జీవితం అంచున -17 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          అమ్మ పడక్కుర్చీలో కూర్చుని ఏదో పలవరిస్తోంది. అంతలోనే అమ్మ బోసినోటితో బుంగ మూతి పెట్టింది.

          కెమెరాలలో చూడగలనే కాని వినలేని నేను జూమ్ చేసి శ్రద్దగా చూడనారంభిం చాను. ఎందుకో అమ్మ పరవశంగా చేతులు ముందుకు చాచింది.

          జగన్మోహన ఆనందం కెంపులై ఆమె చప్పిడి బుగ్గల్లో ఎర్ర మందారమై తణుకులీను తోంది.

          అమ్మ ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ముందుకు వంగి గుసగుసగా కలవరించింది. అమ్మ కదులుతున్న పెదాల వంక తదేకంగా చూస్తున్నాను.

          బహూశా అమ్మ మెదడు కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయుంటుంది.

          ఎందుచేతనో ఆ పాలవాడి తెల్ల బట్టలు, చిరునవ్వు, ఆ లేత నీలం వెస్పా అమ్మను గతంలోకి తీసుకెళ్ళిపోయాయి.

          ఏ రహస్య ఆరాధకుని.. ఏ సన్నిహిత సఖుని స్మృతుల్లో అమ్మ విస్మృతమై పోయి వుందో..!

          నేను చదివిన రిట్రోగ్రేడ్ అమ్నేషియాకి సంబంధించిన విషయం…

          బహూశా ఆ నేస్తం ఎప్పుడూ తెల్లటి బట్టల్లో మల్లెపువ్వంటి చల్లని నవ్వుతో పలక రించి అమ్మను పరవశింప చేసేవాడేమో…

          అప్పుడు అంగీకరించి స్వీకరించలేని అతని ప్రేమను అమ్మ ఇప్పుడు తన ఒంటరి తనంలో కోరుకుంటోంది కాబోలు. నిజానికి కోరుకోవటం మాత్రమే కాదు మానసికంగా లేనిది వున్నట్టుగా భ్రమిస్తోంది.

          అతను తన పక్కనే వున్నట్టు, తనతో మాటాడుతున్నట్టు, భోజనం చేస్తున్నట్టు, అనుక్షణం అతని ఉనికిని అనుభవిస్తోంది. అమ్మకు తనేమి చేస్తుందో తనకే తెలియటం లేదు. తనేమి మాటాడుతుందో స్పృహ వుండటం లేదు. ఆ ఊహలతో భ్రమలతో ఆమె మనసున వెన్నెల విరిసి అపరిమితానందంగా ఆహ్లాదంగా మాత్రం వుంటోంది ఆమె అంతరంగం.

          తన ఆనందానికి అడ్డుపడుతున్నారని అమ్మ ఇప్పుడు అందరినీ అనుమానిస్తుం ది. ఇంట్లో మరెవరయినా వుంటే తన మిత్రుడు రావటానికి మొహమాటపడుతున్నాడని ఆపోహ పడుతుంది. అందుకే నేను అమ్మ సేవల కోసం ఆమె చేతి కింద పెట్టిన అమ్మాయిని పంపించేసింది.

          అమ్మ, ఆమె మనసు, ఆమె ఇల్లు అన్నీ ఇప్పుడు నిరంతరం ఆ నేస్తం రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అమ్మ ఇప్పుడు అనునిత్యం ఆమె స్నేహితుని ఊహా పరిష్వం గాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. తన ప్రణయ వాసన పసిగడతారని అందరినీ బహిష్క రిస్తోంది.

          అందరూ అంటారు ప్రేమకు వయసుండదని…

          వయసేమో గాని ప్రేమకు మరుపుండదు.

          డెమెన్షియాలో కూడా ఆరనితడి ప్రేమొక్కటే…

          మతిమరుపులోనూ ప్రేమ మైమరిపిస్తుంది.  

          రిట్రోగ్రేడ్ అమ్నేషియా….

          దగ్గరి గతాన్ని మరిచి బాగా రిమోట్ గతంలోకి మెదడు జారిపోవటం.

          ఉన్నట్టుండి తరుచూ అమ్మ ఐదు దశాబ్దాల గత స్మృతుల్లోకి వెళ్ళిపోతుంది.

          అమ్మ తను వయసులో వుండగా చేసిన వడ్డీ వ్యాపారం ఇప్పుడు చేయాలనుకుం టోంది.

          అప్పట్లో అమ్మకి తెలిసిన ఓ తెల్ల బట్టల నీలం వెస్పా మనిషితో అనుబంధాన్ని ఇప్పుడు కోరుకుంటోంది అమ్మ.

          నాకు లాజిక్కు అందటం లేదు కాని పాలవాడిని బహూశా అతనిగా భ్రమిస్తోంది.

          సమ్ థింగ్ ఈజ్గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే ఇన్ హర్ మైండ్.

          అమ్మ గతంలో జీవిస్తోంది.

          నాకు ఏమి చేయాలో అంతు పట్టటంలేదు. కాలు నిలవటం లేదు.

          మరో వారం మాత్రమే వుంది గృహప్రవేశం.

          అగమ్యగోచరంగా డెస్పిరేట్ గా వుంది నాకు.

          కాశికి ఫోను చేసి పాలవాడి నంబరు తీసుకుని నాకు ఇమ్మన్నాను.

          కాశి నంబరు తెచ్చి ఇచ్చాడు.

          పాలవాడితో అసలు ఏమి ప్రస్తావించాలో ఎలా మొదలెట్టాలో కూడా నాకు అంతు పట్టలేదు. పదాలు పేర్చుకుని కష్టబడి మాటలు కూడబలుక్కున్నాను.

          నిజానికి పాలవాడు చాలా మంచివాడు, నిజాయితీపరుడు.

          కాని డబ్బు చెడ్డది. ఈ కరోనా కష్ట కాలంలో డబ్బు అవసరాలు మరీ చెడ్డవి.

          ఫోనులో పాలవాడు నా గొంతును గుర్తించాడు. అతని గొంతులో తొణుకు బెణుకు లేదు.

          నాకు విషయం ఎలా మొదలెట్టాలో అర్ధం కాలేదు.

          ‘మా ఇంటి చుట్టూ కెమెరాలు వున్నాయి, ఆ ఇంట్లో ప్రతి కదలికను నేను గమనిస్తుం టాను’ అని హెచ్చరించటమే నా ఉద్దేశ్యం.

          “బావున్నావా…” నా పలకరింపు నాకే పేలవంగా వినిపించింది.

          వెంటనే గొంతులోకి గాంభీర్యం తెచ్చుకుని “ఏందయ్యా పొద్దుగాల లోపట మా డైనింగ్ రూముల కనిపించినవ్. నేను సీసీ టీవీ కెమెరాల్ల చూసిన. అసలు నీకు ఇంటి లోపటిదాంక పోవలసిన పని ఏంది…” గదమాయింపుగా అడిగాను.

          “అమ్మా, పెద్దమ్మనే నన్ను లోపటికి పిలస్తదమ్మా. నేను ఇండ్లల్లో పాలు ఎయ్యాలె, నాకు మస్తు పని వుంది అన్నా ఊకోదమ్మా. నా తల్లి అసుంటిది అని కాదనలేక లోనికి పోతానమ్మా.” అతని మాటల్లో నిజాయితీ వుంది.

          “పొద్దున్న నిన్ను కావలించుకుని ఏడుస్తున్నట్టు వుంది. ఎందుకు, అసలు ఏమం టుంది నీతో…”

          అతను ఒక క్షణం మౌనంగా వుండి పోయాడు.

          జవాబు చెప్పటానికి తటపటాయిస్తున్నాడని అర్ధమయ్యింది.

          “మాటాడవే…” రెట్టించాను.

          అసలు అతనిని అమ్మ ఎవరనుకుంటుందో నాకు తెలియాలి.

          “నేను ఒంటరిదాన్నయిపోయాను. అందరూ నాకు దూరమై పోయారు. నా బిడ్డ కూడా నన్ను వదిలేసింది. నువ్వూ నన్ను వదిలేస్తావా… నాకు నువ్వయినా తోడు ఉండవా… అని ఏడ్చుకుంటూ ఏమేమో మాటాడుతుందమ్మా. ఆమెకు జర దిమాగ్ ఖరాబయినట్టుంది. వయసై పోయింది కదా…” నా అనుమానం రూఢీ అయ్యింది.

          అర్జంటుగా ఇండియా వెళ్ళి అమ్మను మంచి డాక్టరుకి చూపించాలి.

          “సరే… నీ మంచితనం మీద నాకు నమ్మకముంది. నువ్వన్నట్టుగా ఆమె బుర్ర సరిగా పని చేయటం లేదు. నువ్వు ఇక పాలు వేయటం మానేసేయి. ఖాతా పోయిందని బాధ పడకు. పెద్దమ్మ ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ వేద్దువుగాని.. ఇంతవరకూ వేసిన పాలకు ఏమయినా బాకీ వుంటే కాశీ వచ్చి ఇచ్చేస్తాడు. నువ్వు డబ్బుల కోసం కూడా ఇంక మా ఇంటి దిక్కుకి పోకు…” బాధ పడుతూ చెప్పాను.

          “తప్పుడు భావనతో నిన్ను మాన్పించటం లేదు. కరోనా సమయంలో కేవలం అమ్మ వయసు దృష్ట్యా నీ రాకను అరికడుతున్నాను. నన్ను అపార్థం చేసుకోకు”

          “ఫరవాలేదమ్మా. నువ్వు చెప్పేది కరెక్టే. నేను రోజు పెద్దమ్మతో పరేషాన్ అవుతున్న… ఇగ పోను…” అన్నాడు.

          అక్కడితో అమ్మ రిట్రోగ్రేడ్ అమ్నేషియా కథ ముగిసి పోతుందనుకున్నాను.

          కాని, ఈ కథ మరో కథకు దారి తీస్తుందనుకోలేదు.

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “జీవితం అంచున -17 (యదార్థ గాథ)”

  1. హాయ్ ఫ్రెండ్ మీ ప్రతి ఎపిసోడ్ లోని యదార్ధ గాధ గుండెను నులిమేస్తుంది. మీరు వ్రాసే తీరు కంట తడి పెడుతుంది. నెక్స్ట్ ఏమి వ్రాస్తారా అని ఎదురు చూసేలా వ్రాయడం మీ గొప్ప తనం విష్ యూ ఆల్ ది బెస్ట్ 🤝👏👌💐👏👌💐👏👌💐👏👌💐❤

Leave a Reply

Your email address will not be published.