యుద్ధం ఒక గుండె కోత-15

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో

జండా కొయ్యల్లా నిల్చున్న

విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో

కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం

శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా

ముఖాల్నిండా ఆర్తి పరచుకొని

అంగరఖా చాటున గుళ్లు నింపిన తుపాకీల్లా

మృత్యువుని సవాలు చేస్తూ

ఆకాశానికి చూపులు ఎక్కుపెట్టే ఉన్నారు

రాబందుల రెక్కల చప్పుడుకి పెట్రేగిపోతూ

బంధుజనాల మృత్యువాసన

వంటినిండా పూసుకొంటూ

ఆకల్ని మింగేస్తున్న పూనకంతో ఊగిఊగి

ఆదమరుపుగా రెప్పవాలిస్తే

నిద్రాలింగనంలో అమ్మ పిలుపు 

వెనక్కి పిలుస్తుందేమోనని

ముందే ఆత్మీయ కుబుసాల్ని విసర్జించేసి

సర్పయాగంలోకి దూకేందుకు సిద్ధమై

వల్మీకంలో దాగిన సర్పాలయ్యారు

పగబట్టిన ప్రతీకారంతో

పూనకంపట్టిన గండభేరుండాలు

ఆకాశమంతా ఎరుపుని కక్కుతున్నాయి

మతాన్ని తొడుక్కున్న ద్వేషం

పందికొక్కులా కొండల్ని తొలుచుకొని

గర్భకుహరాల్ని రక్తసముద్రాలు చేస్తోంది

భూగోళం అస్థిరత్వంతో బొంగరంలా తిరుగుతూ

ప్రశాంతతని వెతుక్కొంటూ

సముద్రాలలో మంటల్ని రేపుతోన్న యుద్ధోన్మాదం

తలకెక్కిన దేశాల పెనుభారంతో

నిప్పును మింగిన మందుపాతరలా

ప్రళయానికి ముందు భయంకర నిశ్శబ్దంలా

శవ సంస్కృతిని విరజిమ్ముతూనే ఉంది

ఉపరితల విస్ఫోటనాలతో

భగభగమండే సూర్యగోళంతో పోటీపడుతూ

ప్రపంచీకరణ విషజ్వాలల్తో రగులుతూ

శత్రువెవరో మిత్రుడెవరో తెలియని

డోలాయమాన విషమ పరిస్థితి

నిప్పులగుండం లాంటి జీవితాల్ని మోసుకుంటూ

పయనం ఎటో తెలియని బాటసారులై

కళ్ళల్లో ఆయుధాల్ని దాచుకొని

మరణాన్ని వరించి అఖాతంలోకి దూకుతూ

చిట్టచివరిగా

కనిపించని దైవం చేయూతకోసం

అంధకారంలో తడుముకొంటున్న యువత

చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకొని

అడుగులు వేయించిన కన్నతల్లి చూపిన దారిని

చేతులారా మూసేసుకొంటున్నారు

*   *   *

పిచ్చుకమీద బ్రహ్మాస్త్రాల్తో

ఆకాశ భూతల పోరాటాల్తో

దెబ్బతిన్న బెబ్బులిపంజా విసురుల్తో

వీరభద్రావతారమై

ప్రచండతాండవ పదఘట్టనలతో ప్రపంచాన్నే వణికిస్తూ

అష్టదిక్కులూ దద్దరిల్లేలా పెనుబాంబులు కురిపిస్తూ

చిచ్చర పిడుగుల విజృంభణలో

ఓడేదెవరో గెలిచేదెవరో!

కూలిన ఆశ్రమాల కింద పడి నలిగిన

కొస ప్రాణాలకు వేలాడుతోన్న ఉడిగిన ఆశలు

జీవసమాధులైన జనావాసాలు

రక్తచిత్తడి ఎడారి దారులు

గెలుపుకి చిహ్నాలే అనుకొంటే –

పరదాచాటున మెహందీపండిన అరచేతుల్లో

తనవారి జ్ఞాపకాల పంటల్ని దాచుకొంటూ

ప్రాణాలు చేదుకొంటూ

బతుకుకోసం పొలిమేరల్ని దాటుతోన్న

రక్తపు అడుగుజాడలు

గెలుపుకి చిహ్నాలే అనుకొంటే –

ఊళ్ళకి ఊళ్ళే పుడిసిటపట్టి మింగుతూ

అసహాయ వృద్ధాశ్రమాల మీదా

నిస్సహాయ రోగుల మీదా చూపుతోన్న ప్రతాపం

గెలుపుకి చిహ్నాలే అనుకొంటే –

సీసాలో బంధించిన పురాతన క్రిములకు

స్వేచ్ఛని ప్రకటిస్తూ

వాయువుని తోడుగా పంపి

భూ ఆవరణలోకి వదిలిపెట్టిన క్రూరత్వమూ

శరీరమంతటా ఆవరించుకొని

కొద్దికొద్దిగా ప్రాణాల్ని కొరుక్కుతినే రోగాల్ని చూసి

పగలబడి నవ్వే రాక్షసత్వమూ

గెలుపుకి చిహ్నమే అనుకొంటే –

విర్రవీగుతున్న రాక్షసుడా!

ఇకరా!

నీ విజయోత్సవాల్ని సమాధులపైనో

శవాల గుట్టలపైనో వీరోచితంగా జరుపుకో

ప్రవహిస్తున్న రక్తధారలలో చితిబూడిదని కలిపి

నీ విజయస్తంభాల్ని

మా గుండెల్ని తవ్వి ప్రతిష్టించుకో

నీకు జేజేలు కొట్టటానికో

నీకోసం కేరింతలు కొట్టటానికో

నీవాడు ఒకడన్నా మిగిలాడేమో

స్మశాన శిథిలాల్ని వెతుక్కో

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.