నా అంతరంగ తరంగాలు-17

-మన్నెం శారద

 

          విశిష్టమైన ఈ గురుపూర్ణిమ రోజు కాకతాళీయమైనప్పటికి ఈ  ఇద్దరి అద్భుతమైన వ్యక్తుల పుట్టినరోజులు కూడా  కలిసి రావడం  నిజంగా ముదావహం అనే చెప్పాలి.

          అప్పట్లో గుంటూరులో వున్నాం మేము. ఇంకా చదువులు  కొనసాగుతున్నాయ్.

          ఒకరోజు మా కుటుంబ స్నేహితులు వాసుదేవరావు గారు హడావుడిగా వచ్చి  “అమ్మాయ్, శారదా , తయారవ్వు, నిన్నో చోటకి తీసుకెళ్ళాలి “అన్నారు.

          మా అమ్మ ఆయనకేసి సీరియస్ గా చూసి  “ఈ టైమప్పుడు ఎక్కడకి.. అప్పుడే ఆరవుతోంది”అన్నది అసహనంగా.

          “అమ్మా తల్లీ, నీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటిదగ్గర వదిలే బాధ్యత నాది, ఒక గొప్ప వ్యక్తి ని పరిచయం చెయ్యడానికి  తీసుకెళ్తున్నా, కాదనకు “అంటూ హాస్య ధోరణిలో  మాట్లాడి ఒప్పించారు.

          “నీ పెయింటింగ్స్, కథలూ కూడా తీసుకురా “అన్నారాయన తిరిగి నాతో.

          నేనూ ఉత్సాహంగా ఆయనతో బయలుదేరాను.

          ఆ లొకేషన్ ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు లేదు బహుశా పట్టాభిపురం ఏమో!… గుర్తు లేదు.

          ఆ ఇల్లు డాక్టర్ జయప్రద గారిదని గుర్తు.

          ఇద్దరం టెర్రస్ మీదకి వెళ్ళాం.

          అప్పటికే చిన్నపాటి  గేదరింగ్ ఉందక్కడ.

          చాలా వరకు అందరూ పెద్దవాళ్ళే వున్నారు.

          జయప్రదగారు చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించారు.

          నేను భయం భయంగా నిలబడితే  వాసుదేవారావ్ గారు అక్కడ చిరునవ్వుతో కూర్చుని వున్న నడివయసు వ్యక్తి కి నన్ను పరిచయం చేశారు.

          “ఈ అమ్మాయిపేరు శారద. బొమ్మలు బాగా వేస్తుంది. కథలు కూడా రాస్తుంది “అని చెప్పేరు.

          నేను ఆయనే సంజీవ్ దేవ్ గారని గ్రహించి నమస్కరించాను.

          ఆయన సాదరంగా నవ్వి నా చేతిలో చుట్టబెట్టి వున్న షీట్స్ తీసుకుని చూసారు.

          తర్వాత నాకు ఆర్ట్ అంటే ఎందుకిష్టమో, నేను వాడుతున్న మాధ్యమాలేమిటో  సాహిత్యం పట్ల అభిమానం ఎలా కలిగిందో తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

          తన పక్కనే కూర్చోబెట్టుకుని మిగతా వారితో తన ఉపన్యాసం సాగించారు.

          నాకు అదేం అర్ధం కాలేదసలు.

          తిరిగి వచ్చేటప్పుడు ఆయన తను రాసిన మ్యూసింగ్స్ కొన్ని ఇచ్చారు.

          నాకు బాగా గుర్తుంది. చిన్ని చిన్ని పుస్తకాలవి.

          తర్వాత కొన్ని మీటింగ్స్ కి వెళ్ళాను.

          ఆయన మాట, భావుకత నన్ను చాలా ఆకర్షించాయి.

          మా ఇద్దరి ఆలోచనలకి  ఏదో సామీప్యత ఉందనిపించింది.

          ఇద్దరం ప్రకృతి ప్రేమికులం.

          తర్వాత తర్వాత  అమ్మ ఒప్పుకోకపోవడం వలన  నేను ఆ  మీటింగ్స్ కి వెళ్ళలేక పోయాను.

          కానీ సంజీవదేవ్ గారు నాకు బుక్స్ పంపేవారు. తరచూ లెటర్స్ రాసేవారు.

          వాటి కోసం నేను ఎంతగానో ఎదురు చూసేదాన్ని.

          ఎప్పుడో ఎలానో గుర్తులేదుకానీ మా మధ్య ఉత్తరాలు ఆగిపోయాయి.

          పాతవే తిప్పి తిప్పి చదువుతుండేదాన్ని.

          ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని కలవగలిగినా వారితో  నా స్నేహాలు కొనసాగలేదు.

          అది నా చేతకాని తనమో పరిస్థితులో ఇప్పుడు చెప్పలేను.

          ఒక్కటి మాత్రం నిజం పెద్దవారి ఆంక్షలు ఎక్కువగా ఉండేవి.

***

          ఇక  రెండో వ్యక్తి సాటిలేనిమేటి నటుడు ఎస్ వి రంగారావుగారు.

          వారిని ఒక షూటింగ్ లో చూడటం జరిగింది. మొదటిసారి సెలవులకి ఆ నాటి   చెన్నై వెళ్ళడం, ఆ అనుభూతి నేనెప్పుడూ మరచిపోలేను.

          ఫ్లైఓవర్లు లేని సెంట్రల్ స్టేషన్ లో దిగి బయటకి వచ్చి చూస్తే  పెద్దగా ఎర్రటి రెక్కలు సాచిన రాబందులా ఉండేది స్టేషన్!

          ఆ పక్కనే మూర్ మార్కెట్!

          ఇక కారులో మౌంట్ రోడ్డులో వెళ్తుంటే, అక్కయ్యా వాళ్ళు అదే రంగులో వున్న స్పెన్సర్ బిల్డింగ్స్ సముదాయం పేపర్ మెష్ తో బొమ్మలు తయారుచేసే పూంగ్ పుహార్ అలా ఏవేవో చూపించేవారు.

          మొదటి సారి సముద్రం మీదుగా వచ్చే ఉదయపు చల్లగాలుల్లో తేలియాడుతూ  జెమినీ స్టూడియో దగ్గరకు వచ్చేసరికి నుంగంబాకం వెళ్ళే రోడ్డు మలుపులో విలాసమైన చిరునవ్వుతో బర్కిలీ సిగరెట్ తాగుతూ ఈ మహానుభావుడి హోర్డింగ్ దర్శనమిచ్చేది.

          మొదటిసారి సౌత్ లో యాడ్ ఇచ్చిన గౌరవం ఆయనకే దక్కిందట.

          ఒకరోజు వాణిశ్రీ గారు మమ్మల్ని ఒక షూటింగ్ కి తీసుకెళ్ళారు.

          చదువుకునేరోజుల్లో నటుల్ని, చూడాలంటే యమ సరదా కదా!

          వాణిశ్రీ గారి అక్కయ్య కాంతమ్మ గారు, మేము ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ  జెమినీ స్టూడియో చేరుకున్నాం.

          ఆ సినిమా పేరు ఇద్దరమ్మాయిల కథ!

          ఇంతలో రంగారావుగారు పంచెకట్టు, లాల్చితో  సెట్ లోకి వచ్చేరు.

          ఒక్కసారి సెట్ ఎలర్ట్ అయిపొయింది. అందరూ లేచినిలబడి విష్ చేశారు.

          ఆయన అందర్నీ చూస్తూ  “నాగేశ్వర్రావ్ రాలేదా? ” అని అడిగారు.

          వెంటనే డైరెక్టర్ మీ పార్ట్ తీసేస్తాం సర్, అంటూ ANR నిలబడే చోట ఒక సర్కిల్ గీసి, SVR దగ్గర ఒక సర్కిల్ గీసి నాగేశ్వర్రావు గారి ఎత్తులో టేప్ పట్టుకుని ఆయన డైలాగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ చేప్పాడు.

          వాణిశ్రీ గారు, మిగతా నటులు యధావిది నటించారు.

          ఒకే టేక్ లో ఆయన అద్భుతంగా నటించిన నటన చూసే అదృష్టం మాకు కలిగింది.

          “మరో టేక్ కావాలా?” అని అడిగారాయన.

          “వద్దు సర్ వద్దు బ్రహ్మాండం సర్ “అని డైరెక్టర్ చెప్పడం ఆయన వెళ్ళి పోవడం జరిగిపోయింది.

          తర్వాత ANR వచ్చి “రంగారావు గారు రాలేదా?” అని అడిగారు.

          ” రావడం యాక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగిపోయిది సర్!” అని డైరెక్టర్ చెప్పాడు.

          మిగతా షూటింగ్ వాణిశ్రీ ANRతో జరిగింది.

          రంగారావు గారిని పలుకరించే  ధైర్యం ఆ వయసులో మాకు లేక ఊరికే కళ్ళప్పగించి చూసాం.

అదీ కథ!

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.