కలలు

– డా॥కొండపల్లి నీహారిణి

వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు
ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు

విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు
రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు పాత్రలో నింపినప్పుడు
అభివృద్ధి ఒత్తిడీ
విడదీయరాని బాంధవ్యాల సుగంధాలు మోసుకొస్తూ
చెమట చుక్కల లెక్కలు ఎందుకు అన్నప్పుడు
సాయం సమయపు యానం ఏమీ ఆనంద విమానం ఎక్కనప్పుడు
నిమిషాలు గంటలుగా విరాజిల్లే నాలుగు చక్రాల బండిది నల్లేరు నడక కాదనే ఒకానొక దశలో
అలసిన కాయం తెలిసిన మనసు సాయమడిగి సమ భావాన్ని సంధించాలంటే
నిదురను సాదరంగా స్వాగతించాలంటే
గుండె గట్టు పై నిలబడి గుట్టు విప్పిన సమాచారం ఏదో ఒకటి
ఒనగూర్చుకొనే ప్రయత్నంలో పడాలి

ఆడేమీ మగేమీ
ఈ వ్యక్తిత్వ వికాసపు లోకం పోకడలో పూడ్చుకోలేని కష్ట సమయాలు
పోల్చుకోలేని న్యూనతలు తేల్చుకోలేని ఆర్థిక సమానత్వాలు
అసమాన సమాజం
ఆలుమగల తేడాల బరువు బాధ్యతలు
అదేపనిగా అందుకోలేని
అందలాలేవీ ఎక్కించవు
నిదురపై నింద వేసి
రాని స్వప్నాల కోసం
రంగులో రంగు కలిసి నట్టు రంగరించిన కుటుంబంలో
అమ్మలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు
లెక్కలేని తనంతో ఎక్కలేని శ్రేణులన్నీ ఎక్కినా
సమానతల రీతులు కూలినా
అతివలందరూ ఎందుకో ఎదురు చూస్తుంటారు

చదవాల్సిన కావ్యంలో
అర్థాలెరుగని పదబంధాలలా ఉన్నా
పాదాలు రెండూ నాలుగై సమాంతర రేఖల్లా గమ్యాన్ని చేరుస్తుంటవి
కలలు కల్లలుగావు విరబూసిన కంటి కమలాల రేకులు
కలలు పెద్దగా కనాల్సిన కలలు.

****

Please follow and like us:

5 thoughts on “కలలు (కవిత)”

  1. డా . కొండపల్లి నీహారిణి గారి ‘ కలలు ‘ కవిత వాస్తవాన్ని ప్రతిబింబించెది గా వుంది
    సమాజంలో అడుగడుగునా కాన వస్తున్న అసమానతల గురించిన ఆవేదన వ్యక్తం అయింది కవితలో .
    అన్నీ కలలేనా , వాస్తవ రూపం దాల్చవా అనే ఎదురుచుపు ప్రతి మనిషి లోనూ వుంది .
    రచయిత్రి కి అభినందనలు .

  2. కలలు కనండి సాకారం చేసుకోండి అని చెప్పిన అబ్దుల్ కలామ్ గారి మాటలు గుర్తొచ్చాయి.కలలు కవిత మధురం గా ఉంది.

Leave a Reply

Your email address will not be published.