ఒక్కొక్క పువ్వేసి-5

సచివాలయంలో అంటరాని బతకమ్మ

-జూపాక సుభద్ర


సద్దుల బత్కమ్మ పండుగ, తెలంగాణకు, అందులో శ్రమకులాల మహిళలకు ప్రత్యేకమ్. బ్రాహ్మణ, గడీ దొర్సానులు బత్కమ్మలు ఆడరు. భూస్వామ్య మహిళలు ఆడరు. యీ పండగ ఫక్తు శ్రమకులాల మహిళల పండుగ. బత్కమ్మంటే ప్రకృతి పండుగ. బూమంతా పూలు, పచ్చలు, చెరువులతో, పంటలతో కళకళ లాడే పండగ. ఆడపిల్లలంతా పుట్టింటికి చేరేపండగ.


కులసమాజంలో అన్నిరంగాల్లో ’కులవివక్షలున్నట్లు, కులనిషేధాలు వున్నట్లు బత్కమ్మ పండుగ మీద కూడా నిషేధాలున్నయి. ‘ఎస్సీ మహిళలు బత్కమ్మలు ఆడుకోగూడదు’ అని. అయినా కూడా ఎస్సీ మహిళలు చెరువుల కాడికి బోయి ‘వూరి మహిళలు ఆడ్తుంటె… వీల్లు కూడా బత్కమ్మల్లేకనే గుంపుగ కూడి ఆడి,పాడి సద్దుల పలారం తిని వస్తరు.

తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో ఉద్యమ రాజకీయ అవసరాలకోసం వూరు, గూడేల మహిళలందరి చేత ఆడించినా, పాడించినా అది మూన్నాళ్ల మురిపెమైంది. మల్లా ‘ఎప్పటిసిప్ప ఎనుగుల్నే’ అన్నట్లు తెలంగాణ వచ్చినంక ‘ఎస్సీ మహిళలను’ మీకు బత్కమ్మలేదు’ అని అడ్డు చెపుతూ ఆడనిస్తలేరు.కొన్ని ఏరియాల్లో కేసులు కూడా అయినాయి.


అయితే యీ నిషేధాలు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్న ఎస్సీ మహిళల్ని కూడా యిడువలేదు. ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగినులము ధర్నాల్లో, వూరేగింపుల్లో, సకల జనుల సమ్మె, సాగర హారమ్ లల్లో అన్ని మీటింగుల్లో ముందున్నము. తెలంగాణ రాష్ట్రమొచ్చినంక ‘ఏపీ సచివాలయ ఉద్యోగినిల సంక్షేమ సంగమ్’ నుంచి విడివడి ‘తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంగమ్’ గా ఏర్పడినము. యీ సంగమ్ అధ్వర్యంలో తెలంగాణ వచ్చిన కొత్తలో (2014) బత్కమ్మ పండుగను ధూమ్ ధామ్ గా చేద్దామని తెలంగాణ ఉద్యోగినులను పిలిచి మాట్లాడినమ్. సంగంలో అధ్యక్ష, కార్యదర్శులు లాంటి కీలక స్థానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళము వున్నామ్. యిది సహించని ఆధిపత్యకులాల మగ ఉద్యోగులు వాల్ల కులాల ఆడ ఉద్యోగుల్ని ఎగేసినారు మాకు వ్యతిరేకంగా. ‘మీ అధ్వర్యంలో మేము బత్కమ్మలాడుడేంది? మీరు బత్కమ్మలు ఆడిన వాల్లా, పాడిన వాల్లా…. మీ నాయకత్వంలో మేము బత్కమ్మలాడాలా’ అని వెళ్లిపోయిండ్రు.


ఆదిపత్య కులమ్ ఉద్యోగులు తమకులాల ఉద్యోగినులను బత్కమ్మ ఆడించడానికి ఫండ్స్ కూడా తీసుకొచ్చారు. పూలు, డీజే, షామియానా గిట్ల అన్ని అరేంజ్ మెంట్స్ చేయించినారు. కానీ మందిలేరు ఆడేవాల్లు చాలా కొద్ది మంది వుండిరి. కానీ ‘తెలంగణా సచివాలయం మహిళా సంగమ్’ ఆఫీసు వూడ్చేవాల్లనీ, తోటపనులు చేసే వాల్లని, ఆఫీసు టాయిలెట్స్ క్లీనర్స్ నీ ఆఫీసు సబార్డినేట్స్ ని బత్కమ్మ ఆటలో భాగం చేసినము. అంతే కాకుండా సంగమ్ బెట్టినప్పుడే యీ (క్లాస్ ఫోర్) మహిళలందరిని కూడా సభ్యులుగా చేర్చుకున్నాము. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్ర మహిళా సంగంలో వీరికి సభ్యత్వం లేకుండె. మేము బత్కమ్మలాడుకునే కాడ మా బత్కమ్మల్ని తీసేయడం, యిది మీకు పర్మిషన్ యిచ్చిన జాగ కాదు ‘ అని బత్కమ్మల్ని తీసేయడం ,చెదర గొట్టడం, పాటలు పాడేవాళ్ల మైకులు గుంజుకోవడం, మైకుల వాయిస్ కట్ చేయడం’ యిట్లాంటివి చేసి ‘ ‘అన్నా నువ్వు చెప్పినయి చేసినమ్, తరవాత ఏం జెయ్యాలె’ అని ఫోంజేయడం అక్కడి సలహాలను బట్టి తీవ్రత వుండేది. సచివాలయం ఆఫీసులో రెండు చోట్ల బత్కమ్మలు ఆడడము జరిగింది. అరవై యేండ్ల కల తెలంగాణ.లొల్లి వద్దనుకొని అన్ని భరించినం.


ఒకటి సవర్ణకుల ఉద్యోగుల (మగ) సలహా సూచనలతో నడిచిన సవర్ణ ఉద్యోగినుల(మహిళ) బత్కమ్మ. యింకోటి తెలంగాణ సచివాలయంలో ఉద్యొగం చేస్తున్న (ఆఫీసర్స్ నుండి అటెండర్స్)ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళల బత్కమ్మ. మొగ ఉద్యోగుల సహాయం లేకుండా ఆడిన సాధికార బత్కమ్మ.


ఉద్యోగినుల సంగమ్ బత్కమ్మ ఆడడానికి వచ్చిన స్వీపర్లను, తోటమాలీలను అటెండర్ మహిళల్ని అడ్డగించి అవమానించినా తొమ్మిది రోజులు వినూత్నంగా ఆడడము జరిగింది. సచివాలయ చరిత్రలోనే కాదు,తెలంగాణ చరిత్రలో అట్టడుగు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున జమకూడి ఆడిన, పాడిన బత్కమ్మ 2014 లోనే. అదీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో.


తొమ్మిది రోజులు ఆడిన బత్కమ్మ ఒక్కో రోజు ఒక్కో పేరు పెట్టి ఆడినమ్. చదువుల బత్కమ్మ, బాలికా బత్కమ్మ, పారిశుద్య బత్కమ్మ, ఉద్యమ బత్కమ్మ పంతులమ్మల బత్కమ్మ, నర్సుల బత్కమ్మ, లాయర్ల బత్కమ్మ, జర్నలిస్టుల బత్కమ్మ, డాక్టర్ల బత్కమ్మ అని ఆయారంగాల్లో పంజేస్తున్న మహిళల్ని ఆహ్వానించి ఆడించి పాడించినము. యింకా హుసేన్ సాగర్ బుద్దుడి బొమ్మ కాడికి బత్కమ్మలతో వూరే గింపుగా బొయి బౌద్ద బత్కమ్మ కూడా ఆడినము. యిక మాతో కల్సిరాని ఆధిపత్య ఉద్యోగినులు ఒకటి రెండు రోజులు పోటీ బత్కమ్మలాడి మానేసిండ్రు. కానీ అవరోధాలు అడ్డంకులు పెడ్తానే వుండిరి. రిసెప్షన్ గేటు దగ్గర అతిథుల్ని రానియ్యక పోవడం కూడా చేసినారు.
చివరి రోజు అనేక ఉద్యమాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యమకారుల్ని, రచయిత్రుల్ని, మహిళా ప్రజా ప్రతినిధుల్ని, సామాజిక, సాంస్కృతిక ఉద్యమకారిణులను తెలంగాణ రాష్ట్రమ్ వచ్చిన సంబురాల్లో బత్కమ్మ పండుగకు ఆహ్వానించి రోజంత రక రకాల కార్యక్రమాలతో, ఉద్యమాల్లో వారి వారి అనుభవాలు, విజయాలు ఆట, పాట, మాటగా సాగింది. బత్కమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ‘తెలంగాణ సచివాలయ ఉద్యోగినుల’ సంఘం అధ్వర్యంలో జరగడము విశేషమ్.


కానీ అంటరాని బత్కమ్మలు కుల వివక్షలు, నిషేధాలు ఎస్సీలపైన గ్రామాల్లోనే కాదు రాష్ట్రానికి దశ దిశలు నిర్దేశించే సచివాలయంలో కూడా వున్నదని యీ ఘటన నేర్పిన చేదు అనుభవం.
బత్కమ్మ అంటే మహిళలు సంబురంగా ఆడుకునే పండుగ. ఇన్ని అడ్డగింపులు అవమానాలు ఎదుర్కొనుడు ,లొల్లితోని, కొట్లాడు కుంట బత్కమ్మ ఆడు కోవడం అవసరమా,’ అనుకున్నాం. అట్లా మమ్మల్ని బత్కమ్మల నుంచి గెంటేసి, మరుసటి సంవత్సరం(2015) నుంచీ తెలంగాణ సచివాలయంలో సవర్ణ మగ ఉద్యోగులు తమ కులాల మహిళా ఉద్యోగులతో బత్కయ్యలై ఆడుతున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.