నా అంతరంగ తరంగాలు-4

-మన్నెం శారద

అమ్మమ్మ వూరికి  ప్రయాణం

Co canada

          నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ టౌన్ ని పోర్ట్ ని విడదీస్తూ మధ్యలో ప్రవహించే బ్యాక్ వాటర్, అందులో వున్న ఫిషింగ్ షిప్స్, దూరంగా వున్న సముద్రానికి లోడ్ తీసుకెళ్లే మరబోట్లు… కొచ్చి చూసినప్పుడు కూడా నాకు కాకినాడే గుర్తొచ్చింది.

          నేను నయాగరాకు వెళ్ళినప్పుడు రెయిన్బో బ్రిడ్జ్  దగ్గర కూడా అదే వాతావరణం కనిపించింది.

          ఆఁ రోడ్లు, ఇళ్ళు,, ఆఁ ప్రశాంతత … అచ్చం కాకినాడలానే.

          కాకినాడని పెన్షనర్స్ పేరడైస్ అనికూడా అంటారు.

          రిటైర్ అయ్యాక నేను కూడా కాకినాడ వెళ్లిపోవాలనుకునే దాన్ని. అన్నీ అనుకున్న ట్లుగా జరగవు కదా!

          తర్వాత కాలంలో కో కనాడ  కాకినాడగా రూపాంతరం చెందింది.

          సముద్రతీరం కాబట్టి కాకులు విపరీతంగా ఉండేవి. అందుకే కాకినాడ అంటారని అనుకునేదాన్ని నేను.

          ఒంగోలు నుండి కాకినాడ ప్రయాణం నాకు గుర్తులేదు కానీ మాచర్ల నుండి బాగా  గుర్తు.

          కాకినాడ వెళ్తున్నామంటే వళ్ళు పులకించిపోయేది.

          అమ్మమ్మగారి ఊరితో అనుబంధమలాంటిది.

          ఇంకా బళ్ళో చేరలేదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడే బయల్దేరిపోయేవాళ్ళం.

          కానీ ఆఁ ప్రయాణం .. ఎంత శ్ర మతో కూడిందో ఇప్పుడు తలచుకుంటే వళ్ళు జలదరిస్తుంది.

          అమ్మకసలే మహా శుభ్రం!

          తెల్లవారు ఝామున రెండింటికి లేపి వేడి నీళ్లు కాచి స్నానాలు చేయించి జడలు వేసేది. నాకప్పటికి ఇంకా హెయిర్ కటింగే ఉండేది.

          నాలుగింటికి ముందు రోజు చెప్పిన ఒంటెద్దుబండి వచ్చేది.

          రెండు మరచెంబుల్లో నీళ్లు, రెండు ట్రంకు పెట్టెలు, రెండు cane baskets, మా  అయిదుగురు సైన్యంతో  స్టేషనన్ కి బండిలో బయలు దేరే వాళ్ళం.

          నాన్న టార్చ్ లైట్ తీసుకుని బండి వెనుక నడచి వచ్చేవారు.

          ఒక అరగంటకి స్టేషన్ చేరేవాళ్ళం.

          నాన్న రైలు ఎక్కించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవారు.

          అమ్మ మమ్మల్ని సరిగ్గా కూర్చోబెట్టి చాలా జాగ్రత్త లు చెప్పేది.

          అది మీటర్ గేజీ రైలు మార్గం. కంప్పార్ట్మెంట్స్ చిన్నవిగా ఉండేవి. బొగ్గు ఇంజన్లు. రైలు రెండెడ్లబండి కన్నా కొంచెం స్పీడ్ గా వెళ్ళేది.

          ఈ లోపున మేం కిటికీ దగ్గర సీటుకోసం కొట్లాట.

          రైలు ఏడ్చుకుంటూ, ఈడ్చుకుంటూ ఏ రాత్రికో గుంటూరు చేరేది.

          పల్నాడు అప్పటికి చాలా వెనుకబడిన ప్రాంతం. అంతా మెట్టభూములు. రాతి నేలలూ, మట్టి మిద్దెలు. గుంటూరు వచ్చే వరకూ అంతే.

          ఒకసారి ఒక తమాషా అయిన సంఘటన జరిగింది. రైలు మమ్మల్ని ఎక్కనివ్వ కుండా కొందరు పారలు పలుగులు, తట్టలు తీసుకుని మాకు దారి ఇవ్వకుండా ఎక్కుతు న్నారు. రైలు కదిలిపోయే టైమయింది. అమ్మ ఎలానో లగేజ్ ఎక్కించి తనూ ఎక్కింది. మమ్మల్ని ఎక్కనివ్వకుండా ఒకతను తోసేస్తున్నాడు. అమ్మ వెంటనే అతని తలపాగా  తీసి ప్లాట్ఫామ్ మీదకి విసిరేసింది. అతను ‘ఓయమ్మో, ఇదేందీ’ అంటూ తలపాగా తెచ్చు కోవడానికి పరిగెత్తాడు. ఆఁ సందులో అమ్మ మమ్మల్ని ఎక్కించేసింది గబగబా.

          అమ్మకసలు భయం ఉండేదే కాదు. అదేంటో!

          నాగార్జున సాగర్ వచ్చాక పల్నాడు సస్యశ్యామలమయ్యింది. తర్వాత నేను ఉద్యోగం వచ్చాకా ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూసాను.

          గుంటూరులో దిగి తిరిగి మేం విజయవాడ వెళ్లే ట్రైన్ ఎక్కేవాళ్ళం. అక్కడ నుండి  బ్రాడ్ గేజ్ లో ప్రయాణం.

          అక్కడకు చేరుకునే సరికి హమ్మయ్య అనిపించేది. నగర వాతావరణం, జిగ్ జిగ్ మంటూ మెరిసే విద్యుద్దీ పాలు.. యమ థ్రిల్ గా ఫీలయ్యేవాళ్ళం.

          ఆ రాత్రి వైటింగ్ రూంలోనే మా మకాం.

          అమ్మ అక్కడకూడ తెల్లవారుఝామున లేపి మేం కుయ్యోమొర్రో అన్నా వినకుండా చన్నీళ్లతో స్నానా లు చేయించి బట్టలు మార్చి టిఫిన్స్ పెట్టి సామర్లకోట మీదుగా వెళ్లే ఏదో ఒక ట్రైన్ ఎక్కించేది. అప్పుడు రీసెర్వే వేషన్స్  లేవు కదా!

          అక్కడ నుండి ప్రయాణం బాగుండేది. ఏలూరు దాటగానే పచ్చని పొలాలు, పంట కాలవలు, తెరచాపలతో సాగె పడవలు, కొంగల బారులు, కొబ్బరి తోటలు, వుదయిస్తున్న  సూర్యుడూ.. ఒక గొప్ప చిత్రకారుడు వేసిన అందమైన చిత్రాలలా…

          వాటికోసం చలిగాలి తగులుతున్నా కిటికీ దగ్గర చేరి చూసేదాన్ని.ఇక్కడ నవ్వొచ్చే సంగతి ఒకటుంది. మా పక్కన కూర్చున్న కొంత మంది ఆడవాళ్లు “మేం గోదాట్లో దిగిపోతాం అమ్మా, మీరు అప్పుడు సర్థుక్కుర్చోవచ్చు.”అనేవారు. మేం ‘గోదాట్లో దిగిపోతారంట ‘ అని కిసుక్కున నవ్వేవాళ్ళం. అమ్మ కళ్ళేర్రజెసేది.

          వాళ్ల ఉద్దేశ్యం గోదావరి స్టేషన్ లో దిగిపోతామని.

          కొవ్వూరు దగ్గర నుండి మరీ సరదా, రైలు అఖండ గోదావరి దాటేది పాత బ్రిడ్జి మీదుగా.

          దానికి అటూ ఇటూ  రైలింగ్ వుండేది కాదు. రైలు ఎక్కడ గోదావరిలో పడిపోతుందో అని తెగ భయం వేసేది.

          అప్పటికే అమ్మని అడిగి నదిలో వేయడానికి రాగి నాణేలు తీసుకుని ఉండేవాళ్ళం.

          అవి విసరగానే అందులో ఈత కొడుతున్న పిల్లలు వాటిని తీసేసుకునేవారు.

          అయ్యో నదికి కోపం వస్తుందేమోనని భలే భయం వేసేది.

          రైలు గోదావరి దాటగానే పెద్ద రిలీఫ్!

          సామర్లకోట రాగానే చెప్పలేని సంతోషం!

          కానీ అక్కడకి మమ్మల్ని రీసీవ్ చేసుకోవడానికి మా హిట్లర్ మావయ్య వచ్చేవాడు.  రైలు దిగగానే  “ఏం చిన్న చెల్లీ, వీళ్ళు నిన్ను బాగా సతాయించారా!” అని అమ్మని అడిగేవాడు.

          మళ్ళీ తనే  “వీళ్లంతా ఫర్వాలేదులే, ఇదిగో.. ఈ నల్లదాంతోనే చిక్కు “అనేవాడు నా వంక అనుమానంగా చూస్తూ. వెంటనే నాలోని సంతోషం మాయమయ్యేది.

          నాకసలు పేరు లేనట్లు, వీళ్లంతా  తెల్లగా మెరిసిపోతున్నట్లు ఎందుకలా హర్ట్ చేస్తారో నాకిప్పటకీ అర్ధం కాదు.

          సరే.. కాకినాడ చేరేకా మా అమ్మమ్మని చూస్తానని, మిగతా అక్కచెల్లళ్ళని కలుస్తాననే సంబరంతో ఆయన మాటని మరచిపోయి కాకినాడకు సామర్ల కోటకు షటిల్ సర్వీస్ చేసే డీజిల్ కార్ ఎక్కాం.

          పోర్ట్ లో ఆగగానే ఎంత ఆనందమో!

          ఉప్పుటేరు దాటి చర్చి స్క్వేర్ లో అడుగు పెట్టగానే రిక్షాలోంచి దూకి మా వీధిలోకి  పరిగెత్తాలనిపించినా.. మా హిట్లర్ మావయ్యకి ఝడిసి కూర్చునేదాన్ని.

          మా కోసం చీకటి పడినా పిల్లలందరూ వీధిలో నిలబడి మమ్మల్ని చూడగానే  కేరింతలు కొట్టేవారు.

          ఆఁ క్షణం మేమందరం మా పెద్ద వాళ్ళసంగతి మరచిపోయి ఒకటే నవ్వులు!

          బాల్యం ఎంత మధురమైంది!

          ఎంత కల్లాకపటం ఎరుగనిది!

          మనుషులెందుకు రాను రాను ద్వేషాసూయాలతో, కక్షలూ కార్పణ్యాలతో  తాము మండిపోతూ పక్కవారి జీవితాల్ని కూడా ఛిద్రం చేస్తారో మా కొందరి బంధువుల గురించి  తర్వాత …

(మరోసారి మీకు విన్నవిస్తున్నాను, ఇదంతా  మీకెవ్వరికీ స్ఫూర్తి దాయాకమని నేను రాయడం లేదు. నా జ్ఞాపకాలని నేనే ఇలా నెమరు వేసుకుంటున్నాను. ముఖ్యంగా నా మనవరాలు ఈషా నా గురించి తెలుసుకోవాలని రాయమని అడిగింది. మా పెద్దలు పిల్లలకి ఏమీ చెప్పనందువల్ల మాకెన్నో విష యాలు తెలియకుండా మరుగున పడి పోయాయి. అందుకే నా ఆరోగ్యం సహకరించకపోయినా నేను కష్టపడి టైపు చేస్తున్నాను. మీరు కూడా అర్ధం చేసుకునే వయసొచ్చాకా మీ మనవలికి వివరించండి. వాళ్ళు తప్పకుండ వింటారు )

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “నా అంతరంగ తరంగాలు-4”

  1. మన అంతరంగతరంగాల్లో మన తదనంతర తరం మునకలు వేయాల్సిందే… మన పిల్లలు మన అంతరంగం తెలుసుకోవటం ఇలా లిఖితపూర్వకంగా నిక్షప్త పరచటం చాలా మంచి ఆలోచన…రచయిత్రికి అభినందనలు💐💐

Leave a Reply

Your email address will not be published.