నా అంతరంగ తరంగాలు-9

-మన్నెం శారద

మహానటికి పుట్టినరోజు జే జేలు!
—————————–
సావిత్రి !
సావిత్రికి మరో పేరు ఉపమానం ఉంటాయా …వుండవుగాక వుండవు !
ఒక రోజు వైజాగ్ లో పనిచేస్తున్నప్పుడు మేం ఇద్దరమే కనుక తోచక అప్పటికప్పుడు ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం !

          అలా మేం అనుకున్న సినిమా టికెట్స్ దొరక్క జగదాంబలో ఆడుతున్న ఒక మళయాళ సినిమా కి వెళ్ళాం. కారణం అందులో సావిత్రి వుంది. కానీ, తీరా ఆ సినిమా చూస్తుంటే నా కళ్ళు ఎర్రబడిపోయాయి. దుఃఖం ముంచుకొచ్చింది. అలాంటి ముదనష్టపు సినిమాలో సావిత్రి లాంటి మహానటి నటిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.

          ఆఁ సినిమా చూడగానే సావిత్రి మద్యానికి ఎంత బానిసయ్యిందో అర్ధమయ్యింది.
అంతకు ముందు ఓ నాలుగేళ్ళక్రితం చదువుకునే రోజుల్లో సెలవుల్లో చెన్నై అక్కయ్య ఇంటికి వెళ్ళాం. హబీబుల్లా రోడ్డులోని నడిగరి సంగం ఎదురుగాఁ అక్కయ్య వాళ్ళ ఇల్లు.
సావిత్రి ఇల్లు అక్కడే. ఆమె తన చిన్న టాప్ లెస్ హెరాల్డ్ కారులో తరచూ ఆఁ రోడ్డు మీద వెళ్తుంటే మేం ఆమెని ఆసక్తి గా చూసేవాళ్ళం.

          సౌత్ లో మొట్టమొదట ఇంపాలా చేవర్లెట్ కొనుక్కున్న మహానటి ఇంక ఇలా కాదు… దగ్గర్నుండి చూసి మాట్లాడాలని మేమంతా తిన్నగా సావిత్రి గారింటికి వెళ్ళిపోయాం.
అప్పటికే ఆమె కట్టుకున్న అద్భుతమైన మేడ ‘ప్రాప్తం ‘ సినిమా పుణ్యమా అని మార్వాడీ చేతుల్లోకి వెళ్ళి పోయింది. అదే క్యాంపస్ లో జమున గారు ఉన్న మేడ కూడా చెయ్యి జారి పోయింది. నిజానికి ఆమె మేం వెళ్ళేసరికి వున్నది ఒక చిన్న కారు గారేజ్.

          ఎలక్ట్రీషియన్ చేత ఏవో రిపేర్స్ చేయిస్తున్న ఆమె మమ్మల్ని సాదరంగా ఆహ్వానిం చి కూర్చో బెట్టారు.

          “మేం ఏం చదువుకుంటున్నామో, ఎక్కడి నుండి వచ్చామో అడిగి టీ, బిస్కెట్స్ ఆఫర్ చేశారు. మా కజిన్ తన సినిమాలు, నటన గురించి మాట్లాడుతుంటే ఆమె ఎటో చూస్తూ “ఆఁ సావిత్రి లేదమ్మా, ఎప్పుడో చచ్చిపోయింది “అన్నారు చాలా నిర్లిప్తంగా.
మా మనస్సులు చివుక్కుమన్నాయి. అప్పుడు నాకు వయసు చిన్నది కాబట్టి జీవితాల పట్ల సరయిన అవగాహన లేదు. జీవితమంటే స్టీరింగ్ పట్టుకుని కారు నడిపినట్లే అను కున్నాను. కానీ, మనం ఎంత జాగ్రత్తగా నడిపినా ఎదుట వచ్చే వెహికల్స్ మీద మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయని తెలియదు.

సావిత్రి!
పరమ శివుడు పార్వతితో కూడి ఆనంద తాండవం చేస్తుంటే భువికి జారిపడిన ఓ పారిజాతం!
ఒక శాపగ్రస్త!
లేకుంటే వజ్రాల నగల్ని చిల్ల పెంకుల్లా దానం చేస్తుందా?
ఏ సినీ కార్మికుడి ఇంట్లో పెళ్ళయినా చిన్న వెండి బిందె, మంగళ సూత్రాలు పట్టుకుని వెళ్తుందా?
దేశానికి ఏ ప్రమాదమొచ్చినా వున్నదంతా ఊడ్చి ఇస్తుందా?
మట్టిని మణిని సమ దృష్టితో చూస్తుందా?

          అంతకు ముందే ఇద్దరితో పెళ్ళి జరిగిన వ్యక్తి అని తెలిసి ప్రేమించడమేంటి… ఆఁ వ్యక్తి ప్రేమ అంతా తనకే స్వంతం కావాలనుకోవడమేమిటి?
చూసే వారికి వెర్రిగానే అనిపించవచ్చు. పిచ్చి అనిపించవచ్చు, మరి ఆఁ తల్లి హృదయంలో ఆలోచన లేమిటో.. ఎవరు పసిగట్టగలరు?

          ఆమె నటనను తోటి నటులు కాష్ చేసుకున్నారు. ఆమె సరదా పడి ఇచ్చిన నగల్ని తిరిగి ఇవ్వలేదు. దాచిన నగల పెట్టె కాజేశారు. ఆమె ఇంటికి వచ్చి సహాయాలు  తీసు కున్న ఒకానొక డైరెక్టర్ పరిస్థితి బాగోనప్పుడు అతని సినిమాలో నటిస్తే లంచ్ టైం లో ఆమెకు భోజనం కూడా పెట్టలేదని చెప్పు కున్నారు. అప్పుడూ, ఎప్పుడూ కూడా ఆమె ఎవరికీ చెయ్యి చాచలేదు. ఇచ్చినవి ఇమ్మని కూడా అడగలేదు.

          ఏ డబ్బుకోసం అందరూ గడ్డి తింటారో ఆ డబ్బుని తృణ ప్రాయంగా భావించి ఇక్కడ సంపాదించింది ఇక్కడే విసిరికొట్టి వెళ్ళిపోయింది.

          ఆమెవల్ల కోట్లకు పండగలెత్తిన అతి దగ్గర బంధువు ఒకసారి మా యింటికి వచ్చారు. అతను మా వారి కొలీగ్. ఆసక్తి కొద్దీ సావిత్రి గారి గురించి అడిగితే వెయ్యి కొండేలుచెప్పాడు అతను! మరి ఆమె సొమ్ము కాజేసినవాడు కదా… అలానే ఋణం తీర్చుకోవాలి కదా!
ఆమెను మోసం చేసి ఆమె సొమ్ము కాజేసినవారెవరు తర్వాత బాగుపడిందేమీ లేదు.
పేదరికం నుండి, చదువు ఎరుగని కుటుంబం నుండి వచ్చి అనర్గళంగా అనేక భాషాలు నేర్చి, కేవలం కళ్ళతోను, పెదవుల కదలికతోనూ అద్భుతంగా నటించి నటనకు భాష్యం గా కొనియాడ బడిన మహా నటి!

          ఇంతకూ మన మహానటికి ఏ అవార్డన్నా ఇచ్చారంటారా???

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.