“ఆత్మానందం

– షర్మిల అమ్మా ! పద ట్రైన్ మూడో ఫ్లాట్ ఫారానికి ఇచ్చారు అని నా కూతురు తను తెచ్చిన టిఫిన్ ప్యాకెట్లు బ్యాగ్లో పెడుతూ హడావిడి పెట్టింది . తిరుపతి రైల్వే స్టేషన్ రద్దీగా వుంది . ఏదో ఎల్టిటి అంట వైజాగ్ వరకూ వెళ్లే లోగా రెండుచోట్లే ఆగుతుందని మా పింటూ ఈరైలుకి  టిక్కట్టు చేశాడు . పింటూ మా ట్రావల్ ఏజెంట్ . పింటూ ఏంచెబితే అదే మాకు వేదవాక్కు .
ఎందుకంటే ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటే రైలురిజర్వేషన్ దొరుకుతుందా ! అందుకే మాకు పింటూ ఏ రైలుకి చేస్తే అదే .
మా అమ్మాయి చెన్నైలో కాపురం పెట్టిన దగ్గరనుంచి పింటూ పంట పండింది . అది రావాలన్నా వెళ్లాలన్నా , వాళ్ల ఆయన ఇది ఇక్కడ వున్నప్పుడు వచ్చిపోవాలన్నా తత్కాల్ టిక్కట్లే . ఇట్లా ఆర్నెల్లు పింటూని పోషించింది. పోతే పోయాయిగానీ పండగ టైము అయినా సరే టిక్కట్ రెడీ .
తరవాత మా అమ్మాయి మజిలీ అమెరికా కి మారింది . ప్రస్తుతం మమ్మల్ని చూడాలని వచ్చింది .
ఇంట్లోకి రాగానే వేసిన మొదటి ప్రశ్న ” అమ్మా ! కెన్లే వాటర్ బాటిల్స్ తెప్పించావా ? అని . ” నీ బొంద మనం ఎప్పుడూ నీళ్లు కాచుకునేగా తాగేది నోర్మూసుకుని తాగు “! అన్నా వినిపించుకుంటేగా . ” ఇప్పుడు ఈ వున్న నెల రోజుల్లో ఏ తేడా వచ్చినా టైం వేస్ట్ ” అంటా మినరల్ వాటర్ తెప్పించింది .
తెలుగు వాళ్లు అమెరికా నుంచి అయినా అంతరిక్షం నుంచి వచ్చినా తిరుపతి వెంకన్న విజిట్ తప్పనిసరి కదా తిరుపతి ప్రయాణం పెట్టింది .
ఇప్పుడు రైలు నుంచి ఫ్లైట్ కి ప్రమోషన్ వచ్చింది . నేను టైమింగ్స్ కుదరవు ససేమిరా అనడంతో పింటూని మాంచి శుభ్రంగా సూపర్ ఫాస్టుగా వెళ్లే రైలుకి టిక్కట్ చేయమని ఆర్డరేసింది .
వాళ్ల నాన్న నేనీమధ్యే వెళ్లొచ్చాను రాను అనడంతో అదీ నేనే బయల్దేరాం . వెళ్లేటపుడు మా విశాఖపట్నం నుంచి బయల్దేరే రైలు ఎక్కి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇదుగో ఈ ఎల్టీటీ రైలు ఎక్కాం .
బాగ్ కే వేళ్లాడే ప్యూరెల్ తో సహా మా అమ్మాయి రైలు ఎక్కింది . ఎందుకంటే ప్యూరెల్ తో అది కూర్చునే చోటుతో సహా తుడిచి చేతులకి పులుముకోవడం ప్రయాణంలో తప్పనిసరి. ఈ తతంగం అమెరికా నుంచి వచ్చినప్పటినుంచి చూస్తూనే వున్నా , పోన్లే దాని పిచ్చి దానికి ఆనందమని వూరుకున్నా .
ధర్డ్ ఏసీ బోగీలోకి మేము ఎక్కి మా సీట్ల వరకు వెళ్తుండగానే చాలామంది అప్పటికే పడుకుని వున్నారు . ఏడింటికే అందరూ పడుకున్నారేంటో అనుకుంటూ మా సీట్లకింద సామాను పెట్టుకుని కూర్చోవడానికి సిద్ధమయ్యాం .
మా పక్కనే ఒకామె కొడుకుతో సహా కూర్చుని వుంది . కొడుకుకి ఓ పదహారేళ్లు వుండొచ్చు . తెల్లగా సన్నగా వున్న ఆమె మమ్మల్ని చూసి నవ్వింది . నేను ఇబ్బందిగా చూస్తూ ” ఒక బెర్త్ లో నలుగురు కూర్చోవాలంటే కష్టమేమో ” అన్నా తెలుగు అర్ధం కాలేదు కానీ నా భావం అర్ధమైనట్టుంది ” ఈ ఎదురుగా వున్న పై బెర్త్ మా అబ్బాయిది , ఇదుగో ఆవిడ పడుకుంది … అక్కడ చోటులేక ఇక్కడ కూర్చున్నాడు . భోజనం అయ్యాక పైకి ఎక్కేస్తాడు” అని హిందీలో చెప్పింది .
మా అమ్మాయి విండో సీట్లో కూర్చుంది . ఎదురు బెర్తులో పడుకున్న ఆమె మొత్తం ముసుగుతన్ని పడుకుంది . పక్కన తాగిన టీ కప్పు దానిలో గుడ్డు పెంకులు వున్నాయ్ . ” మహా తల్లి గుడ్డు తిని అక్కడే పడేసినట్టుంది , డస్ట్ బిన్లో పడేయడానికీ బద్దకమనుకుంటా ” అంది మా అమ్మాయి గుసగుసగా .
ఇంతలో పక్కనామె మేము మాట్లాడుకునేది పడుకున్నమె గురించే అని అర్ధమైనట్టుంది . పాపం తనకి బ్రెయిన్ కేన్సర్ అట వెల్లూరులో వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చింది . వాళ్ల దేశం వాళ్లే ఇక్కడికి వైద్యానికి వచ్చినవాళ్లెవరో ఈ రైలులోనే వస్తున్నారు ఈమెకి టీ అదీ ఇచ్చి వెళ్లారు అని చెప్పింది .
” మీరు ఎక్కడనుంచి ” అడిగాను . ” కలకత్తా దగ్గరలో వున్న వూరు మాది . నాకు గుండె జబ్బు నేనూ వెల్లూరు హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ” అంది .
అప్పటికి గానీ మాకు అర్ధం కాలేదు ఈ రైలులో చాలామంది పడుకునే ఎందుకు వున్నారో . వెల్లూర్ మీదగా వచ్చే ఈ రైలులో ఈ అస్పత్రికి వచ్చి వెళ్లే వాళ్లు వున్నారన్నమాట . వాళ్లకి ట్రైన్ ప్రయాణానికి పాస్ కూడా ఇస్తారంట
ఇంతలో పడుకున్నామె కాస్త ముసుగు తీసి మమ్మల్నే చూస్తోంది . తనని చూసి నేను నవ్వాను . ఆమె కూడా నీరసంగా నవ్వింది . ” నీ పేరేంటి అనడిగాను ” కాస్త మాటల్లో పెడదామని
” డాలీ ” అంది . ఈ లోగా అమెకి తెలిసినవాళ్లొచ్చి ” ఏమైనా తింటావా ” అని అడిగారు వాళ్ల భాషలో . ఏమీ వద్దని అడ్డంగా తలూపింది డాలీ . ” ఈ పింటూ పని చెప్తా వుండు, మంచి ట్రైన్ కి చెయ్యరా ! అంటే ఈ జబ్బుల రైలుకి చేశాడు” మా అమ్మాయి కోపంగా అంది . ” ఇప్పుడు నాకే ఇన్ఫెక్షన్ అన్నా వస్తే ? నేను చావాలి , వెళ్లే టైం దగ్గర పడుతుంది కూడా ” అంది ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ .
నేను చటుక్కున దాని చెయ్యి తీసి పక్కన పెట్టి. ” తప్పు అట్లా అనకూడదు . కష్టం ఎవరికైనా వస్తుంది . ఒక వేళ డాలీ స్థానంలో నేను వుండి వుంటే అట్లాగే అంటావా ” అని కోప్పడ్డాను . “ఎందుకమ్మా ! అలా అంటావ్” అని నా భుజం మీద మొఖం పెట్టి చెయ్యి నా చుట్టూ వేసి దగ్గరగా హత్తుకుంది . నేను ఎప్పుడన్నా చిన్న దెబ్బతగిలి అబ్బా ! అంటే చాలు నా కూతుళ్లు విలవిలలాడతారు .
” చూడు వీళ్లకున్నవి ప్రాణాంతక వ్యాధులు , ఈ జబ్బు వల్ల వీళ్లే కాదు వీళ్ల కుటుంబమంతా అల్లకల్లోలం అయిపోతుంది . మనలాంటివాళ్లు సపోర్ట్ ఇవ్వాలి. నువ్వలా మాట్లాడితే నచ్చలేదు ” అన్నాను .
” సర్లే అమ్మా ఇంక అలా అననులే తిందాం రా ! అని టిఫిన్ పొట్లాలు విప్పుతూ అంది . ఒక ఇడ్లీ తీసి డాలీకి ఈయబోయాను . వద్దంది .
ఈ లోగా మిస్తీ దోయీ మిస్తీ దోయీ అంటూ తీపి పెరుగు అమ్ముకునే అతనొచ్చాడు . రెండు కప్పులు కొని డాలీకి ఇచ్చి తిను అన్నాను . ఆమె మాట్లాడకుండా తీసుకుంది . పడుకునే అవి రెండూ తినేసింది . నాకు తెలుసు బెంగాల్ చుట్టుపక్కల వాళ్లు ఈ తీపి పెరుగు ఇష్టంగా తింటారని .
డాలీకి కాస్త ఓపిక వచ్చింది . వూరెళ్లడానికి ఎన్నాళ్లు పడుతుందని అడిగాను . ఇంకా రెండురోజులు ప్రయాణం చేస్తే గానీ తమ వూరు చేరలేనని ఎంత త్వరగా ఇంటికెళ్లి పిల్లల్ని చూద్దామా అని వుందని కన్నీళ్లు పెట్టుకుంది . “ముగ్గురు ఆడపిల్లలు మేడం , మీకు తెలుసుకదా ఆడపిల్లలికి తల్లి ఎంత అవసరమో “ వాళ్లకోసమే బతకాలని వుందని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది .
“అయ్యో ఏడవకు నీకేమీకాదు . చూడు నీ ట్రీట్మెంట్ అయిపోయిందంట కదా అంతా బాగుంటుంది . మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే రోగాలు పారిపోతాయి ” అంటా ధైర్యం చెప్పాను . ఆమె చెంపలమీద నుంచి కారిపోతున్న నీటిని తుడిచి తాగడానికి నీళ్లు అందించాను .
వచ్చీరాని భాషలోనే మా సంభాషణ అంతా సాగింది .
ఆమెకు హిందీ కూడా సరిగా రాదు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ , తెలుగూ కలిసి మాట్లాడుకున్నాం .
నాకు తెలిసిన వాళ్లకి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి తగ్గిపోయి ఇప్పుడు హాయిగా వున్నారని చెప్పాను . ఇప్పుడు ఆమె మొహం కొంచం తేట పడింది . ” వూరుగాని వూరు దేశం గాని దేశం వచ్చి భాష రాకుండా ఒక్కత్తే వచ్చి చికిత్స చేయించుకున్నావంటే , నువ్వెంత ధైర్యస్తురాలివో ” అని అన్నాను . “పిల్లలమీద ప్రేమే నన్నింత దూరం లాక్కొచ్చింది ” అంది డాలీ .
మా అమ్మాయిని నన్నూ చూస్తూ కూర్చుని కొంతసేపయ్యాకా మా అమ్మాయిని చూస్తూ ” నువ్వు చాలా లక్కీ , ఎందుకంటే నీకు ఇలాంటి అమ్మ వుంది ” అంది ఎందుకు అలా అందో నాకు తెలియలేదు .
” అమ్మలున్న పిల్లలు లక్కీనే నీ పిల్లలు కూడా ” అని బదులుగా అన్నాను . తెల్లారే మేం వైజాగ్లో దిగుతున్నప్పుడు డాలీని లేపాను . ఒక వెయ్యి రూపాయలు ఆమె చేతిలో పెట్టి పిల్లలకు ఏమన్నా కొనుక్కెళ్లు ఇదిగో నా ఫోన్ నంబర్, నీకు డబ్బులేమన్నా కావాలంటే ఫోన్ చెయ్యి అని ఫోన్ నంబర్ రాసిన కాగితం ఇచ్చి దిగిపోయాను .
ఆ తరవాత నేనూ మా అమ్మాయితో అమెరికా వ
వెళ్లాల్సి వచ్చింది .
నెల రోజులు గడిచిపోయాయి . ఒక రాత్రి నాకు ఫోన్ వచ్చింది . ఎవరిదో పరిచయం లేని ఫోన్ నంబర్ అది . ఎవరిదా అనుకుంటూ హలో !అన్నాను . అవతలి నుంచి డాలీ గొంతు . ” మేడం బాగున్నారా ” అంటూ అప్పుడు గుర్తొచ్చింది డాలీకి ఫోన్ నంబర్ ఇచ్చిన విషయం . డబ్బులు కావాలంటే ఫోన్ చెయ్యమన్నాను కదా అందుకే చేసి వుంటుందని ” డాలీ ! డబ్బులేమన్నా అవసరమా , నీ బాంక్ అక్కౌంట్ నంబర్ అవీ చెప్పు అన్నాను .
” లేదు మేడం డబ్బేమీ వద్దు , మీరు ఎలా వున్నారో అని ఫోన్ చేశాను …నేను ఎవరో మీకు తెలియదు ప్రయాణంలో కలిశాం . అయినా ప్రేమగా మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు .
డబ్బు వద్దు కానీ మీరు ఈ నంబరుకి ఎప్పుడన్నా ఫోన్ చేసి నాతో మాట్టాడండి చాలు . అదే నాకు బలం. అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి ” అంది .
దేశాలు దాటి ఖండాలూ ,సంద్రాలూ దాటి వచ్చిన ఆమె మాటలతో నా మనసు నిండిపోయింది . ఆమె ప్రేమ నేను డాలీకి ఇచ్చిన వెయ్యి రూపాయల కంటే ఎంతో విలువైనదనిపించింది .

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.