పిట్ట గూళ్లు

-సి.బి.రావు 

యోగ్యతా పత్రం అవసరం లేని కథలు 

 

కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా

అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి

చదవడానికెంతో రుచుండాలి

ఒక్కోకథ ఒక్కో సందర్భంలో

ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది

అందుకే చదువులేని వృద్దుడుకన్నా

చదువుకున్న యువకుడే మిన్న

–శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

 

కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి లోని కథలు. ఈ కథలు చదువుతుంటే, ఆ యా పాత్రల మధ్య మనమున్నామనే భావనలో ఉంటాము. 

 

ఈ సంపుటిలోని కథలన్నీ గతంలో వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డవే. పిట్టగూళ్ళు సంకలనంలోని మొదటి కథ, “ప్రహేళిక” రచన మాస పత్రిక  జనవరి 2003 లో వచ్చింది. వారణాసిలో కథానాయకుడు గంగానది ఒడ్డున పడ్డ మనోవేదన ఎంతో గాంభీర్యమైనది. ఈ కథ చాలా లోతైనది. ఒక నవలగా రాతగ్గ కథను రచయిత్రి సంక్షిప్తంగా కథగా చెప్పారు. కథ చివర వాక్యం చదివాక ఆ తరువాత? అన్న ప్రశ్న పాఠకులలో వస్తుంది. కథా పరంగా, శైలి పరంగా ఒక మంచి కథగా నిలుస్తుంది.

 

మరొక కథ విపుల మాస పత్రికలో వచ్చింది. ఆ కథ పేరు “రానిక నీ కోసం”. ఈ కథ మంచి ఉత్కంఠతో సాగుతుంది. ప్రేమ ఎప్పుడు, ఎవరితో ఎలా కలుగుతుందో, దానికి సూత్రమేమిటో ఎవ్వరూ చెప్పలేరు. అనుకోని పరిస్థితిలొ కథానాయిక ఫిరోజ్ తో ప్రేమలో పడి, ఇమాం వద్ద ప్రమాణం చేసి ఒక్కటవుతారు. ఫిరోజ్ తనను నిజంగానే పేమించాడా? పాలస్తీనా వాడైన ఫిరోజ్, తనను కేవలం, ఈ దేశ పౌరసత్వంకోసం వాడుకొన్నాడా? తనకు చెప్పకుండా తన దేశానికి వెళ్ళాడు. అతనొస్తాడని ఎదురుచూసే సమయంలో, వచ్చింది ఒక ఉత్తరం అతన్నుంచి. పాలస్తీన భాషలో ఉన్న ఆ ఉత్తరాన్ని అతి కష్టం పై తెలుగులోకి అనువాదం చేయిస్తే తెలిసింది ఆ జాబులోని సందేశం. “రానిక నీ కోసం”.  ఆ తరువాత అతడు తిరిగొచ్చాడా? ఒక చక్కటి, చిక్కటి ప్రేమ కథ.

 

తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం — అన్నట్లుగా ఉంటుంది “అందమైన మొద్దబ్బాయి” కథలో శాస్త్రి దయాగుణం. వర్మ తల్లికి వైద్యం కోసం అతను పట్టాణానికి, శాస్త్రి మన్యం వెళ్ళటానికి మ్యూట్యువల్ ట్రాన్స్ఫర్ కి ఒప్పుకుంటాడు; నెలలు నిండిన తన భార్య స్థితిని విస్మరించి. శాస్త్రి భార్య లలిత ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతుంది?

 

మారియా, డేవిడ్ ల డేటింగ్, నెల గడిచాక,  డేవిడ్ దగ్గరున్న డబ్బు, లిక్కర్ బాటిల్స్ అయిపోయాకగాని గుర్తురాలేదు వారికి ఇంకా పెళ్ళికాలేదని. డేవిడ్  తనను కేవలం తన జీతం కోసమే పెళ్ళీ చేసుకోతలచాడని తెలిసాక, వారి నెలరోజుల సంసారం చప్పగా అనిపించింది మారియాకు. ప్రేయసి, ప్రియుడైనా, డేటింగ్ ఐనా సంసారమనే రధం, ధనమనే ఇరుసుమీదే నడుస్తుందన్న ఆర్థిక సూత్రాన్ని చక్కగా తెలియచేస్తుంది “ఇది ఓ బతుకు కథే! “.

 

ఈ సంపుటిలో మరొక కథ “పేరులోన ఏమిగలదు?”. పేరులోనే కలదు పెన్నిధి అన్నారు పెద్దలు. అసలు ఒక వ్యక్తిని చూడకుండానే పేరుబట్టి అతడెలాంటివాడో ఒక అంచనాకు వస్తాము. అలాంటిది కుమారుడి నామకరణ మహొత్సవానికి కమల అటు అత్తవారింట్లోను, ఇటు ఆమె పుట్టింట్లోను ఉన్న పెద్దలందరి పేర్లతో ఉన్న కాయితాన్ని ముందరుంచుకొని, అందరి పేర్లు కలిపి కొడుకుకు నామకరణం చెయ్యాలనుకోవటంలో ఆంతర్యం ఏమిటి?

 

వివాహానికి ముందే భార్యాభర్తల సమానత్వం గురించి, మాట తీసుకున్న వైశాలి, గోపి వంటింట్లో, గ్రైండర్ లో పిండి రుబ్బుతూ, అంట్లు తోముతూ, కాఫీ పెడ్తుంటే కంగారు పడుతూ గోపి ని వంటింట్లోంచి బయటకు పోమ్మని ఎందుకు కోరవలసి వచ్చింది? ఈ వైచిత్రాన్ని “సమానత్వం” కథలో చూస్తాము.

 

మరొక కథ పోష్‌మేనరిజం లో ఆ స్కూల్ కేవలం ఆ కాలనీ వాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడాలని ప్రారంభోపన్యాసం లో అదరకొట్టిన ప్రెసిడెంట్ గారు, స్వీపర్ రాజమ్మ కొడుకు ఆ స్కూల్ లో చేరాక, ప్రెసిడెంట్ గారి పిల్లలతో మొదలు పెట్టి, క్లబ్ కార్యనిర్వాహక సభ్యుల పిల్లలూ మెల్లగా నిష్క్రమించటంతో, స్కూల్ నిర్వాహకురాలు సులోచనకు ఆదర్శానికి ఆచరణకు మధ్య దూరం ఎందుకో బోధపడదు. సామాజిక అసమానత, రుగ్మతలపై రచయిత్రి ఎక్కుపెట్టిన బాణమే ఈ కథ.

 

సృష్టికి మూలం: ఆడ శిశువుల భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ కథ.  అవసరమైన సందేశం కూడినదై, సామాజిక ప్రయోజనం కలదీ కథలో. 

 

అనుకున్నామని జరగవు అన్ని. ఊహించనవి జరుగుతాయి జీవితంలో. మరి అలాంటి జీవితంలో, అనుకోని అవసరానికి ఒక చిన్న అబద్ధమాడి, సంక్షోభం నుంచి బయటపడితే అది తప్పుకాదు కదా. – “అన్‌ప్లాన్డ్ లైఫ్” 

 

“మనసు గతి” – గర్భనిరోధక పద్ధతులు విఫలమయి అనుకోకుండా తల్లి అయిన, ఉద్యోగస్తురాలు  శ్రీమతి సుముఖ మనోభావాలు ఎలా ఉంటాయి? ఆమె మాతృత్వాన్ని అంగీకరిస్తుందా?

 

“ఇంకా ఇంతేనా?” -స్త్రీవాదం అంటూ పెక్కు సిద్ధాంతాలు చలామణి అవుతున్న  ఈ రోజుల్లో, బస్ లో ఇద్దరు అపరిచిత యువతీ యువకులు పక్క సీట్లలో కూచుంటే, మిగతా ప్రయాణీకులు ఎలా స్పందిస్తారు?

 

“పరాజితులు” – 15 సంవత్సరాల క్రితం వారిరువురు ఒక ప్రేమ జంట. రాఘవ తల్లితండ్రులు వీరి వివాహానికి సమ్మతించకపోవటంతో, సురేఖ పై చదువులు, పి.హెచ్.డి ఆపై ఉద్యోగం అంటూ పెళ్ళిని వాయిదా వేసింది. మేనకోడలు ప్రేమ వివాహానికి బాసటగా నిలిచిన రాఘవకు, అన్నవరానికి తన కింద పనిచేసే జూనియర్ అధ్యాపకురాలు పెళ్ళికి వచ్చిన సురేఖ అనుకోకుండా తారసపడుతుంది. వరుడు రామం, వధువు సుజాత పెళ్ళి పనులలో రాఘవకు సహాయపడ్తుంది సురేఖ. రాఘవ అడిగిన ప్రశ్నకు తనకు పెళ్ళయ్యిందని, భర్త పారిశ్రామికవేత్త అని, తనకు ఇద్దరు పిల్లలు అని సమాధానం చెప్తుంది. అలా చెప్పటానికి కారణం; రాఘవకు అప్పటికే వివాహమయ్యుంటుందని, తనకి ఇంకా పెళ్ళి కాలేదంటే అతనిమీద ప్రేమతో తను పెళ్ళి చేసుకొలేదని అతను భావిస్తాడని, అతనికి ఆ అవకాశం ఇవ్వరాదన్న తన భావన వలనే. అయితే అతను కూడా ఈమెపై ప్రేమతో మరల పెళ్ళిచేసుకొలేదన్న విషయం సురేఖకు కు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యదు. మరి ఈ అహం ఎలా తొలుగుతుంది? ఆన్నవరం నుంచి తిన్నగా నేవీ కి వెళ్ళిపోయిన రాఘవ, సురేఖ మరలా జీవితంలో కలుస్తారా? ఈ కథ ముగించిన తీరు బాగుంది.

 

ఒక్కో సారి మన ఊరు పేరు కూడా మన గుర్తింపులో తేడా తీసుకురాగలదు. ఓ! మీది తెనాలా? మాది తెనాలే అని మనను అస్మదీయులుగా అవతలివారు తలిస్తే, వేరొకరు, వేరే ఊరు పేరు చెప్తే పైనుంచి కిందకు అనుమానానుస్పదంగా చూస్తారు. ఆ ఊరినుంచి రావటమే వారి తప్పా? “ఊరు” కథ.

 

తన టిఫిన్ డబ్బాలోంచి, రెండు అరటి బజ్జీలు తీసి ప్రేమగా తాత కిస్తే, నానా యాగీ చేసిన అమ్మ, తన డబ్బాలోంచి తీసి, టిఫిన్ తినేసే ఆయాను, అమ్మ ఎందుకు ఏమీ అనదో ఈ “వ్యత్యాసం” ఏమిటో తనకర్థం కాదనుకుంటాడు ఆ స్కూల్ కుర్రాడు. -“వ్యత్యాసం” కథ.

 

అందమైన అబద్ధంతో డాక్టర్ నీలిమను బుట్టలో వేసిన భువన్, ఆడవారు అపరిచుతులతో ఎంత జాగ్రత్తతో మెలగాలో తెలియచెప్తుంది. -“భువన్” కథ.

 

“ఎవరు హోప్ లెస్ ఫెలో?” కథలో అతను ఆమె మధ్య సంభాషణ పాఠకులకు ఆ సందేహం తీసుకు వస్తుంది. భార్య పై దొంగ  చాడీలు చెప్పి, ఆమె వద్ద ఎన్నాళ్ళు అబద్ధాలతో, చాటు మాటు వ్యవహారం నడుపుతాడు?

 

బతకలేక బడిపంతులనేది ఒకప్పటి సామెత. బడిపంతుళ్ళ “అసలు రంగు” బయటపెట్టే కథ, “అసలు రంగు”.

 

“ఆకలి” – సమాజం లో ఆర్థికంగా, అట్టడుగు వర్గాలలో ఉన్న జీవుల కథ ఇది. చింతచిగురు పులుసు, నాలుగు ముక్కలు, కూసింత సారా వీరికి కలలో కనిపిస్తాయి. రహదారులూడ్చే లచ్చిమి మూడు నెలలు పురుటికి సెలవెడ్తే, రెండొంతులు (2/3) జీతం ఎదురిచ్చి పనిచెయ్యటానికి పదుమికి ఒప్పందం కుదరటమే అదృష్టంగా భావించే బడుగు జీవుల వెతలు తీరేదెప్పుడు?

 

నిజం: రాణి సావిత్రిదేవి గర్భవతి ఐన సందర్భంలో, పుట్టింటి నుంచి సారె తెచ్చిన ఆమె బావ రంగరాజు, భోజనానికి దేవిడిలో సహపంక్తిలోనే కూర్చున్నా, మర్యాదకైనా పలుకరించని రంగరాజు నైజానికి రాణి విస్తుపోతుంది. పుట్టింటి నుంచి వచ్చిన తన ఒకప్పటి ఇష్టసఖి జానకి ద్వారా ఆమె ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకొంటోంది. బావ కాళ్ళపై పడి క్షమాపణ వేడుకోవాలనుకునేసరికి, అప్పటికే అతను పుట్టింటికి పయనమై వెళ్ళిపోతాడు. జమీందారీ కుటుంబాలలో జరిగే కుట్రల గుట్టు విప్పిందీ కథ.

 

“సమిధ”: పిల్లలను పూవులుగా చూసి ప్రేమించే ఉపాధ్యాయిని కుమారి జయప్రభకు, తన విద్యార్ధి తండ్రితో విచిత్రమైన సమస్య ఏర్పడుతుంది. కథ చివరలోని మెలిక పాఠకులను ఆశ్యర్యపరుస్తుంది. వరలక్ష్మి గారి కథలలో, ఓ.హెన్రి తరహా ముగింపు ఉన్న, నేను చదివిన  మొదటి కథ ఇదే కావచ్చు. 

 

కుక్క కరిచింది: సుబ్బారావూ, సుహాసినిల కుక్క ప్రహసనం కాసింత నవ్వుగా మరి కొద్ది బాధగా ఉంటుంది. సుబ్బి పెళ్ళి ఎంకి చావు కొచ్చినట్లు సుహాసిని పుట్టింటి నుంచి తెచ్చుకొన్న జిమ్మి అనే కుక్క ఈ బాధలన్నింటికీ మూలం. జిమ్మీ కరిచి బాధతో మూలిగే సుబ్బారావుకు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ల అసౌకర్యంతో బాటు పథ్యం కూడా జతకలుస్తుంది. కుక్క కరిచిన సుబ్బారావును చూడటానికి ఇటు పుట్టింటి వారు, అటు అత్తింటివారు రావటంతో ఇల్లు పిండివంటల ఘుమ ఘుమలతో నిండితే, పథ్యంలో ఉన్న సుబ్బారావు పరిస్థితి అడకత్తెర లో పోక చెక్కలాగవుతుంది.

 

“కా, పురుషులు” -పొట్టకొస్తే అక్షరం ముక్కరాని చిన్నిగాడు, సూరిగాడు కొట్టుకుంటున్నారు. ఒకే కాకిపై ఇద్దరూ వేసిన రాళ్ళ దెబ్బకి ఠపీమని చెట్టుపైనుంచి కింద పడ్డ కాకి కోసం ఆ తగువు. అసెంబ్లీ లో చిన్నారావు, మార్తాండరావు ల మధ్య హోరా హోరీ బూతుల యుద్ధం జరుగుతుంది. ఈ ఇద్దరూ కాలెజీ లెవెల్ లో చదువు వెలగపెట్టినవారు. అధికారంలో ఉన్న చిన్నారావు విప్లవాన్ని అణచటం సమర్ధిస్తూ మాట్లాడితే, ప్రతిపక్షపు మార్తాండరావు అధికార పార్టీ అవినీతి పై నిప్పులు చెరుగుతున్నాడు. మాటల యుద్ధం కుర్చీలతో కొట్టుకోవడానికి దారితీస్తుంది. ఇదీ నవభారత దృశ్యం.

 

“ఆకస్మికం” – ఒక ప్రణాళిక  లేకుండా అధిక సంతానాన్ని కంటే వచ్చే తిప్పలు వివరిస్తుందీ కథ. మధ్యతరగతి మందహాసం విషాదంగా మారిన వైనం బాధాకరం. 

 

“చెవిలో పువ్వు” – తాడి తన్నేవాడికి తలదన్నేవాడున్నట్లుగా, విద్యార్ధులను స్కూల్ లో చేర్చుకోవటానికి తల్లి తండ్రుల ముక్కుపిండి వసూలు చేసె కరస్పాండెంట్ పుల్లయ్య చెవిలో పువ్వెడతాడు నకిలీ ఇంజనీర్ కృష్ణస్వామి. అత్యాసకు పోయి కటకటాల పాలైన ఒక గుంటనక్క పుల్లయ్య కథ ఇది. 

 

“పిన్ని” -కాలం కలిసిరాకపోతే కన్నతల్లే పిల్లలను వదిలేసిపోతే, పిన్నే దిక్కయ్యింది ఆ సంసారానికి. తండ్రి చనిపోతే అమ్మ తిరిగొచ్చి, పిన్నినే వెళ్ళగొడ్తే, మామయ్యల దుబారాతో కొంప కొల్లేరయితే, తనే మరొకరింటికి పిన్నిగా, అక్కడి పిల్లలకు తల్లిగా వెళ్ళవలసి వస్తే! కథ అడ్డం తిరగటమంటే ఇదేనోమో. 

 

“బాకీ”: చిన్నప్పటి మిత్రుడు అదాటున కనిపిస్తే భారతికి బాల్యపు మధుర స్మృతులు గుర్తుకొస్తే, గోవింద్ కు తను బదులు తీర్చాల్సిన 200 రూ||ల బాకీ గుర్తుకొస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక విషయాలపై ఎంతగా ఆధారపడతాయో ఈ కథ చక్కగా వ్యక్తపరుస్తుంది.

 

ఇవే కాకుండా మరికొన్ని కథలు మిమ్ములను రంజింపచెయ్యగలవు. “ముత్యాలదండ” మిస్టరీ కథ, రెక్కాడితే కాని డొక్కాడని బీదల వెతలు చెప్పే “వేణ్ణీళ్ళు” కథ, పెళ్ళయ్యాక ఈడపిల్ల, ఆడపిల్ల అయే తీరుని వివరించిన”చక్రగతి” కథ, ఒక పిల్ల రాక్షసుడు తన అల్లరితో అందరినీ ఏడిపించి, సరదాగా నవ్వులు పూయించి నవ్వించే “చింటూగాడి చిద్విలాసం” కథ, “కథల పోటీ”: వివిధ పత్రికలు నిర్వహించే కథల పోటీ పై ఈ కథ ఒక వ్యంగాస్త్రం.

 

ఈ కథలు మనకు ఏమి సందేశానిస్తున్నాయి? వీటివలన ప్రయోజనమేమిటి? వరలక్ష్మి గారి కథలలో సందేశాలుండవు. ఈ కథలలోని పాత్రలు మనలను ఆలోచింపచేస్తాయి. పాత్రలు వారి సమస్యల పరిష్కారం కోసం ఏమి చేసాయి అనే అంశాన్ని గమనించగలితే కథల ఉపయుక్తత పాఠకుడికి చేరగలదు. మానవ సంబంధాలలో ఆర్థిక విషయాల ఆధిపత్యం ఈ కథలలో కనిపిస్తుంది. అన్ని సమస్యలూ ఆర్థికం చుట్టూనే గిరిగీసుకు తిరుగుతింటాయి. మరి ఇదే జీవితం.

 

తానా కథా పురస్కారం, ఆటా కథా పురస్కారం, అజో-విభో పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం మొదలైన పెక్కు ప్రతిష్టాత్మక బహుమతులు పొందిన వరలక్ష్మి గారి కథలకు ఎలాంటి యోగ్యతా పత్రం అవసరం లేదు.

 

పిట్ట గూళ్లు (కథలు)

kinige e-book పుటలు 177

వెల: రూ.100/-

e-book కొరకు kinige.com

*****


  











Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.