లేఖాస్త్రం కథలు-2

ఏవండోయ్ శ్రీవారు

– కోసూరి ఉమాభారతి

ఏవండోయ్ శ్రీవారు,

          నేనే… మీ అర్ధాంగి ప్రణతిని.  మనిషిని ఎదురుగా పెట్టుకుని ఈ లేఖలేమిటి అనుకుంటున్నారేమో. పెళ్ళైన కొత్తల్లో నేను రాసిన ప్రేమలేఖలా మాత్రం దీన్ని భావించే అవసరం లేదులెండి.

          సెలవలకి వచ్చిన కొడుకు, కోడలు, కూతురు నిన్నటితో  తిరిగి వెళ్ళారు. అదే సమయానికి చుట్టంచూపుగా కుటుంబంతో సహా వచ్చిన చెల్లెలు కూడా పొద్దుటే వెళ్ళింది.

          విషయానికి వస్తే…  ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు మీరంతా కలిసి నన్ను బాగానే ఆటపట్టించారు. అదీ మా చెల్లెలు, ఆమె భర్త , వాళ్ళ కూతుళ్ళు, అల్లుళ్ళు మనింటికి భోజనానికి వచ్చినప్పుడు. వారందరి సమక్షంలో…  నాకసలు దేనిమీదా అవగాహన లేదన్నట్టుగా, చేలోపడ్డ ఆవులా నేను బతికేస్తున్నట్టుగా మాట్లాడారు. చుట్టాల ముందు నేను ఎంత అవమానపడ్డానో కూడా గమనించకుండా మీ గోల మీకేనా?

          అసలు తప్పు నాదే లెండి. ఇన్నాళ్ళూ … పిల్లలతో కలిసి మీరు నాతో చేసే పరిహాసాలని, పరాచికాల్ని పట్టించుకోలేదు. ఎదిగిన పిల్లలు మీతో స్నేహితుల్లా మెలుగు తున్నారన్న ఆనందంలో ఉండిపోయాను. నేను ఇంటిని సరిగా సర్దుకోలేదనో, మన కుక్కపిల్లల్ని నేను సరిగా పెంచడంలేదనో, డ్రెస్సింగ్ విషయంలోనూ పట్టించుకోకుండా ఉంటున్నాననో… ఏదోక విషయంలో మన చిరంజీవులు నన్ను తప్పు పడుతుంటే… ‘నా పిల్లలు నాకే చెప్పేటంత పెద్దవాళ్ళయిపోయారని’ ముచ్చటేసి గమ్మునుండిపోయాను.

          ఇక తమరేమో “మీ అమ్మకి ఈ మధ్య ఏదీ జ్ఞాపకముండడం లేదు, భద్రంగా డ్రైవ్ చేయడంలేదు, వాకింగ్ తగ్గించేసి లావైపోతుంది” అంటూ ఉన్నవీ లేనివీ పిల్లలకి చెప్పడం … ముగ్గురూ కలిసి పడీపడీ నవ్వడం పరిపాటయింది. అయినా వదిలేసాను. ఓ తల్లిగా, ఓ భార్యగా అలోచించి సహనంతో మిన్నకుండిపోయాను. నా పట్ల మీ ముగ్గురి వైఖరిని ముందే వారించినట్టయితే సరిపోయేది. ‘అమ్మంటే… ఓ బొమ్మ’ అన్నట్టుగా,  ‘మేమెంత గమ్మత్తులాడినా ఏమనుదులే’ అన్నట్టుగా తయారయ్యేవారు కాదేమో. 

          అలా సాగనిచ్చినందుకే … ఈ రోజున నా చెల్లెలు, ఆమె కుటుంబం ఎదుటే నా గురించి మీరు అతిగా పరిహాసాలాడగల స్థితికి వచ్చారు. నేను మునుపటిలా వంట రుచిగా చేయడంలేదని ఫిర్యాదు చేసినా, మా చెల్లాయిని అతిగా పొగుడుతూ… దాని ఆకారం, ఆహార్యం ఇంకా చెక్కుచెదరలేదని మెచ్చుకున్నా కూడా నాకు ఓకే. 

          కాని, నన్ను చూపిస్తూ “మీ అక్క చూడు నీకంటే రెండేళ్ళే పెద్దదైనా, రెండింతలు లావయింది కదూ! ఆరోగ్యరీత్యా అయినా లావు కాకుండా చూసుకోవాలి కదా!” అని అందరిలో అనేయడం … ఏమైనా సబబుగా ఉందా? అసలు మీలోని సంస్కారం ఎటు పోయింది? నన్నలా కించపరిస్తే గొప్పనుకున్నారా? నేనంటే అంత అలుసా? 

          అంటే, నాకు వంటా రాక, డ్రైవింగ్ చేతకాక , ఇల్లు సరిగ్గా సర్దుకోలేక… ఎందుకూ పనికిరాననేగా. ఆఖరికి, అందం చెదిరిపోయిన పిప్పళ్ళ బస్తాలా అయ్యానని … అందరి ముందూ నన్ను అవమానిస్తే ఆనందంగా ఉందా మీకు?  

          ఎంతటి క్రూరులండీ మీరు?

          మీరు, మీ ఇద్దరు పిల్లలు ఈ రోజు ఇలా ఏకతాటి మీద నడుస్తూ స్నేహితుల్లా మెలగ డానికి దోహదం చేసింది నేనేనని తెలుసా మీకు? పిల్లలిద్దరూ మీకు దగ్గరవ్వాలని.. నాతో కన్నా మీతో ప్రేమగా మసలుకుంటే బాగుంటుందనీ… అనుకుని అందుకు ప్రయత్నిం చాను కదూ. తండ్రి పట్ల పిల్లలు గౌరవమర్యాదలతో మెలగాలనే … అన్ని విషయాల్లో మీ మాటలకు వత్తాసు పలికి  మీ స్థానాన్ని వారు గుర్తించేలా చేసాను కదూ.  అందుకు నాకు సంతోషమే.. కాకపోతే  మీరు కూడా గుర్తిస్తే బాగుండేది.

          మీ పట్ల పిల్లలు ప్రేమాభిమానాలతో మెలుగుతున్నారని, అన్ని విషయాల్లో మీ సలహా తీసుకుంటున్నారని, కోడలుపిల్లతో సహా వ్యాపార లావాదేవీల విషయంగా కూడా మీ సలహా పాటిస్తారని మురిసిపోతున్నారు. అంతటి ఆనందం, గౌరవం మీకు దక్కాలనే నేను తాపత్రయపడ్డాను. కానీ బదులుగా మీరు… అన్నివిధాలా నన్ను అగౌరవపరిచారు..

          రిటైర్ అయ్యేవరకు… ముప్పై యేళ్ళపాటు మీరు రోజుకి పదేసి గంటలు పనిచేసి అలిసిపోయి ఇల్లు చేరేవారు. మీకెటువంటి అదనపు కష్టం తెలియకుండా పిల్లల ఆలనా పాలన నేను చూసుకున్నాను. స్కూల్, హైస్కూల్, కాలేజీ చదువులు అయ్యేంతమటుకు ఎన్ని ఉంటాయో మీకు తెలియంది కాదు. పైగా అమెరికాలో పిల్లల పెంపకం సామాన్య విషయం కాదు. కత్తి మీద సాము లాటిదని తమరికి విదితమే. అయినా, ఏనాడైనా  మాటవరసకైనా నన్ను మెచ్చుకున్నారా? అంతా తమరిదే గొప్పతనం అనుకుంటారు.

          అంతే కాదు,,,రెండేళ్ళగా ‘కోవిడ్’ మూలంగా ఇంటిపనితో పాటు బయటపని కూడా మొత్తం నేనే చేసుకొస్తున్నాను. నాకంటే పెద్దవారని మిమ్మల్ని కష్టపెట్టకుండా అన్నీ చేసి చేతికందిస్తున్నాను. అది కూడా మీరు గమనించలేదా? నేను మీకు బానిసను కానండోయ్. ప్రేమకి, బంధాలకి కట్టుబడున్న ఓ మంచి స్త్రీని, మీ ఇల్లాలిని. నేనో బాధ్యత గల సహధర్మచారిణిగా, తల్లిగా మీకనిపించనా?     

          భార్య విలువ తెలుసుకోని భర్తనేమనాలి చెప్పండి. నా మనసుని బాగా గాయ పరిచారు. ఇక నేనిక్కడ ఇమడలేను. ఇలా సాగడం నా వల్ల కాదు. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. నేను నా కుక్కపిల్లలతో పాటు పాతింటికి వెళ్ళిపోతున్నాను. అక్కడే ఇక నుండి నా నివాసం. మీరు కానీ మీ పిల్లలు కానీ నా నిర్ణయాన్ని మార్చలేరు.  

ఇట్లు

శ్రీమతి ప్రణతి

*****

Please follow and like us:

2 thoughts on “లేఖాస్త్రం కథలు-2 – ఏవండోయ్ శ్రీవారు”

  1. అమ్మని ఒక మనిషి గా గుర్తించాలి అని ఎంత బాగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published.