నా జీవన యానంలో- రెండవభాగం- 27

-కె.వరలక్ష్మి

          1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక తప్పలేదు. జనవరి 7 నుంచి 10 వ తేదీ వరకూ గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ కార్యక్రమాలకు సీనియర్స్ తో బాటు యువరచయితలు, కవులు, కళాకారులు చాలా మంది అటెండయ్యారు. ఆ సంవత్సరం కొత్తగా ఆ కార్యక్రమాల్లో స్త్రీవాద సదస్సు కూడా జరిగింది. 10వ తేదీన రావు బాలసరస్వతీ దేవి గారికి లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ ఇచ్చి సత్కరించారు. అద్భుతమైన నాటికల ప్రదర్శనలు మూడురోజులపాటు జరిగాయి. 8వ తేదీ ఉదయం మారుతీ నగర్లో సినీనటులు ధూళిపాళ కట్టించి ప్రధాన అర్చకులుగా ఉన్న హనుమాన్ గుడికి తీసుకెళ్లేరు. పూర్ణకుంభంతో ఆహ్వానం, అర్చనలు గోత్ర నామాల్తో చేసారు. ఆ నాలుగు రోజుల్లోనూ ఏడాదికి సరిపడేంత కొత్త ఉత్సాహం నింపుకొని ఇంటికి చేరేను.

          ఆ సంవత్సరంలో మరొక మరపురాని ప్రయాణం ‘అస్మిత’ ఏర్పాటు చేసిన మద్రాసు
ప్రయాణం- 

          ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తారీఖుల్లో సమావేశాలు జరుగుతాయని లెటర్స్ వచ్చాయి. హైదరాబాద్  నుంచి మా గీతతో సహా ‘అస్మిత’ లో ఉన్న రచయిత్రులంతా ఓల్గాతో బాటు
సికిందరాబాద్- మద్రాస్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లో వచ్చారు. ఇటు నుంచి నేను 27  సాయంకాలం పి.సత్యవతి గారి ఇంటికి వెళ్లి పాటిబండ్ల రజని, ఘంటసాల నిర్మలతో బాటు నలుగురం గుంటూర్లో ఆ ట్రెయిన్ అందుకున్నాం. నెల్లూరులో చంద్రలత, వసంతలక్ష్మి ఎక్కేరు.

          28 ఉదయం 7 గంటలకి మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో దిగేం. రెండు వేనుల్లో మొత్తం 23 మందిమి మహాబలిపురం రోడ్డులో ఉన్న ‘గ్రీన్ యాన్ యార్డ్ ‘ అనే బ్యూటిఫుల్ రిసార్ట్ కి చేరుకున్నాం.  సౌకర్యవంతంగా ఉన్న అందమైన రూమ్స్ లో ఇద్దరిద్దరు చొప్పున సర్దుకున్నాం, మా గీతా నేనూ రూమ్ నెంబర్ 2 లో ఉన్నాం. అక్కడే ఉన్న హాల్లో మధ్యాహ్నం రెండు వరకూ స్త్రీవాద సాహిత్యం మీద గ్లోబలైజేషన్, ఆర్మీ వాదాల ప్రభావం గురించి చర్చ జరిగింది.

          సాయంకాలం పూనమిల్లైరోడ్ లో ఉన్న కింగ్స్ పార్క్ హోటల్లో అస్మిత తరపున కళాసాగర్  ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నాం. భానుమతిగారు ముఖ్యఅతిథిగా ఎంతో చక్కగా మాట్లాడేరు. మాట్లాడడం పూర్తయ్యాక వచ్చి నా పక్కన కూర్చుని చాలా ఆత్మీయంగా మాట్లాడేరు. మాలతీచందూర్,  చందూర్, కళ్యాణ సుందరీ జగన్నాథ్ వంటి మద్రాస్‌లో ఉన్న ప్రసిద్ధ రచయితలెందరో వచ్చారు.  వాళ్లందర్నీ చూడడం, వినడం గొప్ప ఆనందాన్ని కలిగించింది.

మార్చి 1 ఉదయాన్నే లేచి నేను రిసార్ట్ గార్డెన్లో ఉన్న ఓ తిన్నె మీద కూర్చుని డైరీ రాసుకుంటూంటే అటుగా వచ్చిన అబ్బూరి ఛాయాదేవి గారు `అచ్చంగా బాపూ బొమ్మలా భలే ఉన్నారు మీరు’ అన్నారు. అస్మిత స్థాపకులు వసంతా కన్నా భిరన్ కూడా ఎంతో ఆప్యాయంగా చూసారు. ఆరోజు ఉదయం నుంచి మంచి డిస్కషన్స్ జరిగాయి. ఎవరి కథల నేపథ్యాలు వాళ్లు చెప్పారు. ఎవరి జీవితాల లోతుల్లోకి వాళ్లు వెళ్లి జ్ఞాపకాల్ని అందరితో పంచుకున్నారు. ఆ సాయంకాలం గ్రీన్ యాన్ ఎదుటే ఉన్న MGM బీచ్ లో కెరటాల్తో ఆడుతూ, ఇసుక లో నడుస్తూ పొద్దుపోయే వరకూ గడిపాం. ఆ రాత్రి అందరం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసాం.

          మార్చి 2న ఉదయం 8.30కే సభ ప్రారంభమైంది. స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల మీద చర్చలు జరిగాయి. లంచ్ తర్వాత వేన్ లో స్టేషనుకి చేరుకున్నాం. అప్పటికింకా కేసెట్లు కాలం కావడం వల్ల చాలా మంది వారికిష్టమైన గాయకుల కేసెట్లు కొనుక్కున్నారు. నేను మాత్రం 100 రూపాయల్తో ఓ బుల్లి వాక్‌మెన్, ఉన్నిక్రిష్ణన్ క్లాసికల్ మ్యూజిక్ కేసెట్లు కొనుక్కున్నాను. 6.10కి చార్మినార్ ఎక్స్ ప్రెస్ కదిలింది.

          అంతా సరదాగా అంత్యాక్షరి పాడుతూ సందడి చేసారు. 2AM కి నేనూ, సత్యవతి గారూ విజయవాడలో దిగేం. వెంటనే ఎనౌన్స్ చేసిన గౌతమీ ఎక్కేను. ద్వారపూడి వచ్చేసరికి మెలకువ వచ్చేసింది. అప్పడే విచ్చుకుంటూన్న వెలుగురేఖల్లో ఊడ్చిన పొలాల పైన పొగమంచు, తెల్లని పూల తోరణాల్లాంటి కొంగల బారులు మనసును పులకరింప జేసాయి. 7.30 AM కి 3వతేదీన ఇంట్లో ఉన్నాను. ఆ పులకింతనీ, అందర్నీ కలిపిన సమావేశాల ఆనందాన్నీ తక్షణమే పంచుకోవాలన్పించి మోహన్ కి చెప్పబోతే మూలనున్న చేపాటి కర్ర తీసి నామీదికి విసిరేసి ‘వదిలేసినోడి పెళ్లాం లాగా గాలికి బాగానే తిరుగుతున్నావ్. నువ్వు చెడింది కాక నా కూతుర్ని చెడగొట్టేవ్ కదే ‘. అని బండతిట్లు కసితీరా తిట్టేసి స్కూలుకెళ్లిపోయాడు. ఒక్కసారిగా దుఃఖంతో మనసు వికలమైపోయింది. మళ్లీ నరకంలోకి వచ్చి పడ్డ భావనతో ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను.

          1999 ఏప్రెల్ ఫస్టున ఉదయం 6గం॥కు మధురాంతకం రాజారాంగారు స్వర్గస్తులైన
వార్త టీవీలో వచ్చింది. జనవరిలో జరిగిన గుంటూరు అజో-విభో సభల్లో ఆయన కుటుంబం, నేనూ పక్కపక్క గదుల్లోనే ఉన్నాం. రోజూ ఆడిటోరియంకి ఒకే కారులో వెళ్లే వాళ్ళం. సభలు ముగిసేక వీడ్కోలు చెబ్తూ ‘వచ్చేసంవత్సరం నెల్లూర్లో కలుద్దామమ్మా’ అన్న ఆయన మాటలు గుర్తుకొచ్చి కళ్లల్లోకి నీళ్ళొచ్చాయి, ‘ బతుకెంత అశాశ్వతమైనది’ అన్పించింది.

          మోహన్ స్కూలుకెళ్లి వస్తూనే ఉండేవాడు. ఇంటికి రావడమే ఫుల్లుగా తాగి వచ్చి నానా రభసా చేసేవాడు. కావాలని ఇంట్లోనే పాస్ పోసెయ్యడం, దొడ్డికి కూర్చొనెయ్యడం లాంటివి చేసేవాడు. డైనింగ్ టేయిల్ మీద అన్నం తింటూ కుర్చీతో సహా పడిపోయే వాడు. ఒకసారి అలా పడిపోయినప్పుడు తల చిట్లిపోయి రక్తం ధారకట్టింది. రిక్షాలో వేసుకుని డాక్టరు దగ్గరకి పరుగెత్తాల్సి వచ్చింది. కుట్లు పడ్డాయి. అతడు చేసిన గలీజులన్నీ శుభ్రం చెయ్యలేక ప్రాణం కడగట్టి పోయేది. ఒకోసారి అర్థరాత్రి ఏ ఖాళీ పళ్లబండి మీదో పడి ఉంటే తెలిసిన వాళ్లెవరో ఒకరు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళేవారు. ఏ పరువు నైతే వీధిలో పెట్టుకోకూడదని దుఃఖాన్ని కడుపులోనూ, కళ్లల్లోనూ దాచుకొంటూ వచ్చానో దాన్నే అతడు వీధి పాలు చేసేసేడు. ఉదయం పూట తెరిపిగా ఉన్నప్పుడు ఆ మాటే చెప్పబోతే దౌర్జన్యానికి దిగేవాడు. మగవాడు వందచేస్తాడు, ఆడదానికి అడిగే హక్కు లేదనేవాడు. ఒక్క పైసా అయినా తన చేతిది పెట్టని, నా కష్టార్జితమైన ఆ ఇల్లు తనది అనేవాడు. కావాలంటే బైటికి పో అనే వాడు. ఎక్కడికి వెళ్లగలను నాదనుకున్న ఏకైక ఆధారమైన ఇంటిని వదిలి? “ఈవిడకి ఏడవడానికి ఒక వంక దొరికింది” అని ఎగతాళి చేసే బంధువుల దగ్గరకా?

          అలాంటి పరిస్థితుల్లో నన్నాదుకున్నది సాహిత్యమొక్కటే. ఎన్ని కోల్పోయినా, ఎన్ని ఎదురుదెబ్బలు  తిన్నా నాకు వెన్నుదన్నుగా నిలిచింది సాహిత్యమొక్కటే. నేను రచయితగా పేరు, గుర్తింపు తెచ్చుకోవడం సహించలేక మోహన్ ఇదంతా చేస్తున్నాడు  అనుకున్నాను కాని, అసలు కారణం తర్వాత తెలిసింది. అప్పటి వరకూ అతనితో సహజీవనం చేసిన ఆంగ్లో ఇండియన్ టీచర్ బాబ్రా అతనిలోని ఓపిక సన్నగిల్లగానే వేరెవర్నో పెళ్లిచేసుకుని మధ్యప్రదేశ్ వెళ్లిపోయిందని తెలిసి అతని ఈగో దెబ్బతిన్నదని. అది కూడా ఓ కారణమని.

          నేను నడిపిన స్కూలు, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, నాదగ్గర వర్క్ చేసిన
టీచర్లు అంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం వల్ల నా మీద నాకొక నమ్మకం
ఉండేది. అది క్రమంగా సన్నగిల్లడం ప్రారంభమైంది. అయినా, “నాకు నేనుగానే జీవించాలి, నిలదొక్కుకోవాలి” అనే పట్టుదల మాత్రం నన్ను వదలలేదు.

          ఆ సంవత్సరం May 1 కి అరసం తరఫున గుంటూరు రవి కాలేజ్ లో జరిగే సమావేశానికి రమ్మని పిలిచారు. పెనుగొండ లక్ష్మీనారాయణ. ఎ. అప్పల్నాయుడు, వి.చంద్రశేఖర్‌రావు, పాపినేని శివశంకర్, నాగభైరవ కోటేశ్వర్రావుగారు మొదలైన ప్రత్యేక రచయితలు, కవులతో కలిసి పాల్గోవడం ఒక కాన్ఫిడెన్స్ నిచ్చింది.

          కథా రచయితలం కథలు, కవులు కవితలు చదివేం. లక్ష్మీనారాయణ గారి స్నేహితులు కె.శివరామిరెడ్డి గారింట్లో నాకు ఆతిథ్యమిచ్చేరు. వారి భార్య అతి మధురమైన సపోటాపళ్లు దగ్గరుండి వొలిచి పెట్టి ఎంతో ఆత్మీయంగా చూసేరు.

‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మనీ- మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచు వారు ఎవరు లేరని చితి వొడిని చేరకు’

          శ్రీకారం సినిమాలో జేసుదాసు పాడిన పాట నాకు స్మరణీయమై పోయింది. ఏ విషాదమైనా తాత్కాలికమే. అది మనిషికి గొప్ప అదృష్టం.

          హైదరాబాద్ నుంచి భార్గవీరావు గారు ఉత్తరం రాసారు ‘నూరేళ్ళపంట కథా సంకలనం కోసం కొత్త కథ పంపమని,’బలం’ కథ రాసి పంపేను. మా ఊరి పక్కనున్న రాగంపేటలో జమీందారు దొరగారి దేవిడీలో మా స్కూల్ కోసం ఒక రూం ఇచ్చారు. పెద్ద ఖాళీ స్థలం ఆటలకు వాడుకొనే వాళ్లం. అద్దె వద్దన్నారని ఒక జనవరి ఫస్టుకి నేను ఓ గద్వాల్ చీర పట్టుకెళ్లి ఇచ్చాను జమీందారిణి గారికి. అప్పటికెప్పుడో జమీ అంతా చితికి పోయిన స్థితిలో ఉన్నా ఆ గిఫ్ట్ తీసుకోలేదు సరికదా స్కూల్ ఖాళీ చేయించారు. ఆ సంఘటన ఆధారంగా రాసిన ‘స్వాభిమానం’ అనే కథ “రచన”కు పంపితే దువ్వూరి శారదాంబగారి స్మారక సంకలనంలో వేసారు రచన మంత్లీ తో బాటు.

          మా ఊరు జగ్గంపేట పెంకుల మిల్లులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ తయారైన పెంకులు దేశంలో చాలా రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఆ ఫేక్టరీలు పెట్టి అతి తొందరగా ఆర్థికంగా ఎదిగిన అగ్ర కులాలవాళ్లను చూసి ఆర్థికబలం, సామాజిక బలం లేని ఒక బి.సి కులం వ్యక్తి అప్పు చేసి ఫేక్టరీ పెట్టి ఏమయ్యాడు అనే సబ్జెక్టుకి నా బాల్యం నాటి జ్ఞాపకాల్ని, కొన్ని కుటుంబంలోని అనుభవాల్ని కలిపి అలవోకగా, ఆషామాషీగా రాసిన ‘మట్టి- బంగారం’ కథ అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) పోటీలో ప్రథమ బహుమతి పొంది నా పేరును విదేశాలకు కూడా పరిచయం చేసింది. అప్పటి వరకూ నా పేరుకు ముందున్న ‘గాజు పళ్లెం’ ను పక్కకు నెట్టి తను ఆక్రమించింది. సభల్లో, సమావేశాల్లో ‘మట్టి-బంగారం’ వరలక్ష్మిగా గుర్తింపునిచ్చింది.

7.6.99 ఆంధ్రప్రభ వీక్లీలో మున్నాకథ ;
30.10.99 రచన పోటీలో ‘స్వాభిమానం’ కథ ;

నవంబర్- డిశంబర్ 99 అమెరికా భారతిలో ‘మట్టి-బంగారం’ కథ;
అక్టోబర్ 6-10 (99) ప్రజాశక్తిలో ‘ఇంకా ఇంతే’ కవిత
99 అక్టోబర్ గోదావరి గొంతులు సంకలనంలో ‘అనిలావర్తం’ కవిత ప్రచురణ పొందాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.