కనక నారాయణీయం -46

పుట్టపర్తి నాగపద్మిని

          పెళ్ళి తరువాత రంగయ్య సత్రంలో పనులన్నీ చక్కబెట్టుకున్న తరువాత, కడపకు వెళ్ళిపోవాలి. కానీ బాగా పొద్దుపోవటం వల్ల బస్సులు దొరకవు. ఒక వాన్ లో తక్కినవాళ్ళూ, పెళ్ళికూతురూ పెళ్ళికొడుకూ, పుట్టపర్తి దంపతులు వెళ్ళటానికి కారును ఒకదాన్ని తీసుకుని వచ్చాడు సుబ్రమణ్యం. కారులో పుట్టపర్తి దంపతులూ, కొత్త పెళ్ళి జంట కూర్చున్నారు. గట్టిగా మాట్లాడితే ప్రొద్దుటూరు నుండీ కడపకు మూడు గంటల ప్రయాణమే!! రాత్రి 11.30 కల్లా ఇంటికి వెళ్ళిపోవటమే కదా!! అని ధైర్యం!!

          ముందు వాన్, వెనుక కారూ రోడ్డెక్కాయి. రాత్రి ప్రయాణం కాబట్టి రద్దీ లేకపోవటంతో కాస్త వేగంగానే నడుస్తున్నాయి రెండూ!! కారులో ముందు సీటులో డ్రైవర్ పక్కన అతని సహాయకుడు, తరువాత డోర్ కు ఆనుకుని పుట్టపర్తీ ఉన్నారు.  

          ఉన్నట్టుండి, పెద్ద చప్పుడు. కారు రోడ్డు మధ్యలో ఉన్న గొయ్యిలో పడి లేచింది.  ముందు సీటులో పుట్టపర్తి వైపున్న తలుపు తెరుచుకుంది. పుట్టపర్తి ఆ తలుపు నుంచీ విసురుగా తోసినట్టు కింద పడి రెండు మూడు పల్టీలు కొట్టి కింద పడ్డారు, లుంగలు చుట్టుకుని!! కేకలు!! కార్ ముందుకు వెళ్ళి సడన్ బ్రేక్తో విసురుగా ఆగింది. అదృష్టవశా త్తూ వేరే వాహనాలేవీ ఎదురుగా రావటం లేదు. ఇది చూసిన వెనుక వాన్ డ్రైవర్ కూడా  సడన్ బ్రేక్ తో వాన్ ను ఆపాడు.

          కారు వెనుక సీటులో పెళ్ళికూతురూ, పెళ్ళి కొడుకూ,  శ్రీమతి కనకమ్మా ఉన్నారు.

          కార్లోనూ, వాన్ లో ఉన్న వాళ్ళందరూ గాభరాగా బైటికి వచ్చారు. ఇంకెవరికీ ఏమీ జరుగలేదు.

          పుట్టపర్తి నేలమీదే పడి ఉన్నారు బాధ అణుచుకుంటూ!! సుబ్రమణ్యం పరుగు పరుగున వచ్చి అయ్యగారిని లేపాడు. కాళ్ళూ చేతులూ బాగా దోక్కుని పోయాయి. అంతటా ఏడుపులు, కేకలు! ఈ లోగా రోడ్డులో మరికొన్ని వాహనాలూ వచ్చి ఆగాయి సంఘటన చూసి!!

          కారులో, వానులో ఉన్న వాళ్ళంతా దిగారు. శ్రీమతి కనకమ్మా, కొత్త పెళ్ళి కూతురు కరుణాదేవి ఒకటే ఏడుపు!! వాన్ లో ఉన్న పుట్టపర్తి సంతానం కూడా ఏడుస్తూ పుట్టపర్తి దగ్గరికి చేరుకుంది.

          అందరినీ దూరం వెళ్ళమని సుబ్రమణ్యం, కారు డ్రైవర్, అతని సహాయకుడూ వారిని నెమ్మదిగా లేపి, కూర్చోబెట్టారు.

          డ్రైవర్ దగ్గరున్న టార్చ్ లైట్ వెలుగులో పుట్టపర్తిని పరిశీలించి చూశారు. ఒళ్ళంతా దుమ్ము!!జుబ్బా పంచే బాగా చినిగి పోయాయి రక్తం మరకలు వాటిలో! కాళ్ళూ చేతులూ బాగా దోక్కుపోయాయి. ముఖమ్మీద కూడా అక్కడక్కడ చిన్న గాయాలు.

          అందరూ కలిసి పుట్టపర్తిని లేవదీసారు కింద నుండీ!! కళ్ళద్దాలు కింద పడిన తాకిడికి బాగా వంగిపోయాయి. ముఖమ్మీద కూడా అక్కడక్కడా రాచుకుపోయి..రక్తం.

          చుట్టూ మూగి ఉన్న జనాల్లో ఒకరెవరో పుట్టపర్తిని గుర్తు పట్టారు.’ స్వామీ!! మీరా!! అమ్మో!! ఎంత ప్రమాదం తప్పింది!! గుంతలో పడి లేచింది కారు ! నేను చూశాను. ముందు డోర్ తెరుచుకునింది. మనిషెవరో ఎగిరి పడేసరికి, అయ్యో,పెద్ద దెబ్బలే తగిలుంటాయనుకున్నా!! మీరా!! అట్లా డోర్ తెరుచుకోవడమేమిటి?? ఆ డ్రైవర్ ఏడీ? స్వామి అంటే ఎవరనుకున్నావ్? ఎంత గొప్ప మనిషి? శ్రద్ధగా నడపొద్దూ కారు?’ అని కేకలు వేస్తున్నాడు.

          సుబ్రమణ్యానికీ కోపమొచ్చింది డ్రైవర్ మీద!!

          డ్రైవర్ దీనంగా ముఖం పెట్టాడు, ‘సార్!! ముందు డోర్ సరిగ్గా పడడం లేదని రిపేర్ చేయించినాడు సార్ మా సార్ మొన్ననే!! మళ్ళీ ఇట్లా అవుతుందనుకోలేస్సార్!! నేనైతే ముందే చెప్పినాను సార్, దానికి ఆనుకోని కూర్చోవద్దు సార్ అని!! ఈ సార్ కూడా అలిసి పోయున్నారేమో, డోర్ మీద తలానించి పండుకున్నట్టుంది.’ అని సర్ది చెప్పబోతున్నాడు.

          ఇటు వంటి సమయాల్లో గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్దమనుషులైపోతారు.

          కొంతమంది డ్రైవర్ ను సమర్థించబోయేవాళ్ళే, కానీ పుట్టపర్తిని గుర్తించిన వాళ్ళెవరో ఉండటం వల్ల అందరూ డ్రైవర్ ను దండించడం మొదలుపెట్టే సరికి, డ్రైవర్ బిక్కచచ్చి పోయాడు.

          ఎవరో అందుకున్నారు..’పెళ్ళివాళ్ళున్నట్టున్నారు. పని ఒప్పుకునే ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయోలేదో చూసుకోవద్దూ? ఇదేమన్నా తెల్లవారా?? కళ్ళు తెరుసుకోని అట్టా ఇట్టా సూసుకుంటూ కూకోడానికి!! రాత్రి పొద్దు. నిద్ర పట్టదూ ఎవరికైనా?? నువ్వూ తాగున్నావేమో, కళ్ళు మూసుకుని నడుపుతున్నావేమో?? పాపం స్వామికి చూడు ఎంత దెబ్బలై నాయో??’ అని డ్రైవర్ని నిలదీస్తున్నారు. 

          కనకమ్మ పెరుమాళ్ళుకు మొక్కుకుంది, ‘పెద్ద గాయాలేవీ తగలకుండా భర్తను కాపాడినందుకు! మర్చిపోకుండా శ్రావణ మాసం శనివారాలు, పిండి దీపాలు పెడతానని మొక్కుకుంది కళ్ళనీళ్ళతో!!

          సుబ్రమణ్యానికి కూడా డ్రైవర్ మీదే కోపంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ కోపం అతని మీద చూపించే వేళ కాదు. భగవంతుని దయ వల్ల అయ్యగారికి అంత పెద్ద దెబ్బలు తగలలేదు. ఆ డ్రైవర్ కూడా తనకు బాగా తెలిసిన వాడే!! ప్రొద్దుటూరు భాగ్యవంతుడొక రు, అయ్యగారికి అవసరానికి వాడుకునేందుకు కారిచ్చాడు. పెళ్ళప్పుడూ, ఇప్పుడు  కడపకు వాళ్ళను చేర్చేందుకు కూడా యీ డ్రైవరే సహాయ పడుతున్నాడు పాపం! ఇంకే మంటాడు అతన్ని?

          ఈ మాటలన్నీ వింటూనే ఉన్న పుట్టపర్తి నీరసంగానే ఉన్నా చేయెత్తి వాళ్ళను ఆగమన్నారు. మెల్లిగా చెప్పారు,’ పాపం, అతని తప్పులేదప్పా!! కూర్చునేటప్పుడే చెప్పినాడతను, సార్ కాస్త చూసుకోండని!! నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. పోనీలేప్పా!! బాగున్నా కదా!! పదరా సుబ్రమణ్యం! బయలుదేరుదాం. ఇంకెంతసేపప్పా ప్రయాణం?’

          గాయపడిన వ్యక్తే ఏమీ అనకుండా ఉంటే తక్కినవాళ్ళేమి అనగలరు?

          పుట్టపర్తి అభిమాని అననే అన్నాడు ,’మరి స్వామీ!! ఈ దెబ్బలకు కనీసం కట్టు కట్టించుకోకుండానే వెళ్ళిపోతారా?? నాకు తెలిసిన డాక్టరున్నాడు మైదుకూరులో!! అక్కడికిపోదాం పదండి..’ అని!!

          పుట్టపర్తి అన్నారు ,’ఒరే సుబ్రమణ్యం? కడప ఇంకెంత దూరం రా?’ 

          డ్రైవరన్నాడు ,’ఒక అరగంటలో కడపేసార్..’

          ‘ఇంకెందుకప్పా!! అసలే కారులో కొత్త దంపతులున్నారు. కడపకు పోయి పడితే చాలులే!! మా సుబ్రమణ్యమొక్కడు చాలు. రంగయ్య డాక్టర్ కూడా ఉన్నాడు ఇంటి దగ్గర!! పెద్ద దెబ్బలేమీ లేవు. రెండ్రోజులు విశ్రాంతి తీసుకుంటాను. సరిపోతుంది. ఆ..సరేనప్పా!! ఉంటాను.’

          ఈ మాటలతో పుట్టపర్తికి నమస్కరాలు పెట్టి అతనూ, తక్కిన కొద్దిమందీ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు.  

          డ్రైవర్ బతుకుజీవుడా అనుకుంటూ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పుట్టపర్తిని  వెనక సీటులో జాగ్రత్తగా కూర్చోబెట్టాడు సుబ్రమణ్యం. తక్కిన వాళ్ళనెలాగో సర్ది కూర్చో బెట్టిన తరువాత కారూ, వ్యానూ మెల్లిగా కదిలాయి కడప వైపు!!

***

          మరో గంటకల్లా కడపకు చేరాయి పెళ్ళి వారి వాహనాలు.

          చేరీ చేరగానే, ముందు ఇంటి దగ్గర అందరినీ దింపి, వెంటనే దగ్గర్లో దివ్యజ్ఞాన సమాజం ఎదురుగా ఉన్న డా. రంగయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు సుబ్రమణ్యం కారులోనే!!

          డా. రంగయ్య చాలా సౌమ్యుడు. ఆయుర్వేదం మందుల డాక్టరే ఐనా, చిన్నా చితకా వైద్యాలకు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ముందు రంగయ్య డాక్టర్ దగ్గరికే వెళ్తారు. ఆయన హస్తవాసి మంచిదని అందరి నమ్మకం. పైగా అప్పట్లో వచ్చే అనారోగ్యాలన్నీ ఎక్కువ భాగం ఋతువుల మార్పిడిని బట్టి వచ్చేవే! మరీ ఎక్కువైతే ప్రభుత్వ నిర్వహణ లో నగరం మొత్తం మీద ఓ అరడజను పడకలు లేని చిన్న వైద్యశాలలుండేవేమో!! వాటికి పరిమిత సమయాలుండేవి. పెద్ద జబ్బులకు, ఇలా రోడ్డు ప్రమాదాల సందర్భాల్లో పెద్దాసుపత్రే గతి అందరికీ!!   

          అర్ధ రాత్రి, దెబ్బలతో వచ్చిన పుట్టపర్తిని చూసి, గాభరా పడుతూ తక్షణం వేడి నీటితో గాయాలు కడిగి మలాం రాసి, ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడాయన. హఠాత్తుగా కారులోంచీ ఉన్నపాటున డోర్ తెరచుకోవటంతో, కింద పడటం వల్లా, కంకర రోడ్డు కావటం వల్లా శరీరం మీద భుజాల మీదా దోక్కుపోవటం జరిగిందనీ, భయపడవలసిన పనిలేదనీ, నొప్పి తెలియకుండా ఉండేందుకూ, నిద్ర పోయేందుకూ మందు బిళ్ళలిచ్చా ననీ,  ఉదయం పెద్దాసుపత్రికి వెళ్తే మంచిదనీ చెప్పాడు రంగయ్య డాక్టర్.

          అప్పటికైతే ఇల్లు చేరుకున్నారు. మోచంపేటలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం దగ్గరే ఇల్లు. ఆ ఇంటిలో మేడ మీద పుట్టపర్తి సారస్వతోపాసనకే కేటాయించిన ఒక గది. ఆ గదిలో మూడు చెక్క బీరువాలు. వాటిలో భారతీయ, పాశ్చాత్య భాషా సాహిత్య గ్రంధాలన్నీ వరుసగా కొలువై ఉండేది. వివిధ భాషా సుగంధాలతో నిత్యమూ పరిమళిస్తూ ఉండేది. అక్కడే ఒక మూలలో, పుట్టపర్తి వాడుకునే కరణం బల్ల, ఆ బల్ల కుడి మూల పై భాగంలో  చెక్కతో తయారైన పాళీ కలాలుంచుకునే చిన్న స్టాండు. పక్కనే సిరా బుడ్డీ కూడా ఉంచు కునేందుకు ఏర్పాటు. ఇక అక్కడే కింద పరచిన చాప. అదే సరస్వతీ పుత్ర, పుంభావ సరస్వతి, పుట్టపర్తి కర్మ క్షేత్రం. రచనా క్రమ సన్నద్ధతా క్షేత్రం.

          ఇప్పుడైతే కొన్ని రోజులు పుట్టపర్తి కింద పడసాలలోనే ఉండవలసి వచ్చేలా ఉంది. మోకాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. నడవటం కష్టంగా ఉంది. ఒంటి మీద గాయాలు వైద్య సలహాలతో వారం పదిరోజుల్లోనే తగ్గు ముఖం పట్టాయి. కానీ సులువుగా, మామూలు గా నడవటమింకా సమయం పట్టేలా ఉంది.

          ఇటు వంటి పరిస్థితుల్లోనే రెండవ కుమార్తె తరులతాదేవి పెళ్ళి ముహూర్తమూ దగ్గర పడుతున్న తరుణం. కనకమ్మకు దిగులు పెరిగిపోతూ ఉంది. మళ్ళీ ఖర్చులు. పెళ్ళంటే మాటలా?? కొడుకుకాని కొడుకు సుబ్రమణ్యం తోడ్పాటుతో కరుణాదేవి పెళ్ళి బాగానే జరిగినా, కారు ప్రమాదం వల్ల కుటుంబంలో కాస్త అలజడి. కానీ ఒకటి. ఏదో పెద్ద ఆపద రాకుండా భగవంతుడు కాపాడినట్టే జరిగింది, అనుకుంటూ శ్రీవేంకటేశునికి ముడుపు కట్టేసింది కనకమ్మ.

          ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు నుండీ సుబ్బయ్య వచ్చాడింటికి స్వామిని చూసి పోదామని!!

          ‘ఎంత పని జరిగింది స్వామీ!! ఇప్పుడు కొంచెం కుదుట పడినారా??’

          ‘ఏదోనప్పా!! ఇట్లా ఉన్నాను. కొంచెం బాగానే ఉంది. మోచిప్పల మీద దెబ్బలు తగిలినాయి కదా!! అవి మానడానికి ఇంకా కొంచెం సమయం పట్టేట్టే ఉంది. మీరంతా బాగున్నారా?’

          ‘ఆ..అట్నే ఉన్నాం స్వామీ. ఇంతకూ, నేనొచ్చిన సంగతేమంటే, మదనపల్లి దగ్గర అరగొండ పాఠశాల వాళ్ళూ మిమ్మల్ని సన్మానించుకుంటారంట వచ్చేనెల! అక్కడ మీ కొక ఏకలవ్య శిష్యోత్తముడున్నాడు. పేరు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. శివతాండవ మంటే ప్రాణమనుకోండి. ఈ మధ్య చిత్తూరులో కలిసినాడు. అప్పుడు, నేనక్కడున్నంత సేపూ శివతాండవమూ, ప్రబంధ నాయికలు గురించే కలవరిస్తూ ఉన్నాడు. మీరేమో ఇట్లా ఉన్నారు కదా! వచ్చేనెలలో అక్కడికి ఉపన్యాసం ఏర్పాటు చేస్తామన్నారు. నా ‘మహాకవి పుట్టపర్తి’  పుస్తకాలు కొన్ని పంపినా అమ్మమని, మీ సన్మానానికి పనికొస్తాయి కూడా కదా!! ఆ వెంకటసుబ్బయ్య ఎప్పుడెప్పుడు మీ దర్శనమవుతుందా అని చకోరపక్షి మాదిరి చూస్తా ఉన్నాడు. మీకు ఓపికుందా మరి?’ 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.