యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-7

సిడ్నీ (రోజు-2)సిటీ టూర్ తరువాయి భాగం

మొత్తం సిడ్నీ సిటీ టూరులో ఒకట్రెండు చోట్ల మాత్రమే దిగి నడిచేది ఉంది. మొదట  ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి లని పక్కపక్కన ఆవలి తీరం నించి చూడగలిగే మిసెస్ మెక్ క్వేరీస్ పాయింటులో అటూ ఇటూ తిరిగి రావడానికి 30 నిమిషాల పాటు సమయం ఇచ్చారు. అక్కడ కాస్త కిందికి దిగుతూనే రాళ్ళ తీరంలో అలల్ని స్పృశించొచ్చు. అలా మొదటసారి ఆస్ట్రేలియా సముద్రజలాల్ని తాకేం.  

          రెండో స్టాపు బాత్రూము కోసం పది నిమిషాల బ్రేకుగా కెఫె & పార్కు ఉన్న రోజ్ బే (Rose Bay) అనేచోట ఆపేడు. అక్కడికి చేరగానే హఠాత్తుగా విసురు గాలి వీయసాగింది. సిడ్నీలో వాతావరణం చాలా హఠాత్తుగా మారిపోతూ ఉంటుందని చెప్పేడు. చక్కగా ఎండ కాస్తుంటే ఇలా అంటాడేవిటని అనుకున్నాం. అదేవిటో మరికాస్సేపట్లో అర్థమైందిమాకు.

          ఉదయం 9.30 కావస్తుండడంతో కాస్త కాఫీ తాగాలనిపించినా ఎక్కువ సమయం లేక వ్యానెక్కాల్సొచ్చింది. రాబోయే స్టాపు బోండై బీచిలో తగినంత సమయం ఇస్తానని గైడు చెప్పాడు. 

          మధ్యలో ఫోర్సిత్ పార్కు దరిదాపుల్లో రోడ్డు సైడున ఆపి దూరంగా కనిపిస్తున్న సిడ్నీ సిటీ వ్యూని ఫోటోలు తీసుకోమని రెండు నిమిషాల సమయం, ఫోర్సిత్ పార్కు అనేచోట డాల్ఫిన్స్ నోస్ లా సముద్రంలోకి చొచ్చుకొచ్చిన పర్వత భాగాన్ని, దిగంతాల వరకు విస్తరించిన సాగర సౌందర్యాన్ని కళ్ళనింపుకున్నా, ఫోనులో బంధించుకున్నా మరో రెండు నిమిషాలు అంటూ ఉరుకులు పరుగులు పెట్టించాడు. 

          1818 లో నిర్మితమై, ఆస్ట్రేలియాలోనే మొట్టమొదటి లైట్ హౌసయిన మెక్ క్వయిర్ లైట్ హౌస్ ని వ్యానులో నుంచే చుట్టూ తిప్పి అయిపోయిందనిపించాడు. 

          ఇక అంతా ఎదురుచూస్తున్న విశేషమైన బోండై బీచి (Bondi Beach) అమెరికన్లు బోండై అని పిలిచినా నిజానికి “బోండి బీచి” అని ఆస్ట్రేలియన్ ఏక్సెంటులో చెప్పేడు. బోండై ఏవిటి, బోండి ఏవిటి అసలీ పేరేమిట్రా “బోండా” లాగా అని నవ్వుకున్నాం మేం. కానీ స్థానిక అబోరీజినల్ భాషలో “బూండి” (Boondi) అనే పదం నించి బోండి (Bondi) వచ్చిందట. ఆ పదానికి ఇంగ్లీషు అర్థం సర్ఫ్ అట. అంటే “సముద్ర తరంగం” అన్నమాట.  

          మొత్తానికి ఇది సర్ఫింగ్ బీచి. సిడ్నీ సెంట్రల్ నించి దాదాపు ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉంది. విశాలంగా తీరం లోపలికి విస్తరించి అలలతో అలరిస్తున్న తెల్లని, మెత్తని ఇసుక ప్రత్యేకమైన అందాన్ని సంతరించిపెట్టింది. నీళ్ళు మాత్రం కాలిఫోర్నియా సముద్ర తీరంలోలాగా చల్లగానే ఉన్నాయి. 

          వ్యాను దిగి అయిదు నిమిషాల పాటు ఇసుకలో నడిచి, నెత్తిన మూడుసార్లు నీళ్ళు చల్లుకుని, కాళ్ళు ముంచేమనిపించి వెనక్కి తిరిగి వచ్చేసరికే అరగంటా అయిపోయింది. సిరి మాత్రం అర్జంటుగా ఇసుకలో కూర్చుని గూడు కట్టడం మొదలెట్టింది. ఆ పిల్లని అక్కణ్ణించి లాక్కొచ్చేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. ఉన్నట్టుండి ముసురుగా మేఘాలు ఎక్కణ్ణించో రాసాగేయి. ఇక కాఫీ మాట దేవుడెరుగు అనుకుని త్వరత్వరగా వెనక్కి వచ్చి వ్యానులోకి ఎక్కబోయే ముందు ఎక్కణ్ణుంచో టప్ మని ఒక చినుకు వచ్చి మీద పడింది. 

          సరిగ్గా వ్యాను బయలుదేరిన అయిదే నిమిషాల్లో భయంకరమైన తుఫాను లాంటి వాన మొదలయ్యింది. కరెక్టుగా అరగంట దూరం వచ్చేసరికి వ్యాను చక్రాలు మునిగిపోయి నన్ని నీళ్ళు రోడ్ల మీద!  భలే ఆశ్చర్యం వేసింది. అప్పటిదాకా ఎండ కాసిందంటే ఎవరూ నమ్మరన్నమాట. అంతే విచిత్రంగా సరిగ్గా గంటలో ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది వాన. 

          దార్లో సిడ్నీలో ఇళ్ళ రేట్లు, అద్దెలు ఎలా ఉంటాయో చెప్తూ సామాన్యులకి సిటీలో బతకడం ఎంత కష్టమో చెప్పుకొచ్చేడు గైడు. ఇక్కడ నెలకొకసారి కాక, ప్రతి వారాంతం లోనూ అద్దె కట్టాలట. ఒక్క గదికి వారానికి 800 డాలర్లు అద్దె ఉంటుందట. వారమంతా కష్టపడినా ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుందని వాపోయాడు. 

          మాతో వచ్చిన వాళ్ళలో ఇద్దరు కెనెడియను మహిళలున్నారు. దాదాపు డెబ్బై య్యేళ్ళుంటాయేమో ఇద్దరికీ. రెండేళ్ళ క్రితం కొద్ది వ్యవధిలోనే ఇద్దరి సహచరులూ గతించారట. ఎన్నాళ్ళుగానో అంతా కలిసి  చెయ్యాలనుకున్న యాత్రని వీళ్ళు పూర్తి చెయ్యడానికి వచ్చారట. వాళ్ళు సిడ్నీ నించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలని మొత్తంగా చుట్టి వచ్చే మూడునెలల క్రూయిజ్ ఆ సాయంత్రం ఎక్కబోతున్నామని చెప్పేరు. ఒక్కొక్కళ్ళకి ఇరవై వేల డాలర్ల టిక్కెట్టని చెప్పేరు. దార్లో వాళ్ళు వేసుకున్న టీ షర్టులు సిడ్నీ అని రాసి ఉండి, ఆకర్షణీయంగా ఉండడంతో ఎక్కడ కొన్నారో అడిగేను. “మార్కెట్ సిటీ” (Market City) అన్న బోర్డు చూపించేరు వాళ్ళు. అక్కడ పెద్ద మార్కెటు ఉంటుందని, చవకగా చాలా వస్తువులు దొరుకుతాయని చెప్పేరు వాళ్ళు. ఆ వయసులో చక్కగా ఉత్సాహంగా చూడాలనుకున్న ప్రదేశాలని చుట్టి రావాలనుకుంటున్న వారిని  మనసారా అభినందిస్తూ వాళ్ళ దగ్గరి నించి  వీడ్కోలు తీసుకున్నాం. వాళ్ళు వాళ్ళ హోటలు దగ్గిర దిగిపోయారు. మేం తిరిగి హోటలుకి కాకుండా మా టూరులో చివరి స్టాప్ అయిన డార్లింగ్ హార్బరులో దిగుతామని చెప్పడంతో దాదాపు 11.30 ప్రాంతంలో సిడ్నీ సెంట్రల్ ప్రాంతాల్లోని డార్లింగ్ హార్బరు దగ్గరలో రోడ్డు పక్కన మమ్మల్ని డ్రాప్ చేసేడు. 

          డార్లింగ్ హార్బరులో చుట్టుపక్కల ప్రాంతం నించి పడవల రాకపోకలే కాకుండా ఆక్వేరియం, మ్యూజియంమ్స్, జెయింట్ వీల్ వంటి ఆకర్షణలు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అయితే పెద్ద వర్షం పడి వెలవడం వల్లనో ఏమో జనం బొత్తిగా లేరు. 

          మరో గంటలో మధ్యాహ్న భోజన సమయానికి ఏదైనా చోటికి వెళ్లాల్సి ఉండడంతో పిల్లలు ఆక్వేరియంకి వెళదామంటూ పేచీ పెడుతున్నా ‘ముందు భోజనం’ అంటూ దారి తీసాను. కానీ అక్కడ మేం ఇష్టంగా తినగలిగేవేవీ ఓ పట్టాన కనిపించలేదు. 

          దాంతో దగ్గర్లోని చూడదగ్గ విక్టోరియా మార్కెట్ కి నడిపించాను. ఈ మార్కెట్ గురించి ఎన్నో వీడియోల్లో విశేషంగా చెప్పగా తప్పనిసరిగా చూడాలనుకున్న ప్రదేశంగా రాసు కున్నాను మరి!  

          విక్టోరియా మార్కెట్ బిల్డింగు 1893-98 ప్రాంతంలో కట్టబడింది. విక్టోరియా శకానికి చెందిన గొప్ప పురాతన భవనాల్లో విశేషంగా పేరు గాంచిన కట్టడాల్లో ఇదొకటి. మూడంత స్తుల్లో అత్యంత సుందరమైన రాజ ప్రసాదాన్ని తలపించే రీతిలో నిర్మింబడింది. ఏ అంతస్తులో నుంచి చూసినా మధ్య నుంచి కింది అంతస్తులన్నీ కనిపించేలా నడవాలు  ఉంటాయి. పైన ఎత్తైన అద్దాల గోపురంలో నుంచి వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ చుట్టూ గోడలకు, రైలింగులకు ఉన్న రంగుటద్దాల డిజైన్ల మీద మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది. భవంతికి ఒక వైపుగా క్వీన్ విక్టోరియా సహజంగా అక్కడ కూర్చున్నట్టుగా భ్రమించజేసే విగ్రహంతో పాటుగా చుట్టూ ఆవిడ ధరించిన కిరీటాల నమూనాలు ఉంటాయి. రాయల్ గడియారం అన్ని అంతస్తుల నించి కనిపించే విధంగా పై కప్పు నించి ఠీవిగా వేళ్ళాడుతూ ఉంటుంది. ఈ భవంతిని ఎన్నోసార్లు రీ మోడల్ చేస్తూ వస్తూ కాపాడుతున్నారట. 

          డార్లింగ్ హార్బరు నించి పది పదిహేను నిమిషాల నడక దూరంలో ఉన్న చూడదగ్గ  షాపింగ్ మాల్ అది. క్వీన్ విక్టోరియా బిల్డింగ్ Queen Victoria Building (QVB) అని పిలుచుకునే ఆ మార్కెట్ లో వస్తువులు కొనడానికి రేట్లు చేతులు కాలేట్లు ఉన్నా తినడానికి మాత్రం మంచి ఫుడ్ దొరికింది. బెల్లం పాకం పట్టినట్లున్న కారమెల్ కోటెడ్ క్యాషూలు, రకరకాల ఫ్రైడ్ సీ ఫుడ్ ఐటమ్స్, సాండ్ విచెస్, నూడుల్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, థాయ్ పెరల్ టీ, కాఫీ  ఇలా ఎవరికి ఏం కావాలో అన్నీ సుష్టుగా ఆరగించాం. ఫుడ్ అక్కడు న్నంత రుచికరంగా ఆస్ట్రేలియాలో మరెక్కడా లేదు. 

          అప్పటికి దాదాపు రెండు కావొచ్చింది. అయినా అలసట కలగలేదు మాకు. పిల్లలు మాత్రం వేళ్ళాడడం మొదలుపెట్టారు. ఇక తప్పక హోటలుకి వచ్చి పిల్లల్ని వొదిలి మార్కెట్ సిటీ కోసం మళ్ళీ నడక మొదలెట్టాం. 

          తీరా చూస్తే మార్కెట్ సిటీ మా హోటలు పక్క సందులోనే ఉంది. ఒక పెద్ద వీథి మొత్తం ఆ మూలనించి ఈ మూలకి విస్తరించి ఉన్న పెద్ద భవంతిలో కింది అంతస్తులో  ఆ మార్కెట్ ఉంది. ఇంతకీ అక్కడ ఆ సదరు మార్కెట్ కేవలం బుధవారం నించి ఆదివారం వరకు మాత్రమే తెరిచి ఉంటుందట. ఆ రోజు సోమవారం. మేం బుధవారం మధ్యాహ్నం సిడ్నీ నించి మరో ప్రదేశానికి వెళ్ళిపోతాం. వెళ్ళేలోగా ఇక్కడికి రావాలను కుని పై అంతస్తుల్లో ఉన్న ఇతర షాపుల్ని సందర్శించి వచ్చేసేం. సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి అరచెయ్యి వెడల్పున్న మామిడి పండొకటి అయిదు డాలర్లు పెట్టి కొన్నాం. విచిత్రంగా మంచి వాసన  వస్తున్నంత  తియ్యగా లేదు పండు. మేం ఎక్కడికి వెళ్ళినా అక్కడి వెరైటీ పళ్ళ కోసం వెతుకుతాం. తీరా చూస్తే కివీ, బొప్పాయి, పైనాపిల్, నారింజ అంటూ దాదాపుగా అన్నీ అమెరికాలో దొరికేవే కనిపించాయి. 

          వెనక్కి వస్తూనే త్వరత్వరగా రెడీ అయ్యి సిడ్నీకి ముప్ఫై మైళ్ళ దూరంలో ఉన్న హైదరాబాద్ హౌస్ ఇండియన్ రెస్టారెంటుకి ఊబర్ లో బయలుదేరేం. అమెరికాలో కంటే ఆస్ట్రేలియాలో ఊబర్ ఛార్జీలు ఎక్కువే అనిపించాయి. అన్నట్టు ఇలా మరో దేశానికి వెళ్ళినపుడు సెల్ ఫోనులో డేటా కావాలంటే, అంటే ఊబర్, వాట్సాపు వంటి సర్వీసుల కోసం వైఫై లేనిచోట్ల వాడుకోవడానికి  మాములు సెల్ ఫోన్  రోమింగ్ ప్లానైతే రోజుకి $10 అమెరికను డాలర్లు అవుతుంది. అలా కాకుండా ఈ -సిమ్ డేటా ప్లాన్ ద్వారా 3 జిబి డేటా  30 రోజుల వరకు $10 కే వస్తుంది. ఆ విషయం కొంచెం ఆలస్యంగా తెలుసుకున్న మేం రోమింగ్ పొరబాటున వాడేసి నాలుక్కరుచుకున్నాం. 

          ఇక సరిగ్గా అనుకున్న ఏడు గంటల సమయానికి రెస్టారెంటుకి చేరుకున్నాం. వర్కింగ్ డే అయినా తప్పనిసరిగా కలవాలని ఆ సాయంత్రం డిన్నర్ కి సాదరంగా ఆహ్వానించిన విజయమాధవి గొల్లపూడి గారిని, వారి కుటుంబాన్ని అక్కడ కలిసేం. ముచ్చటయిన వారి ముగ్గురమ్మాయిలు, మా ఇద్దరమ్మాయిలు కాస్సేపట్లోనే మంచి మిత్రులయిపోయేరు. ముఖ్యంగా వారి కవల పిల్లలు, మా పెద్దమ్మాయి వరూధిని కాలేజీ రెండవ సంవత్సరంలోనే ఉండడం వల్ల వాళ్ళ కబుర్లకి అంతూ పొంతూ లేకుండా పోయింది. ఇక విజయమాధవి, ఈ గీతామాధవి కలిసిన విశేషం ప్రత్యేకంగా చెప్పాలా!  అత్యంత స్నేహశీలి విజయ గారిని కలవడం గొప్ప ఆనందాన్ని కలగజేసింది. వారి తల్లిదండ్రులైన పెయ్యేటి రంగారావు, శ్రీదేవి గార్లు రాసిన కథల పుస్తకాలతో బాటూ, పిల్లలకి తినడానికి అంటూ ఏవేవో తెచ్చి ఇచ్చి, చక్కని చెదరని నవ్వు ముఖంతో కబుర్లు చెప్పే విజయగారి ప్రేమ ఉక్కిరిబిక్కిరి చేసింది నన్ను. చిన్నప్పట్నుంచి పుస్తకాలే అత్యంత విలువైనవిగా పెరిగిన నేను నా గుర్తుగా విజయగారికి నా పుస్తకాల్ని బహూక రించాను. రూపురేఖలు తప్ప సంగీతం, సాహిత్యం లాంటి ఎన్నో ఇష్టమైన విషయాల్లో మా ఇద్దరికీ పోలికలు, ఒకేలాంటి అభిరుచులుండడం తెల్సుకుని ఆశ్చర్యచకితులయ్యేం. చివరికి మా ఇద్దరి సహచరుల పేర్లు కూడా సగం ఒక్కలాగే  ఉండడం చూసి చాలా సంతోషించాం. కథలు, కవిత్వం, సాహిత్య కార్యక్రమాలు, నెచ్చెలి పత్రిక, టాక్ షోలు అంటూ మనసారా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. 

          మా సిడ్నీ ప్రయాణంలో ఆ సాయంత్రం ఒక మరపురాని మధురానుభూతిని కలుగజేసింది మాకు. 

          తిరిగి హోటలుకి వచ్చేసరికి రాత్రి పదయ్యింది. పిల్లలు దార్లోనే నిద్రపోయినా టాక్సీ హోటలుకి చేరగానే వెంటనే లేచి బుద్ధిగా మా కూడా నడిచేరు. మర్నాడు బాగా పొద్దున్నే లేచి మేం రోజు మొత్తం పెద్ద టూరుకి వెళ్లాల్సి ఉన్నా చీకటి అద్దాల్లోంచి చిరు దివ్వెల్లా మెరుస్తున్న  సిడ్నీ నగర అందాల్ని చూస్తూ కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాం.

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.