మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

నేను ఒరురో నుంచి చాల . ఆందోళనతో భయసందేహాలతోనే బయల్దేరాను. వాళ్ళ మాటలమీద కొంచెం అనుమానం వేసిందిగాని లాలాగువా – సైగ్లో-20 వైపు అడుగులు పడుతోంటే మాత్రం గుండె పీచుపీచుమనడం మొదలైంది.

నేనక్కడికి సాయంత్రం ఏడింటికి చేరాను. అప్పుడు సన్నగా మంచు కురుస్తోంది. బితుకుబితుకు మంటూనే బస్ దిగాను. కొన్ని అడుగులు వేసి ఊరిని తేరిపార జూశాను. ఊరు ప్రశాంతంగా కనిపించింది. జనం మామూలుగానే మాట్లాడుకుంటున్నారు.

రాళ్ళగుట్ట స్త్రీ కార్మికురాలొకామె నన్నుచూసి గుర్తించి, పరుగెత్తుకొచ్చి, “ఓ, దొమితిలా! వచ్చేశావా!” అని కావలించుకుంది.

అమ్మయ్య-నేనొక నిట్టూర్పు విడిచాను. ఉరితీస్తారనీ, కొడతారనీ ఊహించిన చోట ప్రేమగా కావలించుకుంటున్నారు.

చుట్టూ ఉన్న జనం అందరూ నేను వచ్చేశానని గుర్తించారు. ఒకరొకరే వచ్చి “బావున్నావా? అబ్బ – నువు రావడం ఎంత సంతోషంగా ఉందో – వాళ్ళు నిన్ను బాగా చూశారా? కొట్టారా? అక్కడ ఎలా ఉంది?” అని ప్రశ్నలు గుప్పించడం మొదలెట్టారు.

అమ్మయ్య – అప్పుడు నా మనసెంత కుదుటపడిందని?

వాళ్ళందరూ ఆనందంగా “మేం ఇప్పుడు సమ్మె చేస్తున్నాం. ఇప్పటి వరకు మేం పనిలోకి దిగనే లేదు తెలుసా? మేం ఎన్నో రోజులు పని చేయనేలేదు” అని చెప్పారు.

అంటే నేను అరెస్టయిన నాటి నుంచి వాళ్ళుపనికి వెళ్ళలేదు. జైళ్ళలో ఉన్నవారికి మద్దతుగా…! ఎంత గొప్ప విషయం !

నా మనసు పూర్తిగా కుదుటపడింది. ఆ రోజు కాగితం మీద సంతకం పెట్టనందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. నాకు కొండెక్కినంత సంతోషమయింది.

నేనెంత ఆనందాతిరేకంలో పడిపోయానంటే పిల్లల సంగతి అడగాలని గానీ ఇంకా అడగాల్సినవెన్నో ఉన్నాయని గానీ నాకు గుర్తెరాలేదు. వాటి బదులు జైల్లో నాకెదురైన అనుభవాలూ, ఆ కాగితం మీద సంతకం పెట్టే గొడవా – అలాంటివే మరెన్నో గుర్తొచ్చాయి.

సైగ్లో – 20లో కెళ్ళాక “నా పిల్లలెక్కడున్నారు?” అని ఎవరినో అడిగాను.

“నిన్ననే చూశాను” అని ఒక స్త్రీ చెప్పింది.

మేం మా ఇంటివైపు మళ్లాం. నాతో పాటు ఎంతోమంది వచ్చారు. వందమంది కన్న ఎక్కువే ఉంటారేమో! నన్ను చూసిన వాళ్ళందరూ నా వెనుక గుంపులో కలిశారు.

మేం మా వీధి మొగదలలో కొచ్చేసరికి కొందరు పిల్లలు రివ్వున పరుగెత్తుకెళ్ళి నా పిల్లలకీ సంగతి చెప్పారు. అప్పుడు మా ఇంటి తలుపులు తెరుచుకొని నా పిల్లలు ఒక్కక్కరూ బైటికి రావడం నేను చూశాను.

అప్పుడు నా మనస్థితి ఎలా ఉండిందో ఊహించగలరా మీరు? ఎంత కుదుట పడ్డాను! వాళ్ళను నేను పోగొట్టుకోలేదనీ, వాళ్ళు నాతో పాటు ఉన్నారని తెలిసి ఎంత ఆనందించాను! ఆ ఆనందంతో నేను ఏడవడం మొదలెట్టాను. పిల్లల్ని గుండెకు హత్తుకొని అటూ ఇటూ పిచ్చిగా పరిగెత్తాను, ఎగిరాను, దుమికాను, గంతులేశాను. ఆ క్షణం ఎలా ఉండిందో మీరు ఊహించలేరు. అది ఒక మహత్తర క్షణం! నేను మళ్ళీ జీవితంలోకి వచ్చినట్టనిపించింది. ఆ క్షణం ఎంత మధురమైన క్షణమంటే ప్రపంచంలో, ఇంక నాకేమీ లేనట్టు నేను నా పిల్లల్ని ముద్దాడుతూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ, హత్తుకుంటూ, నామీద పడేసుకుంటూ ఉన్నాను. వాళ్లు బతికి వున్నారు, అది, అదే చాల గొప్ప విషయం. దాన్ని వర్ణించడానికి నాకుమాటలులేవు.

అప్పుడు నాన్న బయటికొచ్చాడు. ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నాడు. పొరుగిళ్ళ వాళ్ళు వచ్చారు. ఇక ఆ రాత్రంతా నాకొక్క నిమిషం కూడా విశ్రాంతి లేదు. ఖైదీల భార్యలు ఒక్కక్కరే వచ్చి తమ భర్తలెట్లా ఉన్నారని అడిగేవారు. నేనా రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాను. ఏ ఒక్క సంగతీ వదలకుండా వాళ్ళు వాళ్ళ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. నేను నా విషయాలన్నీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ అవే సంగతులు చెప్పుకున్నాం. అలాగే రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పొద్దు కరకర పొడిచేదాకా కూడా ఇంటినిండా జనం ఉన్నారు.

యూనియన్ సమావేశం ఒకటి ఏర్పాటుచేశామనీ, నేను అక్కడికి రావాల్సి ఉందనీ కార్మికులు చెప్పారు. అక్కడ నేను జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్టు వివరించి చెప్పాను. ఏ చిన్న వివరం కూడా వదిలి పెట్టలేదు. నేను పడిన అనవసర ఆందోళన, ఒరురో వరకు నాతో వచ్చిన ఏజెంట్ మాటలూ అన్నీచెప్పాను.

“మేం నిన్ను నిర్బంధించామని చెప్పకపోతేనే నీకు క్షేమం. నీ భర్తను కాపాడుకోవడానికి నీకు అదే మార్గం. నీ భర్తను విడుదల చేయమని అడగడానికి నీ అంతట నువ్వే డిఐసి భవనానికి వచ్చావనీ, బయటెక్కడా ఉండడానికి చోటులేదు గనుక, డిఐసి కార్యాలయంలో ఉండమన్నారనీ నువు చెప్పాలి. నువు నీ భర్తను సజీవంగా చూడదలచుకుంటే తప్పకుండా అట్లాగే చెప్పాలి. అలా చెప్పకపోయావో ఇక నీ పిల్లల్ని నువ్వొక్కదానివే సాకాల్సి వస్తుంది.”

వాళ్ళు నన్ను అలా బెదిరించారని నేను కార్మికులకు చెప్పేశాను. దానితో ఏ ఫలితమన్నా ఉండనీగాక, జనానికి నిజం చెప్పకుండా ఉండడం ఎట్లా?

‘ఈ మాటలు వినగానే కార్మికులు తమ ప్రతిఘటన తెలిపారు. వాళ్ళు పనిలో కైతే తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారుగాని, మిగిలిన అందరు ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.