చిత్రలిపి

నిరంతర అన్వేషిణిని నేను…..

-మన్నెం శారద

నడుస్తూనే ఉన్నాను నేను …
యుగయుగాలుగా తరతరాలుగా
ఏ అర్ధరాత్రో అపరాత్రో
నేను తొడుగుకున్న భౌతిక కుబుసాన్ని విడిచి
నీకోసం నడక ప్రారంభిస్తాను ..
గమనమే గాని గమ్యమెరుగని
నా అడుగులు సాగుతూనే ఉంటాయి
ఆనీవు ఎవరివో అంతుపట్టని
కలత ఆలోచనలలో ..
తడబడుతూ తల్లడిల్లుతూ
నా హృదయపు తాళం తెరచి
నీకై నిరీక్షిస్తూ …
క్షితి రేఖని చేరి
నా మనో సుమాల పరిమళాన్ని
ఆకాశమంతా వెదజల్లుతాను
నువ్వు లీలగా కనిపిస్తావు
ఇంతలో ఏ మాయామోహం
మనసుని కమ్ముకుంటుందో ఏమోగానీ
ఉలికి ఉలికి పడుతూ ఊడిపడుతున్న తారల్ని
వడినిండా ఎత్తుకుంటూ
వచ్చిన పనినే విస్మరిస్తాను …
ఏ జాము కో ఏమో
చీకటి వెలిసిపోతూ నీ జాడ
నిశ్శబ్దం గా నిష్క్రమిస్తుంది !మళ్ళీ ఎడతెగని దుఃఖం !
తిరిగి హృదయానికి తాళం వేసి
నా బురఖా నేను కప్పుకుని
రేపయినా నిన్ను కలవగలుగుతానని
మరలుతాను …ఒకానొక నమ్మకాన్ని
మనసంతా నింపుకుని !

*****

Please follow and like us:

One thought on “చిత్రలిపి- నిరంతర అన్వేషిణిని నేను…..”

  1. ఒకానొక నమ్మకాన్ని మనసంతా నింపుకుని!..నిజమే…నమ్మకమే కదా మనిషిని నడిపించేది ,చాలా బాగుందండి కవిత

Leave a Reply

Your email address will not be published.