చిత్రం-38

-గణేశ్వరరావు 

 
          కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.
ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో ఒక సూత్రానికి లొంగవు, ఒక పరిధిలో ఇమడవు. దేని ప్రత్యేకత దానిదే! అందుకే ఆర్చ్ బాల్డ్ మక్లీష్ ‘A poem should not mean. But be.’ అంటారు. ఏ కళకైనా దానికంటూ వేరే జీవితం ఉంటుంది.
 
          ఈ సోదికి కారణం ఈ మధ్య నేను చూస్తున్న రకరకాల పెయింటింగ్ లు. మిత్రులు బ్రహ్మానందం గారు ఒక సందర్భంలో ఉదహరించిన కామూ వ్యాఖ్య: ‘నాకు నచ్చింది నువ్వు గీసిన బొమ్మ కాదు, దాన్ని నువ్వు గీసిన పద్ధతి” గుర్తొచ్చింది. ఒక చిత్రం మనకు నచ్చడానికి కారణం కేవలం చిత్రకారుడు ఎన్నుకున్న వస్తువు, రంగులు, కుంచె, పరికరాలు లాంటివే కానక్కరలేదు.
 
          కళకు హద్దులు లేవు. కళాకారుని సృజనాత్మక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. ఇటీవల నేను చూస్తున్న రంగుల చిత్రాలలో ఎంతో వైవిధ్యం ఉంది. చిత్రకారులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వారిలో ‘ఎరికా హార్ట్’ ఎన్నుకున్న పద్ధతి నన్ను ఆకర్షించింది.
 
          ఆమె కొంత కాలం వేరే వృత్తులను చేపట్టినప్పటికీ ప్రాధమికంగా శిక్షణ పొందిన చిత్రకారిణి ఆమె. సర్రియలిస్ట్ ల ప్రభావం ఆమె మీద ఉంది. అనేక జాతీయ పురస్కారాలు అందుకున్న ఆమె తన చిత్రాలలో అనుసరిస్తున్న పద్ధతి స్థూలంగా ఇలా ఉంటుంది. ఆమె చిత్రాలలో మధ్య మధ్య ఫొటోలో కాగితం మీద అచ్చైన బొమ్మలో అంటిస్తుంది. తాను ముందుగా ఎంపిక చేసిన వస్తువులను, వ్యక్తీకరణకు వాడే సాధనలను తన చిత్రంలో అమరుస్తుంది. కుంచెతో రంగులు వేసి వాటిని కలుపుతూ తాను ఆశించిన కంపొజిషన్ కుదిరేదాకా ప్రయత్నిస్తుంది. సాహిత్యంలోంచి తన చుట్టూ వున్న సమాజంలోంచి తన చిత్రాలకి కావలసిన ముడి సరుకు గ్రహిస్తుంది. అవి ఏవైనా కావచ్చు: వాస్తవం/భ్రమ, జననం/మరణం, మనసులోతుల్లోకి ప్రయాణం! ఒక్కొక్క సారి ప్రతీకాత్మకంగా చిత్రిస్తుంది. తరచూ చేతులనీ, కళ్ళనీ చిత్రాలలో చిత్రించి తన భావ వ్యక్తీకరణకు వాడుతుంది.ఆమె వేసిన అనేక చిత్రాలు సందిగ్థతతో నిండి ఉంటాయి. కొన్నిటిలో ఆధ్యాత్మిక, తాత్విక భావాలు దాగి ఉంటాయి. తమలోని అంతరార్థాన్ని కనుక్కోమని అవి మనల్ని ఆహ్వానిస్తుంటాయి.
 
          ఇక్కడున్న చిత్రాన్ని చూడండి. అతికించిన చేతి ఫోటో ఒక వైపు, బూడిద రంగులో గీసిన అస్థిపంజరం చేయి మరో వైపు. మధ్యలో ఎండిపోయిన కొమ్మలతో నల్ల రంగులో ఉన్న చెట్టు , మధ్యలో లేత నీలం, నారింజ, ఆకుపచ్చ రంగుల మేళవింపు.. కోల్లెజ్’ లో వ్యక్తీకరణకు వాడే వస్తువులన్నీ కలిసిపోయి చిత్రానికి ఒక కొత్త రూపం, చైతన్యాన్ని ఇచ్చ్చాయి. ఆధునికత సంప్రదాయకతతో కలిసి పోయింది.
 
          మైకేల్ ఏంజెలో దేవుడు తన చేతిని మానవుడికి అందించడాన్ని సృష్టికి సంకేతంగా చిత్రాన్ని గీశాడు. అన్ని సంస్కృతులు, మతాలలో చెట్టు ని విశిష్టమైన అర్థాలలో వాడతారు. బోధివృక్షానికున్న పవిత్రత గురించి వేరే చెప్పాలా? కాగా చావు పుట్టుకలని చేతులు రెండూ సూచిస్తాయి. అలా ఈ చిత్రం లోని మార్మికతను పలు రకాలుగా విశ్లేషించవచ్చు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.