యాదోంకి బారాత్-5

-వారాల ఆనంద్

కరీంనగర్  మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం

ఎ దౌలత్ భి లేలో

ఎ షౌరత్ భి లేలో

భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ

మగర్ ముఝ్ కో లౌటాదే

బచ్ పన్ కా సాయా

ఓ కాగజ్ కి కష్తి    

ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)

          ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. విని ఆనంద పరవశున్ని అయ్యానో, కన్నీటి పర్యంతమయ్యానో చెప్పలేను. నిజంగా బాల్యాన్ని గురించీ, దాని మాధుర్యాన్ని గురించీ గొప్పగా ఆవిష్కరించిన అద్భుత గీతాల్లో ముందు వరసలో వుంటుందీ గజల్, ఆ కవికి చేతులెత్తి నమస్కరించాల్సిందే.

        అయితే అందరి బాల్యం గొప్పగా ఉంటుందా, ఊహల్లోనే అందంగా ఉంటుందా అంటే చెప్పలేం.

***

          నిజానికి బాల్యం రెండు స్థాయిల్లో వుంటుంది. ఒకటి మనకు పూర్తిగా లోకం తెలీని వయసు. కల్మషం లేకుండా హాయిగా నవ్వడం, ఆకలయితే ఏడవడం, అమ్మని పూర్తిగానూ నాన్నని కొంచెం కొంచెంగా గుర్తించడం మాత్రమె చేసే కాలమది. తర్వాత నడకలు, మాటలు నేర్చుకుంటూ క్రమంగా అన్నీ అర్థమవడం, అందరినీ గుర్తించడం బాల్యంలో రెండో అంకం.

          మొదటి అంకం అంతగా గుర్తుండే అవకాశం లేదు. అమ్మ వొడిలో హాయిగానూ నాన్న చంకన ఆనందంగానూ గడిచిపోతుంది. దశాబ్దాల క్రితం వీడియోలు లేవు కాని, అప్పటి ఛాయా చిత్రాలు ఏమయినా వుంటే వాటిని చూస్తూ ఆ కాలాన్ని మననం చేసుకోవచ్చు. 

          ఇక ఎదిగిన కొద్దీ “మనలోని బలాలు మనకు తెలుస్తూ వుంటే, లోపాలు లోకానికి తెలిసిపోతూ వుంటాయి”.

          అక్కడే వైవిధ్యం, సంక్షోభం అన్నీ మొదలవుతాయి.

          నా బాల్యంలోని మొదటి అంకం ఆనందంగానే గడిచింది. కొన్ని ఛాయా చిత్రాలు, మరికొన్ని అమ్మ చెప్పగా విన్న స్మృతులు ఆ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. అప్పుడు మిఠాయి సత్యమ్మ ఇల్లు పిల్లా పాపలతో కళ కళ లాడుతూ వుండేది. ఇంటికి ఎదురుగా విజయలక్ష్మి మిలిటరీ హోటల్, అందులో ఒక రేడియో అందరినీ ఆకర్శిస్తూ ఆహ్వానించేది. మా నాన్న వారాల అంజయ్య ఆయన మిత్రులు ఆ హోటల్లో చేరి పాటలు వింటూ, తాము పాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. “జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే కే క్యా కరేంగే ..” అనే సైగల్ ని, “జల్తే హై జిస్కే లియే..”, ‘యే హవా యే రాత్ యే చాందినీ”, ‘షామే ఘం కీ కసం..” అంటూ పాడే తలత్ మహమూద్ నీ వింటూ గుణ్ గునాయించడమే కాదు గొంతెత్తి పాడుతూ వుండే వారంట. అప్పుడప్పుడూ ఆ వాతావరణంలోకి నన్ను ఎత్తుకొని వెళ్ళేవారట. ఏమీ తెలీని వయసులోనే ఆ పాటలు ఆ గొంతులు నా unconscious level లో స్థిరపడి పోయాయేమో. అందుకే ఇప్పటికీ ఆ గొంతులూ పాటలూ అంటే నాకిష్టం. మా ఇంట్లో మా తరంలో అందరికంటే పెద్దన్నయ్య వారాల మోహన్. తానే చిన్నప్పుడు నన్ను విజయలక్ష్మి హోటల్ లోనూ, ఆయన మిత్రుడు శంకరయ్య గారి అజంతా  ఫోటో స్టూడియోలోనూ పలు ఫోటోలు తీయించాడు. వాటితో పాటు వేములవాడకు తీసుకెళ్ళి నప్పుడు మా రెండవ మేనమామ డాక్టర్ రఘుపతి రావు నన్నూ మా పెదమామ కొడుకు శివప్రసాద్ ను కలిపి అనేక ఫోటోలు తీసి జ్ఞాపకాల్ని మిగిల్చాడు. నిజానికి మా ఇద్దరికీ 21 రోజులు తేడా. ఇద్దరినీ ఒకే తొట్లేలో(ఉయ్యాల) వేస్తే నేను కొంచెపు తెలుపు కావడంతో నన్ను అత్తయ్య సులోచన(తను బాగా తెలుపు) కొడుకునని, బావ కొంచెం రంగు తక్కువ కావడంతో తనని రాధ కొడుకనీ అంతా అనే వాళ్ళంట. అంతా నవ్వుకునే వాళ్ళని అమ్మ ఎప్పుడూ చెప్పేది. అట్లా బాల్యంలో మొదటి అంకం గడిచింది.

***

          తర్వాతి అంకంలో నడక, మాటలు నేర్వడం మొదలయింది. క ను త అని, గ ను డ అని పలకడంతో మాట మొదలయింది. కష్టాలు మొదలయ్యాయి.అంతా మాట్లాడించడం నేను అమాయకంగా మాట్లాడ్డం దాంతో అందరూ బనాయిస్తూ ఎంజాయ్ చేయడం చూసి అమ్మలో వేదన మొదలయింది. అమ్మ డాక్టర్ తాతయ్యతో నా ఇబ్బందిచేప్పి ఏదయినా మందు ఇమ్మంటే సరస్వతారిష్ట వాడొచ్చు కానీ దాని వళ్ళ వ్యతిరేక ప్రభావమొస్తే ఇబ్బంది, వద్దన్నారు. క్రమంగా నాలో ఒంటరితనం ఆరంభయింది. అందరిలో వుంటూనే దూర దూరంగా వుండడం మామూలయింది.

ఆ రోజుల్లో వాళ్ళంతా నన్ను
వెలుగు వాడలో
చీకటికి పరిమితం చేసారు
శబ్దాల హోరులో
నిశబ్దంలో నిలువరించారు

ఆ రోజుల్లో
వాళ్ళ ముఖాలన్నింటి మీదా
పెద్ద పెద్ద నోర్లు ఉండేవి
అర్థం ఉండీ లేని
అరుపుల్లాంటి మాటలుండేవి

ఆ రోజుల్లో
నేనేమో గొంతు పెగలని
గాయంతో
మనుషులకు దూరంగా
నివసించడం నేర్చుకున్నాను

రద్దీ రద్దీగా వున్న చౌరస్తాలో
మొలిచిన మొక్కలా
బిక్కు బిక్కు మంటూ
నీడ లేని శరీరంతో నిలబడిపోయాను

తనవాళ్ళే అందరూ
కానీ
అన్ని ముఖాలూ పరాయివే

ఆ ఇల్లు
సముద్రమూ ఎడారీ
కలగలిసిన నివాస స్థలిలా వుండేది

నాకేమో
ఆ రోజుల్లో
మౌనం ఓ ఆచ్చాదన
మాట అపురూపం

అవును వాళ్ళంతా నన్ను
అమ్మ ఒడికీ
నాన్న నీడకూ పరిమితం చేసారు

అట్లా బాల్యం
సొంతింట్లో ‘వలస’ బతుకులా గడిచింది

***

          ఇక నాన్న నన్ను అయిదవ తరగతి వరకు స్కూలుకు పంపలేదు. తానే అన్నీ అయి సిలబస్ ప్రకారం చదువు చెబుతూ వచ్చాడు. చదువుల్లో కొంత చురుగ్గా వుండడంతో మెప్పులు కూడా అందుకుంటూ వచ్చాను.

          చిన్నప్పటి నుండీ రోడ్డు మీద గారడీ వాళ్ళు వచ్చినా, దొమ్మరి ఆట ఆడేవాళ్ళు వచ్చినా నాకు పండగలా వుండేది. గదిలోనో, గచ్చు మీదో కూర్చుని రాసుకుంటున్న వాణ్ని అన్నీ ఎక్కడివి అక్కడ వదిలేసి పరుగెత్తి ముందు వరసలో నిలబడి చూసే వాడిని. గారడీవాడు పిల్లాన్ని మాయం చేయడం, డబ్బాలోకి చిల్లర నాణాలని తెప్పించడం ఎంతో ఆసక్తిగా వుండేది. ఆట ముగిసి ఇంట్లోకి వచ్చేసరికి రాస్తూ వదిలేసి పోయిన పెన్నులు మాయమయ్యేవి. ఇక నాన్న వచ్చిం తర్వాత కొట్టేది కాదు కాని నా పుస్తకాల చిన్న బీరువాకి తాళం వేసి ఇక నీకు చదువు వద్దు ఆడుకోపొమ్మనేవాడు. ఒకటి రెండు రోజులు ఆ శిక్ష కొనసాగేది. తర్వాత చదువుకుంటానని ఆటకు పోనని బతిమిలాడి వేడుకుంటే నాలుగు దెబ్బలు వేసి ఏడుస్తూ వుంటే ఇది చివరి అవకాశం అనేవాడు. ఆ సాయంత్రం బయటకు తీసుకెళ్ళి పండో, ధిల్లీవాలా స్వీటో కొనిచ్చి ఊరడించేవాడు. దండనకు దండన ప్రేమకు ప్రేమ ఇదీ నాన్న సరళి. తర్వాత షరా మామూలే. ఇక అదే సమయంలో ఎప్పుడూ ఇంట్లో అక్కో వదినో ఎవరో ఒకరు కాన్పుకు వచ్చేవారు. మంగలి ఆమె రావడం 11 రోజుల పాటు స్నానాలు, పిల్లల ఏడ్పులు అంతా సందడిగా గడిచేది. వాయిలి ఆకులు కొమ్మలతో సహా తెచ్చి మరగ బెట్టిన నీళ్ళతో బాలింతలకు స్నానాలు  పోసేవారు. ఆ నీటి ఘుమ ఘుమ వాసన అద్భుతం. ఇక పురుడు రోజు పెద్ద పండగే. రాత్రి కాగానే పిల్లనో పిల్లాన్నో ఒడిలో పెట్టుకుని తల్లి కూర్చుంటే ముందు దీపాలు, అగరొత్తులు, పిండి వంటలతో అలంకరించే వాళ్ళు. మంగలామె వచ్చి సోలలో లింగాలు వేసుకుని “పామోలె పాకులాడు, కప్పోలె గెంతులాడు”.. అంటూ చుట్టూ తిరుగుతూ గెంతుతూ అందరినీ సోలలో పైసలు వేయమనేది. చీకట్లో ఆ దృశ్యం ఎంతో కళాత్మకంగా వుండేది (ఎప్పటికయినా ఆ దృశ్యాన్ని VISUALISE చేయాలనుకున్నా. శివ పార్వతుల డాక్యుమెంటరీ చేయగలిగాను ఇది కాలేదు).

***

          ఇక నన్ను నాన్న ఖార్ఖానగడ్డ హై స్కూల్ లో చేర్పించారు. కానీ నాన్న అదే సంవత్సరం ట్రైనింగ్ కని వెళ్ళడంతో నేను వేములవాడలోని భద్రయ్య బడిలో కొన్ని నెలలు చదివాను. వేములవాడలో నేను చదివింది ప్రభుత్వ పాఠశాలే అయినప్పటికీ భద్రయ్య బడి అనే పిలిచేవారందరూ. భద్రయ్య ఆ స్కూలులో పనిచేసే అటెండర్. అనేక మంది టీచర్లు, వందల మంది విద్యార్థులు వుండే ఆ స్కూలులో భద్రయ్య అంటే హడల్. పిల్లల పట్ల ఎంత ప్రేమగా వుండేవాడు క్రమశిక్షణ పట్ల అంతే ఖచ్చితంగా ఉండేవాడు. అందుకే ఆ బడికి ఆయన పెరట్లా నిలిచిపోయింది. అట్లా కొంత మంది పేర్లు ప్రజల నోల్లల్లోనే కాదు గుండెలలోనూ ఉండిపోతారు.

          అట్లే నా చిన్నప్పుడు కరీంనగర్ పెద్ద గడియారం చుట్టూ కొన్ని పేర్లు నిలబడి పోయాయి. మిఠాయి సత్యమ్మ, బుక్క శంకరమ్మ(బుక్క గులాలు అమ్మే షాప్), బుక్క భద్రయ్య( మెడికల్ షాప్), చింతల నర్సింలు(బుక్ సెల్లర్స్), గౌరిశెట్టి నారాయణ(కిరాణ).

***

          తిరిగి ఖార్ఖానగడ్డ హై స్కూల్ లో చేరాను. అక్కడ 6 అండ్ 7 తరగతులు చదివాను. ఆ స్కూలు అనగానే హిందీ చెప్పిన ఠాకూర సింగ్ సారు, కలిసి చదువుకున్న నరేందర్, రాధ తదితరులు గుర్తొస్తారు. అంతేకాదు ఆ స్కూలుకు వెళ్ళే దారిలో తీరందాజ్ టాకీస్, అది దాటితే పెద్ద కుంట వుండేది వర్షాకాలం అది మత్తడి దుముకి రాక పోకలకు అంతరాయం కలిగేది.

 ఇప్పుడు అక్కడ ఓ పక్క వైశ్యభవన్, మరో పక్క శనివారం అంగడి నడుస్తున్నాయి. ఇంకోటి కార్ఖానా గడ్డ రోడ్డు మీదే ఎం.ఎల్.ఏ గా పని చేసిన ప్రేమలతా దేవిగారి ఇల్లు ఉండేది. 

          ఇక ఆ స్కూలు వదిలేసి గంజ్ స్కూలుకు వచ్చిం తరవాత అక్కడి మనుషులు విషయాలు మరుగున పడ్డాయి. కాని రాధ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా తిరిగి పరిచయమయ్యారు. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని చాలా ఆనందపడ్డాం.

          రాధ శ్రీవారు శ్రీ కే.రాజయ్య నాకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో కొలీగ్. ఇప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తూనే వుంటాం.

          కార్ఖానా గడ్డ బడిలో ఏడవ తరగతి అయ్యాక COMPOSITE MATHEMATICS గంజ్ హై స్కూలుకు మారి 8 వ తరగితిలో చేరాను.

          దాంతో కొత్త అధ్యాయం మొదలయింది.

          వివరాలతో మళ్ళీ వారం….. నా యాదొంకి బారాత్

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.