యాదోంకి బారాత్-10

-వారాల ఆనంద్

ఖాళీ కాలాలు- భాష్యత్తు పునాదులు

వైఫల్యం అనుకుంటాం కానీ విద్యార్థి కాలంలో ఫెయిల్ అయ్యో, పై చదువులకు సీటు దొరక్కో ఒకటో రెండో సంవత్సరాలు ఖాళీ దొరికితే…ఆ కాలం మామూలు యువకుల సంగతేమో కానీ సృజన రంగం పట్ల అసక్తి ఉత్సాహం వున్న వాళ్ళకు బంగారు కాలమే. ఆ కాలం ఎన్నో చదవడానికి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రూపొందడంలో ఆ కాలం గట్టి పునాదులు వేస్తుంది. నా అనుభవంలో 1977-78 సంవత్సరం అట్లా పునాది వేసిన ఏడాదే. గంజ్ స్కూల్లో టెన్త్, సైన్స్ కాలేజీలో ఇంటర్, ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ ఇట్లా అకాడెమిక్ చదువుల్లో ఫెయిల్యూర్  తెలీని నాకు మొదటి నుంచీ 60% మాత్రం ఊరిస్తూ వుండేది. దాదాపు ప్రతిసారి నా మార్క్స్ షీట్ 59% దగ్గర నిలిచి పోయేది. కానీ ప్రవేశ పరీక్షలు అచ్చి రాలేదు. మెడికల్ సీటు ఊరించి ఉడికించి అందకుండా పోయింది. అదే క్రమంలో డిగ్రీ తర్వాత ఉస్మానియాలో M.Sc.(CHEMISTRY), M.B.A. ల కోసం ప్రవేశ పరీక్షలు రాస్తే రెండింటిలోనూ సీటు రాలేదు. ఇక ఏముంది 1977-78 ఖాళీ.  

          అప్పుడే కరీంనగర్ కు, వేములవాడకు నడుమ నా కాలం గడిచి పోయింది. చిత్రంగా వేములవాడలో నా బంధు మిత్ర బృందమంతా ఆ ఏడూ వేర్వేరు కారణాలతో ఖాళీ. జింబో, పి.ఎస్.రవీంద్ర, వజ్జల శివకుమార్, శివప్రసాద్, సాంబశివుడు ఇట్లా ఒకరే మిటి అంతా సెలవుల్లోవున్నట్టే వుండేది. నటరాజ కళా నికేతన్ కార్యక్రమాలు ఉధృతంగా సాగిన కాలమది. దాదాపు అందరమూ సాహిత్యం చదవడం. కవిత్వమో కథలో రాయడం. సభలు నిర్వహించడం అందరికీ అదే ప్రధాన కార్యక్రమం. అబ్బ ఎంత చదివామో… చలం, శ్రీ శ్రీ, బుచ్చిబాబు, రావి శాస్త్రీ, ఆరుద్ర, గోపీచంద్, నవీన్ ఇట్లా అధ్యయన పరం పర సాగింది. చాలా చిత్రంగా వేములవాడ హనుమాజీపేట వాడయినప్పటికీ డాక్టర్ సి.నారాయణ రెడ్డిగారు మా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. నేనూ ఆయన్ని అప్పుడు అంత సీరియస్ గా చదవలేదు. బాపు రెడ్డి లాంటి వాళ్ళ పుస్తకాలు ఉండేవి కాని అసలు చదవలేదు. దిగంబర కవిత్వమూ, కే.శివారెడ్డి కవిత్వమూ అప్పుడప్పుడే పరిచయం.

***

          అదట్లా వుంటే ఆ కాలంలో నా పైన ప్రభావం చూపిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ ఫ్రెష్ గానే వున్నాయి. నటరాజ కళానికేతన్ కార్యక్రామానికి దేవిప్రియ, కే.శివారెడ్డి గార్లను పిలిచినప్పుడు ఒక సంఘటన జరిగింది. సభ తర్వాత ఆ ఇద్దరికీ పార్వతీపురం గెస్ట్ హౌస్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడంతా గుమి గూడాం. వేదిక ఉపన్యాసాలకంటే ఇలాంటి గెట్ టు గెదర్ లే ఎక్కువ ఆసక్తిగా వుంటాయి. ఎలాంటి ఫార్మాలిటీస్ వుండవు కనుక కొత్తవాళ్ళు నేర్చుకోవడానికి అవకాశమూ వుంటుంది. సభ బాగా జరిగింది. శివారెడ్డి గారి ఉపన్యాసం పెద్ద ఊపు. అందరమూ గొప్ప ఉత్సాహంగా వున్నాం.

          అందరినీ తమ తమ కవితల్ని వినిపించమన్నారు. జింబో, వజ్జల, రవీంద్ర ఇట్లా తమ తమ కవితల్ని వినిపించారు. నా వంతు వచ్చింది.

          నేను ‘బావి గుండె’ కవిత చదివాను …

“ఆకాశం కాళ్ళీడ్చుకుంటూ

 బావిలోకొచ్చింది

ఎంగిలి విస్తార్లా

తైలాన్ని గొంతుక్కొట్టి

అందేలా ఉన్నాయనీ

నీకవసరమనీ

బావి గుండెల్లోంచి

రక్తాన్ని లాగేస్తున్నావు

గుండె లోతుల్ని

ఖాళీ చేస్తున్నావు

బావి కళ్ళు సముద్రమయి

కన్నీటి బొట్లు

బాంబుల్లా

నీ పళ్ళా మసిచేస్తే

బక్కెట్ తన్నేసి

ప్రపంచం కంటికి నమస్కరించి

గుండె గోడల్లోకి

శరణు పోవాల్సిందే..”  

          అది విన్న కే.శివారెడ్డి స్పందిస్తూ ఇట్లా ఇటీవల తాత్వికంగా రాస్తున్నామని చాలా మంది రాస్తున్నారు…ఏదయినా నేరుగా ఉండాలయ్యా అన్నాడు. నాకు ఎక్కడో తగిలింది. ఏమీ అనలేదు. మౌనంగా ఉండిపోయాను. నేరుగా రాయడం.. తాత్వికంగా రాయడం ఎదో కన్ఫ్యూజన్ లో పడి పోయాను. మొదలే నాకు అప్పటికి మొహమాటం వెనకసీటు తనం ఎక్కువ…. చాలా కాలం ఆ మాటల్నుంచి బయటకు రాలేదు. అట్లని శివారెడ్డి గారి పై వేరే అభిప్రాయం ఏమీ రాలేదు నాకు. తర్వాత చాలా సార్లు కలిసాం. వేములవాడ ఫిలిం సొసైటీ కి “ప్రత్యూష” సినిమా కార్యక్రమానికి పిలిచాను.

          కానీ అదే శివారెడ్డి గారు రవీంద్రకు చాలా మంచి సలహా ఇచ్చారు.( ఇటీవలే రవికూడా గుర్తు చేసాడు). అప్పుడు రవీంద్రకు కవిత్వంతో పాటు పాటలు పాడడం, నాటకాలు వేయడం పట్ల ఆసక్తి అభినివేశం వుండేది. అది గమనించిన జింబో ‘ చూడండి సార్, రవీంద్ర అనేక రంగాల్లోకి వెళ్తున్నాడు, వద్దంటే వింటలేడు అని శివారెడ్డితో అన్నాడు’. అప్పుడు వెంటనే శివారెడ్డి గొంతెత్తి ఒక మంచి ఎంకి పాట అందుకుని విని పించాడు. చాలా గొప్పగా పాడాడు. అందరం ఊగిపోయాం. ఎట్లా వుంది రవీంద్రా అని అడిగాడు శివారెడ్డి. చాలా బాగుంది సార్ రవీంద్ర బదులిచ్చాడు. నేను బాగా పాడగలను కానీ నేను కవిత్వాన్నే ఎంచుకున్నాను ఎందుకంటే ఒకవ్యక్తి అనేక రంగాల్లో ప్రావీన్యుడు కావడం సాధ్యంకాదు అందుకే నువ్వు బాగా రాస్తున్నావ్ కనుక రాయడమే ఎంచుకో అన్నాడు. దాంతో రవీంద్ర మిగతా కలల్ని వదిలేసి కవిత్వం రాస్తూనే ఉండిపోయాడు. తనకు చాలా మేలు జరిగింది అంటాడు రవి. అట్లా కళానికేతన్ మా అందరికీ చదవడం రాయడంతో పాటు మంచి వ్యక్తిత్వాలు ఏర్పడేందుకు దోహదం చేసింది.

          అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మేమంతా సాహిత్యమనీ సభలనీ తిరిగినప్పటికీ ఇటు మా నాన్న గానీ, అటు వేములవాడలో తాతయ్యగానీ రఘుపతి మామయ్య కానీ ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఇవ్వాల్టి కాలంలోలాగా ఏనాడూ పరీక్షలనీ రాంకులనీ ఒత్తిడి చేయలేదు. చాలా ప్రజాస్వామ్య యుతంగా వున్నారనిపిస్తుంది. అది ఒక రకంగా మా సాహిత్య ప్రస్థానానికి తోడ్పదిందనే అనుకుంటాను. 

***

          ఇక ఆ ఏడు కరీంనగర్ లో వున్న కాలంలో డి.వెంకటేశ్వర్ రావు, దామోదర్ ల ఇంటికి వెళ్ళడం గంటలు గంటలు బాతాఖానీ, సినిమాలూ, చర్చలూ చేసేవాళ్ళం. అప్పుడు వెంకటేష్ వాళ్ళు బస్ స్టాండ్ రోడ్డులో మెయిన్ రోడ్డు మీదే (ఇప్పుడు జోయాలుక్కాస్ షాప్ వున్న చోట)  అద్దెకు వుండేవాళ్ళు. ఆ ఇంటి ఓనర్ కొడుకు మదన్ (ఇ.మదన్ మోహన్ రావు) తో మాకు మంచి స్నేహం కుదిరింది. తను అప్పుడు హైదరబాద్లో చదువుతూ ఉండేవాడు మాకు ఒక సంవత్సరం సీనియర్. అప్పుడే జనతా పార్టీ ఏర్పాటు జరిగింది. అది అధికారంలోకి రావడం..మదన్ కొంత జనసంఘ్ అభిప్రాయాలతో ఉండేవాడు. అయితే మా మధ్య స్నేహం ఎంతో బాగా వుండేది. రాజకీయ చర్చలు, క్రికెట్ లాంటి ఆటల మీద చర్చలు జరిపేవాళ్ళం. తనకు మంచి లాయర్ కావాలన్నదే జీవిత ధ్యేయం. వాళ్ళ మామ శ్రీ ముత్యం రావు గారు కరీంనగర్ లో పేరున్న పెద్ద లాయర్. మదన్ సామాజిక సమస్యల మీదా తీవ్రంగా స్పందించేవాడు. ఒక సారి నేనూ తనూ కలిసి ఎదో సమస్య మీద వెళ్ళి అప్పటి పోలీసు ఎస్ప్పీ ని కలిసాం. అట్లా మదన్ తో నా స్నేహం చాలా దగ్గరితనంతో సాగింది.   

          ఇక 1977-78 విద్యా సంవత్సరం ముగిసే సమయం వచ్చింది. అందరం కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు సన్నాహాలు మొదలు పెట్టాం. నేను అతకు ముందు సంవత్సరంలాగే  ఉస్మానియాలో M.Sc. (CHEMISTRY), M.B.A. కోర్సులకు ప్రవేశ పరీక్ష లు రాయాలనీ నిర్ణయించుకున్నాను. ఇంకేముంది హైదరాబాద్ కు ప్రయాణం. ఉస్మాని యాలో నాకు పరిచయం వుంది ఒక్క మదన్ మాత్రమె. తను అప్పటికే ఎల్.ఎల్.బి.లో చేరాడు. ‘ఈ’ హాస్టల్ లో వుండే వాడు. తన దగ్గరికి వెళ్ళి కలిసాను. ప్రెస్ కు వెళ్ళి ఫారాలు తీసుకుని బ్యాంకు తదితర పనులన్నీ పూర్తిచేసాం. అప్లై చేసిన తర్వాత ఈ హాస్టల్ మెస్ లో మదన్ తో కలిసి భోజనం చేసి తన రూమ్ కు చేరుకున్నాం. నాకు మెస్ భోజనం తోలిసారి. బాగానే అనిపించింది. రూముకు వచ్చి రెస్ట్ తీసుకుంటూ వుండగా మదన్ సడన్ గా ఒక ఆలోచన చెప్పాడు. “ఆనంద్, లైబ్రరీ సైన్స్ అని ఒక కోర్సు వుంది. ఎంట్రన్స్ రాయకూడదూ” అన్నాడు. ఉద్యోగాలు దొరుకుతున్నాయట..అని కూడా అన్నాడు. అప్పటికి ఆ కోర్సు వున్నట్టు కూడా నాకు తెలీదు. ఆ మాట వినగానే పద వెళ్దాం అన్నాను తిరిగి వెళ్ళి ఆ కోర్సుకూ అప్లై చేసాను. తర్వాత ప్రవేశ పరీక్షలు రాయడం ఫలితాలు రావడం జరిగిపోయాయి. చిత్రంగా నేను అనుకున్న M.Sc.(CHEMISTRY,) M.B.A. లలో సీటు రాలేదు . కానీ  బి.ఎల్.ఐ.ఎస్.సి. లో సీటు వచ్చింది. అందులో చేరిపోయాను. అదే నాకు భవిష్యత్తులో ఉద్యోగాన్ని ఇచ్చింది. కాలేజీ గ్రంధ పాలకుడిగా (Lecturer in Library Science ) వివిధ కాలేజీల్లో విద్యార్థులతో పని చేసే అవకాశం వచ్చింది.

          మదన్ ఆ రోజు ఏ మూడ్లో వుండి ఆ కోర్సు గురించి చెప్పాడో కానీ అదే నా భవిష్యత్తు అయి కూర్చుంది. B.L.I.Sc. అయిపోగానే ఎం.ఎ. (ఫిలాసఫీ)లో చేరాను. కానీ ఈ లోగా మంథని కాలేజీలో ఉద్యోగం వచ్చింది. చేరాలా వద్దా అని వారం రోజులు ఆలోచించాను పెద్దవాళ్ళంతా చేరమని వొత్తిడి తెచ్చారు. చేరిపోయాను.

          ఈ మధ్యలో 77-78 ల నడుమ కరీంనగర్ జిల్లాలోనూ, మొత్తం ఉత్తర తెలంగాణా జిల్లాలోనూ అనేక పరిణామాలు జరిగాయి… సిరిసిల్లా జగిత్యాల ప్రాంతాల్ని కల్లోల ప్రాంతా లుగా ప్రకటించడంతో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడ్డాయి… మరో వైపు నేను ఉస్మానియాలో చేరాక సాహిత్య కార్యక్రామాల కోసం ఉస్మానియా రైటర్స్ సర్కిల్ ఏర్పాటు, అనేక కొత్త స్నేహాలూ… జీవితంలో అనేక మార్పులు రావడం మొదలయింది. ఆత్మ విశ్వాసం స్థాయి పెరగడం మొదలయింది. ఆ వివరాలన్నీ మళ్ళీ రాస్తాను…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.