చిత్రలిపి

-అన్వర్

 

ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, గౌరీ దేవి బొమ్మల్ని ఎదురెదురుగా కూచుని చెరో రోలు పుచ్చుకుని రోట్లో దంచడానికి సిద్దమై ఉంటారు. ఈ పీఠం పుచ్చుకున్న స్త్రీ కిందనుండి చేతులు ఉంచి ఆడించగానే ఇద్దరు సవతులు మర చేతులు ఊపుకుంటూ  రోట్లో రోకలి అడిస్తూంటారు. వారి ఎదురుగా శివుడు ఇంతింత కళ్ళు తెరుచుకుని నోరుమూసుకుని చూస్తూ ఉంటాడు. ఆయన నెత్తి మీద మళ్ళీ ఒక గంగమ్మ కొలువు తీరు ఉంటుంది. బొమ్మలు మాత్రం భలే రంగులుగా తీర్చి దిద్ది ఉంటాయి. జస్ట్ పోక్ ఆర్ట్ అనుకో! ఎట్లాంటి పోక్ ఆర్ట్ అనుకున్నావు మా ఇంటి పక్కన  సుంకులమ్మ దేవత అని కొలుచుకున్నది త్రికోణంగా విరిగిన బేతంచెర్ల బండనే. దానికి పసుపు రాసి కుంకుమ అద్ది అందులో గ్రామ దేవతను చూసినాం . ఆమెకు పెట్టే పెరుగన్నాన్ని ప్రసాదంగా కళ్ళకద్దుకున్నాం ఇంకా రాయలసీమలోని చిన్న చిన్న ఊర్లల్లో అమ్మవారి బొమ్మ కొలువై ఉంటుంది అది వయ్యరి నడుం దింపుకున్న  వగల భంగిమల శిల్పమూర్తి కాదు. బలమైన కడుపు జబ్బ తొడలు గల అచ్చమైన దక్షిణ భారత స్త్రీ శరీర నిర్మాణమే ఈ గ్రామ దేవతల ఆకారం. ఆ గ్రామ దేవతకు కట్టిన కట్టూ, దిద్దిన బొట్టూ, తలపై కిరీటం వేపమండల మాల అంతా జానపదం! ఆ గుడి గూడు పై రెండు పులులు కాపలా వాటి వంటిపై ఆ రంగులు ఉంటాయి చూశారూ! సాయంత్రం మద్దిలేటి తడికల కొట్లో చిత్తు కొట్టే ఆర్టిస్ట్ ఒబులేసు  మాత్రమే గీయగలడు, అలా పచ్చని పులి – నల్లని చార, మూతికంటిన నాటుసారా తుడుచుకునే అరచెయ్యి . ఇక్కడ కాన్వాస్ పై ఫారిన్ స్కాచ్ తాగే సంకర కుంచెలు ఈ గానం ఎలా గీయగలవు కక్కా?

గంగమ్మా గౌరమ్మా సంగతి సరే!  ఇంకా ఘనమైన శూరుడు జొకుమారయ్య అనేవాడి జాడే లేదు.  నిండా నిలువెల్లా నోరులా కనపడేది జొకుమారయ్య బొమ్మ. చూడవలసిన లోక భీకర సొగసు జోకుమారయ్యది,  స్వోమీ! ఈంత నొరు! నల్లని మొహం. ఆ నోటి నిండా వెన్నపూస. చూడ్డానికి ఆ బ్లాక్ అండ్ జిడ్దు వైట్  భయంకరంగా ఉండేది. కానీ బొమ్మలు వేసే గుణం ఉంటం వల్ల దాన్ని దడుపుగానే కానీ అయినా ఇష్టంగానే చూసేవాణ్ణి. అప్పుడు కెమెరాలు లేవు. ఇప్పుడు ఆ మనుషులూ లేరు. నూనేపల్లి మంచి నీళ్ళ బావి దగ్గర మన్నుతో బొమ్మలు చేసి ఎర్రమన్ను నీళ్ల రంగులో  దొర్లించి పక్షి ఈకతో సున్నం గీతలు గీసేవారు. నిముషాల్లో ముగిసిపోయేది మహా మన్ను శిల్పం. ఇక్కడ చిత్రకారులు గ్యాలరీల్లో పెట్టే పెద్ద పెద్ద బొమ్మలు, పెయింటింగులని చూస్తుంటే వెంట్రుక కూడా పులకరించట్లా కదా అనిపిస్తుంది. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా ఇంటిముందు కాటన్ మార్కెట్ కాంపౌండ్ వాల్ పొడుగూతా ల్యాడ్ స్కేప్ లు వేసి కింద సంతకం రాజన్ అని పెట్టి మాయమయ్యాడు ఒక నల్లని మనిషి. చింపిరి మనిషి,  లుంగి మనిషి, చిరుగుల మురికి అంగి మనిషి , బక్క దేహం మనిషి…. కానీ ఆ వ్రేళ్ళు మాత్రం మైదాను రాజు తాకినవి. అన్ని గడపలు గల మా ఊర్లో ఒక్కరయినా ఒక్క పూటయినా అన్నం పెట్టారో లేదో తెలీదు ఆ కళాకారుడికి . నేను మాత్రం ఆ మనిషి పులిమిన సంజె రంగులో విభ్రాంతుణ్ణై ఆగిపోయా! ఇప్పటికీ ఆ గోడ నా రెటీనా ముందు పరుచుకూనే ఉంది. నలుపు నలుపు అంటే నారాయణుడే కాదు, ఇండియన్ ఇంకు ద్రావకమే కాదు. పక్క పిన్నీసులు, రోల్డ్ గోల్డ్ నగలు, సవరాలు,  ట్రంకు పెట్టె నిండా. వయ్యారాలు వంటినిండా నింపుకొచ్చే ఆ నాగకన్యలే తోస్తారు. మాయా లాంతరు ఎర చూపి నాబోటి అమాయక యవ్వన్నాన్ని రుద్ది రుద్ది వెలిగించడానికి నాగనందిశ్వర బిళాల్లోంచి బయలు దేరి వచ్చి వేషాలు మార్చి ఇలా గలీ గలీ లో తిరిగే నాగస్వరపు మీది గవ్వల నునుపు సొగసు ఆ నడుములది! ఆ విషపు నవ్వులది. మా ఆకుపచ్చ మంచం మీద పడుకుని ఆ సవరాలు అమ్మే ఆవిడ్ని చూసి నా కళ్ళు పెద్దవయ్యాయి. నేను మగాడినని గ్రహింపు కలిగింది ఆప్పుడే. శరీరానికి కూడా  విల్లు బిగింపు పూనుతుందని గ్రహింపు అక్కడే. కరాళుడి ప్రభావం నశించడంతో సవిత్వకుడి ఎదురుగా కూర్చున్న ఆ యువతి రాజహంసగా మారి ఎగిరిపోయింది అనేది మాత్రమే తెలిసిన జీవితంలో అంతకన్నా అద్భుతంగా శరీర వాంచ అనేది కూడా ఒకటి ఉన్నది అని తగిలింది అప్పుడే . ధైర్యం చేయలేకపోయా కానీ ఆరోజే ఆవిడ వెంబడి అన్నీ వదిలి వెల్లిపోవాల్సింది. ’కో.కు’ అరుణోదయం లో ’ఊళ్ళోనుంచి సర్కసు వెళ్ళిపోతుంటే ఊళ్ళో పిల్లల కెంత దిగులేస్తుందో రామ్మూర్తి కంత దిగులేసింది’ అంటాడే? నా బెంగ తాలూకు పరిమాణం  మోకాలి దగ్గరికి చాలదు రామ్మూర్తి గాడి దిగాలు. ఈ వెళ్ళిపోవడం ఇది మొదలు కాదు. ఏడో తరగతి మద్ధ్యాహ్నం ఇల్లు చేరి చేరగానే వెంకట రాముడి తమ్ముడు వెంకట్ ప్రసాద్ నను చేరి “ఆలస్యంగా వచ్చినావే? ఇందాకే దసరా వేషాలు వేసుకుని రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు, శూర్పనఖ వచ్చి ఇట్లే పోయినారు” అన్న మాట విని. పుస్తకాల సంచి, చెప్పులు అక్కడిక్కడే వదిలి ఒకటే పరుగు. నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర నుండి పొన్నాపురం మెత్తని మట్టిలో కూరుకు పోయేదాకా.. ఎంత వెదికినా ఎవరూ కనబళ్ళా. దారిలో ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నా? న్నా వేషాలోల్లు ఎట్టా బొయినారున్నా?” మన్ను కొట్టుకు పొయిన నా మొహంపై కన్నీటి దారి ఉప్పగా ఆరింది కానీ ఆ దేవతలు మాత్రం అందలా. దేవతలు అందరు.  మనం దేవతలం కాలేం. కనీసం దసరా వేషాల్లోకయినా…..

*****

(“ఆర్టిస్ట్ అన్వర్ బొమ్మలు చెప్పే కథలు పుస్తకం నుండి”)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.