మళ్ళీ జైలుకు

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి వెనక్కి వెళ్ళిపో! నీకు నార్ బెర్టా డి ఆగిలార్ తెలుసుగదా. గెరిల్లాలతో సంబంధాలున్నాయని ఆమెను అరెస్టు చేశారు. ఆవిడ నీ పేరు చెప్పింది. వాళ్ళు నీ పేరుమీద వారెంట్ తీశారు. నువు కడుపుతో ఉన్నప్పుడు అరెస్టు చేసిన పాపం నేను మూటగట్టుకోదలచుకోలేదు. దయచేసి దిగి ఎటన్నా వెళ్ళిపో!” అన్నాడు.

          “కానీ… నేను పిల్లల్ని చూడ్డానికే వస్తున్నాను ఇల్లుదాటి బయటికడుగు పెట్టను”

          “లేదమ్మా! నా మాటవిని వెళ్ళిపో – అంత అవసరమైతే నీ భర్త వచ్చి పిల్లల్ని చూస్తాడులే”

          ఆయన’ నా వస్తువులన్నీ బస్ నుంచి దింపించి, ఒరురోవైపు వెళ్ళే బస్ లో నన్ను ఎక్కించాడు.

          నేను ఒరురో చేరేసరికి రెనె విపరీతంగా తాగుతూ కూచున్నాడు. అప్పుడాయన నాకు నీళ్ళు తాగుతున్న చేపలా కనిపించాడు.

          “మళ్ళీ తాగుతున్నావేం?” అనడిగాను.

          ఈ మాటకే ఆయన నన్ను కొట్టడం మొదలెట్టాడు. నా వల్లనే తనకు ఉద్యోగం రావడం లేదనీ, నా వల్లనే తాను తాగుడుకు అలవాటుపడ్డాననీ, కనుక ఇక నేనేం చెప్పినా ఖాతరుచెయ్యననీ ఆయనన్నాడు.

          మర్నాటికల్లా ఆయన కుదుట పడ్డాక, నేను మళ్ళీ సైగ్లో-20 వెళ్ళాల్సిన విషయం ఎత్తాను.

          “వాళ్ళు నన్ను సైగ్లో-20లోకి వెళ్లనివ్వడం లేదు. పిల్లలక్కడ ఒంటరిగా ఉన్నారు గదా. నువు వెళ్ళరాదూ…”

          “నేను వెళ్ళను – నేనెందుకెళ్ళాలసలు?”

          ఆయనంత ఖండితంగా చెప్పాక నాకు చాలా నిరుత్సాహం కలిగింది. ఏం చేయాలి? ఏం చేయగలను?

          అప్పుడు నాన్న “ఎందుకంత కుంగిపోతావ్. ఎందుకలా కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తావ్? ఎందుకట్ల పిచ్చిగా ప్రవర్తిస్తావ్? ఇంతింత చిన్న సంగతులు నేర్చుకోకపోతే నువు అన్ని చదివి ఏం ప్రయోజనం? నువు యూనియన్లోకీ, రాజకీయాల్లోకి దిగి ప్రయోజనమే ముంది? నువ్విట్లాగే ఉంటే రాజకీయాల్లో ఎందుకు పనికొస్తావు? ఎక్కడికైనా నువు పరాయివాళ్ళ కళ్ళు గప్పి పోదలచుకున్నప్పుడు మారువేషంలో వెళ్ళాలి” అన్నాడు.

          అప్పుడాయన కొన్ని సలహాలు చెప్పాడు. నేను టకటకా తల వెంట్రుకలు కత్తిరించుకున్నాను. వేరే దుస్తులు వేసుకున్నాను. ఒక కొత్త మనిషిగా తయారయ్యాను. ఐతే ఈ ప్రయత్నం కూడా నిష్ఫలమే అయింది.

          మేం ప్లాయా వెళ్ళే ప్రధాన ద్వారం దగ్గర చేరే సరికి ఒక ఏజెంట్ ‘ఒక్క నిమిషం ఆగండి’ అన్నాడు. అక్కడున్న శిబిరంలోకి వెళ్ళి ఇద్దరు ఏజెంట్లను తీసుకొచ్చి “ఈవిడ్ని అరెస్టు చెయ్యండి” అన్నాడు.

          నిజం చెప్పాలంటే, అప్పుడు మొట్టమొదటిసారిగా నేను చాల భయపడ్డాను. ఒణికి పోయాను. నా మోకాళ్ళప్పుడు ఒకదానికోటి కొట్టుకునేంతగా వణికాను నేను. పారిపోదామా అనుకున్నాను. ఏం జరుగబోతోందో నా శరీరానికి అర్థమయి, అలా పండుటాకులా వణుకు తున్నట్టు అనిపించింది. నా గుండెను ఒక ఇనుపకడ్డీతో మెలి పెట్టినట్టు అనిపించింది.

          “ఈవిడ ఇక్కడ దిగిపోతుంది” అని వాళ్లే డ్రైవర్ తో చెప్పారు.

          “దిగను, దిగను – అసలు నన్ను దిగమనడానికి మీరెవరు? ఎందుకు దిగాలి?”

          “నోర్మూసుకో – నువు దిగకపోతే ఈ బస్ ఇంక కదలదు” అని బస్ ఇంజన్ ఆపుజేశారు.

          బస్ లో ఉన్న వాళ్ళందరూ “తొందరగా దిగమ్మా – దిగి సమస్యేమిటో తేల్చుకోరాదూ, దిగు, దిగు….” అని నన్ను త్వర పెట్టారు. డ్రైవర్ నా దగ్గరి కొచ్చి “మీ పిల్లలకేమన్నా చెప్పమంటావా?” అని అడుగుతూనే ఉన్నాడు, నేను జవాబు చెప్పే వీలు కూడా లేక పోయింది. నా వెనకే ఉన్న ఏజెంటు నన్ను మాట్లాడ నివ్వలేదు. వాడు నన్ను కిందికి తోసేశాడు. నా వస్తువులన్నీ బయటికి పారేశాడు.

          వాళ్ళు నన్నుఅంగుళమంగుళమూ సోదా చేశారు. అక్కడున్న ముగ్గురు ఏజెంట్లూ నన్ను సోదా చేశారు. నా తలను కూడా చిందర వందర చేసి వెతికారు. నా కాళ్ళమీద బర్రలు చూసి అవెట్లా వచ్చాయని అడిగారు. వాళ్ళడగని విషయం లేదు.

          ఆ రోజు సెప్టెంబర్ 20.

          వాళ్ళు నన్ను అప్పుడు ఒంటరిగా ఓ కొట్లో పడేశారు. మధ్యాహ్నం పూట ఓ ఏజెంటు నా దగ్గరికొచ్చి “నీ పేరేమిటి?” అని అడిగాడు.

          “నీకు తెలిసి ఉండాలిగదా! నేనెవరో తెలియకుండానే అరెస్టు చేశావా?”

          అప్పుడు వాడు నాతో “సరసాలాడుతున్నావా! ఇక్కడ ప్రశ్నలడిగేది నేను, నువ్వు కాదు” అని మొరిగాడు.

          వాడప్పుడు నా పేరు, ఊరు, ఎక్కడికెళ్తున్నదీ, ఎందరు పిల్లలున్నదీ, భర్తెక్కడున్నదీ, సైగ్లో-20కి ఎందుకెళ్తున్నదీ సమస్త వివరాలడిగి రాసుకొని వెళ్ళిపోయాడు. .

          ఈ తతంగమైపోయాక వాళ్ళు నన్ను కొట్లో వేసి తాళం బిగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు వినిబడిందల్లా ఎవరో క్రమబద్ధంగా ఒకటి – రెండు – మూడు, ఒకటి – రెండు – మూడు…. అని నడుస్తున్న అడుగుల చప్పుడే. నేను ఆ అడుగులు లెక్క పెడుతూ,నా కాలం గడుపుదామనుకున్నాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసునా? కొన్ని క్షణాలు కూచుంటాను. కొన్ని క్షణాలు నిలబడతాను. చలికి వణికిపోతాను. ఏమీ తోచకుండా ఉంది. కడుపులో నొప్పి వస్తోంది. దాహం వేస్తోంది. భయమవుతోంది. అప్పుడు నేను అనుభవించిన క్షణాలు నా జీవితంలో మరే ఇతర క్షణాలతోను పోల్చదగినవి కావు.

          నేనిలా ఉన్నప్పుడే కొట్లోకి ఒకడొచ్చాడు. వాడు ఒక కల్నల్ కొడుకని నాకా తర్వాత తెలిసింది. వాడు కొట్లోకి వచ్చిన సమయం పగలో రాత్రి నాకు తెలియదు. కొట్టంతా కటిక చీకటి నిండి ఉంది. నన్ను ప్రశ్నించడానికే, నన్ను లొంగదీసి జవాబులు రాబట్టడానికే తానొచ్చానని వాడన్నాడు. నేను గెరిల్లాలతో పని చేశానా అని వాడడిగాడు.

          వాడి ప్రధానోద్దేశ్యం నన్ను కాసేపు ఏడిపించి సరదా తీర్చుకోవడమే అని నాకర్థమై పోయింది. నేను కడుపుతో ఉండడం చూసి వాడు, స్త్రీలెందుకు పనికొస్తారో అర్థం కాలేదా అని అడిగాడు. ఆడవాళ్ళు మగవాళ్ళకు ఆనందం ఇవ్వడానికే పుట్టారన్నాడు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో దిగడమెందుకన్నాడు. అలా వాడు నన్ను నానా మాటలతో అవమానించాడు. అంతేకాదు, నన్ను నా భర్త సంతృప్తి పరచలేక పోయాడనీ, నాకింకా ఆయనివ్వగలిగిందానికన్న పెద్దది మరేదో కావాలనే కోరిక ఉంది గదూ అని కారుకూతలు కూశాడు. అందుకే వాడు నన్ను లొంగదీస్తున్నాడట. అది జరగకుండా ఉండాలంటే నేను వాడడిగిన వాటన్నిటికీ జవాబు చెప్పాలట. గెరిల్లాలు ప్రజల దగ్గర దొంగిలించిన డబ్బంతా నా దగ్గర దాచారని వాళ్ళకు సమాచార మందిందట.

          నేను వాడేమన్నా అనుకోనీ అని పెదవి విప్పకుండా కూచున్నాను. దాంతో వాడు మరింత రెచ్చిపోయి, చాల మొరటుగా భరించలేని కారుకూతలు కూయడం మొదలెట్టాడు. ఆ మాటలు విని నా రక్తం ఉడుకెత్తిపోయింది. బాధతో, కోపంతో, అవమానంతో నేను మండిపోయాను. ఈ మాటలంటూనే వాడు నన్ను పట్టి అటూ ఇటూ లాగాడు. నన్ను వాడు చితగొట్టాడు. నన్ను బలవంతాన అనుభవిద్దామని వాడనుకున్నాడు. నేను ప్రతిఘటించాను. వాడు నా మొఖం మీద ఉమ్మేశాడు, తన్నాడు, నేనిక తట్టుకోలేక పోయాను. నేను వాణ్ని కొట్టడం మొదలెట్టాను. వాడు నా మీద గుద్దుల జోరు ఎక్కువ చేశాడు. నేను వాడి ముఖం గోళ్ళతో రక్కాను. అప్పుడు వాడు నన్ను విపరీతంగా కొడుతూ, మీద పడడం మొదలెట్టాడు. నేను కాచుకోగలిగినంత సేపు ఆ దెబ్బలు కాచుకున్నాను. వాడిట్లా కొడుతూనే “నార్ బెర్టా చెప్పిన సంగతేమిటి? ఇంతీ పెండో చెప్పిన ప్రకారం నార్ బెర్టా నీకు 120 మిలియన్లు ఇచ్చిందటగా. నీకు గెరిల్లాలతో సంబంధాలున్నాయనీ, నువు గెరిల్లాలకు జనంతో సంబంధాలు కలిపావనీ చెప్పిందే” అన్నాడు.

          “అది అబద్ధం. నాకు నారా బెర్టా తెలుసు. కాని నాకు గెరిల్లాలతో సంబంధాలేమీ లేవు. అది పచ్చి అబద్దం, బూటకం” అని అరిచాను.

          “కాదు, నిజం, పచ్చినిజం. నువు కాదనొచ్చుగాక కానీ, రుజువు కావాలా, చూస్తావా…” అని వాడు ఒక గార్డును పిలిచి “ఈ లంజె గురించి సాక్ష్యంగా మన దగ్గరున్న ఉత్తరాలు పట్రా” అన్నాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.