కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-16

” పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” -పులిపాక బాలాత్రిపురసుందరమ్మ

 -డా. సిహెచ్. సుశీల

 
           ad vertere అనే లాటిన్ పదం నుండి ఆంగ్లంలో advertisement అనే పదం వచ్చింది. “ఒక వైపుకి తిరగడం” అని తెలుగులో అర్ధం. ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడం “ప్రకటన” ప్రధాన లక్షణం, లక్ష్యం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏదైనా సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రకటనా ప్రక్రియ ఉద్దేశం. ప్రాథమికంగా పరిశీలిస్తే, పూర్వకాలంలో ప్రజలకు ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి ‘దండోరా’ వేసేవారు. తర్వాత పత్రికలు వచ్చాక  తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యాపారవేత్తలు వివిధ వాణిజ్య ప్రకటనలను అందంగా ఆకర్షణీయంగా వేయడం ప్రారంభించారు. భారత దేశంలో స్వాతంత్య్రాయానికి పూర్వమే పోల్సన్ బ్రాండ్ యొక్క వాణిజ్య ప్రకటన –  “పోల్సన్ వెన్న” ను ఒక పాప బ్రెడ్ ముక్కు పై రాయడం, పిల్లల ఆరోగ్యానికి అత్యుత్తమమైనదని ఆంగ్లంలో చెప్పడం గమనించవచ్చు. (70 వ దశకం వరకు పోల్సన్ బ్రాండ్ ని వాడేవారు సంపన్న వర్గాలుగా గుర్తించబడే వారు.)
 
           ప్రకటన ( advertising) అనేది రాజకీయ, సైద్ధాంతిక, వ్యాపార సంబంధించి తమ లక్ష్యాలను ప్రజలకు తెలియజేయడం. ఒకరకంగా ‘ఒప్పింపజేయడం’ ప్రధాన ధ్యేయం. తమ ఉత్పత్తులను, తమ సేవలను ప్రజలకు తెలియజేయడంలో వాణిజ్య వేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆకర్షణలను సృష్టిస్తూ ‘పోటీ’ పడడం గమనిస్తున్నాం.
 
           కానీ ఈ ప్రకటనల పోటీల్లో “స్త్రీలను అశ్లీలంగా, అసభ్యంగా చూపడమే” సమస్య.* 
 
           ఈ విషయాన్ని మార్చి 1, 1938 లోనే శ్రీమతి పులిపాక బాలాత్రిపురసుందరమ్మ ‘గృహలక్ష్మి’ పత్రికలో కథ రాయడం ప్రశంసనీయం. 
 
“పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణసంకటము”
 
సీత, రామారావు భార్యాభర్తలు. ఒకరోజు పోస్ట్ మాన్ తెచ్చిన ఉత్తరాలు, పత్రికలు చూస్తున్న రామారావు భార్యను పిలిచాడు. నవ్వుతూ సంచిక మీది బొమ్మను చూపాడు. పుట్టింటి నుండి ఉత్తరం వచ్చిందేమో అని వచ్చిన సీత ఆ బొమ్మ ను చూసి చిన్న బోయింది. అదేమని అడిగిన భర్తతో ” ఏ రోజుకారోజు స్త్రీలు ఎంత చులకనగా, ఎంత హేయముగా చూడబడుతున్నారు అని ఆలోచిస్తున్నాను” అన్నది.
 
           “ఎవరో చిత్రపటము వ్రాసినారని నా మీద అలిగితివా! పురుషులంతా ఒక్కటే కదా అని కాబోలు నీ అభిప్రాయం” అన్నాడు చిరుకోపంతో.
 
           “ఇట్లాంటి బొమ్మలు వేశారంటేనే మీకు కోపం వస్తుంటే, ఈ బొమ్మలు చూస్తే మాకెలా వుండొచ్చునో మీరే చెప్పండి. పూర్వకాలంలో స్త్రీలు ఎంత గౌరవంగా  చూడ బడ్డారో, ఇప్పుడు అంత చులకనగా వున్నారు పురుషుల కలము క్రింద. స్త్రీలు ఈ చిత్తరువులను చూచి తలలు వంచుచున్నారు. మాకు కోపమొస్తుంది అనే గౌరవ మర్యాదలు మీకు ఉంటే ఈ పత్రికలను ఇంత దూరం తెచ్చి వృద్ధి చేస్తారా” అన్నది.
 
           కేవలం బొమ్మల వలన మీకు కలిగిన నష్టమేమున్నది అని అతడనగా – మీకు సంతోషం, మాకు దుఃఖం. డబ్బు నష్టమైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. గౌరవం నష్టమైతే ఎలా వస్తుంది. అనాది నుండి భారత స్త్రీలు ఎంత గౌరవం పొందుతున్నారు! అట్టి సంతతికి చెందిన మా ఎదుట నేడు ఈ విధముగా వస్త్ర విహీనములగు చిత్తరువు లను వ్రాసి ప్రదర్శిస్తుంటే మా హృదయాలు ఎంత వేదన పడుతున్నాయో మీకేం తెలుస్తుంది! పూజనీయమగు స్త్రీ మూర్తిని నవీన కాలపు చిత్తరువుల వల్లను, వ్రాతల వల్లను ఇట్లు హేయము చేస్తున్నారు. ఇంత శోచనీయం ఇంకొకటి కలదా! మా స్త్రీలలో కూడా ఎందరో కథకులు ఉన్నారు. ఉపన్యాసకులు ఉన్నారు. కవయిత్రులు ఉన్నారు. చిత్రకళా నిపుణులున్నారు. ఎవరైనా ఎప్పుడైనా పరులను అగౌరవపరుచుట ఏ గ్రంథంలోనైనా ఏ పత్రికలోనైనా చూశారా అన్నది సీత గద్గద కంఠంతో.
 
           ‘మీరు కూడా నవీనులే కదా. పత్రికలను మాత్రం ‘నవీనం’ అని ఆక్షేపించుట ఎందుకు’ అన్నాడు రామారావు. పైగా ‘మీరు కూడా రాయకూడదూ’ అన్నాడు గడుసుగా.
ఇటు వంటి హేయపు పనులు మేము చేయము అన్నది సీత. తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ –
 
           “సమయం వస్తే మేము కూడా రాజ్యాంగ విషయాల్లో గాని, ఉద్యోగాల విషయాల్లో గాని, రణరంగములలో గాని మీకు తీసిపోము. మితముగా మాట్లాడినంత మాత్రమున స్త్రీకి ఒక వ్యక్తిత్వం కూడా లేదని తలంచి ఆట వస్తువుగా భావిస్తున్నారు కాబోలు. స్త్రీ యొక్క ఆశయములు, తెలివితేటలు, గౌరవ మర్యాదలు నిప్పు మీద నివురు గప్పిన చందముగా ఉంటాయి. కానీ స్త్రీ అబల కానేరదు. అవసరం వచ్చినప్పుడు స్త్రీ యొక్క తెలివితేటలు, కార్యశూరత ఉపయోగించును. కానీ అనవసర ప్రసంగములు కలగజేసుకునే వ్యక్తి కాదు స్త్రీ. ఏది ఏమైనా ఆ బొమ్మలను చూసి నేను సహించలేనండి” కరాఖండిగా అన్నది సీత.
సీత తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు. కానీ స్త్రీలను అసభ్యంగా చిత్రించడం చూసి ఘర్షణ గా మాట్లాడక తప్పలేదు. రామారావు కూడా చదువుకున్నవాడు. తన పని తాను చేసుకునే తత్వం కలవాడు. ఇతరుల జోలికి వెళ్ళేవాడు కాదు. స్త్రీని అభ్యంతరకరంగా చిత్రిం చడం సహించలేక పోయింది సీత. భర్త అంటే గౌరవ ప్రేమాభిమానాలున్నా ఈ విషయం లో వాదించకుండా ఉండలేకపోయింది ఆమెలోని ఆత్మగౌరవం.
 
           వంటపని చేసుకుంటున్నా సీత మనసులో వస్త్ర విహీనమైన ఆ చిత్తరువులే మెదులుతున్నవి. ఆ విషయం అంతటితో వదిలిపెట్టదలచుకోలేదామె. తాను కార్యదర్శి గా ఉన్న స్త్రీ సంఘములో దీనిని గురించి చర్చించి ఒక తీర్మానం చేసి పత్రికాధిపతులకు పంపవలెనని నిశ్చయించుకుంది. ఆచరించిందింది కూడా.
 
           ” పత్రికలు వ్రాయుచున్న వ్రాతలు, వేయిచున్న చిత్తరువులు చూచి స్త్రీల హృదయాలు చాలా వేదన పడుచున్నవి. ఈ కాలపు కథకులు, చిత్రకారులు తెలుసుకొన వలెనని ఈ సభ వారు హెచ్చరించుచున్నారు. మరియు వ్యాసకర్తలు, చిత్రకారులు తమ కళా నైపుణ్యతను, కథా కౌశలమును, వాక్య చాతుర్యమును, చిత్ర రచనాపటిమను సద్విని యోగము చేయక వృధా చేసుకునుచున్నారు గదాయని ఈ సభ వారు విచారించుచున్నా రు. ఇక నుంచి ప్రచురింపబడే గ్రంథ పత్రికాదులలో ఈ విధమగు వ్రాతలను, చిత్తరువు లను నిషేధించ వలెననియు,  వ్రాయు వారిని మందలించవలెననియు ఈ సభ వారు పత్రికాధిపతులను ముద్రాలయాధికారులను ప్రార్థించుచున్నారు” అని సీత ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని స్త్రీలందరూ ఆమోదించారు. 
 
           ఇంటికి వచ్చి రామారావుకి చెప్పగానే అతను నవ్వుతూ ‘మరి మీరు రాస్తే’… అన్నాడు.
 
           “ఆ భయము మీకెప్పుడూ వద్దు. మేము ఇది వరకు ఇలా రాయలేదు, ఇప్పుడు వ్రాయుట లేదు. ఇక ముందు వ్రాయము అని స్త్రీలందరి తరఫునా నేనే చెప్పగలను. అయినా ‘చక్కని స్త్రీ’ అంటే అందరికీ అర్ధం కాదూ! ఆమెను నిలువెల్లా వర్ణించాలా” అంది సీత ధైర్యంగా. 
 
           రామారావు నవ్వడం చూసి కోపంగా ” మీకు నవ్వులాటగానే ఉంటుంది. ‘పిల్లికి చరలాటం ఎలుకకు ప్రాణసంకటం’ అన్నట్లు మీకు నవ్వు, మాకు దుఃఖం” అంది.
 
           దాదాపు 86 ఏళ్ళ క్రితం పత్రికల్లో ముఖచిత్రం చూసి ఒక స్త్రీ తీవ్రంగా వ్యతిరేకించి, మహిళా మండలిలో చర్చింది, అందరూ ఆ అసభ్య చిత్రాలను నిరసిస్తూ తీర్మానం చేసి పత్రికలకు పంపారంటే – ఈనాడు వస్తున్న యాడ్స్, సినీ తారల ఫోటోలు గురించి మన మేం చేయాలి? ఎంత తీవ్రమైన ఆందోళన చేయాలి?
 
           కనీసం వ్యతిరేకిస్తూ ఆలోచన చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో, ప్రపంచీకరణ నేపథ్యంలో ‘స్త్రీని మార్కెట్ వస్తువు’గా పరిగణించడం మామూలై పోయింది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార ఆర్భాటం లో, టీవీ ఛానెల్స్ లో వ్యాపార ప్రకట నల్లో వారి వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడే ‘వ్యాపార వస్తువు’ గా మారింది స్త్రీ. ఒళ్ళు రుద్దు కునే సోప్ నుండి, అంట్లు తోమే ( లిక్విడ్ ) సోప్స్ వరకు, కాఫీ టీ ల ప్రకటనలు, స్త్రీల చర్మ కేశ పోషణ,  సౌందర్యసాధనాలుతో పాటు పురుషులకు సంబంధించిన రేజర్స్ వంటి వాటిని కూడా స్త్రీలే ప్రచారం చేస్తున్నట్టు, అదీ అర్ధనగ్నంగానూ  చూపుతున్నారు. ఫలానా పెర్ఫ్యూమ్ వాడితే వివాహిత యైన స్త్రీ కూడా ‘పడిపోతుంది’ అనే యాడ్ ఎంత దౌర్భాగ్యకరమైంది! తెల్లతోలు ఉంటేనే ‘అందం’ అని ఊదరగొట్టేవి, అతి ‘సన్నగా’ (ఓపిక లేనట్టు) ఉండడమే స్త్రీ జీవిత ధ్యేయం అన్నట్టు చూపడం, వాటికై ఆడపిల్లలు అర్రులు చాచడం గమనిస్తే ‘ఆత్మ సౌందర్యం, ఆత్మగౌరవం’ అనే మాటలు ఎటు ఎగిరిపోయాయో అనిపిస్తుంది. వ్యాపార ప్రకటనలు మధ్య పోటీ, దిగజారుడుతనం సమాజం పై దుష్పరి ణామం చూపుతుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ విపణి రంగంలో, అందాల పోటీల్లో అంగాంగ ప్రదర్శన, పాశ్చాత్య నృత్యాలు పై మోజుతో, మత్తులో చేసే నైచ్యం వర్ణనాతీతం. ఈ విశృంఖలత స్త్రీ వ్యక్తిత్వానికి మాయనిమచ్చ. 
 
           తమ వస్త్రధారణ పూర్తిగా స్త్రీల అభీష్టమే. కానీ దానిని అలుసుగా తీసుకుని ‘కాసులు’ కురిపించుకోవడానికి చేసే వ్యాపారవేత్తల కుతంత్రమే అభ్యంతరకరం. ఈ విషయాన్ని 1936 లోనే నిర్ద్వంద్వంగా నిరసించిన శ్రీమతి పులిపాక బాలాత్రిపుర సుందరమ్మ గారి ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించాలి.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

2 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-16 పులిపాక బాలాత్రిపురసుందరమ్మ”

  1. Advertisement లో స్త్రీలను చులకనగా చూపే సంస్కృతిని ఆ నాడే పసిగట్టిన బాలా త్రిపురసుందరి గారు గొప్ప Visionary అనుకోవాలి. She was Really a Great Woman.సుశీల గారికి అభినందనలు.

  2. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి says:

    స్త్రీలని పువ్వులని వర్ణించిన ముళ్ళలానే చూస్తారు. వారి చుట్టూ చిక్కు ముళ్లే వేస్తారు. అలాంటి ముళ్లలో ప్రకటనల రంగం ఒకటి. దానికి పెట్టుబడి డబ్బే అయినా కట్టుబడి పట్టుబడి మాత్రం ఆకర్షణే. ఆ ఆకర్షణ పేరే ఆడది.
    దీన్ని అప్పుడే గుర్తించి ప్రతిఘటించిన బాలాత్రిపురసుందరమ్మకు జేజేలు

Leave a Reply

Your email address will not be published.