గృహవాసం
– డా॥కొండపల్లి నీహారిణి
అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ
గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు.
వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది!
కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ,
గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో
నమస్కారం!!
నాలో నేను రంగులేసుకున్న బొమ్మనై, నవ్వుల్ని విచ్చుకుంటుంటే,
మరో ఆశ్చర్యం ముందటర్ర వరకూ తీసుకుపోయింది.
వాళ్ళమ్మకు అందిచ్చినట్టే మా అమ్మకూ ఆయన
చాయగిలాసనిస్తుంటే,
ఇనుమడించిన గౌరవాలకు హృదయ ఛాయ ఒకటేదో చెప్పని
సాక్ష్యమయ్యింది
నేను కాకుండా, నాతోపాటు తిరిగే ఫ్యానూ, మోగకుండా
పక్కన పడి వున్న సెల్లు ఫోనూ, మనసుగిల్లి కనుపాప చిత్రంతో
దోస్తీ చేస్తున్నవి!
నాలో ఏదో చిదాకాశం విశాలమైందో, ముగ్ధమనోహర
నేల పరిమళభరితమైందోగాని,
పిల్లల అవసరాలు చూసి, పుస్తకాలు సదిరి,
మాసినవి ఉతకడానికని వేస్తున్న ఆ దృశ్యం మూసగాగాక,
అపురూపమే అయింది!
సునామీలొచ్చిన పాత సంద్రాన్ని చెరిపి,
ఆ పాత మధుర గానాన్నిచ్చింది!!
సుతారంగ తిరస్కరించలేని ప్రియ వాతావరణమైంది!!!
అనుభవమనేది చెప్పకుండా రాలిన వడగళ్ళ వానగాదు గాని,
దండెంమీది ఎండిన బట్టలన్నీ ఆయనే తెస్తుంటే,
గుండె తడితో కలిపి సంశయం నిస్సంశయమయ్యింది
నేనూ, మధ్య గదీ, బల్లెపీట, పూల చెద్దరూ చూస్తుండగానే,
మా ఆయననే బట్టలన్నీ మడతవేసే వైనం
నన్ను మరో లోక విహారం చేయించింది!
బహు హుందాగా తిరిగే చేపపిల్లలా ఊపునేదో తెప్పిస్తున్నది!!
అల్మారీలల్ల బూజును దులుపుతుంటే,
చంటోడి ముక్కును ఆయనే తుడుస్తుంటే,
పారేసుకున్న అనుభూతుల్ని మళ్ళీ తెచ్చుకున్న!!
క్యాకరేంగే కరోనా నువ్వేం చేయగలవు?
కొండంత అండగా వెన్నంటి ఉన్నాడు నా భర్త!
అత్తమామలతో సహా ఆనందంగా నేనున్నానంటే నువ్వు
పారిపోవూ?
పాత కోపతాపాలను కడిగేసుకున్న మేమిద్దరమూ
ఇప్పుడు, శుభ్రపరిచిన పాత్రల్లా తళతళ మెరుస్తున్నం.
“ఇంటిలోన అందం ఇంతింత కాదయా
ఇంతిదే కాక ఇతనిదీ అవునయా”
అని కొత్త పద్యం చదవాలి అందరు !!
గృహవాసం ఇక గొప్ప సహవాసం !!
*****