వ్యాధితో పోరాటం-2

కనకదుర్గ

కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో చెయ్యికి ఇవ్వమని అడిగింది. కొంచెం కండ వున్న చోటే ఇచ్చే ఇంజెక్షన్ ఇది అన్నారు. 

నొప్పితో మెలికలు తిరుగుతున్న నా దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని,” జస్ట్ గివ్ 5 మినిట్స్ ఇట్ విల్ వర్క్ డియర్.” అంది.

మందు డైరెక్ట్ గా తలలోకి వెళ్ళినట్టనిపిస్తుంది. దిమ్మెక్కుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెల్లిగా నొప్పి పై పని చేయడం, మత్తుగా అనిపించడం కళ్ళు మూతలు పడడం జరుగుతుంది. మామూలుగా అయితే నిద్రపోతాను. కానీ భర్త పిల్లలను తీసుకొచ్చే సమయం అవుతుంది. అందుకని పడుకోదల్చుకోలేదు. 

“హౌ డూ యూ ఫీల్ దుర్గా?” అంది మోరా, నర్స్. 

” ఐ ఫీల్ లిటిల్ బెటర్,” అని అంటుండగానే బేబీకార్ సీట్ లో పాపను పట్టుకుని శ్రీని, చైతు పరిగెత్తుకుంటూ వచ్చి,”అమ్మా!” అంటూ మంచం మీద కూర్చున్నాడు. వాడిని వదిలి పెట్టి వుండాలంటే చాలా బాధగా ఉంటుంది నాకు. పాప పుట్టేవరకు వాడితోనే గడపడం, వాడికి నా దగ్గర చనువెక్కువ. ఇద్దరికీ తొమ్మిదిన్నర ఏళ్ళు తేడా వుంది. ప్రతి నిమిషం వాడికోసం ఏదో ఒకటి చేయడం, వాడితో కలిసి చేయడంతో బాగా దగ్గరయ్యాడు. “అమ్మా! ఇంటికెపుడొస్తావు, నొప్పి తగ్గిందా?” అని అడిగాడు. “తగ్గుతుంది కన్నా!” 

 

మోరా వచ్చి ఐ.వి డిస్ కనెక్ట్ చేసింది. ” యు కెన్ హోల్డ్ యువర్ బేబి వితవుట్ పుషింగ్ దిస్ ఐ.వి పోల్.” 

శ్రీని నిద్రపోతున్న పసుపు పచ్చ ఫ్రాక్ లో ఫ్రెష్ గా వున్న పాపని కార్ సీట్ లో నుండి తీసి నా చేతుల్లో పెట్టాడు. జాన్సన్స్ బేబి పౌడర్ వాసనతో నిద్రలో మెల్లిగా కదుల్తున్న పాపని మెల్లిగా జాగ్రత్తగా ముద్దు పెట్టుకుంటుంటే, “అమ్మా, పాపకి మేము స్నానం పోసాము తెలుసా?” అన్నాడు చైతు నెమ్మదిగా, గట్టిగా మాట్లాడితే పాప లేస్తుందేమోనని. 

“హా…నేనొచ్చి పోస్తానన్నాను కదా!” అన్నాను కొంచెం నిరాశగా. అయ్యో! పాపకి మొట్టమొదటి సారిగా స్నానం నేనే పోయాలనుకున్నాను. 

“నేనూ అలాగే ఆగుదాం అనుకున్నాను. కానీ బొడ్డు త్రాడు వూడిపోయీ, బొడ్డు పూర్తిగా మానిపోయాక పోయాలన్నారు కదా! అది జరిగి కూడా వారం అవుతుంది, నువ్వు రెండ్రోజుల్లో వచ్చేస్తావనుకున్నాము కదా! వారం అయ్యింది ఇంకా నీకు నొప్పి కంట్రోల్ లోకి రావడం లేదు. పాపకి స్నానం కోసం నువ్వు నొప్పి తగ్గకుండా ఇంటికి వచ్చేయకూడదు కదా, అందుకని నేనూ, చైతు కల్సి పోసాము.”

“కానీ పాపకి నూనెతో మాలీష్ చేసి కాసేపుంచి పోస్తే బాగా నిద్ర పోతారు….”

“అమ్మా, నాన్న పాపకి మసాజ్ చేసాడు. కాసేపయ్యాక బేబి బాత్ టబ్ కిచెన్ సింక్ లో పెట్టి స్నానం పోసాము. నాన్న పాపకి సబ్బు రాస్తుంటే నేను తన తల పట్టుకున్నాను. కళ్ళలో నీళ్ళు పడకుండా కూడా నేను చెయ్యి అడ్డం పెట్టాను తెల్సా!” అని సంతోషంగా చెప్పాడు చైతు. 

పాపనే కళ్ళర్పకుండా చూస్తున్నాను నేను. మధ్య మధ్యలో చైతు ఆనందాన్ని కూడా చూస్తున్నాను. 

ఒక ప్రక్క సంతోషం, మరో ప్రక్క నేను చేయలేకపోయానే అనే బాధ. 

కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళడానికి రెడీ అయ్యారు. 

“వంట చేయాలా? చేసేసారా?” 

“పొద్దున్నే చేసేసాను. మధ్యాహ్నం జోన్ వచ్చి పాపని చూసుకునేపుడు నేను ఆఫీసుకి వెళ్ళాను. సాయంత్రం నేనొచ్చాక ఇక్కడికి రావాలి కదా అని కుక్కర్ లో అన్నం పెట్టేసాను. కూర, పప్పు వున్నాయి. వెళ్ళి తిని పడుకోవడమే,” అన్నాడు శ్రీని. 

పాప లేచి చుట్టూ చూస్తుంది. ఏడిస్తే పాలు పట్టింది, తనే డైపర్ చేంజ్ చేసింది. కాసేపు ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. 

ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే తనూ మంచం దిగి హాల్లోకి వెళ్తుంటే చైతు వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. 

“అమ్మా ఎపుడొస్తావమ్మా ఇంటికి?” 

“నొప్పి ముందుకంటే కొంచెం పర్వాలేదు. ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకోవటం లేదు. ఒక రోజు మొత్తం పెయిన్ ఇంజెక్షన్స్ తీసుకోకపోతే పంపించేస్తారు. రెండ్రోజుల్లో వస్తానేమో కన్నా!” 

“పాప బాగానే వుంటుందమ్మా! నువ్వు దాని గురించి వర్రీ కాకు!” అని ఎలివేటర్ లోకి వెళ్ళే ముందు గట్టిగా నన్ను చుట్టేసాడు చైతు. 

నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. 

చైతు చూడకుండా తల దించుకుంది. 

“బై అమ్మా. రాత్రికి గుడ్ నైట్ చెప్పడానికి ఫోన్ చేస్తాము,” అని అంటుండగా ఎలెవేటర్ తలుపు మూసుకుంది. 

తలుపు మూసుకునే దాక చేతులూపుతూనే వున్నాను. 

ఖాళీగా వున్న రూంలోకి రాగానే ఒంటరితనం చుట్టేసినట్టనిపించింది. 

బాత్రూంకెళ్ళి వచ్చి మంచం పై వాలి నర్స్ బటన్ నొక్కింది, ఐ.వి కనెక్ట్ చేసి వెళ్తుందని. 

కాసేపటికి మోరా వచ్చి ఐ.వి కనెక్ట్ చేస్తూ,”నీ పిల్లలిద్దరూ చాలా అందంగా, క్యూట్ గా వుంటారు. నువ్వు అందంగా వున్నావు కదా, మరి నీ పిల్లలు కూడా అలాగే వున్నారు. అంత చిన్న పాపకి ఎంత జుట్టుందో! నీది పెద్ద జుట్టు కదా! అందుకనే తనకీ బాగా వుంది జుట్టు.” అంది.

“కానీ బాబు పుట్టినపుడు వెంట్రుకలే లేవు తెలుసా. మొత్తం గుండులా వుండేది. మెల్లి మెల్లిగా వచ్చింది, వచ్చాక వొత్తుగా, కర్లీ హేయిర్ వచ్చింది. 

చిన్నపుడు వాడు బుగ్గల్లో సొట్టలు, పెద్ద పెద్ద కళ్ళు, కర్లీ హేయిర్ తో చాలా ముద్దుగా వుండేవాడు కదా! అందరూ వాడిని ఆడపిల్లనుకునేవారు తెల్సా మోరా?” అన్నాను. 

“రియల్లీ! ఇపుడు కూడా వాడి కళ్ళు నీ కళ్ళలాగే పెద్దగా, నీ సొట్టలే వాడికొచ్చాయి, చాలా ముద్దుగా ఉంటాడు. పెద్దయితే చాలా హ్యాండ్ సమ్ గా అవుతాడు చూడు నీ కొడుకు,” అంటూ నవ్వింది. 

“వెల్, ఫ్యామిలీ విజిట్ తో అల్సిపోయివుంటావు. కాసేపు రిలాక్స్ అవ్వు. పెయిన్ ఎక్కువగా వుంటే పిలువు వస్తాను.” అని దగ్గరగా వచ్చి బుగ్గలమీద ముద్దు పెట్టి వెళ్ళింది మోరా. ఇక్కడ కొంతమంది నర్స్ లు చాలా క్లోజ్ గా వుంటారు పేషంట్స్ తో. మోరాని పాప పుట్టక ముందు నుండి చూస్తుంది. చాలా ప్రేమగా, సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ వుంటుంది. 

 

వీళ్ళందరినీ ప్రెగ్నెంట్ అయినప్పటినుండి అంటే ఆరో నెలలో పాన్ క్రియాటైటిస్ అటాక్ వచ్చింది, అప్పట్నుండి చూస్తున్నాను. అప్పుడు ఎమర్జన్సీకి రావడం వాళ్ళు వెంటనే నొప్పికి ఇంజెక్షన్స్ ఇచ్చి, రక్త పరీక్ష చేయడం అది పాన్ క్రియాటైటిస్ అటాక్ మళ్ళీ వచ్చిందని చెప్పడం, హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా పెద్ద షాక్ అనే చెప్పాలి నాకు.  అపుడు వచ్చిన అటాక్ నుండి మేన్ లైన్ హాస్పిటల్స్ లో ఒకటైన ఈ హాస్పిటల్ లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకునేవారు. ఇది ఇంటికి దగ్గరగా వుంది. అప్పటినుండే వీరందరికీ నా గురించి తెల్సు. మాకు ఇక్కడ, ఈ దేశంలో కుటుంబసభ్యులెవరూ సాయం చేయడానికి లేరని, చాలా ప్రేమగా, స్నేహంగా, ఆప్యాయంగా చూసుకునేవారు.

*****

Please follow and like us:

4 thoughts on “వ్యాధితో పోరాటం- 2”

  1. Durga garu your article on vyadithoporatamis very expressive and descriptive everuthing can be easily visualized you r really great especially your fighting spirit hats off

    1. Thanks a lot for your encouraging comments andi. Please keep reading and leave comments, it helps me andi! Appreciate it very much!

  2. Durga garu chala baaga chaeptunarundi mee feelings ela undaevo,pillalaki duramga untae a pain ela untado naku taelusu,naenu pancreatitis patient nae kada,keep it up andi ,continues ga chadavalipistundi,konchaem content ekuva post chayundi👍😄

    1. Thanks Chandana garu! Meeku nacchinanduku thanks. Take care of your health andi, meeru Pancreatitis patient kadaa, inkaa baagaa ardham avutundi! Magazine vaallu decide chestaaru entha content pettaalani andi!

Leave a Reply

Your email address will not be published.