చిత్రలిపి

ఒక ఉషస్సు కోసం…..

-మన్నెం శారద

నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీకై
పదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటాను
చీకటి ఎంత కఠినమైనది …..!
కరుగక దట్టమై పరిహసిస్తుంది
ఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు ….
భూమికి ఆవల నీపనిలో నీవున్నావో ….
లేక దట్టమైన మబ్బుల దుప్పటిలో
దాగి కలలే కంటున్నావో ….
ఎదురుచూపు లో క్షణాలు సాగి సాగి
కలవరపెట్టి కనులు మూతపడుతున్న
సమయంలో నాకిటికీ పై పడి
వక్రీభవిస్తున్న ఓ వెలుగు రేఖ !
పరవశించి పరుగెత్తుతానా …
కొన్నే కొన్ని క్షణాలు మురిపించి దిక్కుమార్చుకుంటావు
మరో దిక్కులో ఏ గవాక్షమూ లేదు నాకు …
మరలా నా గదిలో చీకటి …
కోపమేమీ లేదు నాకు నీపై …
అంతులేని భక్తితో నీకు చేతులు జోడించి
ఎదురు చూస్తూనే వుంటాను ….
మరో ఉదయం కోసం !
 
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.