నడక దారిలో-26

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో  శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో కలంస్నేహం, తదనంతరం బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, నాలుగు నెలల అనంతరం విజయనగరం వెళ్ళాను. మేలో పరీక్షలు ముగించుకుని హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. కొత్త కాపురం. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది.  తర్వాత—

***

 
          1975 -76ల్లో దేశం ఒక అంధకారంలోకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు ప్రధాని ఇందిరాగాంధీ అధికారికంగా విధించిన ఎమర్జెన్సీ1977 మార్చి 21వరకూ కొనసాగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేయటం మొదలైంది. పౌరహక్కులకు భంగపరిచేలా ప్రజలకు భావస్వాతంత్య్రం, వాక్స్వాతంత్య్రం లేకుండా అయిపోయింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన చీకటి కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటిగా మారింది.
 
          సాహిత్యంలో డెబ్భైలలో మొదలైన విప్లవోద్యమ ప్రభావంతో రచనలు చేసేవారంతా ఆ సమయంలో అతలాకుతలం అయినా సరే అక్షరాయుధులుగా రచనలు చేస్తూనే ఉన్నారు. అవి చదువుతూ ఎంతోమంది ప్రభావితులౌతూనే ఉన్నారు.    
 
          సైన్స్ విద్యార్ధినిగా నాకు మన దేశం 1975లో ఆర్యభట్ట అనే తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని మనసులో కాస్తంత సంతోషం కలిగింది.  దేశంలో ఎన్నో సంక్షోభ సమయాలు వచ్చినట్లే నేనూ కుటుంబంలో అటువంటి ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నాను.
 
          ఆ రోజు ఆగష్టు పదిహేను స్వాతంత్య్రదినోత్సవమే కాకుండా వరలక్ష్మీ వ్రతం కూడా. పల్లవికి పెరేడ్ చూపిస్తామని వీర్రాజు గారు, మా మరిది కలిసి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కి తీసుకువెళ్ళారు. నేను వాళ్ళు వచ్చేలోపునే ఫ్రైడ్ రైస్, పాయసం చేయాలని హడావుడిగా చేస్తున్నాను.
 
          అంతలో టెలిగ్రాం వచ్చింది. గుండె దడదడలాడుతుండగా విప్పాను. కాని అది నిజమేనా అని నిశ్చలన చిత్రాన్నే అయ్యాను. ఏమీ తోచనితనం. గుండె బరువెక్కి పోయింది. ఆయన రాగానే టెలిగ్రాం చేతిలోపెట్టాను. మా చిన్నక్క భర్త పోయారనే వార్త చదివిన దగ్గర నుంచి దిగులు ముఖంతో ఉన్న నాకు ధైర్యం చెప్పి విజయనగరానికి రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ కోసం వెళ్ళారు.
 
          వాసుదేవరావు గారు ఎన్.సి.సి. చేసిన మనిషి కనుక ఆరోగ్యమైన వ్యక్తి అనే అనుకునేదాన్ని. గత నెలరోజులు క్రితం అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ లో చేరి డిశ్చార్జి అయ్యారని తెలుసు. కానీ ప్రేమించి వర్ణాంతర వివాహంతో ఇరువైపులా బంధువులకు దూరమై తమమట్టుకు తాము బతుకుతున్న చిన్నక్క జీవితం ఇలా కావటం తట్టుకోలేక పోయాను.
 
          మర్నాటికి టికెట్లు దొరికి ఇరవైనాలుగు గంటల ప్రయాణం చేసి విజయనగరం చేరాము. ఇంటికి చేరేటప్పటికి చీకటి పడింది. అమ్మ,పెద్దక్కయ్య కోరుకొండలోనే ఉన్నారు. మర్నాడు పొద్దునే మేము వెళ్ళాము.
 
          చిన్నక్క మూడురోజులుగా దుఃఖంతోనూ, తలస్నానాలతోనూ ఒళ్ళు తెలియని జ్వరంతో మంచంమీద ఉంది. ఏడేళ్ళకళ్యాణ్, మూడేళ్ళు ఐనా నిండని చెల్లెల్ని అక్కున చేర్చుకుని వాకిట్లో బిక్కమొఖంతో కనబడేసరికి గుండె నీరైంది.
 
          వాసుదేవరావుగారి తాలూకా వాళ్ళంతా అతను వడుగు చేసుకోకుండా వర్ణాంతర వివాహం చేసుకున్నందున మూడురోజుల్లో తమకు మైలతీరిపోయినట్లే అని అందరూ అక్కని ఒంటరిగా వదిలి ముందురోజే వెళ్ళిపోయారట.
 
          వాసుదేవరావు గారికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. పెద్దన్నయ్య వదిన వచ్చి అంతా అయ్యాక వెళ్ళిపోయారు.పెద్దక్క నేనూ క్వార్టర్ ఖాళీ చేయటానికి చిన్నక్కకు అవసరమైన సామాగ్రిని సర్ది పేకింగులు తయారు చేసాము.
 
          అన్నయ్య పట్టించుకోక పోవటంతో చిన్నన్నయ్య ఇంటికి చిన్నక్కని ఇద్దరు పిల్లల్నీ తీసుకుని అందరం వచ్చేసాము. చిన్నన్నయ్య చిరుద్యోగి. చిన్నక్క బాధ్యత ఎలా, ఎవరు తీసుకోవాలో అగమ్యగోచరంగా అయిపోయింది. అయితే అదృష్టవశాత్తు వాసుదేవరావు గారి సహ ఉద్యోగులు అండగా నిలబడి నెలలోపునే చిన్నక్కకు అదే కోరుకొండ సైనిక స్కూల్ లో మేట్రిన్ గా ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేసారు. ఆయన మరణానంతరం వచ్చిన డబ్బును అక్కపేరున పిల్లలపేరనా ఎఫ్.డిలు వేయించారు. కాని ఆరునెలల లోపున మెట్రిక్ పాస్ అయితేనే ఆమె ఉద్యోగం పర్మనెంట్అ వుతుందన్నారు. చిన్నప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టని అక్క ఆ తప్పని పరిస్థితిలో చదవవలసిన అవసరం వచ్చింది. ఏదో ఒకలా పరీక్ష గట్టెక్కటంతో పర్మనెంటు అయ్యి ఆమె జీవితం ఒక కొలిక్కి తొందర్లోనే రావటంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం.
 
          చదువు లేకపోవటం వలన అమ్మ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చిన్నప్పటి నుంచి చూసాను. ఇప్పుడు చిన్నక్కది అదే పరిస్థితి వచ్చినా ఎలాగో ఒడ్డున పడింది. ఆడవాళ్ళకు ఎటువంటి పరిస్థితి సంభవించినా ఆర్థిక స్వావలంబనకు తగిన చదువు ఎంతముఖ్యమో మరోసారి అర్థమైంది. తిరిగి హైదరాబాద్ వచ్చేసినా స్త్రీల జీవితాల పై ప్రభావం కలిగించే ఆర్థిక, సామాజికాంశాల గురించి మాటిమాటికీ గుర్తువచ్చి మనసులో బాధ గింగిరాలు తిరుగుతూనే వుంది. మరోసారి నేను ఎలాగైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ, ఎలా? పెద్ద ప్రశ్నార్ధకం నా కళ్ళముందు నిలిచింది.
 
          మా చిన్నాడబడుచుకి నెలతప్పింది. విజయనగరంలో అయినా, హైదరాబాద్ లోనైనా చూసుకోవాల్సినది అమ్మే కదా. ఎందుకంటే నేనూ చిన్నదాన్నే ఆ మాత్రం దానికి పురిటికి ఆమెని హైదరాబాద్ కి రమ్మనటంలో అర్థంలేదు. అయితే హైదరాబాద్ లో నన్ను చూసిన డాక్టర్ డెలివరి బాగా చేస్తుందని భావించి కాబోలు ఇక్కడికే పంపించాలను కున్నారు.
 
          మరుదులు ఇద్దరికీ సంబంధాలు కుదిరాయి. నాలుగు రోజుల తేడాలో పెద్ద మరిదికి హైదరాబాద్ లో, చిన్న మరిదికి రాజమండ్రిలో పెళ్ళిళ్ళు చెయ్యటానికి నిశ్చయమైంది. 
 
          “వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక కలిసి ఉండటానికి ఇష్టం ఉంటే సరేసరి లేకపోతే వేరుగా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు. తగువులు పడి విడిపోవటం బాగుండదు’ అని తమ్ముళ్ళతో చెప్పమని అందులో తప్పేమీ లేదని వీర్రాజు గారితో అన్నాను. “ముందే అలా చెప్పటం బాగుండదు” అన్నారాయన. ఏది జరిగినా బాధపడవలసినది నేనే కదా అనుకుని ఇంకేమి అనలేక మౌనంవహించాను.
 
          ఇంటికి కలర్స్ వేయించడం, హాల్ లా వాడుకునే పెద్ద గదికి పార్టిషన్ లు చేయించటం మొదలైన పనులు మొదలుపెట్టాం.       
 
          అవన్నీ సరిపోలేదని నాకు నెల తప్పింది. పక్కింటి రంగారావు గారి తల్లిని సాయం తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. బాగా నీరసంగా ఉన్నానని మందులు రాసారు.
 
          రెండోనెల దాటాక అకస్మాత్తుగా రక్తస్రావం కావటంతో పక్కింటామెని తీసుకొని హడావుడిగా రిక్షా తీసుకొని వెళ్ళాను. డాక్టర్ ఇంజక్షన్ చేసి రెండు మూడు వారాలైనా పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని పక్కింటి ఆమెకు నా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఇంటికి వచ్చాక ఆమె బోలెడు జాగ్రత్తలు చెప్పి రెస్ట్ తీసుకోమని కూరలవి తాను వండి ఇస్తానన్నారు.
 
          ఇంట్లో మా మరిది నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోయాడు నేను ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకో మరిది బైటికి వెళ్ళాడు. వీర్రాజు గారు మరికాసేపటికి వస్తే ఆమె డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పారు.
 
          “అలాగా” అన్నారు ఆయన.
 
          మర్నాడు ఉదయమే టిఫిన్ చేసి తీసుకుని వంటింట్లోకి వచ్చిన పక్కింటామె వంటచేస్తున్న నన్ను చూసి “అదేంటమ్మాయ్ డాక్టర్ పూర్తి రెస్ట్ తీసుకోమంటే పనులు మొదలెట్టేసావ్”ఆప్యాయంగా అన్నారు.
 
          “ఎలా కుదురుతుందండీ. ఇంట్లో పెళ్ళిళ్ళు, పిలుపులు ఉంటే రెస్ట్ ఎట్లా? ఏమైతే అదే ఔతుంది.” నా గొంతులో బాధ వణికింది.
 
          “అబ్బాయితో చెప్పమంటావా” అన్నారు ఆమె. నేను తల అడ్డంగా ఊపేసరికి ఏమి అనలేక ఊరుకున్నారు. యథాప్రకారం పెళ్ళి పిలుపులూ, బజారు పనులూ మొదలైన కార్యక్రమాలు జరిగిపోయాయి. ఎవరూ నా ఆరోగ్యం గురించి, డాక్టర్ చెప్పిన బెడ్ రెస్ట్ గురించీ పట్టించుకోలేదు.
 
          పెళ్ళికోసం అని వచ్చిన చిన్నాడబడుచు డెలివరీ కోసం ఉండిపోయింది. అమ్మ డెలివరీ సమయానికి వచ్చి దగ్గరుండి కోడలికి హాస్పిటల్లో సాయంగా ఉండి తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా జరిపింది. పుట్టిన బాబుకు నెలదాటకుండా చిన్నన్నయ్య వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. 
 
          నా తోటి కోడళ్ళు వచ్చాక ఇంట్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఒక నాలుగు నెలలు ఫస్ట్ కి అందరూ ఇచ్చిన డబ్బుని నెలంతా సరిపడేలా నేనే ఇంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తూ ప్రతీ పైసా డైరీలో నమోదు చేసేదాన్ని. చవక రకం సబ్బులు కొంటున్నాననీ, టూత్ పేస్ట్ కాకుండా పౌడర్ కొంటున్నానని తమకు ఖరీదైనవే వాడే అలవాటని, ఇటు వంటి చవకరకాలు వాడమనీ అంటూ వెటకారాలు చేసారు. అందరూ ఇచ్చిన డబ్బుకాక నిజానికి ఆ పైన మా డబ్బే చాలా వరకూ ఇంటి ఖర్చులకు వాడాల్సి వచ్చేది.
 
          తర్వాత నెల రెండో ఆమెకి ఇచ్చి నువ్వే ఈ నెల చూసుకో అన్నాను. ఆ నెల తర్వాత మూడో ఆమెకి ఇచ్చాను. వాళ్ళకి ఇష్టమైనట్లు అన్నీ కొని పదిహేను రోజులకే డబ్బుకు కటకటలాడి ఇంట్లోకి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చే సరికి గిజగిజలాడారు. తర్వాతి నెల నుండి వాళ్ళు కోరుకున్న వస్తువులు వాళ్ళ డబ్బుతో కొనుక్కుని వాళ్ళు రూములో దాచుకుని వాడుకోవటం మొదలెట్టారు.
 
          వీర్రాజు గారు మీటింగుల వల్లో, లేదా మిత్రులు వచ్చి ముఖచిత్రాలు వేసుకోడానికి రావటం వల్లో రాత్రి పూట భోజనానికి రావటం తరుచూ ఆలస్యం అయ్యేది. అప్పటికి అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లో వారు ఉండేవారు చప్పగా చల్లారి ఉన్న అన్నం కూరలు వీర్రాజు గారికి పెట్టి నేను తినే దాన్ని.
 
          ఉదయంపూట ఆయన ఆఫీస్ కు వెళ్ళాలి కనుక తొందరగా వంటపని నేనే చేసేదాన్ని. పది గంటలకే వీర్రాజుతో పాటు నేనూ భోంచేసేదాన్ని. మా మరుదులు షిఫ్ట్ డ్యూటీలు కనుక మిగతావాళ్ళు టిఫిన్స్ చేసుకొని మా కోసం మిగిల్చింది ఆయనకి మధ్యాహ్నానికి ఆఫీసుకి పేక్ చేసి , పాపకి తినిపించగా, మిగిలినది నేను కొంచెం ఉంచుకుని తినేదాన్ని.
 
          పాపని మూడో పుట్టిన రోజు కాగానే ఈ రెండు మూడు నెలలు స్కూల్ అలవాటు కావాలని దగ్గరలోని స్కూల్ లో నర్సరీ లో చేర్చాను. కొన్నాళ్ళు నేనే తీసుకువెళ్ళి తిరిగి తీసుకు వచ్చేదాన్ని. తర్వాత ఒక అవ్వని పెట్టాను. మధ్యాహ్నం నేను వెళ్ళి అన్నం తీసుకెళ్ళి తినిపించి వచ్చేదాన్ని.
 
          ఈ పనులు అన్నీ అయ్యేసరికి నాకు నెలలు నిండసాగాయి. డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా  “బరువు అసలు పెరగలేదు. లోపల బిడ్డ కూడా పెరగలేదు. అసలు తిండి తింటున్నావా లేదా” అని డాక్టర్ కోప్పడసాగింది.
 
          అంతలో వీర్రాజుగారి బాల్యమిత్రుడు స్పాట్ వేల్యుయేషన్ డ్యూటీ నెల రోజులు కోసం హైదరాబాద్ కి ముగ్గురు పిల్లలతో సహా మొత్తం కుటుంబంతో వచ్చారు. మేము ఏడుగురం వాళ్ళతో కలిపి పన్నెండు మంది. వాళ్ళ పిల్లలకు పాలు, ఇంత మందికి వంట, ఇల్లు గడపటం చాలా కష్టమైపోయింది. పాప పల్లవిని కూడా చూసుకోలేక పోతున్నాను. శారీరకంగా ఆర్థికంగా బాగా నలిగిపోయాను.
 
          ఒక్కొక్కప్పుడు నేను ఏమి ఆశించి పెళ్ళి చేసుకున్నాను? నా జీవితం ఎలా మారింది? ఈ పిల్లల్ని నేను కోరుకున్నట్లుగా పెంచగలనా? నా చుట్టూ ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు. భవిష్యత్తు తలచుకుంటూ నిరాశలో కూరుకుపోయే దాన్ని.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.