కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-7

 -డా. సిహెచ్. సుశీల

ఇల్లిందల సరస్వతీదేవి
          15.8.1947 న భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ పురుషుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా సంతోషంతో అనేక కవితలు, కథలు వెల్లువలా పొంగులెత్తాయి.
 
          స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ సంరక్షణా, దాని కొరకు వచ్చిన సాహిత్యం గురించీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్త్రీల వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీల సాధికారతకై స్వాతంత్రానంతరం కూడా స్త్రీలు పోరాడాల్సిన అవసరం గురించిన సభలు, సాహిత్యం అనివార్యం అయ్యాయి. జనాభాలో సగం శాతంగా ఉన్న స్త్రీలకు స్వతంత్రత ఉంటే గానీ దేశ స్వాతంత్రం వచ్చినా ప్రయోజనం లేదన్న గ్రహింపు సంఘ సంస్కర్తలకు, రచయిత లకు కలిగింది. ఆ సాహిత్య చైతన్యం కవిత్వం, కథలు, నవలలుగా వెల్లి విరిసింది. స్త్రీలు విద్యాభివృద్ధి మరికొంత సాధించగానే దేశంలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక,రాజకీయ పరిణామాల పై అవగాహన అంచెలంచెలుగా పెంచుకున్నారు. స్త్రీలకున్న హక్కులకు సంబంధించిన పరిజ్ఞానం సమాంతరంగా పెరిగింది. వారిలో ధైర్యం, ఆత్మాభిమానం మరింతగా పెరిగింది. కుటుంబ కష్టాలకు, ఆర్థిక సమస్యలకు వెరవకుండా పరిష్కార దిశ గా సామూహికంగా, ఒక్కోసారి ఒంటరిగా కూడ నిలబడ్డారు. దానిని నిరూపిస్తూ, స్త్రీల ఆత్మాభిమానాన్ని గౌరవిస్తున్న కథలను రచయిత్రులు రచించడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు.
 
ఇల్లిందల సరస్వతీదేవి
1918 జూన్ 15 న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన ఇల్లిందల సరస్వతీ దేవి 1939 లో భారతి పత్రికలో ‘పాచిక’ అనే కథతో తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభిం చారు. కథలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు రాసి , ” స్వర్ణ కమలాలు” కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు రచయిత్రి ఆమె. కేంద్ర మరియు రాష్ట్ర చలనచిత్ర అవార్డు కమిటీలలో సభ్యురాలిగా పనిచేసారు. 1958 నుండి 1966 వరకు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కు నామినేట్ చేయబడ్డారు. 1964 లో గృహలక్ష్మి సంస్థ గోల్డ్ బ్యాంగిల్ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీచే 1974 లో ఉత్తమ మహిళా రచయిత్రి అవార్డు పొందారు.
 
అక్కరకు రాని చుట్టము
1951 జూన్ భారతి పత్రికలో “అక్కరకు రాని చుట్టము” ఇల్లిందల సరస్వతీదేవి గారి మంచి కథలలో ఒకటి. సీతమ్మ తన భర్త వెంకట్రావుకి క్షయవ్యాధి ముదిరిపోగా, ఏ చుట్టమూ అక్కరకు రాకపోయినా ధైర్యం తెచ్చుకుని ఒంటరి పోరాటం చేయడం ఈ కథ లోని ఇతివృత్తం.
 
          కామమ్మ గారి పెద్ద కొడుకు వెంకట్రావు ఇంటర్ చదువుతూ ఉండగానే తండ్రి చని పోవడంతో ఇంటికి పెద్దదిక్కయి, దొరికిన బడిపంతులు కొలువుతో వచ్చే కొద్దిపాటి జీతంతో తల్లితో పాటు ఐదుగురిని పోషించే భారం వహించాల్సి వచ్చింది. భర్త బ్రతికి ఉన్నంత కాలం నోరు మెదిపే అవకాశం లేని కామమ్మ తర్వాత ఇంటి అధికారం తన చేతిలోనే ఉన్నట్టు భావించి, ప్రతిదీ ఘనంగా జరగాలని కొడుకు ని ఆజ్ఞాపించసాగింది. వెంకట్రావు తర్వాత ఇద్దరు కొడుకుల చదువులు, ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పెట్టుపోతలు వైభవంగా జరగాలని మంకుపట్టు పట్టేది. ఆమె ధోరణి కనిపెట్టిన చుట్టాలు ఏదో పని మీద వచ్చి రోజుల తరబడి తిష్ట వేసేవారు. వారి అవసరార్థం పొగిడితే పొంగి పోయి మరింత మర్యాదలు చేసేది. వెంకట్రావుకి సరిపోయిందే భార్య సీతమ్మ. మరుదు లిద్దరికి ఉద్యోగాలు వచ్చి, పెళ్ళిళ్ళయి వేరు కాపురం పెట్టినా పెద్దకోడలుగా ఆమె బరువు బాధ్యతలేమీ తగ్గలేదు. తమ ఇద్దరు మగపిల్లలకు ఏ అచ్చటాముఛ్చటా తీర్చలేక భార్యా భర్తలు పని యంత్రాల్లా మారిపోయారు. అనారోగ్యంతో మంచాన పడిన కామమ్మ వైద్య ఖర్చులకు, ఆమె చనిపోయిన తర్వాత పది రోజులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహణలో పదివేల పైన అప్పు తేలింది. చెప్పలేక చెప్పలేక తమ్ముళ్ళకి చెబితే, తమకు సంబంధం లేదనడమే కాక నిష్ఠూరాలాడి పోయారు.
 
          ఆర్థిక ఇబ్బందులతో, అప్పులు తీర్చే ఒత్తిడిలో, సరియైన ఆహారం లేక, ఆరోగ్యాన్ని పట్టించుకోక ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు వెంకట్రావు.
 
          భూదేవంత సహనంతో, పిల్లలను సముదాయించుకుంటూ, గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్న సీతమ్మ కి భర్త అనారోగ్యం ఏమిటో అర్థం కాలేదు. వెంకట్రావు  ఓపిక లేక నెలరోజుల పాటు సెలవు పెట్టడంతో మరింత కష్టతరం అయింది.
 
          ఆరేళ్ళుగా పక్క పోర్షన్ లో ఉంటున్నా ఏనాడు తమ పరిస్థితిని తెలియనివ్వని సీతమ్మ మొదటిసారిగా పక్కింటి ప్రకాశరావు ఎదుటికి వెళ్ళి కంగారుగా చెప్పింది – వెంకట్రావుకి జ్వరము, దగ్గు తీవ్రంగా ఉందని. ఆమె పట్ల గౌరవంతో వెంటనే వచ్చి చూసిన ప్రకాశరావు, వెళ్లి డాక్టర్ ని పిలుచుకుని వచ్చాడు. 15 రూపాయలు తీసుకుని, పరీక్షించి క్షయవ్యాధి అని నిర్ధారించి, స్పెషలిస్ట్ కి చూపించమని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రకాశరావు పెద్దడాక్టర్ ని తీసుకొని వచ్చాడు. అతను ఇంజెక్షన్ ఇచ్చి, ఫీజు తీసుకొని, శానిటోరియమ్ లో చేర్చమని. ప్రస్తుతం బెడ్స్ ఖాళీ లేవని, దొరికినప్పుడు రికమెండ్ చేస్తానని చెప్తాడు. తరచుగా వచ్చి ఇంజెక్షన్స్ చేస్తున్నాడు, సీతమ్మ డబ్బు ఇస్తోంది. ఆమె కష్టం చూసి జాలి పడతాడు ప్రకాశరావు. ఒకరోజు ఆమె చేతికి రెండు బంగారు గాజులు లేకపోవడం చూసి వెంకట్రావు అడిగాడు. బంగారం అమ్మి ఎంతకాలం వైద్యం చేయిస్తావు అని బాధ పడతాడు. ఇంకో చేతికి ఉన్నాయిగా అంటుంది నిబ్బరంగా.
 “అంతా ఖర్చు చేయకు. ఆ పది రోజులు చాలా ఖర్చులుంటాయి” అంటున్న భర్త మాటలు అర్ధం కాలేదామెకు. రోజు రోజుకు క్షీణించిపోతున్ప వెంకట్రావు ఆరోగ్యం పరిస్థితి, ఆ ఇల్లాలి సంగతి గమనించిన ప్రకాశరావు ఈ విషయం చుట్టాలకు తెలియజేయాలని అడ్రసులు అడుగుతాడు. ‘వాళ్ళు రారు లెండి’ అంటాడు వెంకట్రావు. బలవంతాన అడ్రసులు తీసుకొని ఉత్తరాలు రాస్తాడు.
 
          శానిటోరియమ్ లో ఖాళీ దొరికిందని చెప్తాడు డాక్టర్. అక్కడకు వెళితే మంచి మందు లతో భర్తకు నయమైపోతుందన్న నమ్మకంతో, ఆనందంగా అన్ని సర్దుకుంది సీతమ్మ. మంగళసూత్రాలు పసుపు తాడులోకి ఎక్కించి బంగారు గొలుసు అమ్మి డబ్బు సమకూర్చు కొంది. రాత్రి నుండి తీవ్రమైన దగ్గు, ఆయాసం ఎక్కువైన వెంకట్రావు ప్రాణాలు విడిచాడు. కారు తెచ్చిన ప్రకాశరావు అతన్ని లేవదీయబోయి, విషయం గ్రహించాడు. సీతమ్మ కుప్పకూలి పోయింది.
 
          వెంకట్రావుకి ఆరోగ్యం బాగా లేదని ఎన్ని ఉత్తరాలు రాసినా రాని చుట్టాలు చని పోయాడన్న వార్త తెలియగానే వచ్చి వాలిపోయారు. అన్నీ శాస్త్రయుక్తంగా జరగాల న్నారు. బంగారం అమ్మిన బాపతు పైకంతో కొడుకు చేత కర్మలు చేయించింది సీతమ్మ.
“మరొక యేభయి రూపాయలు ఖర్చు అయినా మంచి గోవును దానం యిస్తే పుణ్యమూ పురుషార్ధమూనూ” అంటూ దగ్గర ఉండి కర్మకాండ చేయించి మరీ యిళ్ళకు వెళ్ళారు బంధుజనం “.
 
          సీతమ్మకు వెంకట్రావు తుది మాటలలోని అర్ధము అప్పుడు గ్రాహ్యమైనది – అంటూ కథ ముగించారు రచయిత్రి.
 
          వెంకట్రావు జీవితమంతా చుట్టాలకు మర్యాదలు, పెట్టుపోతలతో గడిచిపోయింది. అతని కష్టాల్లో గానీ, అప్పుల్లో గానీ, అనారోగ్యంలో గానీ చివరికి మరణంలో గానీ ఏ చుట్టమూ అక్కరకు రాలేదు. సీతమ్మకు ఆండగా నిలవలేదు. ఆత్మాభిమానం గల ఆమె జీవితం అంతటా భర్తకు చేదోడువాదోడుగా నిలబడింది. రోగగ్రస్తుడైన భర్తకు సేవ చేసింది. చుట్టాలకు, చివరకు ఆరేళ్ళుగా పక్కింటిలో ఉన్న ప్రకాశరావుకి కూడా ఏ విషయ మూ తెలియకుండా తనకు తను ధైర్యం చెప్పుకుంటూ జీవన పోరాటం చేసింది. ఆత్మ గౌరవానికి భంగం కలుగకుండా ఉన్నతంగా ప్రవర్తించింది. వెంకట్రావు చెప్పినట్లు అలాంటి సమయంలో “అక్కరకు వచ్చిన చుట్టము” ఆమె కున్న కొద్దిపాటి బంగారం, దానిని అమ్మగా వచ్చిన డబ్బు.
 
          కామమ్మకున్న వ్యర్థమైన బంధుప్రీతి, కీర్తికండూతి, వెంకట్రావుకున్న మెతకతనం, పేదరికంతో పోరాడే సీతమ్మ నిబ్బరం, అన్నిటికంటే మానవ సంబంధాలలోని బోలుతనం ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి.
 
          శ్రీమతి శీలా సుభద్రాదేవి అన్నట్లు – ” సుమారు ఏడు  దశాబ్దాల సాహితీ యాత్రలో సాహిత్య పరిణామక్రమాన్ని గమనిస్తూ, అనుసరిస్తూ, పాత్రల మనోభావాల్ని, మానవ సంబంధాల్ని తీర్చిదిద్దారు రచయిత్రి. మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్య లను తీసుకొని సమాజ పరిణామ క్రమంలోనే ఇతివృత్తానికి తగినట్లుగా పాత్రల్ని, సంఘ టనల్ని, సంభాషణల్ని సమకూర్చారు. సామాన్య జన జీవన విధానం, వారి ఆలోచన విధానం, మానసిక సంఘర్షణలు, ఆర్థిక సంక్షోభాలు, అంతులేని ఆవేదనలు, ఆశ నిరాశలు, ఆశావాదంతో కూడా కట్టుకున్న దృఢ చిత్రాలు, ఇలా ఎన్నో జీవన చిత్రాలు ఏమాత్రం భేషజం లేకుండా భాషా పటాటోపం లేకుండా, అప్పుడప్పుడే చదువుకుం టున్న స్త్రీ లలో ఆత్మవిశ్వాసం, అస్తిత్వ భావనలకూ సమాజ సంప్రదాయాలకూ,ద్వంద్వ భావనలతో సంశయాత్మకమైన… ఆలోచనల్ని మనోవిశ్లేషణాత్మకంగా ఆవిష్కరించారు శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి.”
 

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

2 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-7 ఇల్లిందల సరస్వతీదేవి”

  1. నేను అభిమానించే ఆనాటి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవి గారి మంచి కథని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సుశీలగారూ

    1. ధన్యవాదాలండీ సుభద్రాదేవిగారు.

Leave a Reply

Your email address will not be published.