పూల పరిమళ స్నేహం

-కోడం పవన్ కుమార్

ఇన్నేళ్ళ మన స్నేహం
ఈ మధ్య కాలంలో
నీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు
 
ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనం
ఈ మధ్య కాలంలో
నీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు
 
ఇన్నేళ్ళ మన పలకరింపు
ఈ మధ్య కాలంలో
నీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు
 
ఇన్నేళ్ళ మన ప్రతి కలయికలో
ఒక మొక్క జీవం పోసుకునేది
ఒక ఆత్మీయత టీ కప్పును పంచుకునేది
ఒక బాధ మేఘమై ఆకాశంలో పరుగులు పెట్టేది
కాలం క్షణాల్లో కరిగి
కలుసుకున్న చోట తీపి గురుతును వదిలేది
మైదాన ప్రాంతాలను వదిలి
మహానగరాలను దాటి
మెరీనా తీరం వెంట అలలై దూకేవాళ్ళం
అలసి అలసి సముద్రమై నిలిచేవాళ్ళం
 
స్నేహానికి దూరం లేదని
దూరంగా ఉన్న శరీరాలను మనస్సు కలిపి
కుటుంబ బాధల బరువును తప్పిస్తుందని నమ్మేవాళ్ళం
నమ్ముతూ బతికేస్తున్న వాళ్ళం
 
సమయమేం మించిపోలేదు
మన కళ్ళలో జ్యోతులు వెలిగించుకోవాలి
గుండె భాస్వరమై మండుతుండాలి
పెదవులపై తేనే పలుకులు చిలుకుతుండాలి
వచ్చే కాలం మనదేనని చాటిచెప్పాలి
స్నేహైక ప్రేమజీవనంలోని పలకరింపులు
పరిమళించే పూలను పూస్తున్న మొక్కల్లా
జీవితపు పెరటితోట నిండా ఎదుగుతుండాలి

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.