వరించ వచ్చిన

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-డా.దారల విజయ కుమారి

          “వివాహ ప్రస్థానం సుదీర్ఘమైనది. పెళ్ళికి ముందు ఒక మహిళ ఎలా ఉందో పెళ్ళి  అయ్యాక కూడా తనవేవీ కోల్పోకుండా ఉన్న దాఖలాలు చాలా తక్కువ. పెళ్ళి తర్వాత కుటుంబం ఆమె నుంచీ కావాల్సినంత తీసుకొంటూ పోతుంది. ఎప్పుడో వెనక్కి తిరిగి చూసుకుంటే అతనితో కలిసి నడిచిన నడక..అతి మామూలుగా కనిపిస్తూ వెక్కిరిస్తుంది.
 
          చాలా విషయాలలో భార్యస్థానంలో ఉన్న స్త్రీ తన లోని నైపుణ్యాలను తన కోసం.. కుటుంబ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాన్ని హర్షించడం అంటూ ఉండదు. అసలు ఒక్కోసారి ప్రయత్నించే అవకాశం ఉండదు..కాదు ఇవ్వబడదు. స్త్రీ తాను వరుని ఎంపిక లో పొరబడినట్టు ప్రతి నిత్యం గుర్తుకొస్తుంది.
 
          కొన్ని చోట్ల ఆమెకు మాటలుండవు. ఎంత మూగతనం ప్రదర్శిస్తే అంత మేలనే పరిస్థితులే ఎక్కువ. పెళ్ళితో స్త్రీని ధారాదత్తం చేసినట్టుగా అనుకుంటే అందులో ఆమె ఆశలు ఆశయాలు కూడా ఉంటాయి. ఇది ఎవరికీ ఎరుకలో ఉండదు. అదేదో చాలా తేలికైన విషయంలా ఆమె ఆత్మగౌరవం చాలా సార్లు అభాసుపాలు అవుతుంది. 
 
          స్త్రీ తన సహచరుని కంటే కాస్త పై మెట్టులో ఉంటే..ఆమె బలహీనురాలని పదే పదే నిరూపించాలనే పట్టుదల చాలా మంది భర్తలలో ఉంటుంది. అందుకే శ్రీలత పెళ్ళి  విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటోంది.
 
          తాను విద్యావంతురాలు. లెక్చరర్ గా చేస్తోంది. సాహిత్యాభిలాష కొద్దీ చాలా రచన లు చేసింది. పలు పత్రికల్లో అచ్చయ్యాయి. పాఠకులు గుర్తుపట్టే స్టేజ్ కు వచ్చింది. తనకు స్త్రీ సాధికారత గూర్చి అవగాహన ఉంది. నిజానికి ఈ రోజు తనకు మళ్ళీ పెళ్ళి చూపులు. మాధవను ఒక్కడినే టీకి పిలిచాడు నాన్న. కుటుంబం అంతా వారం క్రితం వచ్చి వెళ్ళారు. తను పెళ్ళి చూపులంటే ఒప్పుకోదని..నాన్న ఫ్రెండ్ ఫ్యామిలీ ఏదో టెంపుల్ కని వచ్చి ఇల్లు చూడ్డానికి వచ్చారు అని చెప్పి పరిచయం చేసాడు నాన్న. తీరా వెళ్ళిపోయాక చెప్పాడు. ఇపుడు మాధవతో మాట్లాడాలి అన్నందుకు ఇలా.
 
          “నమస్తె” ఏవేవో ఆలోచనలలో మునిగి తేలుతున్న శ్రీలత ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా చిరునవ్వుతో మాధవ నిలబడి చూస్తున్నాడు. 
 
          ఇంటి ఎదురుగా ఉన్న గార్డెన్ లో టీపాయ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్న శ్రీలత మర్యాద పూర్వకంగా లేచి నిలబడి మాధవకు కుర్చీ చూపించి తాను కూర్చుంది.
 
          స్కూలింగ్..కాలేజ్ చదువులు.. కెరియర్ గూర్చి ఏవేవో మాట్లాడుతూ ఒకరినొకరు కాస్త తెలుసుకున్నారు.
 
          టీ తీసుకున్నాక ఎదురుగా కూర్చున్న మాధవ చేతిలో సండే వీక్లీని పెట్టింది శ్రీలత.
 
          “ఇదేంటి”
 
          “అందులో సెవెంత్ పేజ్ లో చిన్న కథ ఉంది చదవండి” అంటూ సండే వీక్లీని అందచేస్తూంటే.. ఆశ్చర్యాన్ని ముఖమంతా పులుముకుని శ్రీలత వైపు చూసాడు  మాదవ. 
 
          శ్రీలత ఇచ్చిన వీక్లీని అందుకుని పేజీలను తిరగేస్తూ..చిన్నగా నవ్వి ” రూం కెళ్ళాక చదువుతాను” అన్నాడు. అతనిలో ఏదో ఇబ్బంది.
 
          “ఎక్కువ టైం తీసుకోదు. మేబీ సిక్స్ మినిట్స్.. ఇప్పుడే చదవండి ప్లీజ్”
 
          శ్రీలత మాటలు మృదువుగా అనిపించినా ఖచ్చితంగా ఉన్నాయి.
 
          “ఆర్ యు సీరియస్” ఇబ్బందిని కంటిన్యూ చేస్తూ 
 
          “ఎస్” 
 
          మాధవ చాలా కన్ఫ్యూజన్ గా చూస్తుంటే శ్రీలత చెప్పింది.. 
 
          “మనం మన గూర్చి తెలుసుకోవాలని ..మాట్లాడుకోవాలని. మనకు ఈ ఏకాంతాన్ని కల్పించారు మన పేరెంట్స్ “
 
          “అయితే” మాధవ ముఖంలో విస్మయం 
 
          “నా దృష్టిలో ఈ కథ కూడా మనతో మాట్లాడుతుందనే నా ఉద్దేశ్యం” శ్రీలత గొంతు లో ఏదో తెలియని అప్పీల్. మాధవ కాదనలేని స్థితి. సండే వీక్లీని ఇటూ అటూ  తిరగేసి.. తర్వాత కథ సెవెంత్ పేజ్ తీసాడు.
 
          చదవబోతూ శ్రీలతను చూసి
 
          “మీ బయోడేటాలో మీరు రైటర్ అని కూడా ఉంది ఈ కథ మీరు రాసిందే నా “
 
          “అవును “
 
          “కంగ్రాట్స్..ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఏదో సబ్జెక్టు పరంగా చదువంతే కానీ నాకు ఏ రచనలూ ఎక్కువ పరిచయం లేదు. అలా అని అయిష్టత అయితే లేదు”
 
          శ్రీలత చిన్నగా నవ్వుతూ “థాంక్స్ ..చదవండి ప్లీజ్ ” అని అనగానే
 
          “మరి నాకు కథలు కవితల్లాంటివి‌ రాయటం రాదే”
 
          “పర్వాలేదు. అర్థం చేసుకునే మనసుంటే చాలు”
 
          శ్రీలతను సాలోచనగా చూస్తూ కథ చదవడం మొదలు పెట్టాడు మాధవ…  
 
‘జామెట్రీ బాక్సు’
          1978 రాయల సీమలో ఒక చిన్న ఊరు మాది. అక్కను చిన్నప్పుడే సి యస్ ఐ హాస్టల్ లో చేర్పించినారు. బాగా చదువుతుంది. జర్మనీ వాళ్ళ స్కాలర్షిప్ తో చదువు కుంటుంది. అక్కకు జర్మనీ తల్లిదండ్రులు చాక్లెట్లు బబుల్ గమ్ లు..బొమ్మల బుక్కులు పంపిస్తారు. క్రిస్మస్ పండక్కి గ్రీటింగ్ లు కొత్త బట్టలు స్వెట్టర్ పంపిస్తారు.
 
          ఎప్పుడన్నా మూడురోజులు సెలవులిస్తే ఇంటికొస్తుంది..లేదంటే సంక్రాంతి.. దసరా ఎండాకాలం సెలవులకే వస్తుంది. అక్క వస్తే ఇంట్లో అందరికీ సంతోషం. అక్క ఉన్నన్ని రోజులు అమ్మ కూడా అత్తిరాసలు, కలకలాలు, మురుకులు ఏదో ఒక పలహారం చేస్తానే ఉంటుంది. 
 
          అక్క హాస్టలు నుండీ వచ్చిందంటే చాలు నాకు ఏవేవో ఇచ్చేస్తుంది. తనకు బిర్రుగా అయిపోయిన పావడాలు జాకెట్లు..రంగు పెన్సిల్లు..రబ్బర్ లు..మిగిలిపోయిన నోటు బుక్కులు.
 
          ఈ సారి నాకెంతో ఇష్టమైన జామెట్రీ బాక్సు ఇచ్చేసింది. నా దగ్గర ఇపుడు నటరాజ్ జామెట్రి బాక్సు ఉంది. తనకు కొత్తది ఉందని అక్క నాకే ఇచ్చేసింది. నా ఆనందం ఇంతా అంతా కాదు.
 
          జామెట్రీ బాక్సు చూస్తానే మోహనరాణి గుర్తొచ్చింది.
 
          అసలు ఈ బాక్స్ ను నా బ్యాగులో నుంచీ తీసి చూపిస్తే ఉషా శ్రీలత శైలజా రజినీ ఎంత ఆశ్చర్యపోతారో ఏమో. వాళ్ళందరికీ మంచి మంచి బాక్సులే ఉన్నాయి. వాళ్ళకది లెక్కే లేదు. ఈ మోహన రాణికే కొంచెం ఇది. 
 
          జామెట్రీ బాక్సులో అన్నీ బాగా సర్దుకొని పెట్టుకున్నా. స్కేలు.. త్రికోణం నాకు అవసరం లేదు. అవి మధ్య రూం గూట్లో పెట్టేసాను. ఇక చిన్న పెన్సిలు. కొంచెం అరిగిన రబ్బరును ఆ బాక్స్ లోనే పెట్టేసుకున్నా. 
 
          టైలరన్న కుట్టిచ్చిన కాకీ బ్యాగు చాలా బాగుంటుంది దానికి ఉన్న చిన్న జోబిలో బలపాలు పొడుగ్గా ఉండేవి రెండు తీసి బాక్స్ లో పెట్టుకున్నా. ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది. 
 
          మోహన రాణికి ఒక బాక్స్ ఉంది. కొత్తది ‘మా నాయన కొనిచ్చినాడు ‘ అని తెచ్చి చూపించింది. అది చానా బాగుంటుంది. పైన పసుపు రంగులో నల్ల లైన్లు. నేను చూడాలనే ఏమో దాన్ని రోజు తెరిచి అట్లతిప్పి ఇట్లతిప్పి లోపల రబ్బరు పెన్సిలు జరిపి. ఒక బలపం తీసుకుంటుంది. మళ్ళీ జాగ్రత్తగా మూసి బ్యాగులో పెట్టుకుంటుంది. బాక్సు కింద అరలో బఠానీలు పోసుకుంటుంది. బాక్స్ తెరిచినప్పుడు ఒకటో రెండో నోట్లోకి వేసుకునేస్తుంది. టీచరు చూడకుండా నోరు మెదపకుండా నమిలేస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి నాకూ ఒకటో రెండో బఠానీలు ఇస్తుంది. ఆ బాక్సును చూసుకోని చానా బడాయి పడుతుంది.
 
          ఇపుడు నా దగ్గర కూడా బాక్సుంది ఏమంటే అక్క వాడుకొని నాకు ఇచ్చింది. అట్లని మరీ పాతదేం కాదు. ఒకవేళ మోహన్ రాణి అది కొత్తది కాదని కనుక్కుంటుందేమో.. ఏమన్నా అనుకోని నాకేమి. ఇపుడు నా దగ్గర బాక్సుంది.
 
          ఈ బాక్సు బడికి పోయి అందరికీ చూపించుకుందామంటే మధ్యలో ఆదివారం వచ్చేసింది. అక్క శుక్రవారం బాక్స్ ఇచ్చింటే శనివారమే అందరికీ చూపించేదాన్ని. ఇంక సోమవారమే క్లాస్ లో అందరూ ఉన్నప్పుడు బాక్సును బయటకు తీసి చూపించాలి.
ఎందుకో ఈ సారి ఆదివారం అంటే నచ్చలేదు.
 
          నాయన ఎప్పుడు అంటాడు అన్నీ మన మంచికే అని. అట్ల ఇదీ మంచికే. ఎందు కంటే ఆదివారం నాయన ఎట్లలేదన్నా ఐదు పైసలన్నా ఇస్తాడు ఏమన్నా కొనుక్కోమని. ఒక రెండు పైసలు పెట్టి బఠానీలు కొనుక్కోని మోహన రాణి పోసుకొని తెచ్చుకున్నట్లే నేను కూడా నటరాజ్ జామెట్రీ బాక్స్ లో పోసుకొని పోయి చూపించుకుంటా తింటా. ఈ సారి తాను చూసినపుడు నేనూ ఒకటి రెండు బఠానీలను ఇస్తా. ఈ ఆలోచనే చానా బాగుంది. నాకు చాలా నచ్చింది ఈ ఐడియా.
 
          మిగిలిన మూడు పైసలు బాక్స్ లోనే ఒగ పక్కగా పెట్టుకుంటా. ఆ మన్నాడు ఆ మూడు పైసలకు ఒక గట్టం..రెండు కమరకట్లు కొనుక్కోవచ్చు. ఈ బాక్స్ లో అన్ని పడతాయో లేదో. 
 
          ఏమో ఈ సారి నాకు మంచి టైం రాలేదు. ఆదివారం నాయన దగ్గర డబ్బులు లేవేమో నాకు ఐదుపైలు కాదు కనీసం రెండు పైసలన్నా ఈ లేదు. మళ్ళా అడిగితే నాయన బాధపడతాడేమో అని నేనూ అడగలేదు. రేపు ఒట్టి బాక్సు ఎత్తుకొని పోవళ్ళంటే ఎందో బాధగా ఉంది. ఇన్నిరోజులు బాక్స్ లేదు ఇప్పుడు దాంట్లో ఏసుకోడానికి బఠానీలు లేవు. 
 
          ఆదివారం సాయంత్రం అమ్మ నాయన నేను పొయేసి అక్కను హాస్టల్లో ఒదిలేసి వచ్చినాము. పాపం అక్క ఏడుస్తానే పొయ్యింది. అక్కను చూస్తాంటే నాకూ బాధైంది. అక్కను ఇంట్లోనే పెట్టుకుందాం అని అడిగానో లేదో..
 
          అమ్మ గట్టిగా అరిచేసింది ..’నోరుమూసుకుని ఇంటి పాఠం రాసుకోపో ‘ అని. 
 
          నేను గమ్మున అరుగు మీద కూర్చోని ఎక్కాలు రాసుకున్యా..అక్క వెళ్ళినప్పుడు బాధైంది.. మళ్ళీ జామెట్రీ బాక్స్ గుర్తొచ్చి కొంచెం బాధ తగ్గిపొయింది. 
 
          ఒగ అర్ధ రూపాయికి చెనిగ్గింజలు తెమ్మని అమ్మ చెప్పిందో లేదో..అరవేయమ్మ అంగడికి పరిగెత్తుకోని పొయినాను.. అరవేయక్క చానా మంచింది. ఒక్కోసారి కొసురు వేస్తుంది. అవి నాకే. అక్క చెనిగ్గింజలు పొట్లం కట్టేలోగా .. కమర కట్లు ఉన్నాయా లేదా.. గట్టాల డబ్బా ఉందా లేదా..చూసుకున్నా. 
 
          ” బఠానీలు ఉన్నాయాక్కా” అని అడిగితే
 
           “ఎంతక్కావళ్ళ” అనింది.
 
          “ఇబ్బుడొద్దు లేక్కా మా నాయన రేపో మన్నాడో డబ్బులిస్తాడు అబ్బుడు బఠానీలు, కమరకట్లు, గట్టాలు కొనుక్కుంటా” అని చెప్పి చెనిగ్గింజల పొట్లం పట్టుకోని పరిగెత్తొచ్చే సినా. 
 
          అమ్మ చెనిగ్గింజలు ఏంచి ఊరుమిండి నూరేటప్పుడు నేను దగ్గరే కూర్చోనుంటా.. అమ్మ మొదట పచ్చిమిరపకాయలు ఉప్పు ఏసి నూరుతుంది మళ్ళ తెల్లగడ్డ ఆ తర్వాత చెనిగ్గింజలు ఏసుకోని నూరుతుంది..రోట్లోకి గింజలు ఏసేసి నూరే ముందు.. పది గింజ లన్నా చాటలోనే మిగిలిస్తుంది. అవి నాకే. లాస్ట్లో చింతకాయ ఏసి నీళ్ళు పోసుకోని నూరుతుంది ఎత్తేసే ముందు ఎర్రగడ్డ ఏసి వక్కలదొగ్గలుగా దంచి కలుపుతుంది. గట్టి చెట్నీ కొంచెం పక్కకు పెడుతుంది అది నాయనకు. మిగిలిందాంట్లో రోలు కడిగిన నీళ్ళు కలిపి పెడుతుంది. అమ్మ చేసిన ఊరుమిండితో ముద్ద సంగటి తినేస్తారు ఆపకుండా ఎవరైనా. 
 
          పొద్దున్నే బడికి పోవళ్ళంటే సంగటి కొంచెం పెట్టి..తట్ట నిండా మజ్జిగి పోసేస్తుంది. బాగ పిసికి తినమంటుంది. ఒక్కోసారి ఎర్రగడ్డ నంజుకోమంటుంది. నేనే వద్దంటాను. బడికి పోతే నోరు వాసనొస్తే బాగుండదు. మోహన రాణి కూడా అట్లే తినేసి వస్తుందేమో  మాట్లాడేటప్పుడు వాసనొస్తుంది..పక్కన కూచోబుద్దే కాదు. అందుకే నేను ఎర్రగడ్డ తినను.
 
          రాత్రి జామెట్రీ బాక్స్ గుర్తొచ్చి మళ్ళా ఒకసారి చూసుకోని బ్యాగులో పెట్టేసుకున్నా. శ్రీలతకు వాణిశ్రీకి అల్యూమినిం బాక్స్ లు ఉన్నాయి వాళ్ళతో నాకేం పోటీ లేదు. బఠానీ లు లేకపోయినా రేపు ఎలాగైనా మోహన రాణికే ఒకసారి బాక్సు చూపించేస్తే చాలు.
 
          ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని అనుకుంటూ నిద్రపొయినా. రాత్రంతా బాక్సు గురించి కలలే. ఈ రోజు పొద్దున నిద్ర లేస్తా ఉంటేనే బాగుంది.
 
          తెల్లవారి లేస్తానే గూట్లో చూస్తే బ్యాగు లేదు. కింద ఒగ పక్కన పడిపోయి ఉంది. గబా గబా లోపల చూస్తే జామెట్రీ బాక్స్ లేదు. ఇంగ దుఃఖం ముంచుకొచ్చింది గట్టిగా ఏడ్చేసి నా. బ్యాగు బుక్కులు ఉన్నాయి. బాక్సు మాత్రం లేదు. ఇపుడు బడికి ఎట్ల పోవళ్ళ.
 
          “నా బ్యాగునెవురు కింద పడేసింది మ్మా.. దాంట్లో బాక్సు లేదు. ఇబ్బుడేం చేయల్ల.. మోహన రాణికి అందరికీ చూపిద్దాం అనుకున్నా ఇబ్బుడెట్ల పొయ్యేది” పెద్దగా ఏడుపొచ్చింది నాకు
 
          “పొద్దున్నే ఏడ్చద్దుమ్మా”
 
          “నా బాక్సు యాడుందో తెచ్చీమ్మా” ఏడుస్తూనే ఉన్నాను 
 
          “నువ్వాడబెడితివో ఏమో నాకేం తెలుసు నువ్వే వెతుక్కో”
 
          “అంతా వెతికేసినా.యాడా లేదు”
 
          “అందుకే ఏడుస్తారా..కొట్టంలో ఏవో గుర్తుకోసం గీసుకోవళ్ళ బలపం కావళ్ళ అనంటే.. మీ నాయనకు నేనే చెప్పినా..’పాప బ్యాగులో ఉంటుంది తీసుకో’ అని. తీసుకోంటాడు. ఆ బాక్సు ఈడే యాడో ఏసేసింటాడు ఏడ్చకుండా చూసుకోమ్మా ..నేను సంగటి గెలకళ్ళ” అనేసి వెళ్ళిపొయింది. 
 
          ఎంత వెతికినా బాక్సు కనిపించల్యా. నా ఆశంతా నీరుగారిపోయింది. బడికి పోనని ఏడ్చినాను. 
 
          ‘ఈ సారి వడ్లు అమ్మినప్పుడు ఒగ కొత్త బాక్సు కొనిమ్నని నాయనకు‌ చెప్తానని’ అమ్మ మాటిచ్చింది. అమ్మ అంతగా  చెప్పిందని ఏడుపు ఆపుకొని ఖాకీ బ్యాగు భుజానికి తగిలించుకుని బడికి బయల్దేరినా.
 
          ( బాక్సు దూడ కాళ్ళకు తగిలి ఎగిరి దూరంగా ఎనుము ప్యాడలో పడిందని..నాయన చూసుకోకుండా ప్యాడ్ తో పాటు దిబ్బలో పడేసాడని ఎవరికీ తెలియదు.)
               
***** సమాప్తం******
 
          ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాక ఎంత మంది మగవారు. తమ భార్యలు పెళ్ళికి ముందు వ్యాపకాలను.. నైపుణ్యాలను కొనసాగించేలా స్వేచ్ఛనిస్తున్నారు. స్త్రీలు తమని తాము కోల్పోకుండా ఎంత మంది భర్తలు భార్యలకు సహకరిస్తున్నారు. చూసేందుకు ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది..కానీ స్త్రీ జీవితానికి చాలా ముఖ్యమైన విషయం. 
 
          తాను రచనలు చేయడం ఎప్పటికీ మానదు. ఆ విషయంలో ఎటు వంటి రాజీ లేదు. రచయిత్రిగా తనను కొనసాగించ గలిగితేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇది పక్కా. అని అనుకుంటూ..
 
          కథను చదువుతున్న మాధవనే చూస్తూ కూర్చుంది శ్రీలత. చాలా మంచిగానే కనబడుతున్నాడు. అయినా సరే ఈ పరిక్షలో పాస్ కావడం చాలా ముఖ్యం. చదవటం ముగించి ఆ సండే వీక్లీని శ్రీలత చేతికిచ్చేసాడు మాధవ. అతని ముఖాన్నే చూస్తూ దాన్ని అందుకుంది శ్రీలత. అతన్నుంచీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆమెకు ఆతృతగా ఉంది.
 
          ఈ విషయం గూర్చి తన ఫ్రెండ్ వనజతో ముందు రోజే డిస్కస్ చేయడం జరిగింది. మాధవకు పెట్టే టెస్ట్ కు మొత్తం పది మార్కులు. శ్రీలత రాసిన ఆ కథను చూపించి మాధవను చదివమని చెప్పాలి.. అతను చదివేందుకు సిద్ధపడి చదివితే 2 మార్కులు. అతను ఆ కథగూర్చి ఏదైనా మాట్లాడితే 2 మార్కులు. అతను ఇచ్చే సమాధానం నచ్చితే 6 మార్కులు. సో మాధవ చదివేందుకు సుముఖత చూపడం మాట్లాడటం ఇపుడు చాలా అవసరం. పది మార్కులకు ఏడు వచ్చినా అతనికి ఎస్ చెప్పేయాలి..అదీ ప్లాన్
 
          శ్రీలతకు నిన్న వనజ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ” అతను చెప్పే ఒపీనియన్ ను బట్టి నిన్నూ..నీ అభిప్రాయాలను గౌరవిస్తాడా లేదా.. ఫ్యూచర్ లో అతన్నుంచీ నీకు సహకారం దొరుకుతుందా  లేదా అనేది తెలుస్తుంది” అని
 
          “ఏమిటాలోచిస్తున్నారు” మాధవ ప్రశ్నకు సర్దుకుని
 
          “ఏమీ లేదు ” అంది
 
          “చూడండి మన పెద్దవాళ్ళు మనకు పెళ్ళిచేయాలనుకున్నారు. ఇలా మనల్ని మనసులు విప్పి మాట్లాడుకుని ఏ విషయం చెప్పండి అని పంపించినంత మాత్రాన మన పెళ్ళి అయిపోదు. మనం ఒకరికొకరు నచ్చాలి. ఏమంటారు”
 
          “అవును “
 
          “నాకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కు ఫ్లైట్ ఉంది. నాకైతే మీరు చాలా నచ్చారు. మీకు నేను నచ్చానా లేదా అన్నది మీరు మార్నింగ్ చెప్పండి” అలా అనగానే..శ్రీలత సరే అని తల ఊపింది లేనిదీ పట్టించుకోకుండానే ఉంటానని లేచి బయల్దేరి వెళ్ళిపోయాడు. కథ గూర్చి తన రచనల గూర్చి ప్రస్తావించక పోవడం చాలా అవమానంగా అనిపించింది. ఇలాంటివారు జీవితంలోకి రాకపోవడమే మేలు అని అనుకుంటూ కాస్త బాధ పడుతూనే తోటలోంచీ ఇంట్లోకి వెళ్ళిపోయింది శ్రీలత.
 
          నాన్న ఏమంటాడో. మొన్ననే పెద్ద క్లాస్ తీసుకున్నాడు.”నువ్వేదో పత్రికల్లో రాసి పారేసినంత మాత్రాన పెద్ద గొప్పైపోవు. నేను తెచ్చిన సంబంధాలలో ఏదో ఒకటి ఒప్పు కుంటే మాకూ టెన్షన్ ఉండదు”అని.
 
          “అయినా ఆ పిచ్చిపిచ్చిగా రాసిన రాతలను అందరూ చదవరు. చదవని వాళ్ళను ఇబ్బందులు పెట్టడం మొహమాటం పెట్టడం మంచిది కాదు” అని అన్నారు.
 
          ఇపుడు ఇతను నచ్చలేదు అంటే ఏమంటారో.. ఎందుకని నచ్చలేదో కారణాలు చెప్పమంటారేమో. అలోచిస్తూనే మంచం పైన పడుకుని నిద్రపోయింది. సాయంత్రం ” శ్రీ కిందకు రామ్మా “అని అమ్మ పిలిస్తే.. శ్రీలత క్రిందకొచ్చింది.
 
          హాల్లో కూర్చుని నాన్నతో మాట్లాడుతున్నాడు మాధవ. శ్రీలతను చూడగానే..” ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ హాపినెస్ ” ఆంటూ చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పెట్టేసి..వెల్తానని చెప్పేసి వెళ్ళి పోయాడు.
 
          రూంలో కొచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసింది “నటరాజ్ జామెట్రీ బాక్స్” చూడగానే అరచినంత పనిచేసింది శ్రీలత.  అందులో చిన్న చీటీలో
 
          “మీ కథ పైన ఒపీనియన్ ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు. ఈ బాక్స్ కోసమే చాలా తిరిగాను. ఇది కూడా కొత్తదేమీ కాదు. మీకు నచ్చితే కాల్ చేస్తారని తెలుసు.. ఉంటాను..మాధవ” అని ఉంది. 
 
          ఇంత అర్ధం చేసుకుంటే చాలనిపించింది. హాయిగా నవ్వుకుంటూ సెల్ తీసుకుని రీసెంట్ కాల్ లిస్ట్ లో మాధవను వెతికింది శ్రీలత.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.