జీవితం అంచున -16 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          అన్ని కార్యకలాపాలు వదిలేసి అమెరికా టైముని ఇండియా టైములోకి తర్జుమా చేసుకుంటూ తెల్లవార్లూ మొబైల్లో కెమెరాలు చూస్తూ కూర్చున్నాను.

          అమ్మ పసిపిల్లలా ముడుచుకుని ఆద మరిచి పడుకుంది.

          నేను రాత్రంతా నిద్రపోతున్న అమ్మను ఆర్తిగా చూస్తూనే కూర్చున్నాను.

          పసితనంలో నా ఒంటి మీద వెంట్రుకలు రాలిపోవటానికి, ఒళ్ళు నున్నగా చేయటా నికి  బలంగా నలుగు పెట్టి రుద్దిన ఆ చేతులు నిద్దట్లో కూడా వణుకుతున్నాయిఇప్పుడు…

          బంగారు మేని ఛాయ కోసం ఎన్ని వందల బత్తాయిల రసం తీసి నాతో తాగించిందో ఆ కంపిస్తున్న వేళ్ళతో అప్పుడు…

          నా కళ్ళు కన్నీటితో మసకబారాయి.

          ఐదు కాకుండానే అమ్మ నిద్ర లేచింది.

          నా గుండె దడదడలాడింది.

          అమ్మ బ్రష్ చేసుకుని అంత చలిలో ఉదయాన్నే స్నానం చేసేసి నైటీ తీసేసి చక్కగా చీర కట్టుకుంది. ఏదో లోషన్ ఒంటికి రాసుకుని బాబడ్ జుత్తును దువ్వుకుని నిండుగా వూలశాలువా కప్పుకుంది.

          నా బీపీ పెరిగిపోయింది.

          అమ్మ మెడకు నెక్ బెల్ట్ పెట్టుకుని, కాళ్ళకు చెప్పులు తొడుక్కుని చేతికర్ర సాయంతో బాల్కనీలోకి వచ్చి కూర్చుంది.

          ఐదున్నర కాకుండా అంత చలిలో అమ్మ బాల్కనీలో ఎందుకు కూర్చొన్నట్టు..?

          యాదమ్మ బీజం వేసిన అనుమానం నాలో ఉత్కంఠ రేపగా ఉద్విగ్నంగా రెప్ప వేయకుండా నాలుగు కెమెరాలు నిశితంగా చూస్తున్నాను.

          నాలో తెలియని అలజడి.

          లేత నీలం రంగు పాత బజాజ్ చేతక్ బండి గేటు ముందు ఆగింది. సీటు ఎదురుగా పెద్ద సంచీలో నుండి రెండు పాల ప్యాకెట్లు చేతిలోకి తీసుకుని తెల్లటి బట్టల్లో పాలవాడు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు.

          పైన బాల్కనీలో నుండి చూసిన అమ్మ ఆనందంగా లేచి నిలబడింది.

          అతను పైకి వచ్చి బాల్కనీలో చెప్పుల స్టాండు పక్కనున్న బల్ల పైన పాల ప్యాకెట్లు పెట్టి వెళ్ళబోయాడు. అమ్మ ఏదో చెప్పింది. అతను ఆ రెండు ప్యాకెట్లు మళ్ళీ చేతిలోకి తీసుకుని లోపలికి లివింగ్ రూము దాటి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళాడు.

          వెనుకే అమ్మ లోపలికి నడిచింది.

          అతను పాల ప్యాకెట్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయాడు. అమ్మ అతని చేయి పట్టుకుని చైర్ పైన కూర్చోపెట్టింది. తను దీవాన్ పైన కూర్చుంది.

          అమ్మ పెదవులు ఏదో పలవరిస్తున్నాయి…

          చూస్తున్న నాకు నన్ను నేను నిభాయించుకోవటం కష్టమైంది.

          వాళ్ళ మధ్య జరిగిన పది నిముషాల మాటలు నా ఊహకు అందటం లేదు.

          పది నిముషాలు నాకు పది యుగాల్లా గడిచాయి.

          అతను లేచి వెళ్ళబోతుండగా అమ్మ అతని గుండెల మీద వాలి ఏడవనారంభిం చింది.

          చూస్తున్న నాకు గాభరా ఎక్కువయ్యింది.

          అతనికి ముప్పై ఏళ్ళు వుండొచ్చు. నా పిల్లల ఈడు వాడే. అమ్మకు ఎనభై ఐదు. అతను అమ్మను జాగ్రత్తగా పొదివి పట్టుకుని దీవాన్ మీద కూర్చోబెట్టి వీధి గుమ్మం తలుపు దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు.

          అమ్మ సన్నగా ఏడుస్తూ దీవాన్ మీద పడుకుండి పోయింది.

          నా తల గిర్రున తిరుగుతోంది.

          లేత నీలం బజాజ్ వెస్పా బండి, తెల్లటి ప్యాంటు షర్టులో పాలవాడు…

          ఎంత ఆలోచించినా పాలవాడితో అమ్మ దగ్గరితనానికి లాజిక్కు అందలేదు నాకు.

*****

(సశేషం)

Please follow and like us:

2 thoughts on “జీవితం అంచున -16 (యదార్థ గాథ)”

  1. జీవితం అంచున ‘ యథార్థ గాథ నాలో చాలా ఉత్కంఠ కలిగించింది. అంత ఆసక్తి కరంగా ఉన్న కథ అప్పుడే సశేశానికి వచ్చేసిందా అనిపించింది.

    1. ధన్యవాదాలండీ మీ స్పందనకు… సశేషమే తప్ప సమాప్తం కాదు కదా….

Leave a Reply

Your email address will not be published.