మిట్ట మధ్యాహ్నపు మరణం- 15

– గౌరీ కృపానందన్

          పింక్ కలర్ లో పెద్ద కాగితంలో కార్బన్ పేపర్ మీద వ్రాసిన అక్షరాలు.

16th క్రాస్ స్ట్రీట్

6th మెయిన్ రోడ్,

మల్లేశ్వరం

          మాధవరావు జీప్ లో ఎక్కి, “మల్లేశ్వరం పోనీయ్” అన్నారు.

          జీప్ కన్నా వేగంగా అతని ఆలోచనలు పయనించ సాగాయి. రూములో అద్దం మీద మాయ! రూమ్ లో దొరికిన షూ గుర్తులు. అక్కడి నుంచి సులేఖ స్పోర్ట్స్ షాప్! మళ్ళీ అక్కడి నించి మాయా స్పోర్ట్స్ క్లబ్ కి ఆఖరున చేరుకున్నారు. హంతకుడు ఎత్తైన, ధృడమైన వ్యక్తి.

          16th క్రాస్ స్ట్రీట్ లో జీప్ మలుపు తిరిగింది.

          “కాస్త మెల్లిగా పోనివ్వు.”

          రన్నింగ్ జీప్ లో నుంచి పరిశీలనగా చూశాడు. “మల్లేశ్వరం యూత్ అసోసియేషన్.”

          MAYA  ఇదేనా. బ్యాట్ మింటన్ కోర్టు. వ్యాయామం చేయాడానికి అనువుగా బార్లు అన్నీ కనబడ్డాయి.

          పేకాట ఆడుకోవడానికి ఒక రూమ్. టేబిల్ టెన్నిస్ టేబుల్, బిలయర్డ్స్ టేబిల్ ఉన్న గదులన్నీ తాళం వేసి ఉన్నాయి. ఆ బిల్డింగును ఒక సారి చుట్టూ తిరిగి వచ్చారు మాధవరావు. పక్కనే అవుట్ హవుస్ లాంటి ఇల్లు కనబడింది. అక్కడికి వెళ్లి తలుపు తట్టారు.

          “ఎవరూ?”

          “తలుపు తీయండి.”

          “ఎవరు సుబ్రహ్మణ్యం? ఆయన వచ్చారా?”

          “ఆయనగారి తాత వచ్చాడు. తలుపు తెరు.”

          “ఎవరయ్యా అదీ?”

          తలుపులు తీసిన ముసలాయనకి అరవై ఏళ్ళు ఉండొచ్చు.

          “కాస్త ఉండండి. ఇప్పుడే వస్తాను.”

          బనియన్ తొడుక్కుని వచ్చాడు.

          “ఏం కావాలి సార్?”

          “ఎప్పుడు తెరుస్తారు?”

          “క్లబ్బా? సాయంత్రం నాలుగు గంటలకి.”

          చేతి గడియారం వైపు చూసి, “ఇప్పుడు నాలుగు అయ్యింది?” అన్నారు మాధవరావు.

          “సుబ్రహ్మణ్యం గారు వచ్చే టైం అయ్యింది.”

          “తాళం చెవి నీ దగ్గర ఉందా?’

          “లేదండీ.”

          “నువ్వు ఎవరు?”

          “బిల్లియర్డ్స్ మార్కర్. ఏదైనా తప్పు జరిగిందా సార్.”

          “లేదు. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలి. నీ  పేరేమిటి?”

          “తిమ్మప్ప. ముప్పై సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను సార్.”

          “ఎంత మంది మెంబర్లు ఉన్నారు?”

          “నాలుగు వందలకి పైనే ఉంటుందండీ.”

          “ఇక్క ఉన్న వాళ్ళందరినీ మీకు తెలుసా?”

          “దాదాపు అందరినీ తెలుసు.”

          “ఎత్తుగా, దృడంగా స్పోర్ట్స్ షూ వేసుకునే వాళ్ళ నెవరినైనా తెలుసా?”

          అతను అర్ధం కానట్లు చూశాడు. వెనకాల అడుగుల చప్పుడు వినిపించింది.

          “ఏం జరిగింది?”

          “రండి సార్. ఇనస్పెక్టర్ గారు ఏదో అడుగుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఈయనే సుబ్రహ్మణ్యంగారు. క్లబ్ సెక్రటరి.”

          సుబ్రహ్మణ్యం గారి క్రాప్ చక్కగా దువ్వినట్లు ఉంది. చెవి దగ్గర కాస్త తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. ఒక వేళ డై వేసుకుని ఉన్నాడా?

          “మిస్టర్ సుబ్రహ్మణ్యం! ఐ యాం ఇనస్పెక్టర్ మాధవరావ్ ఫ్రం క్రైం బ్రాంచ్. ఈ మధ్య జరిగిన ఒక హత్య గురించి ఎంక్వయిరీ చేస్తున్నాము. ఆ హంతకుడికి ఈ స్పోర్ట్స్ క్లబ్బుకి ఏదో లింక్ ఉందని తెలిసింది.”

          “హత్య జరిగిందా? ఎక్కడ?”

          “ఇక్కడ కాదు. మీరు కాస్త మీ ఆఫీసు తెరిస్తే అక్కడ నిదానంగా కూర్చుని మాట్లాడు కోవచ్చు.”

          “ప్లీజ్ కం. ఇది చాలా మర్యాదస్తులు ఉండే క్లబ్ అండీ. మధ్య తరగతి వాళ్ళ కోసం ఏర్పడింది. మెంబర్ ఫీజు చాలా తక్కువ.”

          ఆయన ముందు నడుస్తూ, తలుపులు తీస్తూ, కుర్చీలో ఉన్న దుమ్మును దులుపుతూ చెప్పుకు పోతున్నారు.

          “కూర్చోండి.”

          “మిస్టర్ సుబ్రహ్మణ్యం! సూటిగా విషయానికి వచ్చేస్తాను. కొన్ని రోజుల ముందు సులేఖ స్పోర్ట్స్ అన్న షాప్ నుంచి స్పోర్ట్స్ షూ లను డిస్కౌంట్ రేట్ లో కొన్నారు కదా?”

          ఆయన కాస్త ఆలోచించి, “అవును గుర్తు ఉంది. ఇరవై అయిదు జోళ్ళు అని జ్ఞాపకం” అన్నారు.

          “వాటిని ఏం చేశారు?”

          “మెంబర్స్ కి  ఇచ్చాం.”

          మాధవరావు తన ఆతృతను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, నిదానంగా అడిగారు. “ఎవరెవరికి ఇచ్చారు?”

          సుబ్రహ్మణ్యం లేచి అలమారా నుంచి ఆకుపచ్చ రంగు ఫైల్ తీసుకుని వచ్చారు.

          “మై రికార్డ్స్ ఆర్ అప్ టు డేట్.” పేజీలు  తిప్పి, “చూశారా. నోట్ చేసుకున్నాను. పదిహేను జోళ్ళు క్రికెట్ టీంకి పది జోళ్ళు బాస్కెట్ బాల్ టీంకి ఇచ్చాను.”

          “వాళ్ళ పేర్లు తెలుసా?”

          “టీం కెప్టెన్ ని అడగాలి. వాళ్ళే సంతకాలు పెట్టి తీసుకున్నారు.”

          “వాళ్ళ పేర్లు ఉన్నాయా?”

          “వెయిట్ ఎ మినిట్.” మళ్ళీ వేరే ఫైల్ తీసారు. “బాస్కెట్ బాల్ టీం లో ఉన్న వాళ్ళ పేర్లు ఇందులో ఉన్నాయి చూడండి.”

          A.S. రామానుజం  కెప్టెన్

  1. ముత్తయ్య

          M.G. సత్యనారాయణ

          H.ఉదయ కుమార్

  1. తిమ్మప్ప

          దామోదర్ పారు

          తిరగేయ బోయిన మాధవరావు చెయ్యి అలాగే ఆగి పోయింది. H. ఉదయ కుమార్!  ఈ పేరును ఎక్కడో విన్నాను. అవును… అతనే… ఆ హోటల్లో సర్వర్.

***

          ఉమకి రాత్రిళ్ళలో పిచ్చి పిచ్చి కలలు వచ్చాయి. తలుపులను ఎవరో కొడుతున్నారు. ఎవరు అని అడిగితే మాయ! గదిలో రక్తం మడుగులో మూర్తి.

          ఎవరో కుదిపి లేపినట్లు మెలకువ వచ్చింది ఉమకి.

          క్రిందికి దిగి వచ్చింది. హాల్ లో ఉన్న బంధువులు ఆమె రాగానే సంబాషణను నిలిపేశారు.

          ఆమె దాన్ని గమనించనట్లు వంటింట్లోకి నడిచింది.

          “అత్తయ్యా! నేను కాఫీ పెట్టనా?”

          “అన్నీ అయ్యాయి. ఇప్పుడు టైం ఎంత అయ్యిందో తెలుసా. ఎనిమిది దాటింది. రెండో కాఫీకి వేళ అవుతోంది.

          “పోనీ, వంట చేయనా?”

          “వద్దమ్మా. మీ యింటి రుచులు ఇక్కడ ఎవరికీ నచ్చదు. ఇక్కడ అందరికీ కాస్త కారం ఎక్కువ పడాలి.”

          అలాగే నిలబడింది. “వేరే ఏదైనా సాయం చేయమంటారా?”

          “ఏమీ వద్దమ్మా.” నువ్వు ఇల్లు వదిలి వెడితే చాలు అన్న భావం ధ్వనించింది.

          “కాఫీ తాగి నీ గదిలోనే ఉండు. వంట పూర్తవ్వగానే మామగారు వచ్చి చెప్తారు. వచ్చి భోజనం చేద్దువుగాని.”

          “వద్దు అత్తయ్యా. నేను వెళుతున్నాను.”

          “ఎక్కడికి? మీ యింటికా?” ఉత్సాహం దాచుకోని గొంతుతో అడిగింది ఆవిడ.

          “అవును. వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేస్తాను.”

          “సరే.” నీరసంగా అన్నది ఆవిడ.

          కాఫీ తాగి స్నానం చేసి ఆర్గండి ఛీరను కట్టుకుని ఆమె బయలు దేరుతుండగా, అందరూ మౌనంగా చూస్తూ ఉండి పోయారు.

          బస్ స్టాప్ దగ్గిరకి వచ్చి నిలబడింది.

          “హలో!” ఎవరో పలకరించారు.

          ఆమె తిరిగి చూసింది.

          “నేను గుర్తున్నానా?”

          అతను ఎవరో సరిగా జ్ఞాపకానికి రాలేదు. ఎక్కడో చూసినట్లనిపించింది. కానీ ఎక్కడ అని మాత్రం గుర్తుకి రాలేదు.

          “జ్ఞాపకం వచ్చిందా?” అడిగాడు అతను.

          అతని గొంతులో ఆసక్తి, చనువు కనబడ్డాయి. తెల్లటి మేని ఛాయ వల్ల షేవ్ చేసుకున్నంత మేరా గడ్డం ఆకుపచ్చ రంగు తేలి కనబడింది. కళ్ళు కాస్త గోధుమ రంగులో ఉన్నాయి.

          అతని కళ్ళని పరిశీలనగా చూసింది.

          “సారి! మీకు జ్ఞాపకం ఉండడానికి ఛాన్స్ లేదు.”

          “ఉండండి. కాస్త ట్రై చేస్తాను. మీరు … మీరు… మిమ్మల్ని క్రికెట్ గ్రౌండ్ లో మేచ్ మధ్య చూశాను. తరువాత… బృందావన్ ఎక్స్ ప్రెస్ లో మా క్రికెట్ టీం టూర్ కి వస్తున్నప్పుడు, మీరు కూడా మాతోనే వచ్చారు. సరిగ్గా గుర్తు పట్టానా?”

          “కరెక్ట్! నా పేరు చెప్పండి చూద్దాం.”

          “మీ పేరు రా….”

          “రాకేష్! ఇప్పుడు గుర్తుకు వచ్చానా?”

          “యెస్. మేము ఆడిన మేచ్ లన్నింటికీ మీరు వచ్చారు.”

          “మీ టీం ఆడిన మాచ్ కోసం రాలేదు. మీ కోసం మాత్రమే. మీరు ఆడిన మాచ్ లను చూడడానికి వచ్చాను.”

          జవాబు చెప్పలేనట్లు ఉమ తల దించుకుంది.

          “ఇంకా క్రికెట్ ఆడుతున్నారా?’

          “క్రికెట్ ఆడి ఒక యుగం అయ్యింది.”

          “ఏమయ్యింది? బాగానే ఆడే వారుగా. ఆ రోజు జిమ్ ఖానా క్లబ్ కి ఎదురుగా 49 రన్నులు తీశారుగా. అందులో ఒక సిక్సర్ కూడా కొట్టారు. ఎందుకు మానేశారు?”

          ఉమ తలెత్తి అతన్ని చూసింది. “పెళ్లి అయ్యింది” అన్నది.

          “అలాగా. మీ భర్త వద్దన్నారా?”

          “ఆయన చని పోయారు.”

          “ఓ మై గాడ్! ఐ యాం సారీ… సో సారీ. నేనొక పిచ్చి వాడిలా మీ దగ్గర క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను. వెరీ సారీ.”

          ఉమ మౌనంగా ఉండి పోయింది.

          “మిమ్మల్ని క్రికెట్ లో చూసి ఆరునెలలే అయి ఉంటుంది. అంతలో పెళ్లి అయ్యి…”

          “రెండు రోజులే ఆయన ఉన్నది.”

          “ఓ గాడ్! నాకు ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియడం లేదు. మీకు ఏర్పడిన ఈ దుఃఖానికి ఎలా నా బాధను వ్యక్త పరచాలో కూడా అర్థం కావడం లేదు. మీ పేరు ఉమ కదా.”

          “అవును.”

          “ఉమా! ఏ విధంగా నైనా నేను మీకు సాయపడ గలిగితే చెప్పండి. చేయడానికి సిద్ధంగా ఉన్నాను.”

          “థాంక్స్!”

          “నేను మిమ్మల్ని విసిగిస్తున్నానని అనుకోకండి. నాకూ బాధ అంటే ఏమిటో తెలుసు. చెల్లెలిని పోగొట్టు కున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఫోన్ నంబర్, అడ్రెస్ అన్నీ ఉన్నాయి. ఏదైనా సాయం కావాలంటే నన్ను పిలవడానికి మర్చి పోకండి. వెంటనే వచ్చేస్తాను.”

          “థాంక్స్!”

          “మరి నేను వెళ్లి రానా.”

          అతని కళ్ళలో నీళ్ళు తిరగడం ఆమె చూసింది. తనని తాను కంట్రోల్ చేసు కోవడానికి అన్నట్లు అక్కడ ఉన్న సిమెంట్ చప్టా మీద కూర్చుంది.

          “ఏమయ్యింది? కళ్ళు తిరుగుతున్నాయా?”

          లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. అయినా కంటి నీరు ఆగనంటోంది.

          “మీకు ఒంట్లో బాగా లేదనుకుంటాను. టాక్సీ తీసుకు రానా? మీ ఇంటి దాకా తోడుగా వస్తాను.”

          “వద్దు వద్దు. ఇల్లు దగ్గిరే. నేను వెళ్లి పోగలను.”

          బస్ రాగానే ఎక్కింది. కదులుతున్న బస్ నుంచి అతన్ని చూసింది. అతని చూపుల్లో కనబడే ఆ  ఆర్ద్రతకి అర్థం ఏమిటి? బస్సు కనుమరుగు అయ్యే దాకా తన వైపే చూస్తూ నిలబడి ఉండడం గమనించింది.

          “రా ఉమా!” అమ్మా ఏడుస్తూనే స్వాగతం పలికింది.

          “అమ్మా! ఏడవకు. ఏడ్చి ఏడ్చి అన్నీ అయ్యాయి. ముగిసి పోయాయి. మణి ఎక్కడ?”

          “షాప్ కి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేస్తాడు. కూర్చోమ్మా.”

          “అమ్మా! వేడిగా కాస్త కాఫీ కలిపి ఇవ్వమ్మా.”

          “నా బంగారు తల్లీ! తెస్తాను ఉండు.”

          ఉమకి పెళ్లి కాక ముందు తను చేసిన అల్లర్లు, కొంటె పనులు, చిలిపి నవ్వులూ అన్నీ గుర్తుకి వచ్చాయి. వంట చేస్తాను అని ఒక రోజు వంట యింటిని తలక్రిందులుగా చేసిన ఉదంతం జ్ఞాపకానికి వచ్చింది.  ఆ అల్లరులూ, ఆ రోజులూ మళ్ళీ తన జీవితంలో రానే రావా?

          “ఎన్ని రోజులు అక్కడ ఉండాలను కుంటున్నావు?”

          “ఎందుకమ్మా? ఇక మీద అక్కడే ఉండాలని అనుకుంటున్నాను.”

          “మీ అత్తగారు ఏమంటోంది?”

          “ఆవిడకి నచ్చలేదు. వెళ్లమంటోంది.”

          “మరి నువ్వేమన్నావు?”

          “మా నాన్నగారు ఇచ్చినవన్నీతిరిగి ఇవ్వాలని అన్నాను.”

          “ఎందుకే అలా అడిగావు?”

          “ఎందుకు అడగ కూడదు? నేను అడిగిన దాంట్లో తప్పేముంది?”

          “న్యాయమే అయినా అలా నేరుగా అడిగేయడమేనా?”

          “ఏదో విషయం మన దగ్గరి నించి దాచి పెట్టి పెళ్లి చేసారే. అదిమాత్రం న్యాయమా?”

          “ఏ విషయం దాచారే?”

          “తెలియదు. అది తెలుసుకునే దాకా ఆ యింటి నుంచి కదలను.”

          “పోవే పిచ్చిదానా. ఇందులో వాళ్ళు దాచింది ఏమీ లేదు. అన్నీ వివరంగా తెలుసుకునే ఈ పెళ్లి జరిపించాము. మనకు ప్రాప్తం లేదు. నువ్వు ఇలా మాట్లాడడం, వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అనడం బాగా లేదమ్మా, స్నానం చేశావా?”

          “చేశాను.”

          “ఈ స్నానం కాదే…”

          “ఆ … అదీ అయ్యింది.”

          “దేవుడు ఈ మాత్రం కనికరించాడు.”

          “ఆ దేవుడు నిజంగానే నన్ను కనికరించి ఉంటే బాగా ఉండేదేమో. నాకూ జీవితంలో ఒక పట్టుకొమ్మ ఉండేదేమో. ఇక జీవితాన్ని ఏ ఆధారంతో గడపను? పంతొమ్మిది ఏళ్లలో నాకు పెళ్లి ఎందుకు చేశావమ్మా?”

          “అంతా మన తలరాత! ఇలా అవుతుందని ఎవరైనా కలగన్నామా? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు. రా మణీ! ఎవరు వచ్చారు చూడు.”

          “ఉమా! నువ్వా!” టవల్ తో కళ్ళు తుడుచుకున్నాడు. “ఒక వారంలో ఇంతా చిక్కి పోయావు? అక్కయ్యా! ఉమను ఈ క్షణమే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను.”

          “పిచ్చివాడిలా మాట్లాడకు.” గద్దించింది ఉమ.

          “నేను అన్నదాంట్లో తప్పేముంది? రెండు రోజుల పెళ్లి కోసం జీవితమంతా సన్యాసినిలా గడపాలా?”

          ఉమ కాసేపు మౌనంగా ఉండి పోయింది. అమ్మ కూడా ఆమె జవాబును ఎదురు చూస్తున్నట్లు అనిపించింది.

          “మణీ! ఇప్పుడు నా ముందున్న సమస్య మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోవాలని కాదు. ఇప్పుడు ఉన్న నా మనసు ఉన్న స్థితిలో పెళ్లి, భర్త, దాంపత్య జీవితం అన్నీ ఒక మాయగా, హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. నా మనసు, తనువు ఇంకా ఆ గాయం నుంచి తేరుకోలేదు. అంతలో మళ్ళీ పెళ్లి!”

          కటువుగా ఆమె చెప్పిన జవాబుకి మణి బెదిరి పోయాడు. “స్నానం చేసి వస్తాను” అని అక్కడి నుంచి జారుకున్నాడు.

***

          ఆ యువకుడి చేతులు వణుకుతున్నాయి. నుదుటన పూర్తిగా చెమటలు పట్టాయి. కుర్చీలో అతను కూర్చుని ఉన్నాడు. చుట్టూ నలుగురు పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు.

          మాధవరావు అతను చెప్పబోయే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.

          “నాకు తెలిసింది అంతే సార్.”

          “రాస్కెల్! అబద్దం చెబితే మక్కలు విరగ్గొడుతాం.”

          “సార్! బాస్కెట్ బాల్ ఆడితే తప్పేముంది సార్?”

          “ఆ రోజు హత్య జరిగిన గదిలోకి వెళ్ళావా లేదా?”

          “దేవుడి మీద ఒట్టు సార్. లోపలికి వెళ్ళ లేదు. తలుపులు తెరిచి ఉన్నాయే అని దగ్గరేసి వెళ్లాను సార్.”

          “అబద్దం! లోపలికి  వెళ్లావు.”

          “లేదు సార్. అదే ఫ్లోర్ లో ఉన్న ఇంకో గదికి టిఫిన్ తీసుకు వెళ్తుండగా… దారిలో…”

          మాధవరావుకి కోపం వచ్చింది. అరిచినట్లుగా అన్నారు. “మళ్ళీ మళ్ళీ అవే అబద్దాలు చెబుతున్నావా బాస్టర్డ్!” ఆయన గొంతులో నరాలు ఉబ్బి పైకి కనిపించాయి. అంత కోపం!

          సర్వర్ గా పని చేస్తున్న ఆ యువకుడు బిత్తర పోయి లేచి నిలబడి ఏడవ సాగాడు.

          “ఎందుకు చంపావు?”

          “అయ్యో లేదు సార్! ఆ రాఘవేంద్రుడి సాక్షిగా నేను చంప లేదు.”

          “లోపలికి వెళ్ళ లేదా?”

          “లేనే లేదు సర్.”

          “లోపలికి వెళ్లి శవాన్ని చూసి, భయపడి పారి పోయావా? లోపలి వెళ్లక పోతే నీ షూ ప్రింట్ అక్కడికి ఎలా వచ్చింది? సమాధానం చెప్పు.”

          “ఏ షూ ప్రింటు సార్?”

          “బాస్కెట్ బాల్ కోసం నీకు ఇచ్చిన షూస్.”

          “నేనొక్కడినే మీకు దొరికానా? అలా ఎన్ని బూట్లను ప్లేయర్స్ కి ఇచ్చారో? వాళ్ళల్లో ఎవరైనా ఉండవచ్చు కదా?”

          “నీ షూస్ ఎక్కడ?”

          “అది … అది నేనెక్కడ వెతకను? కొన్ని రోజులుగా దాన్ని వాడటం  లేదు. ఎక్కడో పోయిందనుకుంటాను.”

          “మళ్ళీ అబద్దం చెబుతున్నావా? రక్తపు మరకలు ఉన్నాయని పారేసావు. అంతేనా? ఎక్కడ పారేసావు?”

          “అయ్యో దేవుడా! నన్నెవరైనా రక్షించండి. బాస్కెట్ బాల్ ఆడినందుకా నాకీ ఈ శిక్ష?”

          “ఇదిగో చూడూ. నీ చేతి వేలి గుర్తులు ఆ గది తలుపుల మీద ఉన్నాయి. నీ షూస్ ప్రింట్ గదిలో దొరికింది. నువ్వేమో గదిలోకి వెళ్ళనే లేదని బుకాయిస్తున్నావు. ఎందు కోసం గదిలోకి వెళ్లావు? నిజం చెప్పు. నిన్ను వదేలేస్తాను.”

          “నన్ను వదిలెయ్యండి సార్. నేనేమీ చెయ్యలేదు.”

          ఆలోచనల్లో మునిగి ఉన్న డి.ఎస్.పి. మాధవరావు వైపు చూశారు.  “ఏం చేద్దాం మాధవరావు?”

          కాస్సేపు ఆగి అన్నాడు మాధవరావు. “అరెస్ట్ చేసేద్దాం సార్. ఖచ్చితంగా ఇతనే.”

          “నాకలా అనిపించడం లేదు. మీకు అరెస్ట్ చేయాలనిపిస్తే చేయండి.”

          “ఒక పని చేస్తాను. ఇతని గదిలో పూర్తిగా వెతికి చూస్తాను. ఆ షూస్ దొరికితే, మన దగ్గర దొరికిన షూ ప్రింట్ తో మాచ్ అయితే అరెస్ట్ చేస్తాను. నీ గది ఎక్కడ ఉంది చెప్పరా?”

          జవాబు చెప్పలేదు అతను.

          డి.ఎస్.పి. మాధవరావుని ఒక పక్కగా తీసుకు వెళ్ళారు. “చూడండి. మీరు పరిశోధన చేసే కోణం మంచిదే. కానీ అరెస్ట్ చేసేటంత….”

          “రండి దివ్యా! ఈయన ఎవరు?”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.