మూగ జీవితాలు  

(హిందీకథ “గూంగా” కు అనువాదం) 

హిందీ మూలం:శివాని (గౌరా  పంత్) 

తెలుగు అనువాదం: అక్షర

 ప్రేమ పెళ్లిళ్లకు కులం,మతం,వర్గం లాంటివి ఎప్పుడు కూడా అవరోధాలే. దశాబ్దాల క్రితం రాసిన ఈ కథ ఈనాటి సమాజానికి కూడా వర్తిస్తుంది.

 పెద్దల అధికారం , అహంకారం పిల్లల జీవితాల్ని మూగగా మారుస్తున్నాయి. ప్రఖ్యాత హిందీ కథా రచయిత్రి” శివాని” రచన “గూంగా”లోని ఈ అంశమే నా చేత ఈ కథను అనువాదం చేయించింది.    

****** 

మూగ జీవితాలు  

సర్జన్ పాండ్యా ని దూరం నుంచి చూస్తే , ఎవరో దొరబాబు నడిచి వస్తున్నాడా అన్న భ్రమ కలుగుతుంది. అతని ముఖ వర్ఛస్సు ,ఆరోగ్యంగా మెరిసిపోతూ ఉండేది. అతని హస్త వాసి ఎలాంటిది అంటే , అతని స్పర్శ అందిన మాత్రమే ,చిరకాల రోగం తో బాధ పడుతున్న రోగి కూడా లేచి కూర్చునే వారు . అతని ఫీజ కూడా అతని లాగానే ఘనంగానే ఉండేది .  సామాన్యులైతే ఆయన ఫీజ వినంగానే వారి మొహం పాలి పోయేది కానీ సర్జన్ కి మాత్రం ఎవరి పైన దయా దాక్షిణ్యం ఉండేది కాదు. అందంగా ఉన్న రోగియందు మాత్రం సర్జన్ కి మనసు పుడితే కొంత కన్సెషన్ ఇచ్చేవారు. అంతుతెలియని రోగంతో ఉన్నవాళ్లకి కూడా జీవన దానం ఇవ్వ గలిగిన సర్జన్ తన భార్య ని మాత్రం కాపాడుకోలేక పోయాడు. 

            ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి , తల్లి బాలింతగా ఉన్నప్పుడే మతి కోల్పోయింది. మతి పోయిన భార్య కి తగిన వైద్యం చేయించలేక పోయాడు. గత పదహారేళనుంచి ఆగ్రా పిచ్చాసుపత్రి లో పడేసి  ఉంచారు. మధ్యలో సర్జన్ వెళ్లిచూసి వచ్చే వారు. ఇంట్లో ఉంచుకోలేనంత పిచ్చిది కాదు ఆమె అని లోకులు అనుకునేవారు. తన కూతురి ముందు ఆయన ఏనాడూ భార్య ఉన్మాద స్థితి విషయం ఎత్తేవారు కాదు. కూతురికి కృష్ణ అని నామకరణం చేశారు. కొంచెం రంగు తక్కువ ఐనా కృష్ణ అపురూప సౌందర్యవతి. ఘనంగా ఉండే కురులు ఆమె వీపు పై ,సంరక్షణ లేక కారు మేఘాల్లా  ఆడుతూ ఉండేవి. తండ్రి చేసిన గారాబం కృష్ణ కి తల్లి కొరత తెలియనీలేదు. ఎక్కువ కట్టుదిట్టాలు లేక పోయినా ,సర్జన్ కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. కృష్ణ చదువు తో పాటూ సంగీతం నాట్యంలో కూడా చక్కటి శిక్షణ పొందింది. కాళకి గజ్జెలు కట్టీన వేంట నే స్వర్గ లోకంనుంచి అప్సరస దిగివచ్చి స్వయంగా  నాట్యం చేస్తోందా అన్న భ్రమ కలిగేది. ఎంతటి కళా నిపుణుడు కానీ , ఎలాంటి లలిత కళలో ప్రవేశం లేని వారయినా కాని  ఆమె నాట్యమ్ చూస్తూ ఆ రస మాధుర్యం లో మైమరిచి పోయేవారు.  

               ఒకసారి ఒక నృత్యోత్సవం లో మూడు గంటలు అవిరామంగా నాట్యం చేసి దర్శకుల్ని మంత్ర  ముగ్ధుల్ని చేసిన వెనువెంఠనే ఆ హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. సర్జనకళ్లు ఆనందా శ్రువుల్తో నిండి పోయాయి. ఆయన తో పాటు ఆ హాల్లో ఇంకొక యువకుడి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. ఆ యువకుడు సర్జన్ పక్కింటి డాక్టర్ డిసుజా సుపుత్రుడు,డాక్టర్ డిసుజా ,సర్జన్ క్లీనిక్ లోనే, సర్జరీ చేస్తున్నప్పుడు చేతికి కత్తి తగిలి, టేటేనస్ తో మరణించాడు. తండ్రి పోయేకా కొడుకు కూడా అదే క్లినిక్ లో పని చేయటం మొదలెట్టాడు. కృష్ణ వైపు అతను ఎంతగా ఆకర్షితుడు అయ్యాడో అతనికి ఆ రోజే తెలిసింది. 

              సౌమ్యంగా ,వినయ విధేయలతో  మెలిగే ఆ గోవా యువకుడంటే సర్జన్ కి ఇష్టమే. సన్నటి మీసాలకింద ఉన్న అతని అధరాలు కూడా ఎప్పుడూ మితిమీరి మాట్లాడేవి కావు. అతని నెమ్మది స్వరం ,సాదా దుస్తుల్లో , నిత్యం మెరిసిపోతూ ఉండే అతని జోళ్లు చూసి సర్జన్ చాలా సరదాపడే వారు. అతని మనస్సు కూడా అంతే అందంగా నిష్కల్మషంగా ఉండేది. అతను ఎంత తప్పించుకుని తిరిగినా ,కృష్ణ మాత్రం అతని వైపు అంతగా ఆకర్షితురాలైయ్యేది. 

                ఇలా ఉండగా ఒకనాడు సర్జన్ తన నిస్సంతానుడైన పినతండ్రి కి కర్మ చేయటానికి స్వగ్రామానికి వెళ్లవలసి వచ్చింది. కొన్ని రోజుల  క్రితమే ఆ పినతండ్రి నుండి ఒక జాబు అందింది సర్జన్ కి. “ నేను మరణాసన్నుడైయ్యాను. నా మరణానంతరం  నా క్రియ- కర్మ నువ్వే చెయ్యాలి. “

సర్జన్ ఎంత ఆధునిక పద్ధతులు నిజ జీవితం లో అలవర్చుకున్నా,సనాతన ధర్మం  పట్ల ఎంతో నియమ నిష్ఠలు  కలవాడు. పినతండ్రి మరణ వార్త విని ఆయన ఆత్మకు శాంతి కలిగిద్దామని వెళ్లివచ్చే లోపున కూతురు కృష్ణ ఆత్మ దారి తప్పింది. పింతండ్రికి పెద్ద కర్మ చేసి తన బాధ్యత నిర్వర్తించాడన్న ,తృప్తితో ఉన్నాడు. అదీ కాక అక్కడ సర్జన్ బంధువులు కృష్ణ కోసం చక్కటి సంబంధం సూచించారు. సర్జన్ ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవటానికి కృష్ణ వచ్చింది. “ ఏమ్మా, కాంతమ్మ నిన్ను వదిలేసి సెలవ తీసుకుని ఇంటికి వెళిపోయిందా? “ అని అడిగాడు. కాంతమ్మ వారి ముసలి ఆయా. “ లేదు నాన్నా” అన్నది నెమ్మదిగా. కృష్ణ ముఖం కొంత బేలగా కనిపించింది సర్జన్ కి.

 “నాన్నా నా కోసం నేతి కాజాలు తెచ్చావా లేదా?” 

అంటూ వాళ్ల నాన్నని చిన్న పిల్ల లా అల్లుకు పోయింది. “నేతి కాజాల్తో పాటూ నీ కోసం మరో మంచి ఖబురు తెచ్చాను.” అన్నాడు సర్జన్ కూతుర్ని ముద్దుగా దగ్గర్కి తీసుకుంటూ. ‘ అదేమిటి నాన్నా. ‘

అంది కృష్ణ. “  అన్ని విధాలా నీకు తగ్గ ఒక చక్కటి  వరుడు. బహుశా అందుకే నేమో దేముడు నన్ను స్వగ్రామానికిపంపాడు. “ అంటూ సర్జన్ కూతురి వేపు ఓరగా చూశారు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి, ‘ కొన్ని రోజులుకి కూతురు పరాయి అయిపోతుందన్న తలంపుతోనే. కానీ ఇంకో పక్క కృష్ణ ముఖం ఈ ఖబురు వింటూనే ఆశ్చర్య కరంగా పాలి పోయింది. 

కాసేపు మౌనంగా ఉండి పోయినా  ఖచ్చితమైన స్వరంలో అంది” నా కోసం వరుడ్ని వెతక వల్సిన అవసరం లేదు నాన్నా ,నేను వరుడ్ని చూసుకున్నాను. “ అని. 

              స్తబ్ధుగా ఉండి పోయాడు సర్జన్.     ఏమంటోంది కృష్ణ , ఇక్కడ మన కులం వారు ఎవరో గాని లేరే . తనకీ  వరుడు ఎక్కడ దొరికాడు. ఆ మాటే అడిగాడు ఒక పక్క కోపం తన్నుకు వస్తున్నా , కృష్ణ ని నెమ్మదిగానే అడిగాడు. 

 “ నేను విక్కీ ని పెళ్లి చేసుకుంటాను. కృష్ణ స్వరంలో నిశ్చయమ్ సర్జన్ గమనించక పోలేదు. కోపంతో ఊగిపోతున్న సర్జన్ వెంఠనే ఏమీ అనలేక పోయాడు.

ఒక సామాన్యమయిన పైలెట్ కొడుకు ,అందులోనూ క్రైస్త మతం ,తమలాంటి శుద్ధ బ్రాహ్మనుడి కూతురు  కృష్ణ……  కారు ఇంటికి చేరంగానే డిసుజా ని పిలిపించాడు సర్జన్. కానీ అతడు మద్రాసులో ఉన్నాడని తెలిసింది. 

             ఆనాటి నుండి కృష్ణ ని పూర్తి కట్టు దిట్టాల్లో,నియంత్రణలో పెట్టి సర్జన్ నిశ్చింత పొందాడు. నిత్య కర్మాదులకి కూడాసర్జన్ అనుమతి తీసుకుని వెళ్లవల్సిందే. ఆ రోజుల్లోనే సర్జన్ కి ఏదో సెమినార్ కి అధ్యక్షత వహించటానికి జయపూర్ రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. కాంతమ్మ తో పాటు మరో ఇద్దరు ఆయాలను కృష్ణ కి కాపలాగా ఉంచి సర్జన్ జయపూర్ వెళ్లారు. ఈ అవకాశాన్ని ఊరికే పోనీకుండా డిసుజాకూడా సెలువ తీసుకుని వచ్చేశాడు . ముగ్గురు ఆయమ్మల కళ్ళు కప్పి ప్రేమికులు కలవ సాగారు. 

              ఒక రోజు కృష్ణ డీసూజా ఛాతీ పై ఒదిగి పోతూ అడిగింది. “ ఇక వారం రోజుల్లో నాన్న తిరిగి వచ్చేస్తారు ,ఐదు రోజుల్లో నువు ఫ్రాన్స్  కి వెళ్ళిపోతావు. మనం సెంట్ పాల్ చర్చ్ కి పోయి అక్కడ ఫాదర్ని మంచి చేసుకుని పెళ్లీ చేసుకుందామా? “ అని. 

             ఒక సాయంత్రం ,ఇద్దరూ చిన్న పిల్లల్లాగా చేతిలో చేయి వేసుకుని సెంట్ పాల్ చర్చ్ నుంచి తిరిగి వచ్చారు. ఆ మూడవ రోజు డీసూజా వెళ్లి పోయాడు. మరో రెండు రోజులకి సర్జన్ జయపూర్ నుంచి తిరిగి వచ్చాడు. వస్తూనే తన కోసం వేచి ఉన్న పేషెంట్స్ తో రెండు మూడు నెలలు కు గానీ  ముక్తి దొరక లేదు. ఆ తరవాత ఒక నాడు ఉదయం లేచీ లేవంటంతోటే న్యూస్ పేపర్ మొదటి పేజ్ లో భారతీయ పైలెట్ మరణ వార్త చదివి మనసులోనే దేముడికి ధన్యవాదాలు   చెప్పుకుంటున్న సర్జన్ కి వెనక నుంచి పెద్ద కేక వినిపించింది. చూస్తే కృష్ణ కనిపించింది. కూతురి ఏడుపు ఎవరికి వినిపించకూడదని చటక్కున ఒక గది లోకి తోసి గడియ పెట్టాడు. చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయిది. సర్జన్ ఇక తన కోపం చికాకు నిగ్రహించుకోలేక,గట్టిగా కోపడ్డాడు కూతుర్ని. “ చిన్న పిల్లలా వ్యవహరించకు  కృష్ణా. నీకు పెళ్లి నిశ్చయించాను అని తెలిసి కూడా ఏమిటి ఈ మూర్ఖత్వం? “ అని. 

              దుఃఖంతో కుమిలి పోతున్న కృష్ణ అంది 

“ నా వివాహం అయిపోయింది నాన్నా.” ఏం వాగుతున్నావే “ అంటూ కోపంతో ఊగిపోతూ ఎత్తిన్న చేయి ఎలాగో ప్రయత్న పూర్వకంగా వెన్నక్కి లాక్కున్నాడు. 

  “ అవును నాన్నా ,మూడు నెలల క్రితమే సెంట్ పాల్ చర్చ్ లో ఫాదర్ మా ఇద్దరి వివాహం చేశారు. ఇప్పుడు విక్కీ నా భర్త ‘, అంటూన్నకృష్ణ పెదిమలు  కంపించినాయి. 

             “ నోరు మూయవే సిగ్గుమాలినదానా. నీకు ఇంకా మైనారిటీ తీరలేదు. ఈ  పెళ్లి ఎలా చేశాడు ఆ ఫాదర్. “ అసహనమైన కోపంతో రొప్పుకుంటూ సర్జన్ ఆ ఫాదర దగ్గరకు కు బైల్దేరాడు. కావల్సినంత డబ్బు పారేసి ఫాదర్ నోరు మూయించాడు. తిరిగి వచ్చి కూతురితో చెప్పాడు. ఫాదర్తో మాట్లాడాను. ఆయన మీ పెళ్లి రికార్డ్స్ అన్నీ కాల్చేశాడు. మీరు ఆటలో  చేసుకున్న దాన్ని ఎవరూ వివాహం అనలేరు.” 

“ కానీ ఇంకో విషయం నాన్నా. నేను తల్లిని కాబోతున్నాను. “ నేల వేపు చూస్తూ కన్నీరు ము న్నీరుగా ఏడుస్తూ కృష్ణ చెప్పింది. 

              పిడుగు లాంటి మాట విని సర్జన్ బేజారెత్తి పోయాడు. విధి విధానంతో పొరాడి అలిసిపోయిన సర్జన్ ఆ రాత్రంతా బోనులో పులిలా తిరుగుతూ ఉండి పోయాడు. ఇంక ఆలస్యం చేయ కూడదని ఆ రెండవ రోజే కూతుర్ని తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. దారంతా కూతుర్కి బోధిస్తూ వెళ్లాడు. ” నీకు ఇప్పుడు మాత్రం పద్ధెనిమిది ఏళ్లు.జీవితం అంతా ఒంటరిగా గడపలేవు. ఢీల్లీ నగరంలో పెద్ద మహిళా ఆశ్రమం నిర్వాహకురాలు కాశీబాయి నాకు బాగా తెలుసు. కొన్ని ఏళ్లక్రితమే బ్రెస్ట్ కేన్సర్ నుంచి ఆ రూపవతి అయిన విధవకు సర్జరీ చేసి కేన్సర్ నుంచి ముక్తి కలిగించాను. ఆ ఉపకారానికి బదులుగాప్రత్యుపకారం కోరుకోవటానికి వెళ్తున్నాను.”

అని దారిలో కూతురికి వివరించాడు. 

             సర్జన్ చెప్పిందంతా విని కాశిబాయి నవ్వుతూ హామీ ఇచ్చింది. “ మీరు నిశ్చింతగా ఉండండి. మూడో కంటికి తెలీకుండా నేను ఈ వ్యవహారం ముగిస్తా. “

             అదృష్ట వశాత్తు ,సమయానికి పూర్వమే కృష్ణకి ముక్తి దొరికింది. ఏడు మాసాలకే ఒక 

కుమారుడ్కి జన్మని చ్చి నాలుగు మాసాల తరువాత ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల అనంతరం కృష్ణ వివాహం పనులు పెద్ద ఎత్తున  మొదలు పెట్టారు. కూతురి చేత సప్తపది చేయించేక సర్జన్ గుండెల పైన బరువు తగ్గింది. 

            వివాహానంతరం ఆరేళ్లు  పూర్తి అయ్యాయి. కృష్ణ కి ఇప్పుడు ఐదేళ కొడుకు,కానీ ఆమె లోని సౌందర్యం, పసితనపు  అమాయకత్వం మాత్రం చెక్కు చెదర లేదు. నిరంతరం నృత్యాభ్యాసం చేసుకుంటూ పోయేది. ఆమె ఒడిస్సి , భారతనాట్యమ నృత్య ఖ్యాతి చర్చలు రాజధాని వరకు వ్యాపించింది. బ్రిటిష్ మహారాణి స్వాగత సభలో నృత్య ప్రదర్శన కోసం ఆమెకు ఆహ్వానం వచ్చింది. కృష్ణ తన భర్త కొడుకు తో పాటు ఢీల్లీ వచ్చింది. ఏమంటే ఆ వారాంతానికి  కృష్ణ భర్త, త్రిపాఠితో వాషింగటన్ దూతావాసంలో, సెక్రెట్రీ పదవీ  స్వీకరణ కి వెళ్లవల్సి ఉండింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె నృత్య ప్రదర్శన రోజే కొడుకు రాజీవ్ కి విపరీత మైన జ్వరం వచ్చింది. ఒక్కగానొక్క ముద్దుల కొడుకు తల్లి మెడకి అల్లుకు పోయి ఎక్కడిక్కి వెళ్లొద్దని మారాం చేస్తే ఎలాగో ఎలెక్ట్రిక్ బొమ్మ ట్రైన్ , చాక్లెట్స్ లంచంగా ఇచ్చి కృష్ణ వెళ్ల గలిగింది. ఆనాటి నృత్య ప్రదర్శన ఆమెను ప్రశంసలతో ముంచెత్తేసింది. మహారాణి ఎలిజబెత్ స్వయంగా కృష్ణ రెండు చేతులు పట్టుకుని అభినందించింది. ప్రశంసలు చప్పట్ల్ లో మునిగి తేలుతూ సంతోషంగా కారులో తిరిగివస్తూ  మహిళాశ్రమం ముందు నుంచి సర్రున దూసుకు పోయింది. రెప్పపాటులో ఆమె ఆనందం ఎగిరి పోయింది. ఎండిపోయిందనుకున్న పుండు ఇప్పుడు రాక్షసి పుండుగా మారింది. ఇంటికి తిరిగి వచ్చి జ్వరంతో ఉన్న కొడుకుని గుండెలకి హత్తుకుని పడుకుంది కానీ కృష్ణ కి నిద్ర పట్టలేదు. 

            మర్రి చెట్టు నీడలో ఉన్న ఆశ్రమంలో ఒక చిన్న గదిలో జీర్ణ స్థితిలో ఉన్ననులక మంచం పై ఒక నిర్భాగ్యుడు నిద్ర పోతున్నాడు. వాడికి తన మొహం దాచుకోవటానికి ఎవరి గుండెలు లేవు. ఎలాంటి శర్తులు పెట్టకుండానే వెళ్ళి పోయింది వాడి తల్లి. తల్లి అంటే ఏమిటో తెలీని ఆ నిర్భాగ్యుడు ఆశ్రమంలో మిగతా పిల్లల చేత దెబ్బలు తన్నులూ తింటూ ఉండేవాడు. వాడి కళ్ల లో ఏదో తెలియని నిరాశ .ఎవరితోనూ మాట్లాడలేడు. పుట్టుక తోటే మూగ,బధిరుడు. కృష్ణ కి వివరాలు తెలియవు. గత ఐదేళ్ల లో చాలా సార్లు తన కొడుకుని చూడాలని తపిచింది. కానీ తండ్రికి ఎన్నడూ ఆశ్రమంలో కాలు పెట్టనని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పోయింది. అసలు ఆ బాబు జీవించి ఉన్నాడా లేదా అన్న అనుమానం. పాపం కృష్ణ కి అప్పుడు తెలియదు, అటువంటి నిర్భాగ్యుల జీవితాలు, మృత్యువు కోసం ఎంత ప్రార్థించినా వాళ్లని వరించదని. సోమవారం తను విదేశాలకు పయనామవ్వాలి. రాజీవ్ జ్వరం తగ్గిపోయింది. తన రైల్ బండి తో ఆడు కుంటున్నాడు. భర్త ఇంట్లో లేడు, ఏదో పని మీద బయిటకు వెళ్ళాడు. కృష్ణ కారు తీసింది. చేతి బాగులో బోలెడన్ని చాక్లెట్లు నింపుకుని మరో బొమ్మ ఎలక్ట్రిక్ ట్రైన్ కొనుక్కుని,ఆశ్రమానికి వెళ్లింది. కొంచెం దూరం లోనే కారు ఆపేసి ఆశ్రమానికి నడిచి వెళ్తుంటే కృష్ణ గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. 

కాశీబాయి ఉందో లేదో అనుకుంటూ సాహసించి ఆశ్రమం లోపల్కి అడుగు పెట్టంగానే కాశీబాయి ఎదురు అయింది. “ ఆహా, నువ్వేనా! రా, ఆఫీస్ రూమ్ లో కూర్చుందాము. “ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్లింది. “ చెప్పు ఇన్నాళ కి  ఎలా జ్ఞాపకం వచ్చాము.” ఆమె ప్రశ్న లోని వ్యంగ్యం ఆమె మనస్సుని చీరినట్లయింది. “ఎలా వస్తాను నాన్నకి మాట ఇచ్చాక? “ అని తల వంచుకుంది అపరాధిలా. 

            ‘ బాబుని చూస్తావా? ‘ చాలా ఆత్మీయతతో అడిగింది కాశీబాయి, ముందుకు వంగి రహస్యంగా. 

అవునంటూ తల ఊపింది. 

“ పిలిపిస్తాను. కానీ జాగర్త. ని మనసుని అదుపులో పెట్టుకో. బాబు మూగి. కానీ పనివాళ్లు ఎవరికి ఏమాత్రం సందేహం కలిగినా బ్లాక్ మెయిల్ల్ చేయటానికి సంకోచించరు.  ‘ పూరన్ దేయి ‘ అని పిలుస్తూ గంట నొక్కింది. కసాయి లా కనిపిస్తున్న ఒక లావు పాటి మహిళా వచ్చి నుంచిది. “ వెళ్లి ఆ మూగి బాబుని తీసుకురా. డాక్టర్ వచ్చారు వాడిని పరీక్షిస్తుంది. పూరన్ దేయి వెళ్లంగానే  కృష్ణ కి కణతల పోటు తో  పాటు చెమటలు పట్టాయ్. 

నడు ,నడు అంటూ మూగి బాబుని తరుముకుంటూ తీసుకు వచ్చింది. ఎవరి బట్టలో వేసి నట్లున్నారు. వాడు వేసుకున్న షర్ట్ చేతులు భుజాలు వెళ్ళాడు తున్నాయి. సరిగ్గా తయారు చేసి తీసుకు రాలేదేమ్ ? అని కసిరింది కాశీబాయి. 

“ మొండి వెధవ, ఎంత చెప్పిన వినలేదు. అని ఎర్రటి కళ్ళతో చూసింది బాబు వైపు పూరనదేయి. 

కృష్ణ కి కళ్ళలో గిర్రున నీళ్లు  తిరిగాయి. తన కళ్ల ముందు రాజీవ్ ముఖం వచ్చింది. వాడి ప్రతి కోరిక తీర్చటానికి భార్య భర్తలు ఎలా పోటీ పడతారో గుర్తుకు వచ్చి కృష్ణ మనస్సు తల్లడిల్లి పోయింది. 

తలుపు లోపలి నుంచి గడియ వేసి కాశీబాయి బాబుని ‘ రా నాన్నా ‘ అని దగ్గరకు పిలిచింది. 

‘ఘంఘం అంటూ ఎదో చెప్పటానికి ప్రయత్నించాడు వాడు. కృష్ణ కి వాడి భావం ఏదో అర్థం అయింది. అప్రయత్నంగానే కళ్ళు వర్షించటం మొదలైన్నాయి. ఎదురుగా చిన్ని డిసుజా నిలబడి నట్టే అనిపించంది. అవే ప్రశాంతమైన అమాయకమైన కళ్ళు , అదే చిరునవ్వు 

ఒక్క సారి ఆ మూగి బాబుని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. వాడి చింపిరి జుట్టు ని నిమురుతు గుండెలుకు హత్తుకుంది కృష్ణ. వాడి మురికి చేతుల్ని ముద్దు పెట్టుకుంది. అలా ముద్దులు కురిపిస్తూ బాబుని పూర్తిగా తనలో ఇముడ్చుకుందామా 

అన్నట్లు. 

            ఇంక ఆపు ఎందుకు వాడిని అలా నెత్తికీ ఎక్కించుకుంటున్నావు? “ అంది కాశిబాయి కోపంగా. చేసేది లేక వాడిని క్రిందకి దించింది. కిందకి దింపంగానే వాడు కృష్ణ తెచ్చిన బొమ్మల ముందు నుంచున్నాడు.  కాశీబాయి ఆ బొమ్మల డబ్బా వాడికి అందించి “ తీసుకోరా , అన్నీ నీ కోసమే. “ వాడి కళ్లు మిలమిల మెరిసాయి. ఒక సారి ఇంజన్ని, ఒకసారి రైలు డబ్బాల్ని ఎత్తి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ ఘుమ్ ఘుమ్ అంటూ సంతోషంగా తిరిగేస్తున్నాడు. “ ఇక నీవు వెళమ్మా. చాలా సేపటి నుంచి తలుపులు వేసి ఉంచాము. ఆ పూరన్ దేయి తలుపు దగ్గరే చెవులు పెట్టి ఉంటుంది. ఆహా నీ చేతి ఉంగరం భలే ఉందే. “ అంది కాశిబాయి ఆశగా. కృష్ణ అర్థం చేసుకుంది. వెంఠనే చేతి ఉంగరం తీసి కాశిబాయి కి ఇచ్చి ,మౌనంగా ‘ నా నోరులేని బాబుని జాగర్తగా చూసుకుంటావుకదూ’ అన్నట్టు ప్రార్థన పూర్వకంగా చూస్తూ బరువైన మనస్సుతో ఇంకోసారి వాడిని ముద్దు పెట్టుకుని, చటుకున్న వెనక్కి తిరిగి వేగంగా కారు వైపు నడిచింది. 

            సోమవారం భర్తతో కలిసి విదేశాలకు బయలు దేరింది. కొన్ని నెలల లోనే భారతీయ సెక్రెట్రీ భార్య నృత్య నైపుణ్యం మొత్తం ఎంబెసీ లో ప్రముఖ చర్చా విషయంగా మారింది.  ఒక నాడు అక్కడే మూగీ బధిరుల సంస్థ సెక్రెట్రీ అయిన మదర్ మారయా అనునయ పత్రం అందింది. “ మా నిర్భాగ్యులైన పిల్లలను మీ అమోఘమైన నృత్యంతో తరింప చేస్తారా?” అని అడిగారు. కృష్ణ వెంఠనె తన స్వీకృతి ఇచ్చింది. అక్కడ మూడు గంటలు ఒళ్ళు తెలియకుండా నాట్యం చేస్తూ ఉండి పోయిది. ఆ మూగి ముఖాల పై సంతోషం ,కొన్ని కోట్ల హర్ష ధ్వనుల కంటే మిన్నగా తృప్తీని ఇచ్చాయి. నృత్య సమారోహం అయ్యాక , మదర్ చేతులు పట్టుకుని , దేవ దుతలా ఒక బాలుడు వచ్చి ఆమెకి పువ్వుల గుత్తి అందించాడు. 

              ‘ ధన్యవాదాలు బాబు. నీపేరు ఏమిటి ‘అన్న మరో నిమిషానికి తన పొరపాటు గ్రహించి,విసుక్కుంది. “ ఒహో , మిసెస్ త్రిపాఠి వీడు పుట్టుక నుంచే మూగ. వీడి తల్లి మా ఆశ్రమ ద్వారం దగ్గర వీడిని వదిలేసి వెళిపోయింది. మళ్ళీ తిరిగి చూడలేదు. ఏసు ప్రభువు ఆమెను క్షమించు కాక ‘ అంటూ మదర్ క్రాస్ చేసుకుంది. కృష్ణ అలా ఆ బాలుడి ముఖం వైపు చూస్తూ ఉండి పోయింది. ఆ వెనకే ఆమె కన్నీరు ధారా ప్రవాహంగా మారింది. 

‘ఇదేమిటి మిసెస్ త్రిపాఠి, మీరు విలపిస్తున్నారా? 

ఆశర్యపోతూ అడిగి కృష్ణ రెండు చేతుల్ని ముద్దు పెట్టుకుంది. “ ప్రతి ఒక్క మనిషీ ఒకరి కష్ట సుఖం ఒకరు అర్థం చేసుకుంటే ఎంత బాగుణ్ణు. ఒక మూగి బాలుడ్ని చూసి నీవు పడుతున్న బాధ చూసి నాకు ఆనందంగా ఉంది. “ 

పాపం ఆ మదర్ మారయా కి ఏం తెలుసు ,ఆ అశ్రువులు , కిటికీ ఊచల్ని  తన సన్నటి పుల్లలాంటి చేతులతో కర్చుకుని పడుకున్న తన నోరులేని కొడుకు కోసం ఆని . వాడి గుండెల పై ఉన్న మురికి బట్టపై ఒక భల్లూకాన్ని పట్ట్కుని పడుకున్నాడు. వాడికి ఇచ్చిన బొమ్మ రైలు కాశీబాయి ఆశ్రమం ఆఫీస్ అలమారులో దాచేసింది. వాడు దాని కోసం చాలా    ఏడిచాడు. కానీ వాడి ఏడుపు వినిపించుకునేది ఎవరు అక్కడ? 

             ఆశ్రమానికి చాలా మంది ధనికులు ,ఆఫీసర్లు కారుల్లో వచ్చి మిఠాయిలు పంచి వెళ్ళేవారు. కానీ ఆ మూగి బాలుడు ఆ మిఠాయి పారేసి ఆ రైలు బొమ్మ కోసం ఏడ్చేవాడు.  కాశిబాయి మనసు మాత్రం కరిగేది కాదు. 

           ఆ చిన్నారి మూగి మనసు లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచన్లు సముద్ర కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిరి  ఎగిరి పడుతున్నాయి . ఎన్నో అడగాలనిపించేది వాడికి. ఇంతమంది వచ్చి పోతున్నారు మరి ,ఆనాడు తన కోసం అన్ని బొమ్మలు తెచ్చి ,అంత ముద్దు చేసి

వెళ్ళిన ఆమె మళ్ళీ రాలేదేమీ? ఇవాళ కాశీబాయి తనని ఎందుకు అలా బాదేసింది? నేను పూరన్దెయి వీపు మీద కరిచాను అంతే  కదా? మరి ఆ పూరన్దెయి నన్ను కర్ర తో బాదటంలేదా? 

            ఆ నిర్భాగ్యుడు నోరు తెరిచి అడగలేడు. ఆ నిర్జీవమైన భల్లూకాన్ని గుండెలకి హత్తుకుని కిటికీ పక్క ఒక మూలన దాక్కుని ఉండిపోయాడు, కాశిబాయి కి  కనిపించకుండా.  

            ఏడు సముద్రాల అవతల వాడి తల్లి కూడా ఏడుస్తున్నది ఆ దుఖ్ఖంతో నిండిన స్వరం అంత దూర తీరాల నుంచి కూడా వాడికి జోల పాటలా  పని చేశాయి ఏమో , తియ్యటి నిద్ర లోకి జారీ పోయాడు. తన స్వప్న లోకంలోకి పయనమైపోయాడు. అక్కడ ఏ కాశీ బాయి ఏ  పూరన్దెయి లేరు. ఆ స్వప్న లోకంలో 

ఆ మూగబాబుకి ఒక పెద్ద రైలు బొమ్మా, పెద్ద బంగారపు ఊయల లో బొలేడన్ని బొమ్మలూ , అదే అందమైన యువతి ఒళ్ళో ఎగిరి ఎగిరి ఆడుకుంటూ 

ఆమె పై ముద్దులు కురిపిసున్నాడు. నిద్ర లోనే కిల కిల నవ్వుకుంటూ ఆ మూగవాడు  భల్లూకాన్ని ఇంకా గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.