మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

మాకు ముగ్గురు మాంచేగోలతో మంచి దోస్తీ కలిసింది. వాళ్ళు వస్తూనే “మా కివాళ మీ ఇంట్లోనే భోజనం. మాకు ఇవాళ సెలవు. ఎక్కడికీ పోలేం” అనే వాళ్ళు. మేం బయటి పరిస్థితులను గురించి కూడా మాట్లాడుకునే వాళ్లం. మేం అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబాల్ని కూడా పిలిచేవాళ్ళం.

మాంచెగోలకూ, రేంజర్లకూ ఉన్న తేడా ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి వాళ్లూ రేంజర్లను అసహ్యించుకునేవాళ్ళు. ఆకుపచ్చని గుండ్రని చదునైన టోపీ పెట్టుకునే ఈ రేంజర్లు ప్రత్యేకంగా గెరిల్లాలతో పోరాడటానికే నియమించబడ్డారు. వాళ్ళు ఫాసిస్టులు. జరిగిన హత్యాకాండకు వాళ్లే కారకులు. మరొకవైపు మాంచెగోలకు అలాంటి శిక్షణే మీ ఇవ్వలేదు. వాళ్లు సాధారణ సైనికులే. కొంతకాలం తర్వాత సెప్టెంబర్ ఘటనల్ని విచారించేందుకు ఒక కమిషన్ వచ్చింది. ఈ కమిషన్లో యూనివర్సిటీకి చెందిన వాళ్ళు కొందరు, పత్రికలకూ, చర్చికీ చెందిన వాళ్ళు కొందరూ ఉన్నారు. ప్రభుత్వం మామూలుగానే తానే నష్టపోయాననీ, మా తప్పుల వల్లే ఇదంతా జరిగిందనీ ఇల్లెక్కి ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని రుజువు చేయించుకోవడానికే ఇప్పుడు విచారణ సంఘాన్ని పంపింది.

 కమిషన్ అయితే వచ్చిందిగాని ఏ ఒక్కరైనా పెదవి విప్పి మాట్లాడడానికి వీలులేని ” నిర్బంధం అప్పుడు అమలవుతోంది. ఎవరైనా వచ్చి జరిగిన దాన్ని ఖండించవచ్చునని వాళ్లు రేడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. కాని ఒక్కకార్మికుడు కూడా మాట్లాడేందుకు సిద్దంగా లేడు. ప్రతీ ఒక్కరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు నా భర్త నాతో “నా తోటి పనివాళ్ళనెందరినో కంపెనీ నుంచి తొలగించారు. నన్ను కూడా తీసేస్తారేమో! మనం ఎంత పెద్ద కుటుంబాన్ని సాకాలో చూడు! (అప్పుడు నాచెల్లెళ్ళూ నాతోనే ఉండేవాళ్ళు) ఇవన్నీ ఆలోచించాను. నువు మాట్లాడడానికి వెళ్ళకు” అని చెప్పి తాను కూడా వెళ్ళనన్నాడు. నేను విని ఊరుకున్నాను. కమిషన్ ముందు జనం ఏమీ మాట్లాడకపోవడం నాకు చాల ఆశ్చ్యం – కలిగింది. బాధల్లో మునిగిపోతూ కూడా మౌనంగా ఉండిపోవడానికి ఒకే ఒక్క కారణం భయం. ఇది చూసి నాకు చాల విచారం కలిగింది. చాలా నిరాశ కలిగింది. “మాట్లాడు-మాట్లాడు” అని నాలోంచి ఎవరో ఆజ్ఞాపించినట్టు తోచింది. ఒక్కసారి నా చుట్టూ చూశాను. ఒక స్త్రీ తన బిడ్డడ్ని ఎత్తుకొని ఏడుస్తూ నిలబడి ఉంది. వాళ్ళు ఆమె భర్తని చంపేశారట. “ఏడవకమ్మా ఏడవకు- ధైర్యంగా నిలబడి నీ భర్త హత్యను ఎదిరించు” అని చెప్పాను. ఆమె నా వైపు తీవ్రంగా చూసి “సరేగానీ, నువు మా అధ్యక్షురాలివి గదా – నువ్వే వెళ్లి మాట్లాడరాదూ? ఎందుకు మాట్లాడవు?” అంది.

అప్పుడు నాయకురాలిగా నేను నిర్వహించవలసిన పాత్ర గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నేను నాయకురాలినిసరే – ఉద్యమంలో ఒక మామూలు కార్యకర్తను కూడా. ఇతరుల్ని మాట్లాడమంటున్నాను గాని నాకై నేనేమీ చేయడం లేదు. ఆ స్త్రీ నాతో అన్న మాటలు విని మరికొందరు స్త్రీలు కూడా “మాట్లాడాలి మాట్లాడాలి” అని అరిచారు. నేనిక లేచి మాట్లాడడం ప్రారంభించాను. జరిగిన దుర్మార్గాన్ని ఖండించాను. ప్రతి ఒక్క సమస్యనూ వివరించాను. మాకు బాకీ పడిన జీతాలు మాకిచ్చెయ్యమని మేమెంతగా పోరాడామో చెప్పాను. ఈ నిర్బంధంలో మా వాళ్ళను ఎట్లా చంపివేయడం జరుగుతున్నదో కళ్ళకు కట్టాను. అంబులెన్సుల మీద దాడులతో సహా నేను చూసిన సంగతులన్నీ వినిపించాను. మా పరిస్థితిని యావత్ ప్రపంచమూ గుర్తించేట్టు చేయవలసిందిగా కమిషన్ ను కోరాను. నేను మాట్లాడడం ముగిసి కూచునే సరికి నా భర్త నాపక్కన లేడు. కాని నా చుట్టూ అనేక మంది కార్మికులు గుమిగూడారు. ఇంకా నాకు తెలియని సంగతులు చూసిన వాళ్ళు నా చెవిలో ఫలానా ఫలానా అని గుసగుసలాడారు. వాళ్ళు చెప్పగానే వెంటనే నేను లేచి ఆ సంగతి కమిషన్ కు వివరించేదాన్ని. చివరికి నా చుట్టూ కూడిన జనంలో ప్రతి ఒక్కళ్లూ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దాడారు. “నువు మమ్మల్ని వదిలి పెట్టలేదు. మా ఖర్మానికి మమ్మల్ని తో సేయలేదు. నువు మాతో నిలిచావు. చాలా మంచి పని చేశావు” అన్నారు. వాళ్ళలో ఒకరైతే నా దగ్గరికొచ్చి “ప్రతిదాంట్లోనూ స్త్రీలు ఎందుకు పాల్గొనాలో నాకిప్పుడర్థమైంది” అన్నారు. నా పట్ల కార్మికులు చూపిన సంఘీభావం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక నేను వాళ్ళ తరఫున మాట్లాడాను. పత్రికల వాళ్ళతో, రేడియో వాళ్ళతో, లాపాజ్ నుంచీ, కొచబాంబా నుంచీ, ఒరులో నుంచి వచ్చిన అనేక కమిషన్లతో నేను వాళ్ళతరఫున మాట్లాడాను.  అప్పుడు నేను అధికారులను అంతగా ఖండించినా వాళ్ళు నన్ను గానీ, నా భర్తనుగానీ ఏమీ అనలేదు. చుట్టుపట్ల ఉన్న అన్ని గ్రామాలూ మాకు తోడు నిలిచాయి. భర్తలు పోయిన స్త్రీలెంతో మంది మాకు సాయం చేశారు.

ఏదో సామెత చెప్పినట్టు సైన్యం కూడా ఆహారం పట్టుకొచ్చి పంచి పెట్టడం మొదలెట్టింది. ఇది నిజంగా బాధాకరమైన విషయమే. మమ్మల్ని చంపేసిన చేతులే మా నోళ్లకు తిండి అందించాయి. కాని జనం అప్పుడు ఎంత దారిద్ర్యంలో ఉన్నారో తెలుసునా? గని కార్మికులు కాని వాళ్ళు ఈ ఆహారం కోసం పోట్లాడుకున్నారు. ఇది చాల అవమానకరమైన, చాల విచారకరమైన విషయమే. నా మనసులో ఎప్పుడూ ఈ సంగతే మెరమెరలాడుతుంది. మా వాళ్ళను ఎంతో మందిని బలిగొన్నవాళ్ళే మానోళ్ళలో ఓ రొట్టె ముక్కనూ, ఓ చిన్న చేప ముక్కనూ కుక్కుతున్నారు. వీటిని మేం నిరాకరించగలిగితే ఎంత బాగుండేది! ఆకలికి చచ్చిపోయినా సరే, వీటిని తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది! కాని, అది జరగలేదు. కొంచెం అన్నం కోసం, ఓ చిన్న గిన్నెడు పాల కోసం కొట్టుకుంటూ, తోసుకుంటూ జనం బార్లు కట్టడం చూస్తే గుండె కరిగి నీరయ్యేది.

1970లో సైగ్లో-20లో గని కార్మికుల మహాసభ జరిగింది. అప్పుడు జనరల్ ఒవాండో అధికారంలో ఉన్నాడు. 1969లో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో బారియెంటోస్ చనిపోయి ఒవాండో గద్దెనెక్కాడు. ఆ మహాసభలో మేం భర్తలను కోల్పోయిన స్త్రీలకు నష్టపరిహారాలివ్వాలనీ, అనాథలు చదువుకోడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలనీ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించాం. మేం కోరినవేవీ జరగనేలేదు. జనరల్ బారియెంటోస్ వేలాది డాలర్ల డబ్బు కూడబెట్టాడనీ, దాన్ని స్వాధీనం చేసుకోవాలనీ మేం డిమాండ్ చేశాం. ఆ డబ్బును వాడి దారుణాలకు బలయిపోయిన వాళ్ళకు పంచి పెట్టాలని నేను గని కార్మికులకు చెప్పాను. కాని ఈ ప్రతిపాదనలు అమలు జరగనే లేదు. రాళ్ళగుట్ట: స్త్రీలు ఆ రోజుల్లో స్త్రీలలో నిరుద్యోగులు అసంఖ్యాకంగా ఉండేవారు. ముఖ్యంగా గనిలోనో, హత్యాకాండలోనో చనిపోయిన కార్మికుల భార్యలకు పనేమీ ఉండేది కాదు. ప్రతిరోజూ ఎంతోమంది స్త్రీలు పని చూపించమంటూ యూనియన్ దగ్గరికో, యాజమాన్యం దగ్గరికో వస్తుండే వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక నిరుద్యోగ సంఘంగానో, లేదా మరో రకంగానో సంఘటితం చేయాలని ఆలోచన తట్టింది. మేం వాళ్ళెంతమంది ఉన్నారో లెక్కలు తీశాం. ఈ లెక్కల ఫలితంగా మేం ఒక సంగతి కని పెట్టగలిగాం. అంత పెద్ద కుటుంబాలు కాని చోట్ల కూడా చాల సందర్భాలలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు ఆరేడుగురు పిల్లలుండి, భర్త చనిపోయి ఏ జీవనాధారమూ లేకుండా ఉన్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఇది సరైందని మాకనిపించలేదు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి మేం ఈ నిరుద్యోగులందర్నీ సంఘటిత పరిచాం. మా పరిశీలనలన్నీ తీసుకుని మేనేజర్ దగ్గరికెళ్ళి మాట్లాడాం. కొందరు తిండికి లేక చచ్చిపోతుంటే మరికొందరు అవసరమైందానికన్న ఎక్కువ సంపాదించడం సరైంది కాదని ఆయనకు చెప్పాం.

మా వాదనల్ని చివరికి ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. ఉద్యోగం చేయడం అత్యవసరం కాని తొమ్మిదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించి తొమ్మిదిమంది నిరుద్యోగ సంఘం సభ్యులకు పని కల్పించాడు. ఐతే అక్కడ చాలినన్ని ఉద్యోగాలులేవు. ఉద్యోగాలిస్తున్నారని తెలియగానే ఎంతోమంది స్త్రీలు తమ భర్తలు పనిచేస్తుండిన శాఖలకు వెళ్లి తమకు ఉద్యోగాలిమ్మని కోరారు. ఆ శాఖలు మేనేజర్ కీ సంగతి రాశాయి. అంతేగాక నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నది ఈ స్త్రీలకేనని కూడా రాశాయి. ఇలా వితంతువుల్ని మాత్రమే ఉద్యోగాలకి పంపాలనే నిర్ణయంతో పడుచు వాళ్ళు దెబ్బ తిన్నట్టనిపించారు గాని మరి కార్మికుల నిర్ణయాన్ని పాటించక తప్పదు గదా!

తొమ్మిదిమందికి ఉద్యోగాలొచ్చాయనే సంగతి తెలిసిందో లేదో, మా మొదటి నలభై మంది, జాబితా రెండువందలకి పైగా పెరిగిపోయింది. మా దగ్గరికి ప్రతిరోజూ ఎంతోమంది వచ్చి తాముకూడా భర్తల్ని పోగొట్టుకున్న వాళ్ళమేనని ఏడుస్తుండేవారు. “నా భర్త తన రక్తాన్నంతా కం పెనీకి ధారపోశాడు.  మా త్యాగానికి వాళ్ళిచ్చిన ప్రతి ఫలం చూడు. ఇప్పుడు మా బతుకు ఎంత దుర్భరంగా ఉందో చూడు” అని అంటుండే వాళ్ళు. అవి. హృదయవిదారకమైన సన్నివేశాలు. వాళ్ళు తమ బాధలన్నీ నా ముందు వెళ్ళబోసుకునే వాళ్ళు. నేనవన్నీ రాసి పెట్టుకుని మా సంఘంలోని ఇతర సభ్యుల్లో కలిసి పరిష్కారాలు ఆలోచించే దాన్ని.

ఓ రోజు చాలా దయనీయ స్థితిలో ఆ స్త్రీలు మాతో తాము ఎక్కడైనా పనిచేయడానికి ‘సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ కెక్కడా పని దొరకలేదు. ఇక వాళ్ళు భరించలేక మేనేజర్ దగ్గరికెళ్ళిపోయి “నువు మాకేదైనా పని చూపకపోతే మేం ఇక్కడ నిరాహారదీక్షకు కూచుంటాం. చచ్చిపోయినా ఫరవాలేదు. ఎందుకంటే ఈ పరిస్థితి కొనసాగితే మేం చచ్చిపోతాం” అన్నారు. “ఐతే ఎక్కడైనా సరేనా! పనిచేస్తారా?” అని ఆయన అడిగాడు. ఎక్కడైనా సరేనన్నారు వాళ్ళు. “సరే మాకు ఓ ఆలోచనుంది. రేపు రండి మాట్లాడుకుందాం” అన్నాడాయన.  మేం మర్నాడు వెళ్ళగానే వాళ్ళు తమ ఆలోచన చెప్పారు. మాకు వాళ్ళు రాళ్ళ గుట్టమీద పని ఇస్తామన్నారు. ఖనిజంకంటే తక్కువ నాణ్యతగల రాళ్లన్నిటినీ గని లోంచి తీయగానే కుప్పగా పడేస్తే ఈ గుట్ట తయారయింది. గని పని మొదలయిన రోజుల్లో లోపలినుంచి వచ్చే రాళ్లు నల్లగా బొగ్గులాగ ఉండేవి. అది చాల నాణ్యమైన ఖనిజంగల రాయి అన్నమాట. దీంట్లోంచి ఖనిజాన్ని వేరుచేసి రాళ్ళను పారేస్తే ఈ గుట్ట తయారయింది. అయితే ఈ రాళ్ళలో మరికొంత ఖనిజం మిగిలి ఉండేది. మాకు వాళ్ళు అప్పగించిన పని ఈ ఖనిజాన్ని ఏరడం. మేం ఈ రాళ్ళను చూసి, కొంచెం ఖనిజం మిగిలి ఉన్న రాళ్ళను ఏరి వాటిని బస్తాల్లో వేసుకుని, మర దగ్గరికి తీసుకెళ్ళి, సానపట్టించి కం పెనీకివ్వాలి. బస్తాల లెక్క చొప్పున స్త్రీలకు డబ్బులిస్తామని వాళ్ళన్నారు. ఈ పని ప్రయోగాత్మకంగా మూడు నెలలపాటు జరుగుతుంది. మూడు నెలల తర్వాత ఈ పని ఒప్పందం మీద సంతకాలు జరుగుతాయి. “ఎంత మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు?” అని మేనేజర్ నన్ను అడిగాడు. “రెండు వందలమంది.” “సరే-మేం అందరినీ పనిలోకి తీసుకుంటాం, అందర్నీ ఇటు రమ్మనండి. మాట్లాడుదాం” అన్నాడు.

నేను స్త్రీలందరినీ దగ్గరికి పిలిచి విషయమంతా వివరంగా చెప్పాను. వాళ్ళలో చాలమంది, ముఖ్యంగా వితంతువులు “అమ్మో! రాళ్ళగుట్టకా? వదొద్దు – మేం అక్కడ పనిచేయం” అన్నారు.

మేం మొదటినుంచీ ఎవరికి పనికోసం వెతుకుతున్నామో వాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదు. వాళ్ళు పనిచేయడం మొదలెట్టారు. వాళ్ళు ప్రతిరోజూ దుమ్ముకొట్టుకొని, అలసిపోయి ఇంటికి చేరేవాళ్ళు. వాళ్ళ చేతులు బొబ్బలెక్కి రక్తాలు కారుతుండేవి. వాళ్ళు ప్రతిపనీ, ఖనిజం ఏరడమూ, దాన్ని వేరుచేయటమూ, సంచుల్లో నింపడమూ – అన్నీ చేతితోనే చేయాల్సి ఉండేది.

వాళ్ళకు నెలకు నాలుగువందల పిస్తోల దాకా ఇచ్చేవారు. అబ్బ వాళ్ళాపనినే స్వర్గంగా భావించారు. వాళ్ళెంత సంతోషపడ్డారో మీరు చూసి ఉండాల్సింది. వాళ్ళకు జీతం డబ్బులు చేతికందగానే మా ఇంటికి పరిగెత్తుకొచ్చి “ఏమమ్మోవ్ మాకు నాలుగు వందల పిసోలొచ్చాయి. మాకు డబ్బులొచ్చాయోచ్” అని ఆనందంగా అరిచేవాళ్ళు. ఎంత కష్టపడ్డా తమ జీవితంలో ఒక మార్పు వచ్చింది గనుక వాళ్ళు చాల సంతోషపడ్డారు.

రాళ్ళగుట్టమీద పనిచేసే స్త్రీలు నెలకు నాలుగువందల పిస్తోలు సంపాదించుకున్నారని తెలియగానే ఆ పనిచేస్తామంటూ ఎంతో మంది రావడం మొదలెట్టారు. అలా దాదాపు ఐదువందల మంది స్త్రీలు కటావికి వెళ్లి పని చూపమని యాజమాన్యాన్ని కోరారు. అందరినీ అప్పటికప్పుడే తీసుకోవడం సాధ్యంకాదనీ, నెలకు వందమందికి చొప్పున పని ఇస్తామనీ యాజమాన్యం చెప్పింది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.