నా అంతరంగ తరంగాలు-16

-మన్నెం శారద

తనివితీరలేదే …నా మనసునిండలేదే ….

(మరోమంచి.. మంచి గంధం  లాంటి  జ్ఞాపకం )

***

           సినీనటి,  సీరియల్స్ నిర్మాత  రాధిక గారి నుండి ఒక కథ కోసం నాకు  పిలుపు వచ్చింది .

           అదివరకయితే అక్కయ్య , బావగారు ఉండేవారు ,సెలవులకి చెన్నై చెక్కేస్తుండే వాళ్ళం. కానీ బంగారం లాంటి మా అక్కయ్య మణిమాల, మా పెదనాన్నకు అత్యంత  ప్రియమైన కూతురుహార్ట్ ప్రాబ్లెమ్ తో అకస్మాత్తుగా మమ్మల్ని వీడిపోయింది. నన్ను ఎంతగానో ప్రేమించే అక్కయ్య చనిపోయాక నాకు ఒక రెక్క తెగిపోయినట్లే అయ్యింది.

           అక్కయ్య చనిపోయాకా హబీబుల్లా రోడ్ లో నడిగరి సంగం ముందు వున్న ఆ అందమైన ఆ ఇంటిని అమ్మేశారు. ఆ  ఇంటికి రాడాన్  సంస్థ, సావిత్రి, ఎస్వీర్, ఎన్టీఆర్ ఇళ్ళు చాలా దగ్గర!

           నా వానకారుకోయిల నవల  తమిళుల చాలా మంది దృష్టిలో పడింది.

           కారణం నటి సువర్ణ ! ఆమె వానకారుకోయిల నవల చదివి సీరియల్ గా తియ్యాలని ఆ కథ హక్కుల కోసం నాదగ్గరకొక రచయితని పంపించారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆయన చేస్తున్నట్లుగా చెప్పారు. అసలా కధ సీరియల్ గా తియ్యాలనుకోవడానికి కారణం నా కథ లోని ఇల్లు సరిగ్గా సువర్ణ పాలస్ లానే వుండడమే ముఖ్య కారణం! సువర్ణ పాలస్ San Thom బీచ్  రోడ్డులో ఉంటుంది. అది వారి  అత్తగారివల్ల సంక్రమించిన ఆస్తి! సువర్ణ మామగారు మైసూర్ మహారాజాగారి పేలస్  లో దివానుగా పనిచేయడం వలన, వారి  అబ్బాయి విజయ్ ని సువర్ణ వివాహం చేసుకోవడం వలన వారికా ఆస్తి సంక్రమించింది.

           విజయ్ కూడా చాలా మంచి వ్యక్తి!, నిగర్వి!

           ఆ ఇంట్లో చాలా ఖరీదయిన గోల్డ్ ఫ్రెమ్ చేసిన పెయింటింగ్స్, పాలరాతి, ఏనుగు దంతాలతో చేసిన శిల్పాలు, ఒక్కసారే  ఓ ముప్పైయి మంది భోంచేసే టేబుల్, ఖరీద యిన వెండి డిన్నర్ సెట్స్. అలా చాలా చాలా ఉండేవి.

           అన్నిటికన్నా ఎంట్రన్స్ లో వున్న స్టఫ్ చేసిన తొండమెత్తి వున్న రియల్ ఏనుగు తల పెద్ద ఆకర్షణ! అలాగే ఏనుగు కాళ్ళతో మోడాలు కూడా వున్నాయి.

           ఏనుగు చనిపోయాక విదేశం పంపించి అలా చేయించారట.

           ఆ యింట్లో చాలా సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ జరుగుతుండేవి.

           మండలాధీశుడి షూటింగ్ కూడా అక్కడే జరిగింది.

           అప్పడే వారింట్లో వున్న నిలువెత్తు బంగారు గడియారం కొనడానికి చిరంజీవి గారి భార్య శ్రీమతి సురేఖ గారు , వారి వదినగారు అక్కడకి వచ్చారు.

           సువర్ణ నన్ను వారికి పరిచయం చేశారు. సురేఖ గారు చాలా నిగర్వి.

           ” సువర్ణ ఒక్కరే మీ ఫ్రెండ్ కాదు, మీరూ మాకు స్నేహితులే… మా  ఇంటికి రండి ” అని ఆమె సాదరంగా ఆహ్వానించడం నేను ఎప్పటికీ మరచిపోలేను.

           సరే అసలు విషయానికొస్తే సువర్ణ క్లాస్మేట్, డైరెక్టర్ భాస్కర్ వలన నటుడు కార్తిక్ నా వానకారుకోయిల కథ వినడం , సినిమా తియ్యాలని అనుకోవడం ఇంకా కొంత మంది ఆ కథ వినడం …అలా మొత్తానికి రాధికగారు తెలుసుకుని దాని గురించి వాకబు చేసి నన్ను రమ్మని పిలవడం జరిగింది .

           రాడాన్ సంస్థ చాలా పెద్ద సంస్థ!, అందులో రాధిక గారు నా అభిమాననటి . అందుకే సువర్ణ గారింటిలోనే దిగి వెళ్ళాను, సువర్ణ అప్పటికీ, ఇప్పటికీ నన్ను మంచి స్నేహితురాలిగానే చూస్తారు ,

           మర్నాడు చిత్తి [తెలుగులో పిన్ని ] సీరియల్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళాను. పిన్ని సీరియల్ డైరెక్టర్ C. J భాస్కర్  కి నేను చాలా  పెద్ద ఫాన్ ని. ఆయన్ని కూడా చూడొచ్చని  నాకు చాలా సంతోషంగా వుంది.

           శివాజీగణేషన్ గారి ఇల్లు దాటాకా ఏదో ఒక పెద్ద ఇంట్లో షూటింగ్ జరుగుతున్నది . చాలా కోలాహలంగా పెళ్ళి ఇల్లులా సందడిగా వుంది. అందరూ టిఫిన్స్ తింటున్నారు . చాలా మంది తమిళ ఆర్టిస్టులు !

           రాధిక చెల్లెలు నిరోషా చాలా హడావుడి చేస్తూ జోక్స్ వేస్తూ కలయతిరుగుతున్నారు. 

           నేను  అక్కడే  ఒక  కుర్చీలో కూర్చున్నాను. సుధాకర్ గారు అక్కడే వున్నారు. నాకు  ఆయనతో వ్యక్తిగత పరిచయం లేదు. కానీ చాలా విచిత్రంగా అయన లేచి నా దగ్గరకి  వచ్చి ఎంతో వినయంగా చేతులు జోడించి నమస్కరించి “బాగున్నారా శారద గారూ “అంటూ పలుకరించారు. నేను ప్రతి నమస్కారం చేసి లేచి నిలబడబోతుంటే ఆయన  వారించి నా పక్కనే వున్న కుర్చీలో కూర్చుని నేను వస్తున్నట్లు రాధిక గారు చెప్పినట్లు  చెప్పారు. మిగతా తమిళ్ ఆర్టిస్టులు కూడా సుధాకర్ గారిని నా గురించి అడిగి  తెలుసు కున్నారు. అందరూ  ‘తెలుగు  రైటర్ ‘ అని చెప్పుకుంటుండగానే రాధిక గారు వచ్చేసారు. సుధాకర్ గారు నన్ను పరిచయం చేశారు.

           నేను ఆమెకోసం ప్రత్యేకంగా పెయింట్ చేసిన పట్టుచీర ఇచ్చాను. రాధిక  గారు  మురిపంగా భుజం మీద వేసుకుని చూస్తుండగా నిరోష రివ్వున వచ్చి నాది అని పట్టుకు పోయారు.

           రాధికగారు మేము అంతా డైనింగ్  టేబుల్ చుట్టూ కూర్చుని కథ గురించి  మాట్లాడు కున్నాం. రాధిక గారికి కథ బాగా నచ్చింది.

           “మీ ఇంట్లో సదరు డైరెక్టర్ గారికి  కథ వినిపించే ఏర్పాటు  చేస్తారా “అని సుధాకర్  గారిని అడిగారు రాధిక. 

           ” sure  sure  “అని చెప్పారు సుధాకర్  గారు.

           మర్నాడు అనుకున్న టైంకి  కాస్త  ఆలస్యంగా సుధాకర్ గారింటికి నేను ఆటోలో  చేరుకున్నాను. ఎక్కడికో కారులో వెళ్ళబోతున్న సుధాకర్ గారు నన్ను చూసి కారు రివర్స్  చేసి నా ఆటో ముందు ఆపి దిగి నా దగ్గరకు వచ్చి ఆటోలోకి వంగి నమస్కరించి “రండి   రండి శారద గారూ రండి ” అని ఆహ్వానించారు. ఇదంతా ఇంత వివరంగా ఎందుకు  చెబుతున్నానంటే వారి సంస్కారం, సభ్యత తెలియజెప్పడానికి మాత్రమే.

           వాకిట్లోనే ఎదురొచ్చి చిరునవ్వుతో లోనికి ఆహ్వానించారు వారి శ్రీమతి  శైలజ.  శైలజగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ మర్యాదా , వినయం, పెద్దతరహాగా మాట్లాడటం, అన్ని పరిస్థితులని అర్ధం చేసుకోవడం… ఇప్పటికీ మరచి పోలేను.

           ఆ ఇంట్లో  కృతకమైన సినిమా వాతావరణం ఏమీ లేనే లేదు. స్వయంగా  గాయని  అయినా ఒక గొప్ప ఇండియన్  సింగర్  చెల్లెలని, ఒక కేరక్టర్ యాక్టర్ భార్యనని ఆమెలో  లవలేశమైనా గర్వం లేనేలేదు.

           అక్కడే  డైనింగ్  టేబుల్  చుట్టూ వాళ్ళమ్మగారు, పిన్ని గారు, సుధాకర్  గారి  అమ్మగారు తదితరులంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతో చక్కటి  కుటుంబ వాతావరణం కనిపించిందక్కడ.

           నాదగ్గర వున్న మరో పెయింటింగ్ చేసిన విమల్ జార్జెట్ శారీ శైలజ గారికి  ఇచ్చాను.  శైలజ గారు ఆ పెయింటింగ్ చూసి చాలా మురిసిపోయి అందరికీ  చూపిం చారు.

           డైరెక్టర్  గారు వచ్చాక పైన మేడ మీద వారు ప్రత్యేకంగా కట్టుకున్న హోమ్  థియేటర్ లో సిట్టింగ్ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ తో  పాటూ ఆయనకీ ప్రస్తుతం వర్క్  చేస్తున్న రైటర్ ఇంకా అసోసియేట్  డైరెక్టర్, వచ్చారు. నేనూ నాకు తోడుగా శైలజగారు, సుధాకర్ గారూ కూర్చున్నారు.

           ముందు ఉపోద్ఘాతంగా “ఈ నవల నేను చదివాను, సీరియల్  కి  చాలా  అద్భుతమైన సబ్జెక్టు “అని  చెప్పారు  శైలజ  గారు.

           తర్వాత  కథ చెప్పాను నేను. అందరికీ  నచ్చింది. ప్రస్తుతం  తీస్తున్న సీరియల్ (రాధిక గారిది కాదు ) అవ్వగానే టేకప్  చేద్దామని అన్నారు  డైరెక్టర్.( సి. జె. భాస్కర్ గారు  కాదు )

           తర్వాత నేను రాధికగారికి  ఫోన్  చేసి ఆ విషయం చెప్పి  వచ్చేసాను. ఆమె అక్కడే  ఉండి తన తెలుగు సీరియల్స్ కి వర్క్  చేయొచ్చుకదా  “అని  అడిగారు కానీ అది నాకు  కుదిరే పని  కాదు. నేను చేస్తున్న ఉద్యోగం, ఇంటిని వదులుకుని మరో  రాష్ట్రంలో అవకాశాల కోసం ఉండడం చాలా అసాధ్యం.

           “మబ్బుల్ని చూసి కుండలో నీరు ఒలకబోసుకోవడం అవివేకం కదా!” అనిపించి   తిరిగి హైదరాబాద్ వచ్చేసాను.

           ఆ రోజు నా కోసం అంత టైం వెచ్చించి శ్రమ తీసుకున్న ఆ దంపతుల మంచి తనాన్ని ఎప్పటికి మరచి పోలేను నేను.

           ఇదంతా నేను కేవలం  శైలజా సుధాకర్  గారి సంస్కారం, మంచి తనం  తెలియ జెప్పడానికి మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్నాను. బాలూ  గారు సిటీలో లేక పోవడం వలన  నేను వారిని చూడలేకపోయాను. అది  నా దురదృష్టం.

           ఒక  మల్లెతీగకి  స్వచ్చమైన సుగంధ భరితమైన మల్లెలే కదా పూస్తాయి.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.