మా కథ (దొమితిలా చుంగారా)- 49

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          జూన్ 9న సైన్యం గనిలోపలికి జొరబడింది. అక్కడ ఉన్న కార్మికుల్లో కొరొకొరొ సభకు హాజరైన వారందర్నీ ఏరి తన్ని బైటికి తరిమేశారు. అరెస్టయిన కార్మికుల్ని అన్ సియా బ్యారలలో చిత్రహింసలకు గురిచేసి లాపాజ్ జైలుకొట్లకు పంపించారు. చాలమందిని పినోషె పాలనలోని చిలి కి ప్రవాసం పంపారు.

          వాళ్ళప్పుడు మా మీద అబద్ధాల దుష్ప్రచారాలెన్నో చేశారు. ఎన్నెన్నో అబద్ధాలకు తోడు మేం ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించామని పదే పదే ఊదరగొట్టారు. అప్పుడే జనరల్ తారెస్ ను అర్జెంటీనాలో ఎవరో హత్యచేశారు. ఆయన మృతదేహాన్ని బొలీవియాకు తీసుకురావడానికి బన్ జర్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ హత్యకు నిరసనగా గని కార్మికులు ఒక ప్రదర్శన నిర్వహించారు. సైన్యం ఆ ప్రదర్శనను సాకుగా తీసుకుని, ఆ జనసందోహం మీద విరుచుకుపడింది, మా ట్రాన్స్ మీటర్లను మూసేసింది, మా ఇళ్ళమీద దాడిచేసింది. మమ్మల్ని చెప్పలేనన్ని విధాల బాధలకు గురిచేసింది, అవమానాలపాలు జేసింది.

          అది ఒక మధ్యాహ్నం పూట. మేం మామూలుగా భోజనాలు చేస్తున్నాం. తిన్న తర్వాత నా కొడుకు తనకు స్నానం చేయించమని అడిగాడు. నేను సరేనని వాగు ఒడ్డుకు తీసుకెళ్ళాను. అది షాఖిమేయో అనే నది. అదే సైగ్లో-20ని, లాలాగువాను విడదీస్తుంది. అకస్మాత్తుగా నా దృష్టి ఎందుకో లాలాగువావైపు సారించాను. అక్కడ ఒక ప్రత్యేక రకమైన నిశ్శబ్దం కనబడింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు లాలాగువా రేడియోలలో సంగీతం మోగిపోతూ వుంటుంది. మరి ఈ నిశ్శబ్దమేమిటి? నేను చుట్టూ చూశాను. అప్పుడు నాకు పెద్ద బజారులో సైనికులు ఇల్లిల్లూ సోదా చేస్తూ ఉండడం కనబడింది.

          “సైన్యం …. సైన్యం వస్తోంది….” అంటూ నేను రేడియో స్టేషన్ వైపు పరుగెత్తాను. అక్కడున్న ఇద్దరు కార్మికులకు నేనీ సంగతి చెపుతుండగానే మూల మలుపు మీద సైనికులు కనిపించారు. సైనికులు రేడియో స్టేషన్ ఆక్రమించుకున్నారు. మా స్త్రీలం మాలో మేమే గుంజాటన పడ్డాం. “ఏం చేద్దాం? మనం ఏం చేయగలం ఇప్పుడు? … గనిలోని కార్మికులకు ఈ సంగతి చెప్పడం ఎట్లా?….”

          మొత్తానికి ఎవరో గనిలోపలి కార్మికులకు ఈ సంగతి చేరవేయగలిగారు. వెంటనే కార్మికులు పనివదిలేసి వచ్చి ప్రధాన ద్వారం దగ్గర ఒక సభ పెట్టి నిరవధిక సమ్మె మొదలైందని ప్రకటించారు. ఆ రాత్రి వాళ్ళు మమ్మల్ని పిలిచారు. వాళ్ళు నా భర్తతో “నాయకులందరూ గనిలోపలికి వెళ్తే బాగుంటుంది. ఒక సమ్మె కమిటీని ఏర్పాటుచేద్దాం లోపలి నుంచి సైన్యాన్ని ప్రతిఘటిద్దాం. ఇళ్ళలోంచి తప్పించుకోవడం కష్టం. గనిలోపల ఐతే రక్షణగా ఉంటుంది….” అన్నారు.

          గనిలోపల దాక్కోవడం చాలా సులభం. లోపల ఒక పట్నంలాగా ఉంటుంది. భూ గర్భంలో 800 కిలోమీటర్ల పొడవైన సొరంగాలున్నాయి. అక్కడ పనిచేసేవాళ్ళకే అవి కొట్టిన పిండి.

          మేమిక గనిలోపలికి వెళ్ళి సమ్మె కమిటీ ఏర్పరచాం. వెంటనే మొదటి ఉత్తర్వులు బైటికి పంపాం: కార్మికుల మధ్య ఐక్యత కాపాడాలి. నిజమైన నాయకుల మీద మాత్రమే విశ్వాసం ఉంచి వాళ్ళ పిలుపులే పాటించాలి. తమ ప్రయోజనాల కోసం సంఘం పేరు వాడుకునే వాళ్ళను నమ్మొద్దు. సమ్మె చివరిదాకా విజయవంతంగా కొనసాగించేందుకు గాను ఆహారం సేకరించాలి. సైనికులతో సత్సంబంధాలు నెలకొల్పుకొని, తిండి వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళూ మన పిల్లలే. తప్పని పరిస్థితులలో వాళ్ళు మనకు వ్యతిరేక స్థానం తీసుకోవాల్సి వచ్చింది. గృహిణులందరూ నిర్మాణయుతంగా ఉండాలి. కంపెనీ కొట్టు మూసేస్తే ప్రతిఘటించి తెరిపించాలి – ఇవన్నీ మొదటి ఉత్తర్వులు.

          ఆ రాత్రంతా మేం అక్కడ వంతులవారీగా కాపలా కాస్తున్నాం. ఆ మరుసటి రోజు కూడా అలాగే కాపలాలు కాశాం. ఆ రోజు కార్మికులు కొంచెం ఆలస్యంగా మాకు భోజనాలు పట్టుకొచ్చారు. ముందురోజు రాత్రి సైన్యం దాదాపు అన్ని ఇళ్ళలోకి జొరబడిందట. ఎన్నో అరెస్టులు జరిగాయట.

          కొందరు ఏజెంట్లు కూడా మాలో దూరి గనిలో ప్రవేశించారు. ఈ సంగతి గుర్తించాక మేం ఇంకా గని లోతుల్లోకి వెళ్ళిపోయాం. నా భర్తా, నేనూ, మరో కార్మికుడూ సాన్ మిగ్యూల్ అనే చోటికి వెళ్ళాం. వాళ్ళు ఒక తారు పూసిన పలక తెచ్చి కిందవేసి నన్ను దానిమీద కూర్చోబెట్టారు. నేనప్పుడు తొమ్మిదోనెల గర్భంతో ఉన్నాను. ఆ పరిస్థితి నాకు చాల దుర్భరంగా ఉండింది. అక్కడ ఏర్పడే వాయువుల వాసనా, మంచి గాలి లేకపోవడమూ కలసి నా తల తిప్పడం మొదలైంది. నాకు దప్పికైంది. ఆకలైంది. విపరీతంగా అలసి పోయాను.

          మేం గురువారమంతా అలాగే ఉండిపోయాం. శుక్రవారం ఉదయం నేనిక సొమ్మసిల్లి పోయాను. ఊపిరి కూడా పీల్చలేకపోయాను. “నాకు ఒంట్లో బాగోలేదు … నేనింక ఎక్కువ సేపు తట్టుకోలేను ….” అని నా భర్తతో చెప్పాను. “కాని ఏం చేస్తాం ఇప్పుడు ….” అన్నాడాయన. “బైటికెళ్ళిపోదాం పద ….. అరెస్టు చేసినా మంచిదే …. ఇక్కడ మాత్రం దుర్భరంగా ఉంది. నేనిక ఉండలేను …” అన్నాను. “చూద్దాం … బహుశా మనం కాన్ నిరివైపు నుంచి బైటికి వెళ్ళొచ్చునేమో….” అని ఆయన వెళ్ళి చూసివచ్చి, ఆ మార్గం సాఫీగానే ఉందన్నాడు. మేం అలా కాన్ కనిరి ప్రవేశ ద్వారం నుంచి బైటికి వెళ్ళాం. అక్కడ ఒక కార్మికుని సాయంతో బైటపడి, మొదలు ఒక మందుల దుకాణానికి వెళ్ళి, మందు వేసుకొని కుదుటపడ్డాను. అక్కడ్నించి ఇంటికి బయల్దేరాం. తోవలో మాకు వందలాది సైనికులు ఎదురయ్యారు. “ఆగండక్కడ! ఎక్కడికెళ్తున్నారు?” అని వాళ్ళు గద్దించే వాళ్ళు. “నా భార్యకు నొప్పులొస్తున్నాయండీ! ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను ….” అని నా భర్త వినయంగా చెప్పేవాడు. “సరే పొండి ….” అని వాళ్ళు వదిలేసేవాళ్ళు.

          అలా సందుగొందుల్లో పడి మేం ఇల్లు చేరాం. నేనప్పటికే చలిలో వణికి పోతున్నాను. అప్పుడు ఉదయం ఆరో, ఏడో అయి ఉంటుంది. నా చెల్లెలు నాకేదో వేడిగా తాగడానికిచ్చింది. దాంతో నాకు ప్రాణాలు లేచివచ్చాయి.

          కాని అప్పుడే కొందరు స్త్రీలు మా ఇంట్లోకి వచ్చి కంపెనీ దుకాణాన్ని సైనికులు ఆక్రమించుకున్నారని, కనుక వచ్చి వాళ్ళతో మాట్లాడి మరొక్క రోజైనా దుకాణం తెరిచి ఉంచేట్టు చేయమని కోరారు.

          కాని మేం దుకాణం చేరేసరికి అక్కడ చాలా మంది సైనిక ఉన్నతాధికారులున్నారు. వాళ్ళు కార్మికవర్గం పట్ల తమ కరుడు గట్టిన ద్వేషంతో మమ్మల్ని అవమానపరిచారు. వాళ్ళలో ఒకడు “త్వరగా కానివ్వండి, కానివ్వండి – ఈ సోమరిపోతులు వస్తున్నారు ….. ఆఁ సమ్మె చేస్తున్నారు గదూ మీరు! మీరెందుకు పనికొస్తారసలు? ఉట్టి సోమరిపోతులు … ఎంతకాలం పనిచేయకుండా ఉండగలరో చూస్తాం ….. ఆకలికి మాడి చచ్చిపోవాలి …. దొంగలంజెల్లారా! మీకు మీ మలమూత్రాలు తప్ప తినడానికేమీ దొరకవు చూడు ….. ఇవాళ మీ సరుకుల దుకాణం మూసేస్తున్నాం ….. రేపు మీకు నీళ్ళు బంద్ చేస్తాం … ఎల్లుండి మీ కరెంట్ కోసేస్తాం ….. ఎవరు నిలబడతారో చూద్దాం ….. అప్పుడు మీకేం కావాలంటే అదిస్తాం ….. మొట్టికాయ కావాలంటే మొట్టికాయ ….. బుల్లెట్లు కావాలంటే బుల్లెట్లు ….” దుకాణం మేనేజర్ కప్పతాళం వేయడానికి వణుకుతున్నాడు. సరే – మిగిలిన స్త్రీలతో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయించుకుందామని నేను వెనక్కి తిరిగాను. అక్కడొక్కరూ లేరు. అందరూ వాడి మాటలకు భయపడి జారిపోయారు.

          అప్పుడు నా కొడుకొచ్చి నా చెయ్యి పట్టుకొని లాగుతూ, “అమ్మా! ఏం చేస్తున్నావు నువ్విక్కడ? వాళ్ళు నిన్ను పట్టుకుపోవడాని కొస్తున్నారు….” అన్నాడు. కొందరు ఏజెంట్లు కల్నల్ లో “ఆ చుంగారా స్త్రీ లేదూ ….. అది కొందరు జనాన్ని వెంటబెట్టుకొని కర్రలూ, రాళ్లూ తీసుకుని సరుకుల దుకాణం మీద దండెత్తుతోంది …” అని చెప్పడం వాడు విన్నాడట. అప్పుడు కమాండర్ “అది కడుపుతో ఉందేమో గదా! ఇంకా అలాంటి పనులు చేస్తూనే ఉందా?” అని అడిగి “దాన్నిక్కడికి లాక్కురండి …. కడుపులోంచి పిండాన్ని తన్ని ఇవతల పారేస్తేగాని దానికి బుద్ధిరాదు ….” అన్నాడట. వెంటనే నా కొడుకు నా దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. నాకప్పుడు తప్పించుకోవడానిక్కూడా చాల కష్టమయ్యే స్థితి …. వీథుల నిండా సైనికులు నిండి ఉన్నారు. ప్రతి ఇళ్ళ వరుసలోనూ నలుగురు సైనికులు అటూ ఇటూ కవాతు చేస్తున్నారు. ఇద్దరిటువైపు నుంచీ, ఇద్దరటువైపు నుంచీ …

          వాళ్ళిక నన్ను అరెస్టు చేయబోతున్నారని తెలిసింది గనుక నేను పిల్లలందర్నీ చుట్టూ కూచోబెట్టుకుని, నేను పారిపోతున్నాననీ, మళ్ళీ తిరిగిరాననీ చెప్పాను. నేనెక్కడికెళ్తానో నాకే తెలియదు గనుక, నా కోసం వెతికే ప్రయత్నం చేయొద్దని కూడ చెప్పాను.

          అలా నేను ఖచ్చితమైన గమ్యం ఏమీ లేకుండానే ఇంట్లోంచి బయటపడ్డాను. అప్పుడు నేను కొందరు – పాత పరిచయస్తుల ఇళ్ళలోకి వెళ్ళి కనీసం ఒక్కరాత్రి కోసం అక్కడుండనిమ్మని బతిమిలాడాను. కార్మికులు అప్పుడెంతగానో ఆదరించారు. “రామ్మా! రా – విశ్రాంతి తీసుకో …” అనేవారు. అలా పదిరోజులపాటు నేను ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారుతూ తప్పించుకు తిరిగాను.

          ఆ రాత్రే పోలీసులు నా ఇంటికెళ్ళారట. పిల్లలు లోపల తాళం వేసుకుని కూచుని ఉన్నారట. పోలీసులు ఎంత తలుపు కొట్టినా పిల్లలు తెరవలేదట. అప్పుడు పోలీసులు గోడదూకి లోపలికెళ్ళారట. లోపల పిల్లల్ని పట్టుకొని మొరటుగా “మీ అమ్మేదీ ….”

“ఇక్కడలేదు”

“మరెక్కడుంది?”

“తెలీదు ……”

          “వెధవ్వేషాలెయ్యక … ఆవిడ పిల్లలు మీరు, ఆవిడెక్కడుందో మీకు తెలియదా? మీతో జవాబులెలా చెప్పించాలో మాకు తెలుసు”

          ఆ మాట విని నా పదకొండేళ్ళ కూతురు ఫక్కున నవ్విందట. నవ్వు తెరల్లోంచే “నిజంగానే మా అమ్మ అంత తెలివితక్కువదను కుంటున్నారా మీరు? మీరు తన కోసం వెతుకుతున్నారని తెలిసీ, మాకు తానెక్కడికెళ్ళేదీ చెప్తుందా? మా అమ్మేమీ అంత తెలివి తక్కువ పనులు చేయదు” అందిట.

          ఆ పోలీసుల్లో ఒకడు ఈ జవాబుతో మండిపోయాడట. మరొకడు మాత్రం “నిజమే …. వీళ్ళ అమ్మ అంత మూర్ఖురాలేమీ కాదు. పోదాం పదండి …. పిట్ట గూట్లోంచి ఎగిరి పోయింది ….” అన్నాడట. వెళ్ళే ముందు వాళ్ళు ఇల్లంతా సోదాచేశారట. నా పిల్లలు పోలీసుల్ని చూసి ఏడవకపోవడం చూసి “ఈ పిల్లలకి కూడా నేర్పి పెట్టారు” అన్నారట. నేను విన్న ప్రకారం సైన్యం నేనెక్కడైనా దొరుకుతానేమోనని రోజురోజూ ఎన్నో ఇళ్ళు సోదా చేసింది.

          ఆ రోజుల్లో అధ్యక్షుడు బెన్ జెర్ కటానికి వచ్చాడు. ముందు చెప్పకుండానే సరా సరిగా ఆయన అనసియాలో దిగాడు. ఆయన నిజమైన కార్మిక నాయకులతో మాట్లాడ నన్నాడు. వాళ్ళకు బదులుగా శ్రేణుల సమన్వయకర్తలనబడే వాళ్ళను నియమిస్తు న్నానని ప్రకటించాడు.

          ఇక అప్పుడు డిఓపి (రాజకీయ భద్రత శాఖ) ఏజెంట్లు తమ నిర్బంధ విధానాల్ని రుచి చూపడం మొదలు పెట్టారు. అప్పుడు మాత్రం కొన్ని విషాద సంఘటనలు జరిగాయి.

          వాళ్ళు వీధుల్లో పిల్లల్ని పట్టుకొని విపరీతంగా కొట్టి తాము రాసిన పత్రాల మీద సంతకాలు చేయించారు. అప్పుడు వాళ్ళు ఈ కాగితాలు ఆ పిల్లల తల్లిదండ్రులకు చూపి, పిల్లల్ని విడుదలచేయించుకోవాలంటే మరికొన్ని కాగితాల మీద సంతకాలు చేయాలని చెప్పేవారు. ఆ కాగితాల మీద సమ్మె విరమిస్తున్నామని, పనిలోకి వెళ్ళదలచు కున్నామనీ ఉండేది. తమ పిల్లల్ని విడిపించుకోవాలనే ఆందోళనలో కొందరు తల్లి దండ్రులు ఆ కాగితాల మీద సంతకాలు చేశారు.

          ఇదేగాక, పిల్లల్ని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులతో “మీవాడు జులాయిగా తిరుగు తుంటే పట్టుకున్నాం. లాపాజ్ జైలుకు తీసుకెళ్ళమంటారా? ఐదువందల పిసోలిస్తారా, ఎనిమిదివందల పిసోలిస్తారా?” అని వేధించేవాళ్ళు. తన పిల్లలకు దేనితోను సంబంధం లేకపోయినా, వాళ్ళను విడిపించుకోవడానికి రెండువేల పిళలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన ఒక స్త్రీ నాకు తెలుసు. చాలా మంది పిల్లల్ని విడుదలచేయించుకోవడానికి తమ సామాన్లు అమ్ముకున్నారు.

          వాళ్ళిలా మమ్మల్ని ఎన్నో రకాల ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. మా ‘మైనర్స్ వాయిస్’ ఇప్పుడు మిలిటరీ గుప్పెట్లో ఉన్నదని తెలుసుగదా… వాళ్ళు దాని మీద 50 నుంచి 80 శాతం మంది పనిలోకెళ్తున్నారని ప్రసారం చేశారు. ఇతర కార్మికుల్ని కూడ పనిలోకి వెళ్ళమని హితబోధ చేశారు. కాని ఆ వార్తలన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరూ పనిలోకి వెళ్ళనే లేదు.

          కొందరు కార్మికుల్ని చిత్రహింసలు పెట్టి కణతల మీద తుపాకి ఆనించి ఒక ప్రకటన చేయించారు. వాళ్ళు నాయకుల గురించి “వాళ్ళకు విదేశాల నుంచి డబ్బులొస్తుండేవి… ఇక మేం వాళ్ళ మాట వినం… దేశం బాగు కోసం మేం మళ్ళీ పనిలోకి వెళ్ళదలచుకున్నాం…” అని చెప్పించారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.