ఆమె లోకం

-గూండ్ల వెంకట నారాయణ

ఎండకు ఎండి
వానకు తడిసి
ఇంటికి రాగానే 
బయట ఎక్కడెక్కడో 
గాలి రెమ్మల్లా తిరిగిన కోళ్లన్నీ
ఆమె కాల్లచుట్టూ తిరుగుతూ
చీరకి ముక్కులు తుడుస్తూ
గోల పెడుతూ ఉంటాయి.
ఆమె ఒక్కో రోజు వాటిని కసురుకుంటుంది.
‘ నా సవుతుల్లారా చీర వదలండే ‘ అని.
ఒక్కో సారి ‘ నా బంగారు తల్లుల్లారా ‘ అని 
ముద్దు చేస్తుంది
ఆ కోళ్ళు ఆమెకి బిడ్డలు 
మసి నిండిన ఆవేసిన కుండలాంటి 
బూజు మొలిచిన రేకుల కొంపలో
ఆ మొక్కతే కోళ్ల కౌగిలింతల మధ్య
పగలంతా పొలం కూలీలో కరిగిన ఒంటిని 
నిద్ర పుచ్చుతుంది
దోసిటి తపేలలో పిరికెడు బియ్యం ఒండుకొని 
మరో పిరికెడు కోళ్లకి చల్లి 
వాటితో పాటు తింటుంది.
ఆదివారం నెత్తిన సగం ముసుగు కప్పుకొని, 
చిరిగిన పేలికల కాయితాలని కూడా జాగర్తగా దాచిన ముసలి బైబిలు పట్టుకొని 
కొత్త చర్చీకి పోతుంది
ఆ మాట్లాడే దేవుడు కరుణించాలని 
ఏ కోరికా లేని మోడు చెట్టు తను, 
ఆ కాస్త తోడున్న కోళ్ళు తప్పా…
ఏమని వేడుకుంటుంది దేవుణ్ణి… 
 
ఇన్నాళ్లు రాలిపోయిన జీవితంలో గాయం గుర్తు మాని మునుపటిలా మారుతుందా…
ఎన్ని చిగుర్లు వేసినా చెట్టెప్పుడూ జారవిడుచుకున్న ఆకుల్ని పొందలేదు.
 
ఆమె జుట్టు నడి వయసు నిండక మునుపే గోడకి కొట్టిన సున్నం కుంచెలా ఉంది
ఇప్పుడామెకి తన చక్కదనం గురించి ధ్యాసే లేదు.
ఎండుకర్ర దండెం మీద వేలాడేసిన 
చిరుగుపట్టిన చీరా జాకెట్లలో 
ఆమె ఒళ్ళు ముడుచుకుంటుంది.
ఆమెకి తన రెండు చీరలంటే ఎందుకో బో బెమ.
కొంగు చివర ఆకొక్క ముడి కట్టుకొని 
బొడ్లో దోపుకుంటుంది.
అప్పుడప్పుడూ కాస్త నాలిక పైన 
మాడిజాం పూట సూర్యుణ్ణి వెలిగించటానికి
బొడ్లో ఆకొక్క నోట్లో వేసుకుని నముల్తొంది.
ఎందుకో తన బతుకులో 
అదో యసనం అయ్యింది.
అరి చేతుల మజ్జెలో గీతల్ని దిద్దుకున్న కలుపులిక్కి ఆమె కూటి కుండ.
ఆమెకి పండగ రోజు, మామూలు రోజు 
అంటూ ఏ తేడా లేదు.
తనకి కొన్ని రోజులు ఆకులు 
విచ్చుకున్నట్టు పచ్చగా ఉంటాయని, 
కొన్ని రోజులు ఎండ పులుముకున్నట్టు 
ఎర్రగా ఉంటాయని తెలీదు.
ఏ రోజైనా ఆమెకి ఒకటే.
ప్రతిరోజూ ఉన్నది పగలు పనిచేయను, 
రాత్తిరి కుక్కిమంచంలో ఒళ్ళు మరచి నిదరపోను.
అన్ని రోజులూ ఒకటే అయిన ఆమెకి,
నల్లని సీతాకోక చిలుకలాంటి ఒకే ఒక్క రోజు వస్తుందని మాత్రం తెలుసు.
అప్పుడు తన బిడ్డలాంటి కోళ్ళు, కూడు లాంటి లిక్కి, కుక్కి మంచం, చీకటి కొంప, కొంపలో బూజు, ముసలి బైబిలు, కొత్త చర్చీ, ఎండుకర్ర దండెం, దాని మీద రోజు మార్చి రోజు ఏలాడే
రెండుకోకలూ, కొంగు చివరి ఎర్రగా పండే ఆకొక్క 
ఏమై పోతయా అనే ఆమె దిగులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.