జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-9

-వెనిగళ్ళ కోమల

నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చి ఉన్నాడు. ఇన్నయ్యకు ఆ పెండ్లికి అభ్యంతరం లేకపోయింది. జనవరి 12, 1988న రిజిస్టర్ వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ క్లబ్ లో డిన్నర్ ఇచ్చాము. వ్యవధి లేకపోవటాన నా వాళ్ళంతా ఊళ్ళ నుండి రాలేకపోయారు. అన్నయ్య పిల్లలు, కొద్దిమంది లోకల్ గా ఉన్న స్నేహితులు అటెండ్ అయ్యారు డిన్నర్ కి, కమల గారి కుటుంబం అంతా మా వెంట ఉన్నారు.

జూబ్లీహిల్స్ క్లబ్ లో ఆలపాటి సచ్ దేవ్ ఇన్ ఛార్జి. (కేటరింగ్)గా ఉండి డిన్నర్ కు చక్కని ఏర్పాట్లు చేశాడు. హేమంత్ తరఫున చాలామంది డిన్నర్ కి వచ్చారు.  అది మతాంతర వివాహం. బెంగుళూరు నుండి నవీన స్నేహితులు పెండ్లికి వచ్చారు. పెద్ద ఆర్భాటం లేకుండా పెండ్లి జరిగింది. జనవరి 16న హేమంత్ తిరిగి వాషింగ్టన్ వెళ్ళిపోయాడు. నవీన హౌవుస్ సర్జన్సీ ముగించి అదే సంవత్సరం డిసెంబరు 10న వాషింగ్టన్ వెళ్ళింది. డిప్లమాటిక్ వీసా గనుక, వర్క్ పర్మిట్ గూడా లభించింది. 

నవీన, హేమంత్ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కుని సహజీవనం ప్రారంభించారు. నవీన ఒక హాస్పిటల్లో తెల్లవారగట్ల ఐదు గంటలకు వెళ్ళి కొన్ని గంటలు పనిచేసింది. తరువాత ఇ.సి.ఎఫ్.ఎం.జి. పరీక్ష తయారీకి కేప్ లాన్ కోచింగ్ సెంటర్ లో చదివేది. కోచింగ్ ఫీజు, పరీక్ష ఫీజులు భారీగా ఉండటాన ఇద్దరూ కష్టపడి పనిచేశారు. హేమంత్ అదనంగా పని చేపట్టాడు. అప్పుడు నవీన యింకా డ్రయివింగ్ చేయలేకపోటాన హేమంత్ కారులో దించటం, లేక బస్ పట్టుకుని ప్రయాణాలు సాగించేది నవీన. పాసయిన తరువాత డి.సి.జనరల్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ లో రెసిడెన్సీ దొరికింది. కొంతకాలం మెడిసిన్ చేసిన తరువాత సైకియాట్రీ వైపు మొగ్గు చూపి నాలుగేళ్లు అడల్ట్ సైకియాట్రీ, రెండేళ్ళు సూపర్ స్పెషాలిటీ – ఛైల్డ్ సైకియాట్రీ ముగించింది. 

కొంతకాలం డా. డెవాస్కిన్, డా. జోషీలతో కలిసి పనిచేసి తన సొంత ప్రాక్టీసు ప్రారంభించింది. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుంది గనుక సత్ఫలితాలు సాధించగలుగుతున్నది. 

రాజు ప్రతిభకు తగిన దేశం అమెరికా అని, రాజును రమ్మని వత్తిడి చేసింది. జర్మనీ చూసి తిరిగి వెళ్ళిన రాజు అమెరికా పోవడానికి సిద్ధమయ్యాడు. 

ఇండియానా యూనివర్సిటీ, బ్లూమింగ్టన్ లో బిజినెస్ జర్నలిజంలో చేరి చదివాడు ఎం.ఎస్. ఇంటర్న్ గా, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేసిన మొదటి రోజే తన ప్రతిభ చాటుకున్నాడు. తను రాసిన ఆర్టికల్ ఫ్రంట్ పేజీలో మొదటి రోజే అచ్చయింది. సీనియర్ స్టాఫ్ రాజును అభినందించారు. అలా మొదటి రోజే తన ఆర్టికల్ ఫ్రంట్ పేజీలో రావటం విశేషమని వారు రాజును కొనియాడారు. 

కోర్సు అవుతుండగానే డేటన్ డెయిలీ న్యూస్ పేపర్ లో ఉద్యోగం ఖాయమయింది. ఎడిటర్ గ్రెగ్ ష్రీహార్ చెక్ రాజు పనితనాన్ని ఎంతో మెచ్చుకున్నారు. రాజుకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఉద్యోగం వచ్చినప్పుడు గ్రెగ్ ఇష్టం లేకుండానే రాజును వదులుకోవలసి వచ్చింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్నేషనల్ పత్రిక. అందులో ఉద్యోగం రాజు ప్రతిభకు గీటురాయి అని గ్రెగ్ భావించాడు.

రాజు మొదట పిట్స్ బర్గ్ బ్యూరోలో కొన్నాళ్ళు పనిచేసి న్యూయార్క్ మెయిన్ ఆఫీసుకు మారాడు. తనతో పనిచేస్తున్న కిమ్ బ్యారింగ్టన్ ను 1994 అక్టోబర్ 8న వివాహమాడాడు. అది అంతర్జాతీయ వివాహం. గ్రీన్ కార్డు అంతకుముందే రాజుకు వచ్చింది. నవీన కొడుకు రోహిత్ మా ముద్దుల మనవడు. 1994 మే 11న జన్మించాడు. వాషింగ్టన్ లో జరిగిన రాజు మామ పెండ్లికి పసివాడు రోహిత్ హాజరయ్యాడు తన 5 నెలల వయసులో. 

రాజు రెగ్యులర్ గా ది వాల్ స్ట్రీట్ జర్నల్కి ఆర్టికల్స్ రాసేవాడు. ఒక్కొక్కరోజు రెండు ఆర్టికల్స్ కూడా తనవి ప్రచురించేవారు. సీనియర్ జర్నలిస్ట్ లు రాజా నీవు ఈ కొద్ది కాలంలో రాసినంత మేము 10 సంవత్సరాల ఉద్యోగ కాలంలో కూడా రాయలేదు పత్రికకి అని రాజును మెచ్చుకున్నారు. ఎక్కడ పనిచేసినా తన శక్తి సామర్ధ్యాలు చాటుకుని తనదైన ముద్ర వేయటం రాజుకు అతి సహజంగా అనిపించినా చూసేవారికి ఎంతో గొప్పగా అనిపించి మెచ్చుకునేవారు. అంతటి ప్రతిభ చూపగలగటం మామూలు విషయం కాదుగదా!

నవీన ప్రసవించక ముందే నేను, ఇన్నయ్య తన దగ్గరకు చేరాము. 1992లో మొదటిసారి నవీన దగ్గర 6 నెలలు ఉండి వాషింగ్టన్ అంతా చూసాము. రాజు దగ్గరకు డేటన్ వెళ్ళి నెలరోజులున్నాము. బూమింగ్టన్ తీసుకెళ్ళి తాను చదివిన యూనివర్సిటీ  చూపాడు. 1994 ఫిబ్రవరిలో నవీన దగ్గరకెళ్ళాము. మే 11న బాబు పుట్టాడు. చూడచక్కని పసివాడు. రోహిత్ జాషువా, జాష్ అంటారు అందరూ. నేను, ఇన్నయ్య, రాజు రోహిత్ అనే పిలుస్తాము. పసివాణ్ణి పెంచటంలో ఎంతో ఆనందం అనుభవించాము          నేను, ఇన్నయ్య. ఏడవటం, విసిగించటం అనేవి ఏమీ లేకుండా ఎంతో హాయిగా నవ్వుతూ పెరిగాడు రోహిత్. ప్రతిక్షణం మేము ఆనందించాము. బిడ్డను పెంచనిచ్చినందుకు నవీన, హేమంత్ లకు కృతజ్ఞతలు తెలిపాము. మధ్య మధ్య ఇండియా కొద్దికాలం మేమిద్దరం వచ్చినా రోహిత్ కి 6 ఏళ్ళు వచ్చేదాకా ఎక్కువ కాలం నవీనతోనే ఉన్నాము. రోహిత్ పసితనంలోనే చదువు పట్ల శ్రద్ధ చూపేవాడు. రెండు సంవత్సరాలకే అక్షరాలు, అంకెలు రాయటం నేర్చుకున్నాడు. లైబ్రరీ నుండి కథల పుస్తకాలు తెచ్చి చదివేవాళ్ళం. విన్న కథ పొల్లుపోకుండా తిరిగి మాకు చెప్పేవాడు. వాళ్ళమ్మ పని వత్తిడితో పగలంతా బిజీగా ఉండేది. పసివాడి ముద్దుముచ్చట చెపుతుంటే తాను మిస్ అవుతున్నాననుకునేది. తనకు రెస్ట్ ఇవ్వాలని రాత్రి కూడా రోహిత్ ని నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని. అందుకే మాతో ఎక్కువ అనుబంధం రోహిత్ కి. తాత సెక్యులర్ భావాలు పసివాడికి అబ్బాయి. సైన్స్ పట్ల అభిరుచి తాతవల్లనే కలిగింది రోహిత్ కి. అదే బాటలో ఆలోచించి నడుచుకుంటున్నాడు. ఇప్పుడు కాలేజ్ చదువుల్లో ఉన్నాడు. మమ్మల్నిద్దర్నీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. తల్లికి ఆశాకిరణం ఆ బిడ్డ. అన్ని హంగులూ అడగకుండానే సమకూరుస్తుంది బిడ్డకు. రాహుల్ రెండవ బిడ్డ నవీనకి. ఇద్దరి మధ్య 6 సంవత్సరాలు తేడా. అన్ని విషయాలలోనూ రాహుల్ రోహిత్ కంటే తేడాగానే ఉన్నాడు. రంగు, రూపంతో సహా.

నాకు ఎడమ మోకాలు రీప్లేస్ మెంట్ అయి, సర్జరీ ఫెయిల్ అవటాన నేను రాహుల్ 20 రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు జబ్బుపడి ఇండియా వెళ్ళిపోయాను.  రాహుల్ ని పెంచటంలో ఏ విధంగానూ నేను నవీనకు తోడ్పడలేకపోయాను. రకరకాల వ్యక్తులు, బేబీ సిట్టర్లుగా ఉండి కూడా నవీనకు ఎక్కువ తోడ్పడలేదు  రాహుల్ ను పెంచటంలో.  తానే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. మేము పెంచక పోవటాన రాహుల్ కి మాతో అంత సన్నిహితత్వం ఏర్పడలేదు. నవీనే అటు ఉద్యోగ ధర్మం, ఇటు ఇంటి విషయాలు, పిల్లల పెంపకం అన్నీ తానై నిర్వహించుకుంటున్నది. రాహుల్ ఇప్పుడు 8వ స్టాండర్డ్ చదువుతున్నాడు.  కూచిపూడి  డాన్స్, లక్ష్మీబాబు దగ్గర నేర్చుకుంటున్నాడు. ఇష్టం ఉండటాన త్వరగా నేర్చుకోగలుగుతున్నాడు. ఇది 2013 నాటి ముచ్చట. పిల్లలిద్దరూ ఓల్నీ ఇంట్లో ఉండగా పుట్టారు. పదేళ్ళుగా బ్రూక్ విల్ లో అతి పెద్ద ఇల్లుకొనుక్కుని అందులో ఉంటున్నారు.  మూడు ఎకరాల ప్రాపర్టీ అది. స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు. అనేక రకాల చెట్లు, పూలు ఆహ్లాదాన్ని గొలుపుతాయి. యాపుల్స్ చెట్ల దగ్గరకు చాలా జింకలు వచ్చి తింటుంటాయి. దూర దూరంగా ఇళ్ళు ఉండటాన కూతవేటుకు మనుషులెవరూ అందరు. కారుల్లో పోతూ కనిపించి నప్పుడు ఆగి పలకరించుకుంటూ ఉంటారు. స్టీవ్, కేరల్ దంపతులు, ఎమెట్, జేన్ దంపతులు స్నేహంగా ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. ఇన్నయ్య అందరినీ పలకరించి స్నేహంగా ఉంటుంటాడు. వాళ్ళను ఇంటికి పిలిచి ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఎమెట్, జేన్ తనని తమ యింటికి పిలుస్తుంటారు. కలిసి మూవీలు చూడటం, చదివిన పుస్తకాల గురించి మాట్లాడుకోవటం వారికి ఆసక్తి. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.