ఒక భార్గవి – కొన్ని రాగాలు -5

 హంసధ్వని

-భార్గవి

హంస యెలా వుంటుందో చూసిన వారు లేరు,కానీ దాని చుట్టూ అల్లుకున్న కథలెన్నో! సరస్వతీ దేవి వాహనం రాజహంస.బహుశా అది చేసే ధ్వని యే హంసధ్వని అనే భావనతో ఒక రాగం పేరుగా పెట్టి వుండొచ్చు

 హంసని  ,ఒక పవిత్రతకీ,ప్రేమకీ ,అందానికీ,ఒయ్యారానికీ ప్రతిరూపం గా భావిస్తారు.ఆత్మ ,పరమాత్మ లకి హంసని ప్రతీక గా వాడతారు,ఎవరైనా ఈ లోకం నుండీ నిష్క్రమిస్తే “హంస లేచిపోయిందంటారు”.ఒక కళాకారుడో,ఉన్నతమైనవ్యక్తో తన జీవిత కాలంలో సాధించిన ఉత్కృష్టమైన కార్యాన్ని “హంసగీతం” అంటే చరమ గీతం అంటారు.దీనికి కారణమేమంటే హంసలు తమ జీవిత కాలమంతా మౌనంగా వుండి,మరణించే ముందు మాత్రం గొంతెత్తి అద్భుతమైన గీతం పాడుతాయట,ఇంకా పాలనీ నీళ్లనూ వేరు చేసే లక్షణం కూడా హంసకుందంటారు.ఇంకా నాయికను వర్ణించేటప్పుడు ఆమె నడకని “హంసనడక” తో పోలుస్తారు.

మన పురాణాలలో,ప్రబంధాలలో హంస రాయబారిగా కూడా పని చేసి ప్రేయసీ ,ప్రియులను కలపడం చదివే వున్నాము,(ఉదా” నల దమయంతుల కథ)మన సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో (గ్రీకు,ఈజిప్టు పురాణాలలో)కూడా హంస ప్రస్థావన వుండటం చూస్తే ,ఇది కవుల కల్పన కాదు,ఒకప్పుడు జీవించి అంతరించిపోయిన జాతి అని భావించవచ్చు

కర్ణాటక సంగీతంలో “హంసధ్వని” రాగానికొక ప్రత్యేక స్థానముంది,యేదైనా కార్యక్రమం గానీ ప్రారంభించే ముందు ఈ రాగంలో చేసిన కీర్తన గానీ ,పాట గానీ పాడటం ఆనవాయితీ.నాట రాగంలో చేసిన కృతులు కూడా పాడతారు,”ఆది నాట అంత్య సురటి “అనే నానుడి వుంది.

రాత్రి తొలిజాములో పాడే రాగంగా భావిస్తారుఈ రాగాన్ని వాగ్గేయకార త్రయంలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితర్ తండ్రి గారయిన రామస్వామి గారు కనిపెట్టారంటారు,అయితే హిందూస్థానీ సంగీతంలోకి  తీసికెళ్లిన వాడు భేండీ బజార్ ఘరానాకు చెందిన అమాన్ ఆలీఖాన్ .దీనిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వాడు అమీర్ ఖాన్ .హిందూస్థానీలో ఈ రాగం పాడే పథ్థతిలో చిన్న చిన్న తేడాలుంటాయి ,పేరు కూడా మార్పే “రాగ్ శంకర్ “అంటారు.

ఇది 29 వ మేళకర్త అయిన ధీరశంకరా భరణం నుండీ జన్యం,అయిదే స్వరాలుంటాయి దీనినే ఔడవ రాగము లేక పెంటటోనిక్ స్కేల్ అంటారు.స్వరాలనీ,రాగఛాయనూ బట్టి కల్యాణి రాగానికి దగ్గరగా వుండటంతో 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుండీ జనించిందని చెప్పవచ్చు నంటారు.

ఏదయినా కార్యక్రమ ప్రారంభంలో పాడే రాగమని చెప్పుకున్నాం కదా,తొలుత అవిఘ్నమస్తు అని విఘ్నేశ్వరుడిని కొలుస్తాం కాబట్టి చాలా విఘ్నేశ్వర స్తుతులు ఈ రాగంలోనే వున్నాయి.వాటిలో ముత్తుస్వామి దీక్షితార్ “వాతాపి గణపతిం భజే “చాలా పాప్యులర్ .

కర్ణాటక సంగీతం నేర్చుకునే విద్యార్థులందరూ “జలజాక్షిరో”అనే వర్ణం తప్పకుండా నేర్చుకుంటారు.

దీనిని కూర్చింది త్యాగరాజ స్వామికి దగ్గర బంధువూ ప్రత్యక్ష శిష్యుడూ అయిన మానాంబు చావడి (ఆకుమడుగుల)వెంకట సుబ్బయ్య.ఈయన శిష్యులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ,మరియూ త్యాగరాజ స్వామి సంగీతాన్ని మన ఆంధ్ర దేశానికి తెచ్చిన సుసర్ల దక్షిణామూర్తి.(సినిమా డైరెక్టర్ సుసర్లకి తాతగారని గుర్తు)

త్యాగరాజ కృతులలో “శ్రీ రఘుకులమునందు బుట్టి”,రఘునాయక నీ పాద యుగ” అనే కీర్తనలు ప్రముఖమైనవి.

ముత్తుస్వామి దీక్షితర్ సంస్కృతంలో రాసిన “వాతాపి గణపతిం” అనే కీర్తన తెలియని వారుండరు.

హరికేశ నల్లూర్ ముత్తయ్య భాగవతార్ “గం గణపతిం “కూడా చాలా పేరొందిన కీర్తన.

ఇక సినిమా సంగీతం విషయానికొస్తే మన తెలుగులో కొంచెం తక్కువగా వాడిన రాగం,తమిళంతో పోల్చుకుంటే.తమిళంలో ఇళయరాజా లాంటి వారు ఈ రాగాన్ని విరివిగా వాడినట్టు కనపడుతుంది.

ఘంటసాల గారు, తన సంగీత దర్శకత్వంలో రెండు సినిమాల్లో ఈ రాగాన్ని చాలా చక్కగా ప్రయోగించారు .ఒకటి సముద్రాల గారి సొంత చిత్రం వినాయక చవితి లో “వాతాపి గణపతి “కీర్తన పెట్టడం ,కర్ణాటకం తెలిసిన వారు కాబట్టి చక్కని సంగతులతో దాని మూడు నిమిషాలకు కుదించారు,అందులోనే ఆయన ప్రతిభ వ్యక్తమవుతోంది

రెండో సినిమా “శాంతి నివాసం” ,ఇందులో  “శ్రీ రఘురామ్ జయరఘురామ్ “అనే పాట పి.బి.శ్రీనివాస్ ,పి.సుశీల బృందం చేత పాడించారు ఎంత చకకని పాటో.

పి. భానుమతి “పల్నాటి యుధ్ధం “కోసం పాడిన “జయశంభో శివ శంకరా “కూడా ఇదే రాగం,మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యానికి ,బాణీ కూర్చినది సాలూరి.రాజేశ్వరరావు.ఈపాట వి.ఎ.కె. రంగారావు గారు కూర్చిన “అలనాటి అందాలు -భానుమతి “లో మొట్టమొదటి పాట ,కానీ ఆయన ఈ పాట “రాగ్ శంకర్ “అంటే హిందూస్థానీ రూపమైన హంసధ్వని లో వున్నట్లు పేర్కొన్నారు

 యన్ .టి. ఆర్ ఆస్థాన  సంగీత దర్శకుడు టి.వి.రాజు  “శ్రీ కృష్ణ పాండవీయం” కోసం స్వరపరిచిన “స్వాగతం సుస్వాగతం “పాట “హంసధ్వని “కి చిరునామా గా చెప్పుకోవచ్చు ,దీనికి చక్కని సంస్కృత సమాసాలతో అలంకరించిన రామచక్కని కవి సి.నా.రె .ని ఈ సందర్భంలో మరిచి పోకూడదు.

హిందీ సినిమాలలో సలీల్ ఛౌధురీ సంగీత దర్శకత్వంలో “పరివార్ ” లో లతా,మన్నాడే  పాడిన “జా తోసే నహీ బోలూ కన్హయ్యా “అనే  పాట కూడా జాతి రత్నం లాంటిదే ,దీనికి కాపీ మన తెలుగు”మనుషుల్లో దేవుడు”సినిమాలో యస్ .జానకి పాడిన “గోపాల నను పాలింపరా” అనే పాట

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో “రుద్రవీణ “లోని “తరలి రాద తనే వసంతం”అంటూ సిరి వెన్నెల ఒలికించిన వెన్నెల లాంటి సాహిత్యానికి ,ఇళయరాజా కట్టిన మధురమైన బాణీ వున్నది హంసధ్వని రాగంలోనే ,అంత మధురంగానూ పాడింది యస్ .పి. బాలసుబ్రహ్మణ్యమే.

కమలహాసన్ నటించిన “మహానది” సినిమాలో “శ్రీరంగ రంగనాథుని దివ్యరూపము” అనే పాటలో కూడా హంసధ్వని వినపడుతుంది,సాహిత్యం (అంటే డబ్బింగ్ చిత్రం)వెన్నెలకంటి అని గుర్తు ,సంగీత దర్శకుడు ఇళయరాజానే.

ఇంకో చక్కటి పాట ఎ.ఆర్ .రహ్మాన్  చేసింది”అమృత “అనే సినిమాలో ,వేటూరి (ఇదీ డబ్బింగే)రాసిన “మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా” అని మంద్రమధురంగా సాగే పాట .దీనికి కూడా హంసధ్వనే ఆధారం.

ఇంక మీరు కూడా ఈ పాటలన్నీ వింటూ ,హంసధ్వనిలో తడిసి తలమునకలవ్వాలని ఆశిస్తూ……….


*****

ఆర్ట్ : చంద్ర 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.