కాళరాత్రి-4

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

ఇంతలో యూదు పోలీసులు వచ్చి ‘‘టైమయింది. మీరంతా అన్నీ వదిలిపోవాలి’’ అని జీరబోయిన స్వరాలతో చెప్పారు.

హంగరీ పోలీసులు ఆడ, మగ, పిల్లలు, వృద్ధులను కర్రలతో కొట్టనారంభించారు.

అందరూ గెటోలు వదిలి తమ సంచులతో రోడ్డు మీదికి వచ్చారు. పోలీసులు పేర్లు పిలిచి అందరూ ఉన్నారో లేదో అని పదిసార్లు లెక్కించారు. ఎండ తీవ్రత బాధించింది. పిల్లలు మంచినీళ్ళు కావాలని గోలపెడుతున్నారు. ఇళ్ళల్లో నీళ్ళున్నాయి. కాని మమ్మల్ని లోనకెళ్ళనీయలేదు.

కొందరు యూదు పోలీసులు కొంత నీరు తేగలిగారు. నాకు దాహం వేసింది. మేము ఆఖరి బ్యాచ్‌లో వెళ్ళాలని నిర్ణయం జరగటంతో నేనూ, మా అక్కలూ కొంత నీరు తెచ్చి కొందరితో తాగించగలిగాం వీలయినంతలో.

మధ్యాన్నం ఒంటిగంటకు ప్రయాణం మొదలయింది.

అమ్మయ్య, ఎండలో మాడేకంటే ప్రయాణమే మేలను కున్నారు కొందరు. దేవుని దృష్టిలో ఇంతకు మించి నరకం                  ఉండదని వారి ఆశ. ఎవరూ వెనక్కి తిరిగి తమ ఇళ్ళను గానీ, సామానును గాని, తమ రోడ్లను గానీ చూడలేదు. ప్రతివారి వీపుమీద సంచి వేలాడుతున్నది. అందరి కళ్ళల్లో నీళ్ళు బరువెక్కిన గుండెలతో గెటో గేటువైపు పోసాగారు.

నేను రోడ్డు పక్కన నిలబడి వారిని చూస్తూ ఉండిపోయాను.

ప్రధాన రబీ తన సంచితో ఒంగిపోయిన నడుముతో నడుస్తుంటే నా గుండె అలిసి పోయింది. శిక్షకు గురి అవుతున్న వారిలా వాళ్ళు నడుస్తుంటే చూస్తున్నాను. మా గురువులూ, స్నేహితులూ అందరూ ఓడిపోయి సంచులు భుజాన తగిలించుకొని తమదంతా పోగొట్టుకుని ముందుకు కదిలారు.

మేమింకా కొంత సమయం అక్కడ గడప గలిగామని వారికి ఈర్ష్య కలిగి ఉండవచ్చు.  ఎవరూ నావైపు చూడలేదు. కాసేపట్లో అందరూ గేటు దాటి కనుమరుగయ్యారు.

సూట్‌కేసులూ, విలువైన సామానూ, బ్యాంక్‌నోట్లూ, ఫోటోలూ, అన్నీ వారికి యిష్టమైనవే. కానీ పోలీసులు వాటిని తీసుకెళ్ళనివ్వలేదు వారిని. వాటిమీద ఆశ వదులుకున్నారు.

ఇళ్ళు ఖాళీ అయ్యాయి. ఒకప్పుడంతా వాళ్ళ ఆస్తి. ఇప్పుడు ఎవరిదీ కాదు.

మేము ఏమీ తినకుండా రోజు గడిపాము. అసలు ఆకలి అనిపించలేదు. ఎంతో అలసిపోయాం.

నాన్న గెటో గేటు దాకా అందరినీ సాగనంపాడు. అందరినీ ప్రధాన సినెగాగ్‌లో తడిమి పరీక్షించారు. వారు బంగారం, మరే విలువైనవీ తీసుకుపోవటం లేదని నిర్ధారించటానికి. కొందరు దెబ్బలు తిన్నారు.

మన వంతెప్పుడు అని నాన్నని అడిగాను. ‘‘రేపుగాక, ఎల్లుండి అంటూ ఏదో వింత జరిగితే తప్ప’’ అన్నాడాయన. రాత్రి అందరం పడుకున్నాం. సోమవారం లేచాం. ఎవరం ఏమీ ఆలోచించే స్థితిలో లేము. అమ్మ ఆ సాయంత్రం మమ్మల్ని త్వరగా నిద్రబుచ్చింది. అలా శక్తి కూడగట్టుకుంటామని ఆమె ఆశ. మా యింటిలో అదే మా ఆఖరి రాత్రి.

ఉదయమే లేచి ప్రార్థనకు ఉపక్రమించాను.

నాన్న బయటి నుండి వచ్చి ` శుభవార్త, ఈరోజు మనం వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ నుంచి చిన్న గెటోలోకి మారుతున్నాం అన్నాడు. చివరి ప్రయాణానికి మేమక్కడే ఎదురు చూడాలట.

తొమ్మిది గంటలకు పోలీసులు లాఠీలు రaుళింపించు కుంటూ మమ్మల్ని బయటకు తోశారు. నేను మొదలు బయటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ వైపు చూడలేదు. దుఃఖం ఆపుకోలేనేమొ అని. రోడ్డున పడ్డాం. అదే ఎండ తీవ్రత, అదే దాహం, నీళ్ళు తేవటానికి ఎవరు వెనక మిగలలేదుగా! మా యింటి వైపు చూశాను. ఎంతో కాలం దేవుని ప్రార్థిస్తూ గడిపిన యిల్లది.

మమ్మల్ని లెక్కించటం ముగిసింది. నాన్న ఏడుస్తున్నాడు. అదే ఆయన ఏడవటం నేను మొదటిసారి చూడటం. అమ్మ నిర్లిప్తంగా నడుస్తున్నది. మా చెల్లి జపోరా జుట్టు నీటుగా దువ్వి ఉంది. ఎర్రకోటు ధరించింది. ఏడేళ్ళ పసిది వీపుమీద మోయలేక మోస్తున్న సంచి, పళ్ళు బిగబట్టి నడుస్తున్నది. ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని గ్రహించింది. పోలీసులు లాఠీలు ఆడిస్తూనే ఉన్నారు. నాలో శక్తి నశించింది. మమ్మల్ని తొందర పెడుతున్నారు. వాళ్ళంటే అసహ్యం వేసింది. వాళ్ళు మమల్ని బాధించే మొదటి శత్రువులు, వారే మా మృత్యుముఖాలు, నరక ప్రాయులు.

మమ్మల్ని పరుగెత్తించారు. మా ఊరి జనం కిటికీల వెనక నుండి మమ్మల్ని చూస్తున్నారు.

దేవుడా! మా మీద దయ చూపు అంటూ వేడుకుంటూ పోయాం.

చిన్న గెటోలో వాళ్ళను తరిమేశారు. మూడురోజుల క్రితం. ఇప్పుడు మేము వాళ్ళ సామాను వాడుకుంటుంన్నాం. వాళ్ళను గురించి మరిచిపోయాం.

నేను రూములు వెతుక్కుంటూ మా బాబాయి మెండెల్‌ కుటుంబం ఉండే చోటుకు వెళ్ళాను. సగం తిని వదిలేసిన సూపు గిన్నె యింకా టేబుల్‌ మీద అలానే ఉన్నది. బేక్‌ చేయవలసిన పిండి ముద్ద అలానే ఉన్నది. నేలమీద పుస్తకాలు పడి ఉన్నాయి. బాబాయి వాటిని తీసుకుపోదామనుకున్నాడేమొ!

మా అక్కలు కట్టె పేళ్ళు వెదికి తెచ్చారు. అమ్మ ఎంత అలసిపోయి ఉన్నా, మా కోసం వంట చేసింది. మనం నిరాశ పడకూడదంటూనే పని చేసింది.

పరిస్థితుల కలవాటుపడుతున్నాము. కొందరు యింకా ఆశావహంగానే ఉన్నారు. జర్మన్లు మమ్మల్ని తరిమే లోపల పరిస్థితి మాకు అనుకూలంగా మారవచ్చునేమొ అనే ఆశ. అలా అయితే అప్పటికే తరిమి వేయబడిన వారి గతి అంతేయిక. యుద్ధం ముగిసేదాకా మమ్మల్ని ఈ స్థితిలో ఉండనిస్తారేమొ. అలా సాగాయి మా వాళ్ళ ఆలోచనలు.

గెటో దగ్గర కాపలా లేరు. మాకు లోగడ పనిచేసిన మరియా మమ్మల్ని చూడటానికి వచ్చింది. ఏడుస్తూ మమ్మల్ని తన పల్లెటూరుకు రమ్మని బ్రతిమాలింది. అక్కడ మాకు నివాసం ఏర్పాటు చేస్తానన్నది.

మా నాన్న అదేమీ వినదలుచుకోలేదు. ‘‘మీ ముగ్గురూ కావాలంటే వెళ్ళండి, మీ అమ్మ, చిన్నది నాతో ఇక్కడే ఉంటారు’’ అన్నాడు. మేము వాళ్ళను విడిచి పోవాలనుకోలేదు.

రాత్రి! ఆ రాత్రి త్వరగా గడవాలని ఎవరూ ప్రార్థించటం లేదు. నక్షత్రాలు మెరుస్తూనే ఉన్నాయి. ఏమీ చేసేది లేక పడుకోవాలి ` మా ముందు వదిలిన వారి పక్కల మీద. మేము శక్తి కూడగట్టుకోవాలి మరి!

కొందరు యిలా అభిప్రాయ పడ్డారు. యుద్ధం ముందుకు సాగుతున్నది. తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పౌరుల్ని ఇక్కడి నుండి తరలిస్తారు. మనం అనుకూలురుతో చేతులు కలుపుతామని వీళ్ళు భయపడతారు. ఈ వెళ్ళ గొట్టటం అంతా ఫార్సు. మనవైన వస్తువులు దోచుకోవటానికి వేసిన ఎత్తుగడ, మనం భూమిలో దాచిపెట్టాం గదా! వీళ్ళు వాటికోసం తవ్వకాలు మొదలు పెట్టాలి. మనల్ని తరలిస్తే వాళ్ళకా పని సులువవుతుంది. అలా మాట్లాడారు కొందరు.

ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళూ అనే తేడా లేకుండా కలిసి కాలం వెళ్ళదీస్తున్నాము. మా భవిష్యత్తేమిటో మాకే తెలియదు.

శనివారం. అది మాకు విశ్రాంతి రోజు. కాని అదే రోజు మమ్మల్ని వెళ్ళగొట్టే నిర్ణయం జరిగింది. శుక్రవారం రాత్రి మా ఆచార ప్రకారం భోజనానికి కూర్చున్నాము. అలవాటైన కృతజ్ఞతా ప్రార్థన చెప్పుకున్నాము. ఇదే ఆఖరు మేమందరం అలా ఒకబల్ల దగ్గర కూర్చొని తినటం. నేను ఆ రాత్రి గడిచిన అనుభవాలను నెమరు వేసుకుంటూ నిద్ర పోలేకపోయాను.

ప్రొద్దున్నే రోడ్ల మీదకొచ్చారంతా తరలింపుకు రెడీగా. హంగరీ పోలీసులు లేరు. యూదు కౌన్సిల్‌ తామే చూసుకుంటా మన్నారు తరలింపు పని.

మేము ప్రధాన సినెగాగ్‌కు తరలి వెళ్ళాము. లోకల్‌ ప్రజలు చాటుగా చూస్తున్నారు మమ్మల్ని. మేము వెళ్ళిపోతే మా వస్తువులు దోచుకోవచ్చని ఎదురు చూస్తున్నారు.

సినెగాగ్‌ పెద్ద రైలు స్టేషన్‌లా అనిపించింది. సంచులు, కన్నీళ్ళు ఎటుచూసినా. సినెగాగ్‌ అంతా విరగొట్టబడి ఉన్నది. అక్కడ మేము గడిపిన 24 గంటలు భయంకరమైనవి. శనివారం ` శబాత్‌రోజు మమ్మల్ని బయటకు పోనీయలేదు. కాలకృత్యాలు అక్కడే ఒకమూల తీర్చుకోవలసి వచ్చింది.

మరుసటి ఉదయం స్టేషన్‌కి వెళ్ళాం. పశువుల్ని చేరవేసే రైలు బండి మాకోసం సిద్ధంగా ఉన్నది. హంగరీ పోలీసులు మమ్మల్ని, 80 మందిని ఒక్కొక్క కారులోకి ఎక్కించారు. కొంచెం రొట్టె, కాసిని నీళ్ళు యిచ్చారు.

కిటికీ బార్స్‌ను పరీక్షించారు. ఊడి రాకుండా ఉండేందుకు. కార్లు మూసి సీలు చేశారు. ఒక్కొక్క కారుకి ఒక గార్డు ఉన్నాడు. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే అతను కాల్చి చంపుతాడు.

గెస్టాపో ఆఫీసర్లు గస్తీ తిరిగారు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని వాళ్ళు చిరునవ్వులు చిందిస్తున్నారు. పెద్ద విజిల్‌తో బండి బయలుదేరింది.

పడుకోటానికి గాదు అందరం కూర్చోటానికి స్థలం లేదు. వంతులు వారీగా కూర్చునే ఏర్పాటు చేసుకున్నాం. గాలి పీల్చుకోవటం గూడా ఇబ్బందయింది. కిటికీ దగ్గర చోటు దొరికిన వారు బయటకు చూస్తూ గడిపారు.

రెండు రోజులు ప్రయాణం సాగేటప్పటికి దప్పిక, వేడి బాధించ సాగింది. ఇంకొంచెం రొట్టె మిగిలి ఉన్నది.  ఆకలి తీరేలాగా ఎవ్వరం తినలేదు. రేపటికి అందులో కొంతరొట్టె మిగులుస్తూ పోయాము. రేపటిరోజు ఇంకా భయంకరంగా  ఉండవచ్చు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.