దేహచింతన

  –చల్లపల్లి స్వరూపారాణి

నిజానికి 
మీకో దేశాన్నే యివ్వాలనుకున్నా
దేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా 
చచ్చినాక పూడ్చుకోడానికి 
ఆరడుగుల నేలకోసం 
యుద్ధాలు చేసే సంతతి
వైద్య విద్యార్దీ!
యిది దేహం కాదు, దేశం 
ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!
దేశం అర్ధమౌతాది 
పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు 
చర్మం సుకుమారి కాదు 
వెన్నపూసల మర్దనా 
నలుగుపిండి స్నానం యెరగదు 
అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో 
ఆరా తియ్ !
యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!
యెన్ని కొంచెపు మాటలు 
రంపంతో కోశాయో!
ఆ గాయాలే సాక్ష్యం  
వూపిరితిత్తులు నవనాడులు 
కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి 
ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం 
రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా 
తిరుగాడిన కాళ్ళు 
యెదురు దెబ్బలతో  నెత్తురు చిమ్మినా 
నడక ఆపని కాళ్ళు  
మొరటు చేతులు 
యింకా మట్టి వదల్లేదు కదూ!
పైకి తేలిన నరాలు తప్ప 
కాస్త నునుపైనాలేని 
ఆ చేతి వేళ్ళు లేడీస్ ఫింగర్స్ కావు 
ఎండుకట్టె పుల్లలు 
పిల్లలూ, 
యెడమ చెయ్యి జాగ్రత్తరో !
వరినాటు, కవిత్వం అల్లిన చెయ్యి 
అర్ధంపర్ధం లేని నీతుల్ని 
కుడికాలితో తన్నిన చెయ్యి
పువ్వుల్నీ నవ్వుల్నీ వర్ణించుకోక  
యెప్పుడూ ఆ దిక్కుమాలిన 
మట్టీ మాశానం చెమటల్ని 
యెందుకు రాయాల్సి వచ్చిందో అడుగు  
and she met the king 
in the capacity of an opponent 
not as slave 

******

Please follow and like us:

3 thoughts on “దేహచింతన (కవిత)”

  1. దేహ చింతన కవిత అక్షర సత్యం.
    చాలా బాగుంది స్వరూపా రాణి గారు
    మీకు అభినందనలు

  2. దేహా చింతన కవిత భావగర్భితంగా సమాజానికి వాతలు పెట్టేలా వుంది. ప్రతి అక్షరంలోను స్వరూపారాణి గారి ఆవేదన స్పష్టమయింది . సూటిగా పదునైన వాస్తవాలను కవిత ద్వారా వ్యక్తిక రించిన రచయిత్రి అభినందనీయురాలు .

Leave a Reply

Your email address will not be published.