కనక నారాయణీయం -15

పుట్టపర్తి నాగపద్మిని

 ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’ 

   పుట్టపర్తి అన్నారు,’విద్వాన్ పరీక్ష పాసవటం, అవకపోవటం – గురించి కాదు సుబ్బయ్య గారూ, నా బాధ!! అసలు, దిద్దేవారు,  నేను ఒక్క ప్రశ్నకు వ్రాసిన సమాధానం చదివి అర్థం చేసుకునేవారే  ఐతే, నేను ఫైల్ అయ్యే ప్రస్తావనే ఉండేది కాదు. శిరోమణి ప్రవేశ సమయంలో నేను ఆవేశంగా ఆశువుగా చెప్పిన శ్లోకాలు విని, అప్పటికప్పుడే నన్ను వెనక్కి పిలిపించి, నేను దరఖాస్తు పెట్టుకున్న తరగతి కాక, నాకిష్టమైన తరగతిలో చేరమని ఆ ప్రధానాచార్యులే అన్నారు అప్పుడు తిరుపతిలో !! నా గొప్పతనం గురించి చెప్పుకోవటానికి కాదు నేనీమాటలంటున్నది!! విద్వానేవ విజానంతి విద్వజ్జన పరిశ్రమం..విద్వాంసులు..అంటే పండితులే, పాండితిని గుర్తించగలరు అని!! అసలు ప్రభుత్వం, ఉద్యోగానికి విద్వాన్ పరీక్ష కొలమానంగా నిర్ణయించటమే – విద్వత్తును  పరిధిలో కుదించటం అంటాను నేను!! ‘

  ‘అదెట్టా పుట్టపర్తి??’ సుబ్బయ్యగారికి అర్థం కాలేదీ సంగతి!!

  పుట్టపర్తి అన్నారు-‘ ‘దీనికొక కథ చెప్పవలసి ఉంటుంది సుబ్బయ్యగారూ!! మా అయ్య కథ!! అంటే ఇది కేవలం మా అయ్య కథే కాదు!! ఇప్పటికి దాదాపు, ముప్ఫై ఏళ్ళ కిందటి మన పాండితీ విలువల కథ!! విద్యా విధానంలో అప్పటి రోజుల్లో, మన దేశ పాండిత్యానికున్న విలువల గురించిన కథ!!  సమాజంలో నిజమైన పాండిత్యానికున్న ప్రమాణాల కథ!!’

  ‘ఇదంతా సరే కానీ..అసలు కథ చెప్పవయ్యా..’   

 ‘మా అయ్యగారు  పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు, ఎటువంటి డిగ్రీ లేకుండానే  బెంగుళూరు సైంట్ జోసెఫ్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసేవారు. అప్పట్లో విద్యార్హత అంటేఒక కాశీ విశ్వవిద్యాలయంలో పండిత సభల్లో  సత్కరింపబడటం !! శాస్త్ర చర్చల్లో వాద ప్రతివాదాల్లో గెలుపందుకునియే గజారోహణ గౌరవాన్ని అందుకున్నవారినే పండితులుగా గుర్తించేవారు, గౌరవించేవారు.   జోసెఫ్ కళాశాలలో, మా అయ్యగారు తెలుగు ఉపాధ్యాయుడి పోస్ట్ కు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు, నీ విద్యార్హత ఏమిటి? అని  అడిగినారు !!  క్లిష్టమైన సంస్కృత శ్లోకాన్ని ఆశువుగా  చెప్పినారాయన!!   దీనికి అర్థమేమిటి?? అని మళ్ళీ ప్రశ్న!!  (అటువైపు వారికి తెలుగే రాదు, ఇంక సంస్కృతం కూడానా??) మా  అయ్య గారే సంస్కృత శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చెప్పినారాయన!!   ఉద్యోగం వచ్చేసిందిఅంతే!!

     అదే కళాశాలలోపుట్టపర్తి  దూరపు చుట్టం, అనంత కృష్ణ శర్మసంస్కృత పండితులు. అనంత కృష్ణ శర్మగారు  పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారి మాతృమూర్తి చెల్లెలి అల్లుడు.  

       అక్కడే  సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆంగ్ల పండితులు.

    ఒకసారి ఉద్యోగంలో కొనసాగాలంటే, విద్వాన్ డిగ్రీ అవసరమనీ, మీరు పాసై తీరాలనీ, లేదంటే, ఉద్యోగం వదులుకొమ్మనీ చెప్పినా రట   అయ్య గారికి యాజమాన్యం వారు!!

    రాళ్ళపల్లి వారిని సలహా  అడిగినారంట..    అయ్యగారు , ఇప్పుడేమిటి చేయటం?? అని!

రాళ్ళపల్లి మరోమాటకు తావివ్వకుండానీవే వెళ్ళిపో ఉద్యోగం నుంచీ!!’ అనేసినారంట రాళ్ళపల్లి వారు!!

వారి పాండిత్యాలు అపారమైనవి. విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడవటం అంటే, పాసైన వారి పాండిత్యానికి, కొలమానం అదే!! అతని తాహతు (లెవెల్) అంతేనని పరిమితి విధించడమన్నమాట!! అదే, కాశీ పండితుడంటే, గౌరవం, విద్వాన్ కంటే వెయ్యి రెట్లు మిన్న!!

   ఇంకేముంది??  అయ్యగారు  ఉద్యోగం వదిలేసుకున్నారు!!’ ఆగారు పుట్టపర్తి.

  సుబ్బయ్యగారి కళ్ళు మెరిశాయి. ‘భలే  బాగుండాదే యీ కత!! అంటే, మీ అయ్య మాదిరే నువ్వు గూడా విద్వాన్ పాసవడమంటే నీ విద్యకు కొలమానం నిర్ణయించడమేనంటావా ఏంది??      ఇదుగో అచార్లూ..అట్టా జెయ్యొద్దు. కాలాలు మారినాయి. బతుకుదెరువుకు కాలానికి తగినట్టు కొంచెమైనా మారాలయ్యా!!    ఇంతకూ..ఇప్పుడీ విద్వాన్ పరీచ్చ కతేంది?? యూనివర్సిటీ వాల్లనుంచీ వచ్చిన యీ జాబులో   పొరపాటైందని రాసినారుగదా!! ఇప్పుడేమౌతుందంటావ్?? .చెప్పు తొందరగా!! ‘    సుబ్బయ్య గారిలో పుట్టపర్తిని వదులుకోకూడదన్న తపన స్పష్టంగా కనిపిస్తున్నది. అది చూస్తున్న అక్కడివాళ్ళకిదే సరిపోని విషయం.

   చూద్దాం సుబ్బయ్య గారూ!!’ పుట్టపర్తి మాటల్లో స్థిరత్వం!!

    ముచ్చటగా  పుట్టపర్తిని చూస్తూ ఆనందిస్తున్న కొప్పరపు సుబ్బయ్య గారిని చూస్తూ, అక్కడున్న వాళ్ళంతా, నెమ్మదిగా తప్పుకున్నారు అక్కడినుంచీ!!

   ఇక్కడ కొప్పరపు సుబ్బయ్యగారి వ్యక్తిత్వాన్ని గురించి కాస్త తెలుసుకోవాలి!!      

  సంపన్న స్థితిలో ఉన్నా కొందరికి సామాన్య ప్రజా సంసేవనం జీవన ధేయంగా ఉంటుంది. శ్రీ సుబ్బయ్యగారు యీ కోవకు చెందినవారు. పుట్టపర్తికి, చిన్న వయసులో ఆశ్రయం కల్పించిన మహామనీషి సుబ్బయ్య గారు.

       వీరు, ప్రొద్దుటూరు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆంధ్ర కేసరి టంగుటూరి పంతులుగారికి సతీర్థుడు. అనాథ శరణాలయం, సేవాసదనం, స్కూల్ సుబ్బయ్యగారు స్థాపించారు. రోజుల్లోనే బడుగు వర్గాల ఉన్నతికోసం ఎంతో కృషిచేశారు. హిందూ ముస్లిం తగాదాలు వచ్చినప్పుడు, ముస్లిం సోదరులను దగ్గరకు తీసుకుని, జీవనోపాధి కల్పించి, వారిమధ్య సామరస్యాన్ని పెంపొందించారు.

         1942లో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులుగా వీరున్న సమయంలో సుబ్బయ్య శ్రేష్టి గారికి, నెల్లూరిలో పెద్ద సత్కారం చేశారు. గొప్ప ఊరేగింపు జరిపారు వీరిని కూర్చోబెట్టి!! సర్వమత సమభావనా తత్పరులు శ్రేష్టి గారు.

         సాహిత్యం పట్ల ప్రేమతో ప్రొద్దుటూరులో ఒక గ్రంధాలయాన్ని స్థాపించారు. అప్పుడింకా స్వతంత్రం రాలేదు. ప్రభుత్వం నుండీ ప్రతిష్టాత్మకరావు సాహెబ్బిరుదు వీరిని వరించింది. కానీ గాంధీ అభిమానిగా, కొప్పరపు సుబ్బయ్య శ్రేష్టి, దాన్ని నిరాకరించారు. నిస్వార్థ సేవపరుడు, త్యాగమూర్తి సుబ్బయ్య స్రేష్టి,1932లలోనే,   ప్రొద్దుటూరిలో  ఉచితంగా మంచినీళ్ళ సదుపాయం, కడప కంటే ముందే ఆర్య వైశ్య సంఘం పక్షాన విద్యుత్తును కూడ   తెప్పించిన కార్యశూరుడు.

     అటువంటి కొప్పరపు వారి కొలువులో, మళ్ళీ పుట్టపర్తి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడవటం, ప్రొద్దుటూరులో, వారి స్థానం మరింత స్థిరపడటం, సాహిత్య రంగంలో రోజురోజుకూ, వారి పేరు నవకవుల శ్రేణుల్లో ప్రథమ గణ్యంగా ప్రతిధ్వనించటం జరిగిపోతూనే ఉంది.

      ఈ క్రమంలో ఎన్నెన్నో ప్రాంతాల్లోని సాహిత్య సభల్లో పుట్టపర్తి గంభీర సాధికార పరంపరలు సాహిత్య ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించాయిఅటువంటి కొప్పరపు వారి కొలువులో, మళ్ళీ పుట్టపర్తి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడవటం, ప్రొద్దుటూరులో, వారి స్థానం మరింత స్థిరపడటం, సాహిత్య రంగంలో రోజురోజుకూ, వారి పేరు నవకవుల శ్రేణుల్లో ప్రథమ గణ్యంగా ప్రతిధ్వనించటం జరిగిపోతూనే ఉంది.

       ప్రాకృత, సంస్కృత, ఆంధ్ర సాహిత్యంలోని వివిధ రచనలలోని విశేషాలను గురించి పుంఖానుపుంఖాలుగా వారు వ్రాసిన వ్యాసాలు ప్రచురితమౌతున్నాయి.

  అదేమిటో, వాక్కులోనూ, మేధోమథనంలోనూ వారికున్న  వేగానికి అనుగుణంగా వ్రాత సాగటమంటే కష్టంగానే ఉండేది వారికి!!

  వారి శ్రీమతి కనకవల్లి అక్షరాలు ముత్యాల వరుసల్లా ముచ్చటగా, తీర్చిదిద్దినట్టే ఉండేవి. పైగా ఆమెకూడా విద్యా సంపన్న!! సంస్కృత పంచకావ్యాలనూ ఆపోసన పట్టింది చిన్ననాడే!! పుట్టపర్తికి  శ్రీమతైన నాటినుంచీ, వారివద్ద ప్రాకృత, ఆంధ్ర సాహిత్య విహారం ఆమె వ్యాపకమైందిప్పుడు!! కాబట్టి, ఆమె వ్రాయసగత్తెగా కూర్చుంటే తన పని మరింత సులువౌతుందని తట్టింది పుట్టపర్తికి!!

    వెంటనే ఆచరణలో పెట్టటమైపోయింది. ఇటు ఇంటి పనీ, ఇద్దరు ఆడపిల్లల సం రక్షణా (1939 లో కరుణాదేవి, 1941 లో తరులత పుట్టారు)తో పాటూ, ఇప్పుడు, భర్తకు వ్రాతపనిలోనూ సహకరించటం ఇల్లాలి దినచర్యలో భాగమైపోయింది

     ముప్పై ఏళ్ళ వయసుకే పుట్టపర్తి ఖ్యాతి దక్షిణాదికంతా పాకింది. కారణం, సర్వ విదితం. కేవలం, సంస్కృతాంధ్రాలే కాక, కన్నడ, తమిళములు, ప్రాకృత సాహిత్య సంబంధలు పుట్టపర్తికి ఉండటం, దానికి తోడు సంగీత నాట్యాలలో వారికున్న పట్టు మరీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నదిసాహితీలోకాన్ని!!

  విలక్షణమైన వారి రచనా విన్యాసం లేని సాహిత్య పత్రిక ఉండేది కాదు. అప్పట్లో భారతి   సువిఖ్యాత సాహిత్య పత్రిక కేవలం తలపండిన పండితోత్తముల పత్రికగా ఖ్యాతినొందినది.అందులో పుట్టపర్తి వ్యాసాలు, తప్పనిసరై ఉండేవి. సాహిత్య ప్రత్యేక సంచికలలో అడిగి మరీ పుట్టపర్తితో వ్యాసాలు వ్రాయించుకునేవారు.

     మదరాసు ఆకాశవాణి నుంచీ వచ్చే ఆహ్వానాల హవా ఎటూ ఉంది.

  ఇవన్నీ గమనిస్తున్న అక్కడి పండిత వర్గాలలో,   కొందరిలో పుట్టపర్తి పట్ల వ్యతిరేకత కూడా చాప కింద నీరువలె వ్యాపిస్తూనే ఉన్నది.

     ఇవన్నీ పుట్టపర్తి చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఒకవైపు వారి మనసులో ఏదో అసంతృప్తి!! ;ఇక్కడ, యీ చిన్న ఊళ్ళో, వుద్యోగంలో నిలదొక్కుకునేందుకే ఇన్ని పాట్లు పడవలసి వస్తున్నది!! ప్రతిభ తనదే ఐనా, తనను చూసి ఈర్ష్యాసూయలతో రగిలిపోతున్నవారిని ఏమనాలో అర్థం కావటం లేదు!! ఇక్కడ సుబ్బయ్యగారి చలువ వల్ల వారికి తనను విరోధించే అవకాశం రావటం లేదు. లేకపోతేనా?? ఎప్పుడో, తననిక్కడినుంచీ వెళ్ళగొట్టేవాళ్ళేమో!! ఐనా ఇక్కడ, ఇప్పటి విద్యా విధానంలో, అవే పాఠాలూ, అవే పరిసరాలూ, యీ విధంగా తన ప్రగతిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే వారి మధ్య కొనసాగవలసిందేనా ఇలా ఎప్పటికీ??’

     వైపు, ఇటువంటి భావాలు మదిని కలచి వేస్తున్నా, పుట్టపర్తి రచనా వ్యాసంగమేమాత్రమూ ఆగటం లేదు.   

   విధంగా పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!!

  పుట్టపర్తి  పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి??

(సశేషం)

****

ఫోటో వివరణ : ప్రొద్దుటూరులో పుట్టపర్తి పేరుతో గ్రంధాలయం (ఈ పనిని సాధించిన శ్రీ జింకా సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరు, గారి  సౌజన్యం తో) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.