ఒక్కొక్క పువ్వేసి-17

బుద్దుడిని ప్రభావితం చేసిన తత్వవేత్త-సుజాత

-జూపాక సుభద్ర

          ఈ మధ్య భరత దేశం నలుమూలల్నే కాక ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేసి విస్తరించిన బౌద్ధ యాత్రకు పోయినం. మా చుట్టు పక్కల వూర్ల పేర్లు, మనుషుల పేర్లు, దమ్మక్కపేట, దమ్మన్నగూడెమ్, దమ్మక్కకథలు, దమ్మక్క, దమ్మయ్య అనే పేర్లు వున్నా.,. బౌద్ధం గురించిన అవగాహన చాలా తక్కువ. (నా మొదటి కవిత్వ సంపుటి పేరు కూడా అయ్యయ్యో దమ్మక్క)

          క్లాసు పుస్తకాల్లో బుద్దుడి పుట్టుక, యింటి నుంచి వెళ్లి పోవడం, సత్యశోధన చేయడం, దుక్కాలన్నింటికి మూలమ్ తృష్ణ అనీ, మనుషుల మధ్య తక్కువ ఎక్కువల్లేకుండ సమానత్వం వుండాలనే బుద్దుని బోధనలకు సంబంధించి చదువుకున్న. యింత వరకే నాకు తెల్సిన బౌద్ధం అప్పుడు.

          మా వాడలో దేవర అంటే.,.ఎల్లమ్మ, పోషమ్మలు,మైసమ్మలు ఉప్పలమ్మలు. యింట్ల ఎవరికైనా బాగా లేకుంటే కొబ్బరికాయ కొడ్తననీ, కోడి పిల్లంగోస్తమని మొక్కు కునేది మా యింట్ల, మావాడల. యింకా దుర్గమ్మ కొలుపులు బైండ్లయినతోని కొలి పిస్తుంటారు. ఎల్లమ్మ కతను సిందోల్లతో వారం రోజులు చెప్పిస్తుంటారు. మద్దె మద్దెల ఆ జాతర్లకు, ఈ జాతర్లకు పోయినా, రెండేండ్ల కోసారి వచ్చే సమ్మక్క- సారక్క జాతరకు ఎన్ని అడ్డంకులున్నా… పల్లెలన్ని కదిలిపోతుంటయి. వీళ్లంతా ‘అమ్మ’ దేవతలే. వాల్లకు రూపురేఖలుండవు. గుళ్లు గోపురాలుండయి. ఒక చెట్టు, ఒక చెరువు కట్ట, ఒక పొలిమేర రాయి ఎల్లమ్మ, మైసమ్మ , పోషమ్మలుగా వుంటాయి. సమ్మక్క- సారక్కలకు కూడా గద్దెలే వుంటయి. (యిప్పుడిప్పుడు పోటోలు వస్తున్నయి) యిట్లాంటి అమ్మ తుల్లులు ఆధ్యాత్మికతో అల్లుకున్న పర్యావరణ అస్తిత్వం నాది.

          ఇంకో వైపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు జరిగినయి. రైతు కూలి పోరాటాలు, వెట్టి వ్యతిరేక పోరాటాలు, తునికాకు పోరాటాలు జరుగుతుండేవి. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాల మీద మాట్లాడితే జనం దూరమైతారనో ఏమో ఉద్యమ పార్టీలు తాత్విక అంశాల మీద దృష్టి సారించలేదు.

          ఒకవైపు ప్రకృతి అమ్మ తల్లుల ఆధ్యాత్మికత, యింకోవైపు ఉద్యమాల ఉధృతిలో మార్క్సిజం నుంచి వచ్చిన నేను, ఎదిగే క్రమంలో కులం, మతం, మూఢ విశ్వాసాల వ్యతిరేకత, సామాజిక సమానత్వ చైతన్యాల వైపు, తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాలతో ప్రభావితమైన సామాజిక జీవనం నాది.

          సంచారులకు జ్ఞాన నేత్రం అరికాళ్ళల్లో వుంటదంటారు. నాకు సంచారులన్నా, సంచార జీవితమన్నా గౌరవం. సంచారిగా తిరిగి భిన్న సమాజాలను కలవడము, వారి భాష, నాగరికతలు తెల్సుకోవడం, ఆ నాగరికతలు, సంస్కృతిలో వున్న చరిత్రలను తెల్సుకోవడము నాకు చాలా ఆసక్తి. అది ఉద్యమంలో విద్యార్థినిగా వున్నప్పుడు కొంత సాధ్యమైనా ఉద్యోగ జీవితంలో సాధ్యం కాలే. కరోనా, ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత వెసులుబాటు దొరికి ఛలో బౌద్ధ ధార్మిక యాత్ర అని వెళ్లడం జరిగింది. యాత్ర మొత్తం, నాగ్ పూర్, సారనాధ్, సాంచి, లక్నో, బుద్ధగయ, నలంద విశ్వవిద్యాలయం, వైశాలి, కుశీనగర్ (బుద్ధుడి నిర్యాణం పొందిన నగరం) కపిలవస్తు, లుంబిని (నేపాల్) వంటి కొన్ని అద్భుతమైన చారిత్రక ప్రదేశాల మీదుగా సాగింది. ఆ బౌద్ధక్షేత్రాలు గమనించినంక ‘భారత ఔన్నత్యాలంటే వేదాలు, పురాణాలు కావనీ, అవి కల్పిత రచనా ప్రచండాలే కానీ, ఎక్కడా వాటి చారిత్రిక ఆనవాల్ల వునికి చూడబోము. కానీ హెచ్చు తగ్గులు లేని, ఒక మనిషి యింకో మనిషిని హింస పెట్టని శాంతి సమాజం కోసం పుట్టిన బౌద్ధం, భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా పరివ్యాప్తి చెందినట్లు కట్టడాలు, నిర్మాణాలు, స్తూపాలు, స్తంభాలు, చైత్యాలు, శాసనాలు ప్రత్యక్ష చరితలు. ఇంకా యితర దేశాల బౌద్దుల, యాత్రికుల నివేదికలు, వారి యాత్రా చరిత్రలు, బౌధ్ధ ఔన్నత్యమ్ ను కొనియాడిన చరిత్రలున్నాయి. వేదాలు, ఇతిహాస పురాణాలు చరిత్రలు కాకున్నా వాటికి చరిత్ర గౌరవాన్ని అంటగట్టే రాజకీయ ప్రచారం ఈ మధ్య ఎక్కువైంది.

          మగధ సామ్రాజ్యాధిపతులుగా విలసిల్లిన మౌర్య వంశస్తులు ముర అనే దాసీమాత సంతతి. ఆ సంతతి వాడే అశోక చక్రవర్తి. మౌర్యులంతా బౌద్ధానికి పెద్ద పీట వేసిన మహారాజులే. యిక అశోకుడు యుద్ధాలను ఆపేసి, బౌద్ధాన్ని స్వీకరించి (క్రి.పూ 2వ శతాబ్దంలో) తన కాలంలో ఎనభై నాలుగు వేల బౌద్ధ స్మారక కట్టడాలను (84000) నిర్మించాడనడానికి ఈ కట్టడాలే పెద్ద సాక్ష్యం. యీ నిర్మాణాల్లో బౌద్ధ మహిళల పేర్లతో కూడా పెద్ద ఎత్తున కట్టడాలు, స్తూపాల్నినిర్మించాడని ‘సుజాతగఢ్, సుజాత ఖేరీ చూసినప్పుడు అర్ధమైంది.

          బీహార్ లోని బుద్ధగయ(జిల్లాకు పక్కనే ఫల్గుణ నదీ ప్రవాహము దాటి నంక, బక్రార్ అనే గ్రామంలో సుజాతగడ్ వుంది. బక్రార్ గ్రామానికి వెళ్తుంటే రోడ్లు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, సంక్షేమ భవనాలు, దుకాణాలు, పాఠశాలలు, కాలేజీలు, హోటల్లు అన్నీ సుజాత పేర్ల తోనే యూనాయి. ఆ ఏరియా అంతా సుజాత మయంగా కనబడడం అపురూపమనిపించింది.

          ఎప్పుడో రెండువేల ఆరు వందల సంవత్సరాలకు పూర్వమ్ ‘సుజాత’ అనే ఒక మహిళ ఎంత ప్రభావశీలి అయి వుండెనో… ఆమె పేరు ఇక్కడి నేలంతా పచ్చగా అలకబడింది. చాలా మంది బౌద్ధ మహిళల పేర్లు వినిపించినా ఎవరి విశిష్టత వారిదే. వీరిలో ప్రఖ్యాతమైన పేరు సుజాతది. ఎందుకంటే… సుజాత బుద్ధునికి వాస్తవికమైన శాస్త్రీయ తాత్వికతను బోధించిన ఘనశాలి. ప్రపంచాన్ని హింసలేని, దుక్కంలేని మార్గం వైపు మళ్లించిన బుద్దునికి వాస్తవ తత్వాన్ని బోధించిన ప్రభావశీలి సుజాత. సుజాత బక్రార్ గ్రామ యాదవ రైతు కుమార్తె, బుద్దుడు సత్యశోధనకై ఉపాసిస్తున్నపుడు శరీరం శుష్కించిపోతున్న సందర్భంలో – బుద్ధునికి ఏ ధర్మ సాధనకైనా శరీరం, ప్రాణం ముఖ్యం. ప్రాణము,శరీరము లేనపుడు భౌతికంగా ఎవ్వరూ ఏమీ సాధించలేరు. శరీర ధర్మాలను కూడా వినాలి. దేనికీ అతి పనికిరాదు. శరీరాన్ని , మనసును క్షోభ పెట్టడం నిరర్థకం. నువ్వు జ్ఞాన సాధన, ధర్మసాధన చేయాలంటే, ప్రాణం శరీరం వుండాలి. ప్రాణం, శరీరం నిలవాలంటే తినాలి. యిట్లా శుష్కించి పోతే.. జ్ఞాన సాధనచేయడానికి నీ ప్రాణాలు మిగులవు. ఏదీ తెగేదాకా బిగించవద్దు. అతి పనికి రాదు. తంబూర నాదం వినాలంటే తీగ బలంగా లాగి కడితే తెగి పోతుంది, వదులుగా కడితే నాదం రాదు. మధ్యే మార్గంగా తీగను లాఘవంగా కడితే రాగాలు పలుకుతది! అని చెప్పిన సుజాత తాత్విక సత్యాన్ని గ్రహించి ఆమె పెట్టిన పాయసాన్ని తిని, తన సత్య శోధన కొనసాగించాడు అని అక్కడి గైడ్స్, లోకల్ వాల్లు చెప్పిన చరిత్ర.

          సుజాత గఢ్ లో వున్న స్తూపమ్ యిక్కడి స్తంబాల్లాంటివి కాదు. చాలా విస్తారమైన స్థలంలో యిటుకలతో అల్లబడిన విశాలమైన డోమ్ ఆకారంలో యిప్పుడున్న రూపమ్. బుద్ధుడు, అతని ముఖ్య శిష్యులకు, యితర ముఖ్య ఉపాసకులకు ఎంత విశాలంగా ఉన్నతంగా స్తూపాలున్నాయో సుజాత గౌరవార్థంగా అశోకుడు నిర్మించిన స్తూపం అదే రీతిలో వుండడం ఎంత గొప్ప విషయం.

          2600 (క్రీ. పూ) కిందనే, యింత జెండర్ సమానత్వాలు, ప్రజాస్వామ్యాలు కనబర్చిన బౌద్ధం, బౌద్ధ చక్రవర్తి అశోకుడు ఆకాశమంత ఉన్నతమైతే, ప్రభావ పరిచిన సుజాత తాత్వికత కూడా ఉన్నతమే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.