సరికొత్తగా …..

-రామ్ పెరుమాండ్ల

అనగనగా ఓ ఉదయం
కనులకు చూపులను అద్దుకొని
పాదాలకు  అడుగులను తొడుక్కొని
నిన్నటిదాకా చెల్లా చెదురుగా
పడి ఉన్న హృదయం
రాత్రి వచ్చిన పీడకలను చెరిపేస్తూ
స్వేచ్ఛగా ,విశాలంగా మార్పుకు సిద్ధమైంది .

కాలం మనస్సుకు అంటుకున్న
గతకాలపు మాసిన చేదు జ్ఞాపకాలను
ఊరవతలి కాలువ బండ కాడ ఉతికేసి
శుభ్రంగా గాలికి ఆరవేసి
ఓ చెట్టుకింద సేద తీరుతున్నది.

అలా ఆకాశాన్ని గుండెల్లోకి ఒంపుకొని చూడగా
అటు ఇటు కదలాడే పక్షుల వలే
ఎన్ని స్మృతులో …
మరెన్నీ  విషాదాలో
ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత .

ఇపుడు కదలని సందిగ్ధంలో
జీవిత తాత్వికత బోధించే దృశ్యం
నుదురుపై వాలే సీతాకోక చిలుక వలె
పిడుగుపాటుకు ఎండిన మ్రాను
చిట్ట చివరన కొండంత ఆశతో
చిగురించిన ఓ పసిచిగురు వలె
కొత్తగా సరికొత్తగా జీవించడమే కదూ ..
జీవితం కూడా ఓ నల్లబల్ల
కొత్తగా రాయాలంటే పాతది చెరిపేయాల్సిందే .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.