కనక నారాయణీయం -28

పుట్టపర్తి నాగపద్మిని

అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న 

సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు.

    మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు.

     కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. శివతాండవం పెట్టిన కిరీట కాంతులవి!!  తన మాటలు వినిన శ్రీపాదవారి    అనుయాయులెవరో     ‘అలాగా!! మాది ,   సీతా రాముల దాంపత్యానందానికి  ప్రతిబింబమూ,   సకలకళలకూ ఆకరమూ ఐన , గోదావరి లెండి!! ‘ అన్నారు ,  మరీ వెటకారంగా!! 

         వెటకారంగా అన్న ఆ  మాట  తన     హృదయానికి   సూటిగా, బాణం   వలె  తాకింది.         ఆవేశం కట్టలు తెంచుకుంది.    హృదయం కుతకుతలాడింది.   సంస్కృత శ్లోకాలు  నాలుగైదు   ఆశువుగా   అద్భుత రస ప్రవాహంగా సమాస భూఇష్టంగా   ఉధృత జల  పాత  సదృశంగా వెలువడ్డాయి.  (పుట్టపర్తికి తాను ఆశువుగా చెప్పిన శ్లోకాలను గానీ  పద్యాలను కానీ భద్రపరచుకునే అలవాటు లేదు. అలా చేయాలనుకుంటే, అంతకంటే ఉన్నతంగా కొత్త శ్లోకాలు ఆవిష్కృతమవటమే దానికి కారణమనుకుంటాను. వివిధ సందర్భాల్లో వారు చెప్పిన ఆశు కవితల్లో చాలా కొన్ని మాత్రమే, అదీ ఆయన ప్రయత్నించి భద్రపరచుకున్నవే మనకిప్పుడు లభిస్తున్నవి.)

   అక్కడి విద్వజ్జనుల మధ్య నిశ్శబ్దం తాండవించింది. వారి మౌనం చూస్తుంటే, యీ కఠిన శబ్దజాల పరివృతమైన శ్లోకాలు వారికి కొరుకుడు పడలేదేమోననిపించింది. కానీ శ్రీపాద వారి మోము ప్రకాశవంతమైంది. విషయం గమనించి, ఆశువుగా  తెలుగు పద్యం అందుకున్నాడు తాను!! 

                        ‘  హేరాళంబిదె నాదు భాగ్యమని నీవెంతెంత  ఘోషింతు,  నీ

                             వారల్ జూచితిలెమ్ము చెప్పకుము  గొప్పల్ విప్పుగా గౌతమీ!!

                           ధారావర్ధిత గోస్తనీ రస సముద్యత్ తుంగభద్రానదీ

                              స్వారస్యంబులముందు తావక పయ: పానమ్ము శోభించునా?    

నాదే భాగ్యమని, నా వారే గొప్పవారని నీవెంతగా  ఘోషించినా, నీ గొప్పదనం ఎంతటిదో చూశాను లేవమ్మా!! ఇంకా గొప్పలు చెప్పకు. ధారాపాతంగా ద్రాక్ష రస ధారలవలె (ఆవు పాల వలె అని మరో అర్థంలో)  ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే మా తుంగభద్రానది రుచులముందు (సహజ లాలిత్యము అని కూడా) నీ జలపానము (లేదా క్షీర పానము) శోభిస్తుందా?   (ఏమాత్రమూ నిలువలేదు అని అర్థం.)   

         పద్యం వినగానే అక్కడున్న పండితమ్మన్యులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవటం మొదలెట్టారు. శ్రీపాద వారు గంభీరంగా కూర్చుని వున్నారు.    కాసేపటికి  మళ్ళీ    గుసగుసలు!!

         పరిస్థితి గమనించి మళ్ళీ తనలో పద్యావేశ0   రాజుకుంది

                                            సార సంగీతములకు కావేరి నీరు,

                                                అరిది కవితకు తుంగభద్రమ్మ నీరు,

                                             ఎన్నబూనిన మా పెన్నమ్మ నీరు,

                                            నీవి పై పైని రుచులు, గోదావరమ్మ!!

  రెండవ పద్యంలో పెన్నమ్మను తలచుకున్న తరువాతే సీమవానిగా తన ప్రాంతానికి మ్రొక్కులు    చెల్లించుకున్నట్టుగా    భావించిన పుట్టపర్తి     మరో పద్యం అందుకోబోతుంటే,     శ్రీపాద వారు, కరతాళ ధ్వనులతో పుట్టపర్తి పా0డిత్యానికి      తన హర్షాతిరేకాలు వెల్లడించటం జరిగింది!! అక్కడున్న తక్కిన వారికి కూడా కరతాళ  ధ్వనులకు     చేతులు   కలపక   తప్పలేదు.

         అప్పటికే సాహిత్యంలో లబ్ధ ప్రతిష్టులైన శ్రీపాద వారి ప్రశంసలనందుకోవటం,   వారు అభిమానంతో తన సాహితీ ప్రస్థానాన్ని వివరంగా అడిగి తెలుసుకుని,    వెన్ను తట్టి, మరింతగా  జైత్ర యాత్ర సాగించమని ఆశీర్వదించటంతో, ఉత్తరాదిన ( సీమకు ఉత్తరంగా పై భాగాల్లో ఉన్న ప్రాంతాలను ఉత్తరాది అనటం, సీమ ప్రజలకు అలవాటు) కూడా పుట్టపర్తికి  చాలా చక్కటి గుర్తింపు, ఆదరణ లభించాయి  తరువాతి రోజుల్లో!! 

     ఇటువంటి ఎన్నెన్నో అనుభవాల నేపథ్యంతో కొనసాగిన తన సాహిత్య యాత్ర, యీ విధంగా కడప రామకృష్ణా హైస్కూల్ లో మర్రి చెట్టుకింద పాఠాలు చెప్పుకుంటూ గడపవలసి వచ్చిన యీ  సమయాన నిస్తేజమై పోయిందా అని దిగులు ఆవహించేది అప్పుడప్పుడూ!! స్థితికి కారణం తన స్వాభిమానమా లేక అహంకారమా?? అని తనను తాను ప్రశ్నించుకునేవారాయన, అక్కడున్న మర్రిచెట్టుకు చేరగిలబడి!!

           ప్రొద్దుటూరులోనూ, అనంత పురంలోనూ, తిరువనంతపురంలో తన పాండిత్యాన్ని సహించని శక్తులు తన వైరాగ్యానికి కారణం కాగా, ఢిల్లీ   సాహిత్య అకాడమీ లో,   అనారోగ్యం  తన వెంటపడి   తననిక్కడికి చేర్చింది.  

          తాను అహంభావంతో విర్రవీగిందెప్పుడసలు??  తనలోని   ప్రతిభను ఎవరైనా చెణికినప్పుడు మాత్రమే, తక్కువ చేసి మాట్లాడినప్పుడు మాత్రమే   వారికి తగ్గ సమాధానం చెబుతాడే తప్ప అనవసర వాగ్యుద్ధ విన్యాసాల జోలికి తానెప్పుడూ పోడే!! తాను నిరంతరం పారాయణం చేసే వాల్మీకి వ్యాసాదులు, కాళిదాస భవ భూతులు, పుష్పదంతాది ప్రాకృత కవులూ, తనకు ప్రాణప్రదమైన తులసీ, కబీరూ వంటి హిందీ మూర్ధన్య కవులూ, శిలప్పదిగార తమిళ కావ్య నిధులూ, తన పరిమితిని ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నప్పుడు, తలవంచి వారందరికీ వినీతుడౌతున్న యీ నారాయణ దాసునికి అహంకారమెక్కడిది? తరుణప్రాయంలోనే సంస్కృత శ్లోక పటిమతో   కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర స్వామివారి ఆశీస్సులనందుకున్న తనకు,   సాక్షాత్తూ శివానంద సరస్వతీ స్వాముల వారినోట సరస్వతీపుత్రుడు అనిపించుకున్న తనకుఇప్పటి యీ పరిస్థితి విధి విచిత్రం కాక మరేమిటి??  తన మేధోజగత్తులో పదిలమై ఉన్న   సాహిత్య నిధుల స్వర్ణ కాంతులు    కళ్ళల్లో ప్రతిఫలించటంఅహంభావంగా కొందరికి కనిపించటం ఆశ్చర్యమే మరి!!

        ఇలా తన ఆలోచనల్లో తానుగా రామకృష్ణా హై స్కూల్ లో కాలం గడుపుతున్న పుట్టపర్తిని అమితంగా అభిమానించే ఉపాధ్యాయులు చాలామంది తయారయ్యారు. కరస్పాండెంట్ ఆర్. రంగనాథం గారు పుట్టపర్తి వీరాభిమాని.   హెడ్ మాస్టర్ వై.వీ. సుబ్బయ్య,   లకు పుట్టపర్తి ప్రేమ పాత్రులు. అధ్యాపక వర్గం లో శ్రీయుతులు  హెచ్. గోపాల కృష్ణ మూర్తి (లెక్కలు),  M. సుబ్రహ్మణ్యం (సంస్కృతం), సేతు మాధవ రావు (ఇంగ్లీష్, పుల్లయ్య (సోషియల్)  కే.వెంకట సుబ్బయ్య, కేశవ రావు (ఇంగ్లీష్),  కే.పీ.కృష్ణ మూర్తి,  చెన్నకేశవులు, జీ.కృష్ణ మూర్తి (స్కౌట్స్ అండ్ గైడ్స్),   పీ. కృష్ణ మూర్తి,   వీ. కృష్ణ మూర్తి (లెక్కలు) జేహనుమంత రావు (ఇంగ్లీష్సంజీవ రావు (లెక్కలు)కృష్ణా రావు (ఇంగ్లీష్) వాట్కిన్స్ (డ్రాయింగ్, స్కూల్ వార్షిక కార్యక్రమాల్లో మేకప్ కూడా), ఆర్. సుబ్రహ్మణ్యం (సైన్స్)   చెంచు సుబ్బయ్య (సంస్కృతం) , రామేశ్వర శర్మ, (సంస్కృతం)  సుబ్బరామ శర్మ  (సంస్కృతం) గురు మూర్తి, మల్లికార్జున్ ( ఇద్దరూ లెక్కలు బోదించేవారు )  సిద్దయ్య, మునెమ్మ (ఇద్దరూ దంపతులు, హిందీ అధ్యాపకులు)  సీతారామయ్య (తెలుగు), శ్యామ సుందర్ (హిస్టరీ)  కొండప్ప (సంగీతం – స్కూల్ వార్షిక పోటీలప్పుడు సంగీత, నాటక శిక్షణలో చేయితిరిగిన టీచర్) టీ. నరసిం హాచార్య (లెక్కలు) టీ. కృష్ణమాచార్ (హిందీ) సుబ్బ నరసయ్య (డ్రాయింగ్ – పుష్పగిరి  పీఠాధిపతి   – శ్రీ శ్రీ శ్రీ  విద్యా   నృసిమ్హ భారతి స్వామి వారి పూర్వాశ్రమ సోదరుడు)  శేషయ్య (ఫిజికల్ ట్రైనింగ్) రంజిన్ బేగ్ (ఫిజికల్ ఎజ్యుకేషన్) జమాల్ సాబ్ (క్రాఫ్ట్స్) ,   శ్రీమతులు, శమంతక మణి ,  ఇందిరా జేబ్,  కోకిలమ్మ,  సుజాత, నిర్మల,  రజీనమ్మ (సోషియల్),  ఇత్యాదులు  (అయ్య రామ కృష్ణా హైస్కూల్ లో పనిచేసినప్పుడు అంటే , దాదాపు 1955 నుండీ 1972 వరకు)!!

        చాలా మందికి    పుట్టపర్తిని  ‘స్వామీ’   అని సంబోధించటమే అలవాటు . (తాము గౌరవించదలచిన పెద్దలనెవరినైనాస్వామీఅని సంబోధించటం సీమ తరతరాల అలవాటు మరి.)     సమయం  దొరికినప్పుడల్లా వారి దగ్గర చేరి అపారమైనఅపురూపమైన  వారి జీవితానుభవాలను అచ్చమైన రాయలసీమ యాసలో, మధ్యలో హాస్య ధోరణిలో   వారు ముద్దుగా తిట్టే తిట్లతో కూడన వాక్ప్రవాహపు  చిత్తడిలో తడిసి మురిసిపోవటం వారందరికీ ఇష్టమైన వ్యాపకం

    మూడు నాలుగు  భాషలను అవలీలగా మాట్లాడగల్గటం కొంతవరకు సాధ్యమే!! మాట్లాడేవరకే యీ జ్ఞానం పరిమితం. కానీ పుట్టపర్తి వారి దగ్గర కూర్చుంటే, సoస్కృతం, తెలుగు, కన్నడ, తమిళము, హిందీ, ఆంగ్లము వంటి భాషలే కాక వ్రజ్, అవధీ, మైథిలీ వంటి హిందీ రూపాంతరాలే కాదు.   మాగధీ, అర్ధ మాగధీ, ప్రాకృత, పైశాచీ వంటి ఇప్పటిదాకా వినని భాషా సాహిత్యాల గురించి వినటం ఒక కొత్త అనుభవం వాళ్ళకంతా!! తాను స్వయంగా ఆసక్తితో నేర్చిన రష్యన్, జర్మన్, లాటిన్ వంటి విదేశీ భాషా సొబగులు వారి మాటల్లో వినటం అద్భుతమే!! వారు అరబిందో ఆరాధకులు కూడా కావటం వల్ల  పుదుచ్చేరి (ఇప్పటి పాండిచ్చేరి) వెళ్ళినప్పుడల్లా మహాపురుషుని దర్శనానందాన్ని తన సన్నిహిత ఉపాధ్యాయులతో పంచుకునేవారు పుట్టపర్తి. అంతే కాదు, తన  ఆధ్యాత్మిక  ఉపాసనా క్రమంలో తాను దర్శించిన పెద్దలు, తన విస్తృతానుభవాలూప్రయోగాలూ  ఇవన్నీ కూడా వారి నోట వింటుంటే  కాలమే తెలిసేది కాదు వాళ్ళకు!!  వాళ్ళది పరిమిత జ్ఞానం, సామాన్య కుటుంబ జీవన శైలి. పుట్టపర్తి స్వామి వారిదలా కాదుఒకే ఒక వ్యక్తిలో ఎన్నెన్నో  భిన్న కోణాలు దర్శించటంఎవరికైనా అపురూపమైన అనుభవమే కదా మరి!!

      బావిలో కప్పల వలె తమ ఉద్యోగ జీవితం, కడప కే పరిమితం. కానీ పుట్టపర్తి వారో?? డిగ్రీలకు అతీతమైన వారి జ్ఞానాన్ని అంగీకరిస్తూ, అనంతపురం డిగ్రీ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా ఆహ్వానించారు. అక్కడి ప్రిన్సిపాల్ ఆంగ్ల ప్రభుతాభిమాని కావటం వల్ల దేశాభిమానం పరవళ్ళు తొక్కే వయసులో ఉన్న పుట్టపర్తి తానే రాజీనామా చేసి ఇదివరకు తాను పనిచేసిన ప్రొద్దుటూరికే వచ్చేశారట!! తర్వాత తిరువనంతపురం ! పేరు కూడా విన్నట్టు లేదు తమకు మరి!! (1955- 60 నాటి మాట ఇది కదా!!) కేరళ రాష్ట్ర రాజధాని. అక్కడ, కేరళ విశ్వవిద్యాలయంలో మళయాళ భాషా నిఘంటు నిర్మాణాధికారిగా పిలిచి పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. అక్కడి ఉద్యోగుల ధోరణి నచ్చక వెనక్కి వచ్చేస్తుంటే, ఢిల్లీకి పిలుపు!!  ఢిల్లీ పేరు వినటమే కాని   ఇప్పటిదాకా   దర్శన    భాగ్యమే     కలగలేదు  అక్కడి చాలామంది ఉపాధ్యాయులకు!! కేవలం దేశ రాజ ధానిగాప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇతర మంత్రులూ నివాసముంటూ, భారతదెశ పరిపలనా యంత్రాంగాన్ని నడిపే అతి ముఖ్యమైన ప్రాంతంగానే తెలుసును. కానీ ఆచార్యులవారు అక్కడ ఒక తెలుగు వాడిగా ఉంటూనే, దేశవిదేశీ భాషా గ్రంధాలయాధికారిగా సాహిత్య అకాడమీ లో   పనిచేయటం అద్భుతం కదా!!

పసిరికలన్న వ్యాధి వీరిని పట్టి పీడించకుంటే, దేశ రాజధానిలో, వారే చెప్పినట్టు ఆదర్శ ఉపాధ్యాయునిగాఆధ్యాత్మిక వేత్తగా  పేరెన్నిక గన్న     దేశ ఉపాధ్యక్షుడు  సర్వేపల్లి రాధాకృష్ణన్    మహాశయుణ్ణి అప్పుడప్పుడూ    కలుసుకుంటూ, ఇంకా హిందీ  సాహిత్యాకాశంలో మేలైన తారలుగా వినుతికెక్కిన ఎందరో కవులతో మంతనాలాడుతూ, అప్పుడప్పుడూ సాహిత్య  అకాడమీని     సందర్శించే      దక్షిణాది      సాహిత్యకారులతో       ఇష్టాగోష్టులు నడుపుతూ ఉండేవారు కదా యీ పుట్టపర్తి స్వామి!! మన అదృష్టం బాగుండి, ఇక్కడ యీ రామకృష్ణా హైస్కూల్ లో     కరస్పాండెంట్    రంగనాధం గారి చొరవతో యీ సరస్వతీపుత్రుడు పనిచేస్తూ, మనకు అందుబాటులో ఉండటం, ఇసుమంత భేషజం లేకుండా  తన జ్ఞానాన్ని మనకు పంచుతూ ఉండటం, మనందరి అదృష్టమే కదా!!’  ఇవీ పుట్టపర్తి వారి గురించి అక్కడి అప్పటి ఉపాధ్యాయుల భావాలు!!

     ఒక రోజు వీ.కృష్ణమూర్తి (లెక్కల ఉపాధ్యాయుడు) వారి దగ్గర కూర్చుని ఉండగా, సర్వేపల్లి రాధా కృష్ణన్ గారి ప్రస్తావన వచ్చింది.

   ‘స్వామీ!! మీకు రాధాకృష్ణన్ గారితో పరిచయం ఎట్లా కలిగింది?’

   ‘నా పరిచయానికి ముందే మా అయ్యతో వారికి మంచి స్నేహం ఉండేది రా పీకే!!’ (కృష్ణ మూర్తి అన్న పేరుతో చాలా మంది టీచర్లు ఉండటం వల్ల వారి ఇంటి పేర్లతో కలిపి,సులభంగా పలికేందుకు  వీలుగా   పుట్టపర్తి వారు వారిని  పీకే. వీకే, జీకే, అని పుటాక్షరాలతోనే  సంబోధించేవారు. ఎవరూ నొచ్చుకునేవారు కారు.సరదాగా తీసుకునేవారే అందరూ!!)

   ‘అదెట్లా స్వామీ??

   ‘అదొక పెద్ద కథరా!’

  (సశేషం)

(ఫోటో మరియు అప్పటి ఉపాధ్యాయుల పేర్లు అందించటంలో సహకరించిన నా బాల్య స్నేహితురాలు శ్రీమతి కైపా (డీ) రామసుబ్బ లక్ష్మికి అనేక నెనరులు)            

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.