చిత్రలిపి

నా జ్ఞాపకాల  పొత్తంలో  నెమలీకవు నీవు!

-మన్నెం శారద

ఒకానొక ప్రయాణంలో మనం కలిసేవుంటాం 
మాటామాటా కలిపే వుంటాం 
 
ఆకుపచ్చని చేలని చూడాలని నేను ఆత్రపడినప్పుడు 
కిటికీ దగ్గర సీటుని నువ్వు నాకు ఇచ్ఛే వుంటావ్ 
 
నేను తెచ్చిన పూరీలు , నువ్వు తెచ్చిన పల్లీలు 
ఒకరికొకరం పంచుకుని తినే ఉంటాం 
 
అనుకోని వానజల్లు  నా మొహాన విసిరి కొట్టినప్పడు  కిటికీ మూస్తుండగా నలిగిన
నీ వెలికి నేను తడి రుమాలు చుట్టేవుంటాను .
 
నీ టిక్కెట్ జారీ పడిపోయి టి. సి కి 
నేను ఫైన్ కట్టినప్పుడు  నువ్వు నా వైపు కృతజ్ఞతగా చూసి  
కొద్దిగా మొగమాటపడేవుంటావ్ 
 
ఇప్పుడొక్కసారి  నా గమ్యం వచ్చిందంటూ 
అకస్మాత్తుగా నువ్వు నా చెయ్యి వీడి 
మరో వైపు సాగి పోతుంటే 
నేను అగమ్యగా అక్కడే నిలబడి పోయాను .
 
ఈ శీతల చలిగాలులకి నా తలపులు 
సన్నగా వణుకుతున్నాయి 
 
మంచో చెడో …పోట్లాటో ….కొట్లాటో 
అంతర్లీనం గా ఒక దారం అల్లుకుని బ్రతికినవాళ్ళం 
 
కంటి అంచుల చేరిన నీరు ఘనీభవిస్తుంటే
  దాటని మాటలిప్పుడు  పేర్చుకుంటున్నాను 
 
.పెరగదని తెలిసి కూడా 
శేష జీవితాన్ని  తెల్లార్చడం  కోసం 
పసిపాపలా నా జ్ఞాపకాల పొత్తం లో దాచిన  నెమలీకని 
తిరగా మరగా చేసి చూస్తూనే వుంటాను 
 
ఏ ఇద్దరి  కధా ఒకేసారి ముగియదుగా !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.