తెల్ల సీతాకోకచిలుక 

హిందీ మూలం – ‘సఫేద్ తిత్లీ’ – డా. రమాకాంతశర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          నా అపాయింట్ మెంట్ లెటర్ తీసుకుని నేను ఆ కంపెనీ హెడ్డాఫీసుకి చేరుకు న్నాను. నా కాళ్ళు నేలమీద నిలవడంలేదు. దేశంలోని అన్నిటికన్నా పెద్ద కంపెనీలలో ఒకటైన ఆ కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తోంది. ఇది నాకో పగటికల లాంటిదే. పది అంతస్తులున్న ఆ బిల్డింగులో ఏడో అంతస్తులోని రిక్రూట్ మెంట్ సెక్షన్ వెతకడం కోసం ప్రతి గదికి ఎదురుగా ఉన్న బోర్డును చదువుకుంటూ వెడుతున్నాను. అప్పుడే నాకు వీనులవిందుగా ఒక మధురకంఠం వినిపించింది –“ఎవరికోసం వెతుకుతున్నారుమీరు?” నేను తిరిగిచూశాను. చూస్తూనే ఉండిపోయాను. చిత్రంలోలాగా ఉన్న ఇంచుమించు ఇరవైరెండు-ఇరవైమూడేళ్ళ ఆ అందగత్తె నన్నే అడుగుతోంది. నా మాట బయటికి రాకపోవడాన్ని, నా పరిస్థితిని చూసి ఆమె పకపకా నవ్వింది. తిరిగి తన అదే ప్రశ్నను మళ్ళీ అడిగింది. నేను కొత్తగా రిక్రూట్ అయ్యాననీ, రిక్రూట్ మెంట్ సెక్షన్లో రిపోర్టు చెయ్యాలనీ చెప్పాను. ముందుగా ఆమె నాకు కంగ్రాట్స్ చెప్పి అంది –“పదండి, నాతోపాటు రండి.”

          మొత్తం కారిడార్ అంతా తివాసీ పరిచివుంది. ఆమె ముందు నడుస్తూవుంటే నేను ఆమె వెనకాలే వెళ్ళాను. ఎదురుగా వస్తున్నఇంచుమించు ప్రతి వ్యక్తి ఆమెని చూసి చేయి ఊపి అడిగాడు –“హాయ్ అనితా, ఎలా వున్నావు?” ఆమె కూడా ఉత్సాహంగా అందరికీ జవాబిచ్చింది. కొంతమందితో ఆమె చెయ్యి కూడా కలిపింది. ఆగి వాళ్ళతో మాట్లాడింది కూడా.  ఈమె పేరు అనిత అనీ, తన కొలీగ్స్ లో బాగా పాపులర్ అనీ నేను మనస్సులోనే అనుకున్నాను. అనిత వ్యక్తిత్వాన్ని చూస్తే ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.

          కొన్ని మలుపులు తిరిగాక చివరికి రిక్రూట్ మెంట్ సెక్షన్ బోర్డు కనిపించింది. అనిత నన్ను అక్కడి ఆఫీసరుకి పరిచయం చేసింది –“మీరింక ఇక్కడికి వచ్చేశారు కనుక మళ్ళీ కలుసుకుందాం”– అని వెళ్ళిపోయింది.

          ఫార్మాలిటీలన్నీ పూర్తిచేసుకునేందుకు ఇంచుమించు ఒక గంట పట్టింది. నన్ను అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో పోస్ట్ చేశారనీ, అక్కడికి వెళ్ళమనీ నాకు చెప్పారు.

          అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అడుగుపెడుతూనే నాకు సంతోషంతో కూడిన ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అక్కడ ఒక మూల ఉన్న సీటులో కూర్చుని అనిత పని చేస్తోంది. నన్ను చూస్తూనే లేచి నిలబడి అంది –“అరే, మీ పోస్టింగు ఇక్కడ అయిందా?” నేను అవునని చెప్పగానే తను సంతోషించినట్లు నాకనిపించింది. ఇంచుమించు పరుగెత్తుతూ వచ్చి నా చెయ్యి పట్టుకుని నన్ను ఆఫీసరు దగ్గరికి తీసుకువెళ్ళింది. నన్ను అందరితో పరిచయం చేసే బాధ్యత తనే తీసుకుంది. నవ్వుతూ అంది –“మీరింత వరకూ మీ పేరు చెప్పనే లేదు.”“మీరు ఇంత వరకూ అడిగిందెక్కడ, నా పేరు అభిషేక్” అని నేను చెప్పాను. “అభిషేక్ మంచిపేరు”– ఆమె మళ్ళీ నవ్వింది. ఏళ్ళ తరబడి నేను తనకు తెలుసనిపించేలా డిపార్టుమెంటులో పని చేస్తున్న ప్రతివ్యక్తికీ నన్ను పరిచయం చేసింది.

          ఉద్యోగం చేసుకునేందుకు నేను నా ఊరినీ, నా ఇంటినీ విడిచి ముంబయి రావలసి వచ్చింది. ఆఫీసు టైమ్ తరువాత ఏకాంతం ఇబ్బందిగా వుంది. ఆఫీసులో అందరూచాలా మంచివాళ్ళు. కొద్దిరోజుల్లోనే నేను వారితో కలిసిపోయాను. అనిత ఉండటం, ఆమె ఆత్మీయంగా వ్యవహరించడం కారణంగా ఆఫీసు సమయం ఎప్పుడు గడిచిపోతుందో తెలిసేదికాదు. ఆమె తన పనిలో దిట్ట. అంతేకాక తన పని వేగంగా చేసుకుపోవాలని ప్రయత్నించేది. సమయాన్ని కూడా బాగా పాటించేది. బహుశా ఈ కారణం వల్లనే ఆమెకి మిగిలిన వాళ్ళని కలుసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడటానికి, నవ్వుకుంటూ వుండటానికి తగినంత సమయం దొరికేది. ఆమె స్నేహితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆమెని కలుసుకునేందుకు వేరే డిపార్టుమెంటుల నుండి మాత్రమే కాక కంపెనీ బయట నుంచి కూడా ఆమె మిత్రులు వస్తూవుండేవారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ తను నా గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేది. తన దగ్గర సమయం ఉన్నప్పుడల్లా వచ్చి నా దగ్గర కూర్చు నేది. అప్పుడప్పుడూ నా పనిలో కూడా సహాయం చేసేది. నేను కంపెనీలో పూర్తిగా కొత్తవాడిని. అందువల్ల ఆమె సహాయం నాకు అవసరమవుతూ వుండేది. అనిత ఇక్కడ లేకపోతే నా పనంతా నాకు ఇంత తేలికగా, సంతోషప్రదంగా ఉండేదికాదని నాకు అనిపించేది.

          కొన్నిరోజుల నుంచి అనిత సాయంత్రం సరిగా నాలుగింటికి ఆఫీసు నుంచి వెళ్ళిపోతోంది. ఆమె లేకపోవడం నాకేదో శూన్యంలా అనిపిస్తోంది. రోజూ నువ్వు ఎక్కడికి వెడుతున్నావని అడుగుదామనుకుంటాను. కాని తన వ్యక్తిగత జీవితంలో చెయ్యిపెడుతు న్నానని కోపగించుకుంటుందేమోనని ఊరుకుంటున్నాను. ఆ రోజు కూడా ఆమె నాలుగు గంటలకి వెళ్ళిపోయింది. నేను నా సహోద్యోగి కిషోర్ ని అడిగాను –“ఏమిటి, అనిత రోజూ ఆఫీసు నుంచి రెండుగంటలు ముందే ఎక్కడికి వెడుతుంది?” అతను చెప్పాడు –“నీకు తెలియదా,  మన కంపెనీకి చెందిన డ్రామాక్లబ్బు ఉంది. అప్పుడప్పుడూ నాటకాలు ప్రదర్శించడం లాంటిది చేస్తూ వుంటారు. ఇతర సంస్థల నాటకపోటీలలో కూడా పాల్గొంటూవుంటారు. అనిత నాటకాల్లో ఎక్కువగానే పాల్గొంటూవుంటుంది. తన అభినయానికి చాలా గౌరవప్రదమైన బహుమానాలు గెలుచుకుంది. వీటిలో రాష్ట్రస్థాయి లోని బహుమానాలు కూడా ఉన్నాయి.  ప్రస్తుతం కంపెనీ స్థాపనదినోత్సవం కోసం నాటకం వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన రిహార్సలు కోసం ఆమెని సాయంత్రం నాలుగింటికి అఫీషియల్ గా విడిచిపెడుతున్నారు.”

          మర్నాడు అనితతో నేను ఈ విషయం గురించి మాట్లాడాను. ఆమె నాతో డ్రామా క్లబ్బు, నాటకాలు, అభినయం గురించి విపులంగా చెప్పింది. దాంతోబాటు నేనెప్పుడైనా నాటకాల్లో పని చేశానా అని అడిగింది. నేను అవునని చెప్పిప్పుడు తను అంది –“మీరు డ్రామా క్లబ్బులో ఎందుకు చేరకూడదు?” నేనేమీ మాట్లాడకుండా ఊరుకునేసరికి అధికార పూర్వకంగా అంది –“రేపు నాతో రండి. నేను మిమ్మల్ని అందరితో పరిచయం చేస్తాను.” సాయంత్రం సమయం గడపడం నాకు ఇబ్బందిగా ఉన్న కారణంగా నేను సరేనన్నాను.

          మర్నాడు నేను ఆమెతో డ్రామాక్లబ్బుకి వెళ్ళాను. అనిత అందరితోనూ నన్ను పరిచయం చేసింది. నన్ను అక్కడే కూర్చోబెట్టి తను నాటకం రిహార్సల్ లో బిజీ అయింది. అనిత హీరోయిన్ భూమిక నిర్వహిస్తోంది. నాటకంలో రొమాన్స్ బాగా ఉంది. రిహార్సల్ లో ఆమె హీరోతో అతుక్కుపోయి లేదా అతని చేతుల్లో చేతులుంచి నటిస్తున్న తీరు నాకు విచిత్రంగా అనిపించింది. డైరెక్టరు కూడా మధ్య-మధ్యలో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దృశ్యాన్ని విడమరుస్తున్నాడు లేదా డైలాగ్ డెలివరీ చెబుతున్నా డు. ఒక్కొక్కసారి హీరోలాగా తను స్వయంగా యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. అనిత నిర్వికార భావంతో అవన్నీ చేస్తోంది. కొంచెంసేపట్లో టిఫిన్లు-కాఫీలు వచ్చాయి. నేను కాఫీ తాగుతూ మౌనంగానే ఉన్నాను. ఎవరైనా ఆమెతో అరమరికలు లేకుండా వేళాకోళం చేస్తున్నారు. ఆమెకూడా వాళ్ళకి పగలబడి నవ్వుతూ జవాబిస్తోంది. ఇదంతా నాకు విచిత్రంగా ఉంది. ఎందుకనో నేను అక్కడ కూర్చోలేకపోయాను. వారందరితో అనుమతి తీసుకుని ఇంటికి వచ్చేశాను.

          ఇంటికి చేరుకుని నేను ఏమీ తినకుండానే పక్క మీద పడిపోయాను. అనిత విషయంలో నేను ఇంత ఎందుకు వ్యాకులపడుతున్నానో నాకు అర్థం కావడంలేదు. ఆమె ఏం చేస్తుంది, ఎక్కడికి వెడుతుంది, ఎవరితో స్నేహం చేస్తుంది, వారితో ఎలా వ్యవహరిస్తుంది, వీటన్నిటితో నాకేం సంబంధం ఉంది? అనిత విషయంలో నా మనస్సు లో ఏమయినా మధురభావాలు కలుగుతున్నాయా? నేను చాలా సేపు నా మనస్సుని మథించాను. జవాబు ఒక్కోసారి అవునని, ఒక్కోసారి కాదని నాకు దొరుకుతోంది.  

          మర్నాడు ఆఫీసులో నేను అన్యమనస్కంగా ఉన్నాను. అనిత నా దగ్గరికి వచ్చింది కాని నేను రోజూలాగా ఆమెతో ఓపెన్ గా మాట్లాడలేకపోయాను. పనిలో కూడా నా మనస్సు నిమగ్నం కావడంలేదు. సాయంత్రం డ్రామా క్లబ్బుకి వెళ్లేటప్పుడు అనిత నన్ను రిహార్సల్ కి రమ్మని గుర్తు చేసింది. ఎప్పటిలాగే తన మధుర మందహాసం విసిరి వెళ్ళి పోయింది. ఆమె వెళ్ళిన తరువాత నేను మరింత అశాంతికి గురి అయ్యాను. బహుశా కిషోర్ ఉదయం నుంచి ఇదంతా గమనిస్తున్నట్లున్నాడు. అతను నా దగ్గరికి వచ్చి కూర్చుని నన్ను అడిగాడు –“ఏమిటి అభిషేక్, నువ్వు పొద్దున్ననుంచి పరధ్యానంగా ఉన్నావు, ఏమైనా విశేషమా?” నేను అతనికి సంక్షిప్తంగా `లేదు’ అని చెప్పి తప్పించుకో వాలనుకున్నాను. కాని, అతను నాకు మరింత దగ్గరగా జరిగాడు –“ఆ మాయలాడి తన మాయ నీ మీద కూడా చూపించినట్లుంది.” నేను ఏమీ తెలియనట్లు అన్నాను –“ఎవరి గురించి చెబుతున్నావు?” అతనన్నాడు – “వేషాలెయ్యకు. ఈ రోజున నువ్వు ఎటువంటి మనస్థితిలో ఉన్నావో అటువంటి మనస్థితిని ఈ ఆఫీసులో పనిచేసే ఇంచుమించు ప్రతి వ్యక్తి అనుభవించాడు. వాళ్ళలో నేను కూడా ఉన్నాను.” నేను ఆశ్చర్యంగా అతనివంక చూశాను. అతను అన్నాడు –“సోదరా! ఈమె సౌందర్యం, అమాయకత్వం, అరమరికలు లేని వ్యవహారం ఎవరినైనా ఆకర్షిస్తాయి. కాని,  ఈమె ఒక సీతాకోకచిలుక లాంటిది. ఎంత పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంత దూరంగా కనిపిస్తుంది. నిజానికి అప్పుడప్పుడూ ఈమె మనం పట్టుకునే హద్దులో ఉన్నట్లు అనిపిస్తుంది. కాని, తన రంగురంగుల రెక్కలు ఆడిస్తూ ఎక్కడికో దూరంగా ఎగిరిపోతూ కనిపిస్తుంది. నన్నడిగితే నువ్వు ఈమె గురించిన కలలు కనడం మానెయ్యి. ఈమె అందరిది. కాని ఎవరిదీ కాదు. ప్రతి వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని భావిస్తే ఈమెకి శాడిస్ట్ ఆనందం కలుగుతుంది. ఈమె చాలా దగ్గరగా ఉందని ఎవరనుకున్నారో వాళ్ళని సమయం వచ్చినప్పుడు తను కూరలో పురుగులాగా, పాలలో ఈగలాగా దూరంగా తీసిపారేసింది. ఈ ఆఫీసులోనే ఎంత మంది ఈమె మాయా జాలంలో చిక్కుకున్నారో ఎంతమంది ఈమెకి ప్రేమికులై ఎటూకాని స్థితిలో ఉండి పోయారో తెలియదు.”

          నా ఎదురుగా అనిత గురించిన ఈ వివరాలు చెబుతున్నప్పుడు కిషోర్ ముఖం మీద జుగుప్స స్పష్టంగా తెలుస్తోంది. నేను కూడా ఈ మధ్య చూస్తున్నది, వింటున్నది కిషోర్ చెబుతున్న విషయాన్ని ధ్రువపరుస్తోంది. ఆమె అందరిదీనీ, కాని ఎవరిదీ కాదు. కిషోర్ చెప్పిన ఈ మాట నా గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయింది. ఇంక నాకు వీలయినంత వరకు అనితకి దూరంగానే ఉండాలని నిశ్చయించుకున్నాను. నన్ను నేను ఒక వేటాడ బడిన పక్షిలా ఎవరికీ కనిపించను.

          ఏదైనా నిర్ణయం తీసుకోవడం తేలికే. కాని దాన్ని అమలుపరచడం కష్టం. నేను అనితకి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నానో ఆమెకి అంత దగ్గరగా నన్ను నేను చూస్తున్నాను. నా పట్ల తను వ్యవహరిస్తున్న తీరుతో కిషోర్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తే మనస్సు ఒక ద్వంద్వస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

          ఈలోగా నా ట్రాన్స్ ఫర్ మాదే ఒక బ్రాంచిలో అయింది. ఈ బ్రాంచి హెడ్డాఫీసుకి చాలా దూరం. పనివత్తిడి, దానికితోడు దూరం కారణంగా అనితని కలుసుకోవడం చాలా తగ్గిపోయింది. అప్పుడప్పుడూ నేనే తనకి ఫోన్ చేస్తున్నాను. కాలం గడుస్తున్నకొద్దీ అనిత గురించిన నా అశాంతి తగ్గుతూ వచ్చింది. ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్ అన్నసామెత నిజం కాసాగింది. ఇంచుమించు ఏడెనిమిది నెలల తరువాత నేను ఏదో పనివుండి హెడ్డాఫీసుకి వెళ్ళాను. మిత్రులందరూ నిండు మనస్సుతో స్వాగతం చెప్పారు. కాని నా కళ్ళు అనితని వెతుకుతున్నాయి. అనిత ఎక్కడా కనిపించడం లేదు. కిషోర్ నా కళ్ళలోని భావాలని చదివి నాకు చెప్పాడు- “నీకు తెలుసో తెలియదో. అనిత పెళ్ళి చేసుకుంది.” ఈ మాట విని నేను ఉలిక్కిపడ్డాను. తను పెళ్ళి చేసుకునే విషయం నాకు చెప్పడం కూడా అవసరం కాదనుకుంది. ఎందుకో నాకిది బాగుండలేదు. కాని, నేను కిషోర్ తో అన్నాను- “ఈమె పెళ్ళి ఎప్పుడయింది? ఆ అదృష్టవంతుడెవరు?” కిషోర్ నవ్వుతూ అన్నాడు- “ఈమెని పెళ్ళి చేసుకున్నవాడు అదృష్టవంతుడో కాదో, అది కాలమే చెబుతుంది. ఈ సీతాకోకచిలుక వేరువేరు పూల మీద వాలుతుంది. ఇతనితో ఎన్ని రోజులు స్థిరంగా ఉంటుందో ఎవరికి తెలుసు?”

          కిషోర్ మాట నిజమవుతుందని నేను కలలోకూడా అనుకోలేదు. హనీమూన్ నుంచి తిరిగి వచ్చాక రెండు –మూడు నెలల్లోనే అనిత తన భర్త నుంచి వేరుగా ఉండసాగింది. విషయాలు నాదాకా వస్తూనే ఉన్నాయి. చివరకు ఒక రోజున వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న వార్త కూడా తెలిసింది. 

          ఆ రోజున అనుకోకుండా అనితతో బజారులో కలుసుకోవడం జరిగింది. ఆమె నన్ను అదే ఉత్సాహంతో కలుసుకుంది. కావాలనే నేను అడిగాను- “ఏమిటి అనితా, నన్ను నీ పెళ్ళికి కూడా పిలవలేదు?” తను నన్ను కొంచెం విచిత్రంగా చూసి అంది- “అయితే నీకు అసలేమీ తెలియదా?” నేనేమీ ఎరగనట్లు అన్నాను- “ఏమిటి తెలియకపోవడం? నువ్వు ఏం చెబుతున్నావో నాకేమీ అర్థం కావడంలేదు.” ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించిం ది. అప్పుడంది- “ఇలా ఇక్కడ నిలబడే మాట్లాడతావా, పద ఎక్కడైనా కూర్చుని కాఫీ తాగుదాం.”

          కాఫీ తాగుతూ తను చాలా విషయాలు చెప్పింది. తను ఆ వ్యక్తిని ఎప్పుడూ పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. ఒక ముక్కూముఖం తెలియనివాడితో పెళ్ళి తన తల్లిదండ్రులు పట్టుపట్టడం వల్లనూ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వల్లనూ భయ పడి చేసుకుంది. వాళ్ళు కూడా తమ కూతురు గురించి జనం ఏమేమిటో చెప్పుకుంటూ వుంటే వింటూవుండేవారు. తమ కూతురు ఏదయినా మంచి కుటుంబంలో కోడలు అయితే బాగుంటుందని ఆశించేవారు. తల్లీ, నువ్వు ఎవరికైనా మనసిచ్చావా అని తమ కూతురిని అడిగారు కూడా. ఆమె లేదని చెప్పాకనే వాళ్ళు తమకి నచ్చిన, ఆస్తిపాస్తు లున్న ఆ కుర్రవాడితో పెళ్ళి సామ, దాన, భేద, దండోపాయాలని ఉపయోగించి జరిపిం చారు. అక్కడ తనకి దుర్భరంగా ఉండేదని తను చెప్పింది. తను కోరుకోని మనిషితో మొత్తం జీవితమంతా గడపడం నరకంతో సమానంగా అనిపించేది. తను నాటకంలోని పాత్రలను జీవిస్తుంది, కాని జీవితంలో నాటకమాడటం తనవశం కాదని చెప్పింది. ఇదం తా చెబుతూ తను భావావేశానికి లోనయ్యింది. ఇదంతా నేను మౌనంగా విన్నాను. ఈమెను పెళ్ళిచేసుకున్నవాడు అదృష్టవంతుడవునో కాదోకాలమే చెబుతుందనీ, ఈ సీతాకోక చిలుక వేరువేరు పూలమీద వాలుతుందనీ, అతనితో ఎన్నిరోజులు ఉంటుందో ఎవరు చెప్పగలరనీ కిషోర్ చెప్పిన మాటలు నా మనస్సులో చక్రభ్రమణం చేస్తున్నాయి. నా మౌనాన్ని తను ఎలా అర్ధం చేసుకుందో తెలియదు. కాని తను చెప్పేది పూర్తిచేసి వెంటనే లేచి నిలబడింది. నాకు ఆలస్యమవుతోందని చెప్పి వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగిన బిల్లు తెప్పించి ఆమె వెడుతూవుండటం చూస్తూ ఉండిపోయాను.

          నేను అనితని కలుసుకుని నెలల సమయం గడిచింది. ఈలోగా తన గురించి నేనేమీ తెలుసుకోలేదు. తను కూడా నన్ను కాంటాక్ట్ చెయ్యలేదు. ఆమె గురించి నేను ఎందుకు ఎక్కువ ఆలోచించడంలేదో నాకు తెలియదు. తన స్నేహితుల బృందంలో బహుశా నేను కూడా ఎక్కడో వెనకాల నిలబడివున్నాను. తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కళ్ళముందు ఒక పెద్ద సీతాకోకచిలుక ఎగిరి వెడుతున్నట్లు కనిపించేది.

          ఆ రోజు నేను ఆఫీసుకి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. ఇంతట్లోకే ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే అనిత గొంతుక విని ఉలిక్కిపడ్డాను. “నువ్వు ఆఫీసుకి వెళ్ళడానికి బయలుదేరుతున్నావనీ, తొందరలో ఉన్నావనీ నాకు తెలుసు. కాని నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. కాగితం, పెన్ను తీసుకుని ఒక అడ్రసు చెబుతాను రాసుకో.” నేనా అడ్రసు రాసుకున్నాను. ఆమె చెప్పింది- “రేపు సాయంత్రం సరిగా ఏడు గంటలకి ఈ అడ్రసుకి చేరుకో. నేను రేపు పెళ్ళి చేసుకుంటున్నాను. నేను నా పెళ్ళికి నిన్ను పిలవలేదని తరవాత నన్ను అనద్దు. ఇంకేమీ వంక చెప్పొద్దు. నువ్వు వస్తున్నావు. అంతే.” నా జవాబు కోసం ఎదురు చూడకుండా తను పోన్ పెట్టేసింది.

          అనిత మళ్ళీ పెళ్ళి చేసుకుంటోంది. ఎవరిని? అతనితో ఎన్నిరోజులు ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ నా మనస్సులో ప్రతిధ్వనిస్తున్నాయి. మర్నాడు ఆ అడ్రసు వెతుక్కుం టూ నేను అక్కడికి చేరుకున్నాను. అనిత చాలా స్నేహితులు అక్కడ ఉన్నారు. కాని ఆమె కుటుంబంలో వారెవరూ అక్కడ కనిపించడం లేదు. ఆఖరికి మగపెళ్ళివారు కూడా ఎవరూ లేరు. పెళ్ళికూతురుగా ముస్తాబై తను చాలా అందంగా కనిపిస్తోంది. తన భర్తకి నన్ను పరిచయం చేసింది. అనిత తన జీవితభాగస్వామిగా ఎంచుకున్న వ్యక్తి ఎవరో గొప్ప వ్యక్తిత్వం కలవాడు కావచ్చునని అనుకున్నాను. కాని అతను ఒక సామాన్య యువకుడు. మాటల్లోనే అతను తెలివైనవాడిలా అనిపించాడు. అతనో ఫ్రీలాన్సర్ జర్నలిస్టు అనీ, అతనికి స్థిరమైన ఉద్యోగం ఏదీ లేదనీ తెలిసి ఆశ్చర్యం కలిగింది. అనిత కుటుంబమే కాక ఆమె భర్త కుటుంబంవారు కూడా ఈ పెళ్ళిని పూర్తిగా వ్యతిరేకించారు. అందుకే ఈపెళ్ళికి వాళ్ళెవరూ రాలేదు.

          నాకు మళ్ళీ హెడ్డాఫీసుకి ట్రాన్స్ ఫర్ అయింది. అనితని రోజూ కలుసుకోవడం జరుగుతోంది. తను ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. రవి… అంటే తన భర్త గురించిన విషయాలే ఎక్కువగా చెబుతోంది. అప్పుడప్పుడూ రవి కూడా వచ్చేవాడు. మేమంతా కలిసి కాఫీ తాగేవాళ్ళం.

          అనిత పెళ్ళి జరిగి ఒక సంవత్సరం అయింది. నేను కిషోర్ తో అప్పుడప్పుడూ అనేవాడిని –“చూడు. నువ్వు చెప్పిన ఈ సీతాకోకచిలుక ఒక పువ్వుతోనే అతుక్కు పోయింది.” కాని కిషోర్ ఈ మాటని ఒప్పుకోవడం లేదు. “చూస్తూ ఉండు. ఎన్ని రోజుల తర్వాత ఈమె మనస్సు సంతోషంగా ఉంటుందో. సీతాకోకచిలుక కనుక వేరువేరు పూలచుట్టూ తప్పకుండా తిరుగుతుంది కదా.” అతను చెప్పే ఈ మాటలకి నాకు కొంచెం భయం కలిగేది.

          ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను అనిత మౌనంగా ఉండటం గమనిస్తున్నాను. తను చాలా తక్కువ మాట్లాడుతోంది. జవాబు అవును, లేకపోతే కాదు అని చెప్పి విషయాన్ని దాటవేస్తోంది. రవి కూడా చాలా రోజులుగా ఆఫీసుకి రాలేదు. అనితతో కలిసి ఎక్కడా కనిపించడం లేదు. ఆ రోజు కిషోర్ నన్ను పట్టుకుని ఏదో రహస్యం చెబుతున్నట్లు అన్నాడు- “కొంచెం మార్పు చూస్తున్నావు గదా. ఇంక కొన్నిరోజుల తరువాతనే శ్రీమతి అనిత మళ్ళీ మిస్ అనితగా మారిపోతుంది. దీనికి ప్రారంభం జరిగింది. దీంతోబాటు ఎప్పుడూ ఈమెతో బాటు కనిపించే రవి ఇప్పుడెక్కడా కనిపించడంలేదు. నేను చెప్పాను గదా. ఈమె ఒక సీతాకోకచిలుక, రంగురంగుల సీతాకోకచిలుక.” అతనికి నేనేమీ జవాబు చెప్పలేకపోయాను. నేను స్వయంగా కూడా ఇదంతా ఆలోచిస్తున్నాను. నేను అనితకి దూరమైపోతున్నట్లు నాకనిపిస్తోంది. ఎందుకో తెలియదు.

          హఠాత్తుగా అనిత ఆఫీసుకి రావడం మానేసింది. ఆమె లాంగ్ లీవ్ తీసుకున్నట్లు తెలిసింది. తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ ఏమీ తెలియదు. జనం రకరకాలుగా చెప్పు కుంటున్నారు. అనిత మౌనంగా ఉండటం, రవి ఎక్కడా కనిపించకపోవడం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

          అనితతో ఇలా కలుసుకోవడం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. కొన్ని రోజుల నుండి నాకు కాస్త నలతగా ఉంటోంది. ఒంట్లో బాగుండటం లేదు. మా కంపెనీ డాక్టరు నన్ను స్పెషలిస్టు దగ్గరికి టెస్ట్ చేయించుకునేందుకు పంపించాడు. నేను హాస్పిటల్ నుంచి బయటికి రాబోతూ వుంటే ఎదురుగా అనిత వస్తూ కనిపించింది. మేమిద్దరం ఆగి నిలబడిపోయాం. నువ్వు ఇక్కడున్నావేమిటని నేను అడిగాను. నా ప్రశ్నకి జవాబివ్వకుండా తను అడిగింది- “నీ ఒంట్లో ఎలావుంది? నువ్వు హాస్పిటల్లో ఏం చేస్తున్నావు?” స్పెషలిస్టుకి చూపించుకునేందుకు వచ్చానని తనకి చెప్పాను. నేనింకా ఏదో అడగబోయేలోగానే తను అంది- “రా. అక్కడ లాన్ లో కూర్చుందాం.”

          ఆమె నాకు చెప్పినది ఊహించనలవి కానిది. రవికి వరుసగా సుస్తీ చేస్తోంది. అతను ఇంట్లోనే పడివుండేవాడు. శూన్య నేత్రాలతో పైకప్పుని చూస్తూ వుండేవాడు. అతని ఫ్రీ-లాన్సింగ్ జర్నలిజం పని పూర్తిగా ఆగిపోయింది. అనిత అతన్ని డాక్టర్లకి చూపించింది. కాని వాళ్ళ మందులతో ఫలితం ఏమీ కనిపించలేదు. రవి ఏదయినా పెద్ద హాస్పిటల్ కి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. హాస్పిటల్ ఖర్చు ఎలా భరించగలనని అంటున్నాడు. ఒక్క పైసా అయినా సంపాదించి అతను ఆమె చేతిలో పెట్టలేకపోతున్నాడు. రెండు కుటుంబాలకి చెందినవారెవరూ వాళ్ళని చూడటానికి కూడా రావడం లేదు. వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరూ జీవించినవాళ్ళలో లెక్కకాదు. రవిని కనిపెట్టుకుని చూసేవారు కూడా ఎవరూ లేరు. అందుకే అనిత సెలవు తీసుకుంది. తన బ్యాంకు బ్యాలెన్స్ తో అతనికి చికిత్స చేయిస్తోంది. జీతం లేని సెలవుల వరకు విషయం వచ్చిన కారణంగా ఆమెకి జీతం దొరకడం కూడా ఆగిపోయింది. మరోపక్క రవి పరిస్థితి బాగుపడటానికి బదులు ఇంకా క్షీణించసాగింది. రవి ఎంత వద్దని అంటున్నా తను అతన్ని ఈ పెద్ద హాస్పిటల్ కి తీసుకువచ్చింది. డాక్టర్లు రవికి కేన్సరని చెప్పారనీ, చికిత్స కోసం అమెరికా వెళ్ళమ న్నారనీ చెబుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

          నేను తనని ఓదార్చడానికి ప్రయత్నించాను. తను ఇంకా వెక్కివెక్కి ఏడవసాగింది. “అభిషేక్, నేను రవిని ఎంతో ప్రేమిస్తున్నాను. అతను లేకుండా బతికిఉండటమనేది నేను ఊహించుకోలేను.” నేను అనిత మరోరూపాన్ని చూస్తున్నాను. నా అనారోగ్యాన్ని ఓ పక్కన పెట్టి నేను రవిని చూడటానికి బయలుదేరాను.

          పక్కమీద పడివుండి పాలిపోయిన ముఖంతో బలహీనంగా వున్న ఆ వ్యక్తి నాకు ఏ విధంగానూ రవిలా అనిపించలేదు. నన్ను చూసి అతను ఒక పేలవంగా వున్న చిరునవ్వు తో స్వాగతంపలికాడు. అతను అనితతో అన్నాడు- “నిన్ను నా జబ్బుగురించి ఎవరితోనూ చెప్పవద్దని అన్నానుగా. మరి?” అనిత ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. కుర్చీ లాగుతూ నాతో అంది- “కూర్చో అభిషేక్.”

          నేను చాలాసేపు రవి దగ్గర కూర్చున్నాను. అతనిలో ఏదో తెలియని తక్కువతనం నెలకొనివుంది. తనను తాను తక్కువగా భావించుకోవడం వల్లనే అతను అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అనారోగ్యం అతని సంపాదనను కూడా అదృశ్యం చేసింది. అనితతో కూడా అతను కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేకపోతున్నాడని నేను గమనించాను. అనిత తన కోసం చేస్తున్నదంతా చూసి అతను సంకోచంతో నిండి పోయాడు. నాతో కూడా అన్నాడు- “నువ్వు అనితకి మంచి స్నేహితుడివి కదా. కాస్త నచ్చజెప్పు. త్వరలోనే నిశ్చయంగా వచ్చే మృత్యువు కోసం శాపగ్రస్తుడైన ఈ రవికోసం తను ఎందుకింత శ్రమ పడుతోంది. తన వయస్సు మాత్రం ఏమంత వుందని. తను జీవితంలో అసలేం చూసింది. తను నన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టదు. నేను వెళ్ళిపోయే ముందు అనితని ఈ బంధాలన్నిటి నుంచి విముక్తురాలిగా చేయడానికి సిద్ధంగా వున్నాను.” రవి చెప్పుకుపోతున్నాడు. అనిత బుగ్గల మీద కన్నీటి చారలు ఇంకా గాఢమవుతున్నాయి.

          నా రిపోర్టు తీసుకోవడం కోసం నేను మర్నాడు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాను. అనిత ని మళ్ళీ కలుసుకున్నాను. ఆమె ఎంత మూల్యం చెల్లించి అయినా రవి ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి నెలకొల్పడానికీ, అతని జీవితాన్ని రక్షించడానికీ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. రవిని చికిత్స కోసం అమెరికా తీసుకువెళ్ళాలనుకుంటోంది. ఆమె ముందు ఉన్న ప్రశ్న అంతా దీనికి కావలసిన పెద్ద మొత్తం గురించే. నేను చాలా నచ్చజెప్పిన మీదట తను అప్పుగా భావిస్తాననే షరతు మీద  స్నేహితుల దగ్గర సహాయం తీసుకునేం దుకు అంగీకరించింది.

          ఆమె అనుమతితోనే నేను రవి అనారోగ్యం గురించి, దానివల్ల ఏర్పడిన వాస్తవ పరిస్థితి గురించి మిత్రులందరికీ తెలియపర్చాను. అనిత మిత్రులసంఖ్యకేమీ లోటు లేదు. వారిలో ఎక్కువ మంది తమ-తమ వనరుల నుండి కొంత సొమ్ము సేకరించారు. అయినా ఇంకా డబ్బు అవసరం చాలా ఉంది. మిగిలిన సొమ్ము సమకూర్చుకోవడానికి అనిత స్వయంగానే ఒక ఉపాయం సూచించింది. డ్రామా క్లబ్బు సభ్యులు తమ అత్యంత ప్రసిద్ధమైన నాటకానికి చారిటీ షో ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగానే హీరోయిన్ భూమిక అనిత స్వయంగానే నిర్వహించింది. వరుసగా మూడు రోజులపాటు నడిచిన అన్ని చారిటీ షోలలో నేను కూడా హాజరయ్యాను. అనిత తన పాత్రలో జీవిస్తూ చేసిన నటనతో తనే ఒక ప్రమాణాన్ని నెలకొల్పింది. తను పాత్రకి ప్రాణంపోసి చేసిన ఈ అభినయం వెనుక ఏవిధమైన ప్రేరణ ఉండి నడిపించిందో నాకు తెలుసు.

          రవిని అమెరికా వెళ్ళడానికి ఎలా సిద్ధం చేశారన్నది మరో ఉదంతం. మేము వాళ్ళని ఎయిర్ పోర్ట్ వరకూ సాగనంపడానికి వెళ్ళాము. అనిత నిస్తేజమైన ముఖంలో అంతకు ముందు లేని కళాకాంతులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు. ఆమె చాలా ఉత్సాహం గా ఉండి ఫ్లైట్ సమయానికి ముందు చేయవలసిన ఫార్మాలిటీలన్నీ చురుగ్గా పూర్తి చేస్తోంది. మేమంతా హృదయపూర్వక శుభాకాంక్షలతో వాళ్ళకి వీడ్కోలు ఇచ్చాము.

          రవికి ఆపరేషన్ జరిగింది. కాని అనిత ఇబ్బందులేమీ తగ్గలేదు. డాక్టర్లు కొంత సమయం తరువాత మళ్ళీ ఇంకో ఆపరేషన్ అవసరమని చెప్పారు. ఆ విదేశంలో తను మరో ఆపరేషన్ కోసం డబ్బు ఎలా సమకూర్చుకో గలదు? నిర్ణయించుకున్న సమయం తరువాత అమెరికాలో ఉండటానికి, కావలసిన అవసరాలు తీర్చుకునేందుకు కూడా తన దగ్గర డబ్బులేదు. కాని, అనిత చిన్నా-పొన్నా ఉద్యోగం చేసి తన పని కొనసాగించుకో సాగింది. మాలో ఎవరో ఒకరు ఫోన్ లో ఆమెను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు చెందిన ఒక చారిటీ సంస్థ రవి ఆపరేషన్ కోసం అవసరమై న ధనసహాయం చేయవలసిందిగా అనిత పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించింది.   

          రవికి రెండో ఆపరేషన్ చేయవలసిన రోజు నేను అనితకి పొద్దున్నే ఫోన్ చేశాను. ఆమె బాగా దిగులుగా ఉన్నట్లు అనిపించింది. తను ఫోన్ పెట్టేస్తూ అవరుద్ధమైన కంఠ స్వరంతో అంది- “అభిషేక్, నువ్వు రవి కోసం భగవంతుడిని ప్రార్థించు. అతని జీవితం ఈ లోకంలో నాకు అన్నిటికన్నా విలువైనది. నువ్వు ప్రార్థిస్తావు కదూ? ప్రార్థనల్లో ఎంతో శక్తి ఉంటుంది. వాటి అవసరం మనకి చాలా ఉంది.”

          కాని విధివిధానం మరొకలా ఉంది. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాక అతను కేవలం రెండురోజులే జీవించాడు. నాకీ కబురు తెలిసినప్పుడు నేను పెద్ద షాక్ తిన్నాను. అనిత చేసిన ఎనలేని శ్రమ, ఈ ప్రార్థనలు అన్నీవ్యర్థమైపోయాయి. కొన్ని రోజుల తరువాత అనిత భారతదేశానికి తిరిగివచ్చింది. తన కళ్ళలోని కన్నీరు అడుగంటి పోయాయి. ఆమెను చూసి మా కళ్ళలో కన్నీరు వచ్చినప్పుడు తనే సానుభూతి చూపిస్తూ మా భుజాల మీద చేయి ఉంచింది.

          నేను ఉండలేకపోయాను. మర్నాడే అనిత ఇంటికి చేరుకున్నాను. అనిత తెల్లని బట్టలు ధరించివుండడం చూసి నా గుండె బరువెక్కింది. చాలాసేపు వరకు నేనేమీ మాట్లాడలేకపోయాను. తను కూడా తల వంచుకొని కూర్చుంది. చివరికి నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ఆమెతో అన్నాను- “నువ్వు ఆఫీసుకు రావడం మొదలుపెట్టు అనితా, అది నీ మనస్సు ఊరట చెందడానికి సహాయపడుతుంది.” తను నెమ్మదిగా తల పైకెత్తి తిన్నగా నా కళ్ళలోకి చూస్తూ అంది- “అవును అభిషేక్, ఆఫీసుకి రావలిసే వస్తుంది. ఎంతమంది కో నేను అప్పు తీర్చాలి. అదికాక ఈ శరీరాన్ని భరించడానికి కూడా డబ్బు అవసరమే కదా.”

          ఆ మర్నాటి నుంచే అనిత ఆఫీసుకి రావడం మొదలుపెట్టింది. అందరినీ కలకలా నవ్వించే ఆ  అరమరికలు లేని నిశ్చింతగా నిర్భయంగా ఉండే అమ్మాయి ఎక్కడ మాయ మైపోయిందో తెలియదు. ఆమె మౌనంగా వచ్చి తన డస్కుముందు సీటులో కూర్చుం టోంది. ఆఫీసు పని అదే చురుకుతనంతో చేస్తోంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆఁ, ఊఁ అంటూ జవాబిస్తోంది. ఖాళీ సమయంలో ఒంటరిగా కూర్చుని, తెరిచివున్న కిటికీలోంచి బయటికి ఏకాగ్రంగా అదేపనిగా ఏం చూస్తుందో తెలియదు. రవికి వితంతువుగా తను అన్ని బాధ్యతలనూ నెరవేరుస్తోంది. ఎప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించివచ్చే ఆ అనితలో అంతకు ముందు ఉండే అనిత ఎక్కడా కనిపించడం లేదు. కిషోర్ ఈమెను సీతాకోక చిలుక అనేవాడు. నిజమైన ప్రేమలో మనిషిని పూర్తిగా మార్చేసే శక్తి ఉంటుందా?

          నేను నా సీటులోంచి అనితని చూస్తూ ఉంటాను. ఆ అందమైన ముఖం తెల్లని బట్టల్లో కూడా తన కాంతిని వెదజల్లుతోంది. కాని, సీతాకోకచిలుక రెక్కల్లోని ఆ రంగులన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయో తెలియదు.

***

డా. రమాకాంత్ శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత్ శర్మ 90 కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథా సంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాల పైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us:

5 thoughts on “తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)”

 1. తెల్ల సీతాకోకచిలుక ‘ కథ దాని అనువాదం రెండు చాలా బావున్నాయి. అనువాదం కూచీ నరసింహం గారి స్వీయ రచన అన్నంత సహజంగా ఉంది. హిందీ లో ఆ కథ ముల శీర్షిక కూడా తెలియచేస్తే బాగుంటుంది.

 2. తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ

  డా.రమాకాంత శర్మ గారి హిందీ అనువాద కథ వారి ప్రతిభకు పట్టము కట్టి వివిధ భాషలలోని సంప్రదాయక తీరు తెన్నులను తెలియచేయుట , తెలిసికొనుట తద్వారా మార్పు సంభవించుట తెలిసికో దగ్గ విషయాలు. కష్టములొ ధైర్యము గా యుండి నిలబడడము, ఎదుర్కొనుడము , ఆత్మ విశ్వాసమును కల్గించడము కథద్వారా చైతన్య పరచడము ముఖ్యమైనవి .
  అనితతో నేను ఈ విషయం గురించి మాట్లాడాను. ఆమె నాతో డ్రామా క్లబ్బు, నాటకాలు, అభినయం గురించి విపులంగా చెప్పింది. దాంతోబాటు నేనెప్పుడైనా నాటకాల్లో పని చేశానా అని అడిగింది. నేను అవునని చెప్పిప్పుడు తను అంది –“మీరు డ్రామా క్లబ్బులో ఎందుకు చేరకూడదు?”
  చర్చల ద్వారా అనిత తో కలసి డ్రామా క్లబ్బుకు వెళ్ళడము – ఇటువంటి క్లబ్బుల పని విధానాలు ప్రవేశపెట్టడము తెలిసికోదగ్గ విషయము మధుర మందహాసం విసిరడము ,మధురభావాలు , రిహార్సల్స్ మొదలైనవి తెలిసికోదగ్గవి . ట్రాన్స్ఫర్ కావడము జీవిత సన్నివేశాలు జరుగడము మన దైనందిన విషయాలతో ముడిపడి యున్నాయి .

  అనితను పెళ్ళి చేసుకున్నవాడు అదృష్టవంతుడో కాదో, అది కాలమే చెబుతుంది. ఈ సీతాకోకచిలుక వేరువేరు పూల మీద వాలుతుంది. ఇతనితో ఎన్ని రోజులు స్థిరంగా ఉంటుం ది- అనితను సీతాకోక చిలుకతో పోల్చడము తదుపరి పెండ్లి తర్వాత విడాకులు రంగురంగుల చిలుక తెల్ల సీతా కోకచిలుక -గా మారడము – తెలుపు చీరకట్టు వారెవరో చెప్పకనే చెప్పినట్లు కథ సాగి రక్తి కట్టించింది. అనువాదం సరళముగా సహజత్త్వముతో సాగిన తీరు అభినందించదగిన విషయము – మామిళ్ళ లోకనాథం

  1. ధన్యవాదాలు మామిళ్ళ లోకనాథంగారూ!

 3. తెల్ల సీతా కోక చిలుక అనువాద కథ చాలా బాగుంది. అనిత వంటి స్త్రీని సమాజం లో చూస్తూనే వుంటాము. కష్టాల్లో సైతం ధీరత్వం గల స్త్రీలు అనిత లాగే వుంటారు. ఆఖరి పంక్తి చాలా బాగుంది. అప్పటి వరకు అందరి చేత సీతా కోక చిలుక గా భావించబడ్డ అనిత జీవితం రంగులు వెలిసిన తెల్ల సీతా కోక చిలుక లా మారడం మనసును కదిలిస్తుంది. అనువాదం చాలా సహజంగా, సరళంగా సాగింది. రచయిత కూ, అనువాద రచయిత కూ అభినందనలు

  1. ధన్యవాదాలు హైమా భార్గవ్ గారూ!

Leave a Reply

Your email address will not be published.