నా జీవన యానంలో- రెండవభాగం- 41

-కె.వరలక్ష్మి

          నా మూడో కథల పుస్తకం అతడు – నేను కోసం కథలు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళే ను. గీత చంద్రగారితో చెప్పి ముఖచిత్రం వేయించింది. ఆ కథల పనిమీద వెళ్ళి వస్తూం టే ఒక హోర్డింగ్ కన్పించింది. శిల్పకళారామంలో గులాం ఆలీ గజల్ ప్రోగ్రాం ఆ రాత్రికే ఉందని. వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసాను టిక్కెట్లు సంపాదించమని. ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకకపోయే సరికి ఏడుపొచ్చింది. గులాం ఆలీ గజల్స్ తరచు గా వింటూ ఉండడం వల్ల ఒక్క సారైనా ఆయన్ని ముఖాముఖి చూడాలని ఓ కల. అది నెరవేరలేదు.

          ఫిబ్రవరి 10, 11 లలో శ్రీకాకుళం జరిగే కథానిలయం వార్షికోత్సవానికి తప్పక రమ్మని పిలిచేరు కాళీపట్నం రామారావు మాస్టారు. ఎప్పట్నుంచో పిలుస్తున్నా దూరం అని వెళ్ళ డం లేదు. నేను వెళ్ళే సరికే జ్వాలా ముఖి, అల్లం రాజయ్య, తుమ్మేటి వంటి ప్రముఖ రచయితలెందరో వచ్చి ఉన్నారు. నేను, మృణాళిని, తమరిన జానకిగారు కలిసి ఒక ఫోటో తీయించుకున్నాం కథానిలయం బేనర్ దగ్గర. సాయంకాలం రమణమూర్తి గారి కారులో బజారుకెల్లి మృణాళిని మూడు, జానకిగారు ఒకటి అక్కడి చేనేత చీరలు కొన్నాం. తిరిగి వచ్చి మాస్టారి ఇంట్లో టిఫిన్లు తిని, కాస్సేపు కబుర్లు చెప్పుకొని శ్రీరామ్ హోటల్లో మాకు ఇచ్చిన రూమ్స్ కి చేరకున్నాం. మగవాళ్ళంతా మాస్టారి ఇంట్లో కొందరు, కథా నిలయంలో కొందరు ఉంటారట, పదకొండు ఉదయం తుమ్మేటికి రావిశాస్త్రి అవార్డు 6 వేలు ఇచ్చారు. ఆయన ఆ డబ్బును తెలంగాణా కథలు పబ్లిష్ చేస్తూన్న తనకి ఇచ్చేసా డు. మృణాళిని నాలుగు విదేశాల కథల గురించి మాట్లాడింది. జ్వాలాముఖి అప్పుడొ స్తున్న కథల గురించి మాట్లాడి, తన కథ ఒకటి చదివి వినిపించారు. మధ్యాహ్నం బోజనాల తర్వాత మల్లీశ్వరి కారులో నేనూ, చలసానీ విశాఖపట్టణం వచ్చేసాం. నేను సింహాచలంలో ఉన్న మా ఆడపడుచు గారింట్లో ఆ రాత్రి ఉండి మర్నాడు ఉదయం బయలుదేరాను. తుమ్మేటి ఇమ్మన్నాడట చలసాని గారు అతని కథల పుస్తకం, పనిపిల్ల మీద అభిప్రాయాల పుస్తకం పట్టుకుని కొత్తరోడ్డు బస్టాండ్ లో నా కోసం వెయిట్ చేస్తున్నా రు. ఇంచు మించు గంట పైగా బస్సు ఆలస్యమైనా చలసాని గారు నాతో ఉండి బస్సు రాగానే నా బేగ్ తెచ్చిపెట్టి నన్ను బస్సు ఎక్కించారు. ఇంటికి చేరుకున్నాక క్షేమంగా చేరానా అని ఫోన్ చేసి కనుక్కున్నారు. నిజానికి ఆయన్ని నేను అదే మొదటిసారి చూడడం.

          2007 మార్చిలో మా చిన్నతమ్ముడి కూతురు పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్చి 23 నుంచీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోందని తెలిసి మా అబ్బాయి ఇంట్లో ఉండిపోయాను. మా అబ్బాయి తనకీ నాకూ పాసులు తీసుకున్నాడు. 29 వరకూ సెలెక్టెడ్ థియేటర్స్ లో ఇచ్చని అద్భుతమైన మూవీస్ చూసాను. మా జగ్గంపేట లాంటి ఊళ్ళో ఉంటే అలాంటి అవకాశాలు రావు. అప్పటికింకా యూట్యూబ్ లాంటివి వాడుకలోకి రాలేదు. మా అబ్బాయి రాని ఒక రోజు సినిమాలు ముగిసేక రాత్రి పొద్దుపోయి ఇంటికెలా వెళ్ళాలా అని అనుకొంటూండగా జనచైతన్య మండలి మెంబరు, ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్న చైతన్య అనే ఓ పాతికేళ్ళ అబ్బాయి ‘మీరు రచయిత కదా’ అని పలకరించి, ‘రండి నా బైక్ మీద దిగబెడతాను’ అన్నాడు. నాకు చలసాని గారు గుర్తుకొచ్చారు. ఆ అబ్బాయి మొహం చూస్తే నమ్మదగిన వాడిగా కన్పించాడు. నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రగతినగర్ లోని మా అబ్బాయి ఇంటి ముందు దించి, లోపలికి రమ్మని పిలుస్తన్నా తను ఉండేది గోల్కొండ అని చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళి పోయాడు. ఆ తర్వాత ఫెస్టివల్ ముగిసేవరకూ రోజూ వచ్చి పలకరించేవాడు. ఆ మొహం లో కళ్ళలో ఒక మంచితనం, నమ్మకం కన్పించేది. తర్వాత తెలిసింది అతనిది వైజాగ్ అని. ప్రస్తుతం అతను మలేసియాలో మంచి జాబ్ లో ఉన్నాడు. ఇండియాలో ఉన్నంత కాలం ఫోన్ లో పలకరించే వాడు. అలాంటి వాళ్ళవల్లే మనుషుల మీద నమ్మకం పెరుగు తుంది.

          అప్పట్లో ఈ ప్రగతినగర్ లో ఒక మంచి సాహిత్య వాతావరణం ఉండేది. దాని క్రియేటర్ గొరుసు జగదీశ్వరరెడ్డి, దోహదకారి యాళ్ల అచ్యుతరామయ్య, కొత్తగానూ, అభ్యుదయ భావాలతోనూ రాసే రచయితల్ని పిలిచి కబుర్ల రూపంలో కథల పైనా, కవిత్వం పైనా, సినిమాల పైనా చర్చలు నడిపేవారు. అచ్చుతరామయ్యగారింట్లో రుచికరమైన వంటకాల్తో విందారగించడం, డాబా పైనో, కొండలు రాళ్ళ గుట్టల పైనో కబుర్లు ఎడతెరిపి లేని కబుర్లు సాగేవి. ఇప్పుడు తరచుగా ట్రోలింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ట్రోలింగ్ బైటివాళ్ళ నుంచే కాదు కొందరు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎదర్కోవాల్సి వస్తుంది. రేపెప్పుడైనా మనకి ఓపిక ఉడిగిపోతే చూడాల్సి వస్తుందే మో అని కొందరు కోడళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. తమ భర్తల్ని కూడా ప్రిపేర్ చేస్తారు. సాధారణంగా రాసే వాళ్ళం కొంత ఫ్రీడమ్ కోరకుంటాం. ఎదుటివాళ్ళతో అరమరికలు లేకుండా మాట్లాడతాం. దానికి వేరే అర్థాలు కల్పించి మన మీద నిఘా పెట్టేవాళ్లుంటారు. చిలవలు పలవలుగా కథలల్లుతుంటారు. ఒక చులకన భావాన్ని మన మీద ప్రదర్శి స్తూంటారు. మనం ఒంటరిగా థియేటర్కి వెళ్తే మన పక్కన ఎవరు కూర్చున్నారో, బైటికీ ఎవరితోనైనా కలిసివస్తున్నామా అని కనిపెడుతుంటారు. భర్త, అత్తింటి వాళ్ళ నుంచి వచ్చేదాని కన్నా పిల్లల నుంచి వచ్చే ఈ ట్రోలింగ్ గొప్ప హింస. మా చిన్నమ్మాయి ఒకసారి నా మీద ఒక సెటైర్ విసిరింది. ‘‘నేనే పైనా పాతికేళ్ళ వాడితో  ఫోన్లు మాట్లాడు తున్నానా, వాడితో లేచిపోవాలనుకుంటున్నానా’’ అని.

          ‘‘ఏ తోటైనా ఒకటే గులాబిముళ్ళు గుచ్చుకునేందుకు

          ఏ ప్రవాహమైన ఒకటే – ఊపిరాడకుండా చేసేందుకు

          పూలూ ముళ్ళూ  – చేపలూ నీళ్ళూ 

          చివరికి మిగిలేదొకటే

          కోల్పోయినదాని కోసం – వెదకులాట’’

          శ్రీకాకుళం వెళ్ళినప్పుడు చలసాని అందజేసిన తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథల పైన రివ్వూ రాసాను. క్రిష్ణబాయి గారికి చెప్తే డైరెక్ట్ గా ‘అరుణతార’కు పంపించెయ్య మన్నారు. అది మే – జూన్ 2007 సంచికలో వచ్చింది.

          కథ – 2006 ఆవిష్కరణ ఆ సంవత్సరం బెంగుళూరులో పెడుతున్నామని ఆహ్వానం వచ్చింది. ఏప్రిల్ 13న చాలా మంది రచయితల్తో బాటు మా గీత, కోమల్, నేను సాయంత్రం 6 కి కాచిగూడ స్టేషన్లో రైలు ఎక్కాం, సరదా కబుర్లు, సెటైర్లు, పాటలతో ప్రయాణం సరదాగా నడిచింది. మర్నాడు ఉదయం 6 కి బెంగుళూరు ఈస్ట్ స్టేషన్లో దిగే సరికి దాసరి అమరేంద్ర కారుతో మా కోసం ఎదురు చూస్తున్నాడు. మేం ముగ్గురం అమరేంద్రతో బిడిఏ కాలనీలో ఉన్నవాళ్ళింటికెల్లి రిఫ్రెషై సభ జరిగే నందిని హోటల్ పైనున్న ఏసి హాల్ కి చేరకున్నాం. బెంగుళూరు తెలుగు రైటర్స్ అసోసియేషన్ సభ్యులు వివినమూర్తి గారితో సహా అంతా వచ్చారు. మొదటి సెషన్ వల్లంపాటి విమర్శనా శిల్పం మీద చర్చ. సబ్జెక్ట్ క్లిష్టమైంది కావడం వల్ల కొద్ది మందే మాట్లడేరు. లంచ్ తర్వాత కల్లం పాటికి నివాళి కార్యక్రమం జరిగింది. సాయంకాలం కథ – 2006 ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ ఆర్టిస్ట్ చంద్ర; శివారెడ్డి, మృణాళిని వక్తలు, ఆ పుస్తకంలో కథలు రాసిన రచయితలంతా కథల నేపథ్యాలు చెప్పేరు. సభానంతరం రాత్రి ఫారెస్ట్ గెస్టహౌస్ లో భోజనాలు, సింగమనేని నారాయణ, శివారెడ్డి, నంబూరి పరిపూర్ణ, గీత, భగవంతం చాలా పాటలు పాడేరు. ఆ గెట్ టుగెదర్ ని సరదాగా చాలా ఎంజాయ్ చేసాం. రాత్రి 12 కి మృణాళినిని కూడా తీసుకుని అమరేంద్ర ఇంటికి వచ్చేసాం. తెల్లవారి ఫ్లైట్ లో మృణాళిని హైదరాబాద్ వెళ్ళిపోయింది. 15వ తేదీ అమరేంద్ర ఇంట్లో కథల పైన డిస్కషన్ చాలా బాగా జరిగింది. వోల్గా, కుటుంబరావుతో సహా అందరూ హాజరయ్యారు. మధ్యాహ్నం కొందరు వెళ్ళిపోయారు. హార్మోనీ సాయంతో ప్రసన్నకుమార్ సర్రాజు గజల్స్, మళ్ళీ అందరూ పాటలు, అమరేంద్ర అద్భుతంగా పాడిన హిందీ పాటలు, జరగదీశ్వర్రెడ్డి తూర్పు రామాయణం – మధ్యలో జోక్స్, సెటైర్లు బలే సరదాగా గడిచింది. సాయంకాలానికి అందరూ డిస్సర్స్. మేం కూడా బి. పద్మావతి, సురేష్ ల ఇంటికెళ్ళి, అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ కెల్లి రాత్రి 10 కి తిరిగొచ్చాం. అమరేంద్ర, అతని భార్య లక్ష్మి మంచి ఫ్రెండ్లీనేచర్ కలిగిన వాళ్ళు. అతిథుల్ని గొప్పగా ఆదరించేరు. ఇంట్లోచేసి న రకరకాల పదార్థాలతో పాటు ఉలవచారు, కొన్ని ప్రత్యేకమైన స్వీట్సు హైదరాబాద్ నుంచి పరిపూర్ణగారు, శిరీష్ వచ్చేటప్పుడు ఫ్లైట్ లో తెప్పించేరు. 16 ఉదయాన్నే లక్ష్మి గారు పెట్టిన హెవీ టిఫిన్ తిని అమరేంద్ర దిగబెట్టగా లొట్టిగొల్లహళ్లి స్టేషన్ లో పాసింజరు ఎక్కి మధ్యాహ్నం 2.30 కి ప్రశాంతి నిలయం స్టేషన్ లో దిగి బస్సులో పుట్టపర్తి వెళ్ళేం. ఆ భవనాలూ అవీ చాలా బావున్నాయి. బాబా కూడా అక్కడే ఉన్నారు. సాయంకాలంనాలుగు గంటలకి హాల్లోకి వచ్చి ఓ సారి కనిపించి వెళ్ళిపోయారు. నడవలేకపోతున్నారు. కారు నేరుగా హాల్లోకి వచ్చింది. వీల్ ఛెయిర్ లోంచి ఇద్దరు లేపి పట్టుకొని నడిపించారు. ఆయన పుట్టిన స్థలం అంటున్న శివాలయాన్ని చూసి ఆ వీధుల్లో అలా నడిచి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. అంత వేడి అక్కడ. ఎన్ని నీళ్ళు తాగినా తీరని దాహం. 5.30 కి బస్సెక్కి తిరిగి ప్రశాంతి నిలయం స్టేషన్కి వచ్చి రాత్రి 7 కి కాచిగూడా ఎక్స్ ప్రెస్ ఎక్కి 17 ఉదయం ఇంటికి చేరుకున్నాం. వెంటనే రెండు రోజుల్లో భూమిక విమెన్ రైటర్స్ మీట్ లో పాల్గొని తర్వాతి వారంలో ఇంటికెళ్ళిపోయాను జగ్గంపేటకి.

          పక్కనే ఇర్రిపాక అనే ఊళ్ళో నాటకోత్సవాలకి జడ్జిగా వచ్చారట అదృష్టదీపక్ గారు వచ్చి పలకరించి వెళ్ళేరు.

          మే 18న హైదరాబాద్ మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో బాంబులు పేలి కొందరు మరణించారు.

          జగ్గంపేట ఒంటరి జీవితంలో ఎవరైనా పలకరిస్తే చాలు ప్రాణం లేచివచ్చేది. ఇక మనవలు పలకరిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండేది కాదు. ఒకరోజు మా గీత ఫోన్ చేసి తన కూతురు వరూధిని చేత మాట్లాడించింది. స్వీట్ వాయిస్, ముద్దుముద్దు మాటల్తో ‘ఏం తేత్తున్నావ్, అన్నం తిన్నావా’ లాంటి ప్రశ్నలు వేసింది. ‘నువ్వు బడికెళ్తావు కదా, నేనూ రానా’ అన్నాను. ‘రా’, అంది. ‘అయితే మీ అమ్మనీ నాన్ననీ ఫీజు కట్టమను’ అన్నాను. వెంటనే ‘వద్దులే, నువ్వు ఇంట్లో ఉంతమే మంచిది’ అంది. ఎంత నవ్వొచ్చిందో.

          మా అబ్బాయి చిన్నకూతురు సవర్ణిక ఓ కథ చెప్పింది – ‘ఒక రాజున్నాడూ, ఏత కెల్లేడూ, చేపతెచ్చేడూ, అక్క సెనగలు తెచ్చి అమ్మకిచ్చిందీ, అమ్మ సెనగలన్నీ తినే సిందీ, రాజుకి కప్పులో నెప్పొచ్చిందీ, కప్పులో పాముందంతా, రాజు పిస్తల్ తీసుకుని దాంపేల్చేచేలంతా, పొత్తలోంచి పాము బైతికొచ్చిందంతా, అమ్మకావాలీ అమ్మకావాలీ అని ఏచ్చిందంతా’ అంటూ సెనగలు తింటూ అల్లిన కథ అది.

          ‘‘అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది

          భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిపేస్తుంది’

          ‘‘ఏకాలంలోనైనా సాహిత్యం గొప్పతనం సమకాలీన పరిణామాలకు రచయిత ప్రతిస్పందనలోని నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది’’ అంటారు వల్లంపాటి తన కథాశిల్పంలో –

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.