వెనుతిరగని వెన్నెల(భాగం-49)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురవుతాడు.

***

          “సిద్ధూ! నేను మీతో మాట్లాడాలిఅంది తన్మయి
          “తప్పకుండా, చెప్పండిఅన్నాడు సిద్దార్థ.

          కాలేజీలో ఆవేళ సాయంత్రం స్టడీ అవర్స్ తామిద్దరి వంతు కావడం వలన మిగతా స్టాఫ్ అంతా అప్పటికే వెళ్ళిపోయేరు

          తన్మయి కాలేజీ నుంచి బయటకు దారి తీస్తూ, “అలా రోడ్డు చివరి వరకూ నడుద్దాంఅంది.
 

          అయిదు నిమిషాల మౌనం తర్వాత సంశయిస్తున్నట్టున్న తన్మయి వైపు తిరిగి,

          “ఏదో చెప్పాలని పిలిచేరుఅన్నాడు గుర్తు చేస్తున్నట్టు.

          తన్మయి  “ఎక్కణ్ణించి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అందిదూరంగా ముంచుకొస్తున్న మేఘాల వైపు చూస్తూ.

          పది నిమిషాల నడక తర్వాతఏమో సిద్ధూ, జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంది ఆకాశంలాఅంది.

          “..అర్థం చేసుకోగలను. జీవితం అంత భారమైనది ఇంకోటి లేదుఅంటూ 
కాస్త టీ తాగుదాం”  అంటూ రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలోకి దారి తీసేడు.

          “ఏం సార్, బాగున్నరాఅన్నాడు దుకాణదారు

          ఇద్దరూ కూర్చునేలోగాదో అద్రక్ చాయ్అని అరిచాడు

          సిద్దార్థ చిన్నగా నవ్వుతూ  “చిన్న ఊళ్ళల్లో పనిచెయ్యడం వలన ఉండే లాభాల్లో ఇదొకటి. మనం ఆర్డరు ఇవ్వక్కరలేదుఅన్నాడు

          టీ మెల్లగా సిప్ చేస్తూ “చాలా వరకూ నిలదొక్కుకున్నాను సిద్ధూ. కానీ కొత్త  నిర్ణయా లు తీసుకోవడానికి భయం వేస్తూందిఅంది తన్మయి సాలోచనగా

          “నిర్ణయాలు తీసుకోవడానికి భయం వేస్తూన్నదంటే కారణం నిర్ణయం సరైనది కాకపోయి అయినా ఉండాలి, లేదా నిర్ణయం పట్ల సరైన అవగాహన లేకపోయి అయినా ఉండాలిఅన్నాడు.

          “మొదటిది అవునో, కాదో అనే మీమాంస, రెండోది పెంపొందించుకోవలసిన ఆవశ్యకత. అందుకే మధ్యే మార్గంగా వాయిదా వేస్తున్నానుఅంది తన్మయి.

          “మీ సమస్యేవిటో తెలీదు కానీ, వాయిదా అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు. ఆలస్యం అమృతం విషం. మీకు తెలియనిదేవుంది?
అలాగని తొందరపాటు నిర్ణయాలూ పనికిరావు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనస్ఫూర్తిగా  మీకు నచ్చినది, ఇష్టమైనది చెయ్యండి. అప్పుడే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మంచి ఎదురైనా, చెడు ఎదురైనా తట్టుకో గలిగే శక్తి వస్తుంది. ఏదేమైనా నిర్ణయానికి కట్టుబడండి. గుడ్ లక్అని లేచేడు సిద్దార్థ.

          తన్మయికి మనసంతా తేలికగా మారింది. “థాంక్యూఅంటూ ప్రశంసాపూర్వకంగా చూస్తూ నమస్కరించింది. అతని పట్ల ఉన్న గౌరవం మరింత పెరిగింది.

          “ఎటువంటి సమస్యనైనా చక్కగా విశ్లేషించి, విషయం ఇట్టే బోధపడేటట్లు చేస్తాడు. సిద్దార్థ లాంటి స్నేహితుడు దొరకడం నిజంగా తన అదృష్టంనడుస్తూ ఆకాశంలోకి చూసింది. చిత్రంగా మేఘాలన్నీ చెల్లాచెదురై ఆకాశం ప్రశాంతంగా ఉంది

          ఇంటికి వచ్చేసరికి తన్మయి కోసం పార్శిల్ ఎదురుచూస్తూ ఉంది. ప్రభు నించి వచ్చిందని అర్థమవుతూనే ఉంది

          సాలోచనగా పార్సిల్ ని కత్తెరతో జాగ్రత్తగా కత్తిరించింది
ఒక చిన్న అబ్బాయి, అమ్మాయి చెయ్యీ చెయ్యీ పట్టుకుని నడుస్తున్న ఫోటో లామినేషన్ అది. ముచ్చటగా ఉన్న ఫోటోని గోడకి తగిలిస్తూఎంత మంచి సెలక్షన్ చేసేడు ప్రభు!” అనుకోకుండా ఉండలేకపోయింది

          అతని ఉత్తరాలు, అతని చేతలు అతను మంచివాడని చెపుతున్నాయి. మనసు అతన్ని కోరుకుంటూంది. ఒంటరిగా ఇన్నాళ్ళూ బతికినా, తనకీ తోడుంటే బావుణ్ణన్న ఒక చిన్న ఆశ ఏదో అతన్ని ఒప్పుకోమంటూంది

          కాగితం తీసుకుని ఉత్తరం రాయడం ప్రారంభించింది.

ప్రియమైన ప్రభూ!
ఎలా ఉన్నారు

          మీ ఉత్తరం  వంద సార్లు చదవడం పూర్తికాక ముందే మీరు పంపిన చిత్రం అందింది. ఎంత అందంగా, ముచ్చటగా ఉందోమాయా మర్మంలేని పసి ప్రేమ. మనుషులు ఎప్పటికీ అలా కల్మషరహితంగా ఉండిపోతే ఎంత బావుంటుంది ప్రపంచం! మొన్నటికి మొన్న ఉదయాన్నే కురిసిన హేమంత తుషారంలా మీ ఉత్తరంలో నుంచి రాలిపడ్డ గులాబీ రేకులు. ఉత్తరం మడత విప్పినప్పుడల్లా నన్ను చుట్టుముడుతున్న పరిమళం. ఇప్పుడేమో చిదానందాన్ని పంచే చిత్రం! నేను మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోను!!  మీ కోసం ఇదిగో నా హృదయాన్ని బహుమతిగా పంపుతున్నాను

మీ
తను

          తను రాసిన ఉత్తరాన్ని తనే నాలుగైదు సార్లు చదువుకుంది. అతనంటే తనకూ ఇష్టమని చెప్పడం తప్పేమీ కాదని అనిపిస్తూంది. పెళ్ళి అనే ఆలోచనను తనెలాగూ సంవత్సరం తర్వాతకు వాయిదా వేసింది.

          ఉత్తరం మడిచి తలగడ కింద పెట్టుకుని పడుకుంది. పక్కనే నిద్రపోతున్న బాబు చెంపల్ని నిమిరింది.

          “నువ్వు చెప్పు నాన్నా! నేనేమి చెయ్యాలోఅంది.

          నిద్దట్లో ప్రశాంతంగా ఉన్న వాడి ముఖమ్మీద చిరునవ్వు ఒక్క క్షణం వెలిగింది.
తన్మయి వాణ్ణి దగ్గరగా అదుముకుని ముద్దు పెట్టుకుంది. “చాలు నాన్నాఅంటూ.

***

          జ్యోతి ఉత్తరం రాసిందిఇంటర్వ్యూకి వచ్చినపుడు  హైదరాబాదులో తమకు ఆతిథ్యం ఇచ్చిన పెద్దమ్మ కొడుక్కి పెళ్లట. భాను మూర్తికి ఆరోగ్యం కాస్త కుదుటపడింది కాబట్టి ఇద్దరూ ముందుగా తన దగ్గిరికి వచ్చి, అంతా కలిసి పెళ్ళికి వెళ్ళొద్దాం, రెండ్రోజు లు సెలవు పెట్టమని

          అమ్మా, నాన్నా ఇద్దరూ వస్తున్నారు. తన్మయికి గొప్ప ఆనందం వేసింది. ఇంట్లోకి టిఫిన్లు ఇతరత్రా వండుకోవడానికి కావల్సిన కిరాణా సామాన్లు కొని తెచ్చింది

          తండ్రి భోజనం తినడానికి కిందన కూర్చోలేడు కాబట్టి  రేకు భోజనం బల్ల, ఒక రెండు ఫోల్దింగు కుర్చీలు కొంది. పెళ్లికి కట్టుకోవడానికి తన దగ్గిర ఒక్క పట్టుచీర కూడా లేదు. పైగా తనకి ఎన్నాళ్ళుగానో మంచి చీర కొనుక్కోవాలని ఉంది. సిద్ధూ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చేయి. అవును, మన్స్ఫూర్తిగా నచ్చినట్లు బతకడంలోనే ఆనందం ఉంది

          తాయిబాను తోడు తీసుకెళ్ళి సులభ వాయిదాల్లో కట్టడానికి ఒప్పుకుని మంచి జరీ పట్టుచీర కొని తెచ్చుకుంది. చీరకు అంచులు, ఫాల్సు, జాకెట్టు కుట్టించడానికి ఇచ్చింది.

          శేఖర్ నించి విడిపోయేక తల్లీ, తండ్రీ మొదటిసారి వస్తున్నారు తన దగ్గిరికి. వాకిట్లో ముగ్గులు వేసింది. చెప్పలేని ఆనందంగా ఉంది. తను చదువుకుని ప్రయోజకురాలు అయ్యింది. ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి, తన మానాన తను హాయిగా బతుకుతూంది. ఇంతకంటే తల్లిదండ్రులకైనా ఏం కావాలి? తనని చూసి తప్పకుండా సంతోషపడతారు

          అద్దంలో తనను తాను చూసుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకుంది. కళ్ళ కింద నల్ల చారలు, పీక్కుపోయిన చెంపలు. అయినా జీవితం ఏవీ నిరాశాజనకంగా లేదు
తనకు నచ్చిన కాటన్ పంజాబీ డ్రెస్సు వేసుకుని, తల్లి ఇచ్చిన సన్నని గొలుసు, ఒక జత గాజులు మాత్రం వేసుకుంది. బాబుకి పేంటు, షర్టు, బూట్లు, సాక్సులు వేసి తయారు చేసింది. తాతయ్య, అమ్మమ్మ వస్తున్నారని బాబు హుషారుగా చిందులు వేయసాగేడు.
తల్లీ, తండ్రీ వస్తారన్న సమయానికి అరగంట ముందే బండి మీద బస్టాండుకి బయలు దేరింది.

          సమయానికంటే పది నిమిషాల ముందే బస్సు వచ్చింది.

          తన్మయిని, బాబుని చూస్తూనే జ్యోతి ఆత్రంగా బాబుని ఎత్తుకుని ముద్దాడింది

          ఇద్దరూ బాబు మీద బాగా బెంగ పడ్డట్టు ఒక్క క్షణం కింద దించకుండా ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఎత్తుకోసాగేరు.

          తన్మయికి వాళ్ళని చూసి పట్టరాని అనందం కలిగింది. తల్లి దగ్గిరికెళ్ళి కౌగలించు కుంది. తండ్రి చేతిలో బ్యాగు అందుకుంది

          వీథి మలుపు తిరగగానేఅదేవిటమ్మా, ఇంత కంటే వేరే చోట ఇల్లు దొరకలేదాఅంది వీథి మొదట్లో పీర్ల పండగ నాటి జెండాలను చూస్తూ

          వాళ్లు వచ్చిన సంతోషం గంట కూడా నిలవలేదు తన్మయికి.

          వస్తూనే చికాకు పడింది. “ఏవిటీ ఇల్లు, కనీసం సెపరేటు బాత్రూము కూడా లేకుండా? ఇంటావిడ ఏంటి, అస్తమాటూ అన్నిటికీ కల్పించుకుంటూ…” అని.
ఇక తండ్రి తన్మయి ఏదో కోల్పోయి నిరాశలో బతుకుతున్నట్టు  బాధాకరంగా ముఖం పెట్టుకు కూర్చున్నాడు.

          తన్మయి ఏదో రకంగా వాళ్ళ మూడ్ మార్చడానికన్నట్లు, “అమ్మా, పెద్దమ్మ కొడుకు పెళ్ళికి పట్టుచీర కొనుక్కున్నాను చూడుఅంది చీర ఎదురుగా పెడుతూ.

          జ్యోతి ముఖంలో మార్పు లేకపోగా శోకాలు పెట్టడం ప్రారంభించింది.

          “ దౌర్భాగ్యుడు నీ మెళ్ళో పుస్తెలు కూడా లాక్కున్నాడు. ఇప్పుడు ముఖం పెట్టుకుని పెళ్ళికి  వెళ్తాం?” అంటూ ముక్కు చీదడం ప్రారంభించింది.

          ఇదేమీ వినడం ఇష్టం లేనట్లు తండ్రి తల మీద చెయ్యేసుకుని పడుకున్నాడు.
తన్మయికి సంతోషం అంతా నీరుగారిపోయింది.

          తను పెళ్ళికి వీళ్ళ కూడా వెళ్ళడం వీళ్ళకి పరువు నష్టమన్నమాట. తను భర్త నుంచి విడిపోయింది కాబట్టి నలుగురూ నాలుగు మాటలంటారన్న బాధన్నమాట వీళ్ళకి

          అయినా తన్మయి వెనక్కి తగ్గకుండా, “అమ్మా! మేమిద్దరం విడిపోయేం అన్న విషయం సరికే అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి నా మెళ్ళో మంగళ సూత్రాలు కనబడాల్సిన అవసరం లేదు. అయినా నేనేదో తప్పు చేసినట్లు నలుగురిలో కలవకుం డా ఎందుకు ఉండిపోవాలి? అయినా ఎవరైనా ఏమైనా అంటే నేను సమాధానం చెప్పు కుంటానుఅంది స్థిరంగా.

          “మొకమ్మీద అంటారా ఎవరైనా? వెనక వెనక నవ్వుకుంటారుఅంది జ్యోతి ఇంకా ముక్కు చీదుతూ.

          “నా వెనక వాగుకునే వాళ్ళ గురించి నాకు బాధ లేదు, మీకు బాధగా ఉంటే నేను రావడం మానేస్తానుఅంది తన్మయి.

          “అహా, అంత దూరం నుంచి వచ్చి నిన్ను తీసుకురాకుండా పెళ్ళికి వచ్చారేవిటని అందరూ మమ్మల్ని ఆడిపోసుకోవడానికా?” అంది జ్యోతి రివర్సులో.

          తన్మయికి తలపోటు రాసాగింది.

          “నన్నేం చెయ్యమంటావో చెప్పుఅంది ఓపిక పట్టి  తల్లి దగ్గిర కూలబడుతూ.

          “ఏం చేస్తాం, మన ఖర్మ ఇలా కాలేకఅని వెనక్కి తిరిగి కూచుంది జ్యోతి.

***

          పెళ్ళి సాయంత్రం అనగా ఉదయాన వెళ్ళేరు.

          దగ్గిర చుట్టాలంతా రోజే రావడంతో అప్పుడే పెళ్ళి కొడుకుని చేసేరు. అందరూ వెళ్ళి అక్షింతలు వేయసాగేరు. తన్మయిని పెళ్ళికొడుకు పిన్ని వరసయ్యే ఆవిడ పక్కకు పిలిచింది.

          “ఇలా చూడమ్మా, శుభమా అని పెళ్ళి జరుగుతూంది ఇక్కడ. మొగుడూ పెళ్ళాలు కలిసి దీవిస్తున్నారు. నువ్వు, మీ ఆయన విడిపోయేరంటగా. నువ్వేవనుకోకపోతే అక్షింత లు మాత్రం వెయ్యకుఅని నసిగింది.

          తన్మయికి ఒక్కసారిగా దు:ఖం ముంచుకొచ్చింది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండ బుద్ధి కాలేదు. తల్లి, తండ్రుల్ని అక్కడ వొదిలిపెట్టి వెళ్ళలేక, ఒక పక్కగా వెళ్ళి కూచుండి పోయింది.

          భర్త పోయిన ఆవిడొకామె వచ్చి తన పక్కనే కూచుని నిట్టూర్చడం గమనించింది తన్మయి. సంప్రదాయాలంటూ మనుషుల మూఢ ప్రవర్తనలకు విసుగు పుట్టింది తన్మయికి. ఏమీ చేయలేని నిస్సహాయత. ఇక మీదట బంధువుల ఇళ్ళకు రాకూడదని నిశ్చయించుకుంది. ఇంతకు ముందెప్పుడో ఇలాగే బంధువుల్లో అవమానం జరిగి నప్పుడు ఇలాగే నిశ్చయించుకున్నది, కానీ తల్లీతండ్రీ పనిమీదే  తన దగ్గరకు వచ్చినపుడు ఎలా రాకుండా ఉంటుంది? ఎన్నో రోజులు ఎక్కడికీ వెళ్ళక ఒకసారి వెళ్ళి చూద్దామని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది తనకు.

          దు:ఖం ఆపుకోలేక కింద గేటు దగ్గరకు వచ్చింది

          వచ్చిపోయే చుట్టాల్లో కొందరుఇక్కడ ఉన్నావేవమ్మా, పైన పెళ్ళికొడుకుని చేస్తుంటేనూఅనసాగేరు.

          ఎదురుగా కిరాణా దుకాణం దగ్గిర ఎవరో ఒకతను బండి స్టాండు వేసి కొనడానికి వెళ్లేడు. వెనక నుంచి అచ్చు ప్రభులాగే ఉన్నాడు

          తన్మయికి అంత దుఃఖంలోనూ ఒక్కసారి అతన్ని చూడాలని కుతూహలం కలిగింది.  

          రోడ్డు దాటి అటు వెళ్ళడానికి సాహసం కలగలేదు

          ఒకవేళ నిజంగా ప్రభు అయితే! అతను తనని చూస్తే పలకరించకుండా ఉండడు. ఇదంతా ఎవరయినా చూసి, అమ్మా నాన్నలకు తప్పకుండా చెపుతారు. తర్వాత జరిగే రభస తల్చుకోవడానికే భయం వేసి, చప్పున మెట్లెక్కి పైకి వచ్చేసింది.

          చివరి మెట్టు తిరుగుతూ మనసాపుకోలేక  అటుగా చూసింది.

          సరిగ్గా బండి స్టార్టు చేస్తూ పైకి చూసేడతను. ప్రభు! అవును ప్రభుయే!!

          తన్మయి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం మొదలు పెట్టింది.

          కానీ అంత పై అంతస్తులో మెట్లెక్కుతున్న అనేక పట్టుచీరల్లో తనని అతను చూసినట్లు లేడని అర్థమైంది

          తన చుట్టూ ఏం  జరుగుతున్నదీ మైమరచిపోయి, అతని బండి కనుచూపుమేర దాటేంత వరకూ చూస్తూ , అలాగే ఉండిపోయింది.

          మధ్యాహ్నం భోజనాల దగ్గిర, సాయంత్రం పెళ్ళి దగ్గిరా ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా ప్రభు కనిపించసాగేడు.

          అతని ఊహ వచ్చినపుడల్లా పెదాల మీద చెరగని చిరునవ్వు మొలుస్తూనే ఉంది

          కానీ, పొద్దున్న జరిగింది జ్ఞాపకం వచ్చి పెళ్ళి మండపంలో అక్షింతలు వెయ్యడానికి వెళ్లకుండా దూరంగా ఉండిపోయింది తన్మయి

          తనని, ప్రభుని వాళ్ళ స్థానాల్లో ఊహించుకుంటే ఎందుకో ఒకరకమైన వేదన మొదలయ్యింది. తన చుట్టూ ఉన్న వీళ్ళంతా ఇలాగే ఆశీర్వదిస్తారా? ముఖ్యంగా తల్లీ తండ్రీ ఒప్పుకుంటారా?!

          జ్యోతి కూతురి ముఖంలో భావాల్ని  మరోలా అర్థం చేసుకుంది

          మర్నాడు ఇంటికెళ్ళగానేనిన్న పెళ్ళిలో అందరూ జాలిపడడమే మమ్మల్ని చూసి. మా బతుకులే ఇలా తగలడ్డాయి. ప్రపంచంలో అందరూ బాగున్నారు. అప్పుడే నువ్వు దగుల్బాజీ వెధవని పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టకబోతే ఇవన్నీ జరిగేవి కావు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం?” అంది నిష్టూరంగా

          తల్లి ఇలా మాట్లాడడం కొత్త కాకపోయినా బాధ మాత్రం ప్రతీసారీ కలుగుతూ ఉంది.
తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటేనే ఇటువంటి సమస్యలన్నీ తీరుతాయేమో అని నమ్మకం కలగసాగింది తన్మయికి.

          కానీ తల్లీ, తండ్రీ తన దగ్గర ఉన్న వారం రోజులూ ప్రభు ప్రస్తావన తేవాలనుకునీ, తేలేకపోయింది తన్మయి. చిత్రంగా ఇప్పటి వరకూ వాళ్ళు కూడా ఎప్పుడూ తనకి మళ్ళీ పెళ్ళి చేయాలనే ప్రస్తావన తీసుకు రాలేదు.

          తను ఇంకా అటువంటి ప్రస్తావనలకు సిద్ధంగా లేదనా? లేక ఇక తను జీవితాంతం ఇలా ఉండవల్సిందేననా

          కారణాంతరాలు ఏవైనా పెళ్ళి విఫలం అయినపుడు మగవాళ్ళు జీవితాన్ని చక్కదిద్దుకున్నంత వేగంగా ఆడవాళ్ళు చక్కదిద్దుకోలేరన్న వాస్తవం క్రమంగా బోధపడ సాగింది తన్మయికి.

***

          ఆ ఉదయం తాయిబా అమ్మా, నాన్నా వచ్చేరు.

          వస్తూనేబేటీ, ఎలా ఉన్నావుఅంటూ వాకిట్లోనే కూతురుని బెంగగా కౌగలించుకుని కన్నీరు మున్నీరయ్యింది తల్లి.

          జ్యోతి, భానుమూర్తి  బయలుదేరిన ఉదయం జ్ఞాపకం రాసాగింది తన్మయికి. బాబుని అక్కున చేర్చుకుని బుగ్గలు పుణుకుతూబాగా చదువుకో నాన్నాఅంది జ్యోతి.

          తన్మయి వైపు తిరిగిజాగ్రత్తగా ఉండమ్మాఅంది

          తన్మయికి అమ్మా, నాన్నా తనని వదిలి వెళ్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేయి. తల్లి తననూ అక్కున చేర్చుకుంటే బావుణ్ణని అనిపించింది.

          గుమ్మం దగ్గిర బయటకు వచ్చి నిలుచున్న తాయిబాతోఏమాటకామాటే చెప్పు కోవాలి, మాకు మా అమ్మాయి మీద కంటే మా మనవడి మీదే ప్రేమెక్కువ, వాణ్ణి ఒదిలి ఉండలేకే వచ్చేం. కొంచెం చూస్తుండమ్మాఅంది జ్యోతి.

          తన్మయికి మనసు చివుక్కుమంది. రిక్షా ఎక్కుతున్న తల్లిని, తండ్రిని చెయ్యి పట్టుకుని ఎక్కించింది.

          తనకు మాత్రం వీళ్ళంటే ప్రాణం. తిరిగి ప్రేమను వాళ్ళ నుంచి పొందలేక పోవడం తన దురదృష్టం. తనలో తనే నిట్టూర్చింది. లోపలకి వెళ్ళబోతూ ఉంటే, తాయిబా వెనకే వచ్చింది, “మేడం, మనసు బాగలే, కూసో వచ్చాఅంటూ.

          “రా తాయిబాఅని కుర్చీ వేసింది.

          అయిదు నిమిషాలైనా, ఉలకక పలకక ఉన్న తాయిబా వైపు చూస్తూ, “అంతా బానే ఉందా?” అంది.

          “ఏం సెప్పను మేడం, నా తలరాత గిట్లున్నది. మీతో సెప్పుకుంటెనన్న కొంచెం పరేషాన్ తగ్గుతదని అచ్చిన.” అంది.

          “చెప్పు తాయిబాఅంది అనునయంగా తన్మయి.

          “మా ఆయినకు, నాకు గిది రెండో పెళ్ళిఅంది తాయిబా

          ఆశ్చర్యంగా చూసింది తన్మయి

          ఈ అమ్మాయి జీవితంలోనూ కష్టాలేనన్నమాట. కానీ ఎప్పుడూ చెదరని చిర్నవ్వుతో కనిపిస్తుంది.

          “నా సిన్నపుడె నాకు యాబై యేండ్లవానికిచ్చి కట్టబెట్టిన్రు. వాడేమో డబ్బు పోస్తడని గామోసు. మా అమ్మకి సుతరామూ ఇష్టం లేకుండె. మా బాపు నచ్చజెప్పి పెండ్లి సేసిండు. నా అదృష్టమొ, దురదృష్టమొ కాపురానికి పోక ముందె యాక్సిడెంట్ల వాడు పాయె.” అని ఆగి నీళ్ళ కోసం సైగ చేసింది.

          మంచి నీళ్ళు తీసుకు వచ్చి, “మెల్లగా, ముందు స్థిమితపడు తాయిబాఅంది తన్మయి.

          “ఇరవై ఏండ్ల వయసున గిదో గీ సమ్మందం మా చిన్నాయిన తీసుకుని అచ్చిండు. అతనికి ముందు పెండ్లాము సచ్చిపాయె. మనిసి మంచోడే, కానీ లేని దురలవాటు లేదు. పగలూ, రేత్రీ యేపుకు తింటుండె. ఇంక నయం ముందూ, యెనకా ఎవరూ లేరు. రెండేళ్ళ క్రితం దుబాయి పొయ్యిండు. మూడు నెల్ల బట్టి నయాపైస పంపకపోతుండె, మనిసి మంచిగనె ఉన్నడని దుబాయిల ఉన్న మా సిన్నమ్మ కొడుకు సెప్పిండు. ఒక ఉత్తరం లేదు, కబురు లేదు. ఏం పోయెగాలమొచ్చెనో ఏమొ. నాకు గిట్ల పిల్లలు లేరని, దేన్నైనా  పెట్టుకున్నడేమో అని డౌటు కొడ్తంది. ఈడు నన్ను ఏడ ఇడిసిపెడ్తడోనని మస్తు పరేషాను అయితంది మేడం. రెండో పెళ్ళి జేసుకుని సుకాన ఉన్న నా ప్రాణం దుక్కాన బెట్టుకున్న నే అని ఏడ్వని రోజు లేదు”  అని దు:ఖపడింది.

          కాస్సేపు నిశ్శబ్దంగా తాయిబా చెయ్యి నిమురుతూ కూచుండి పోయింది.

          “అయ్యో, అమాయకమైన అమ్మాయికి ఎంత కష్టమైన జీవితం మిగిలిందిఅని బాధ మొదలయ్యింది.

          “దిగులుపడకు, అన్నీ చక్కదిద్దుకుంటాయిఅంటూ తాయిబాకి ధైర్యం చెప్పింది.
అన్నదే కానీ అప్పట్నించీ మళ్ళీ మళ్ళీ తాయిబా మాటలు గుర్తుకురాసాగేయి.

          “రెండో పెళ్లిజేసుకుని సుకాన ఉన్న నా ప్రాణం దుక్కాన బెట్టుకున్న……” 
తను మళ్ళీ పెళ్ళీ చేసుకోవాలని ఆశపడడం ఇలాగే దు:ఖదాయకమవుతుందా? ఇప్పుడు తన మానాన తను, ఉన్నంతలో హాయిగా బెడదా లేకుండా జీవిస్తూంది. ప్రభుతో మళ్ళీ జీవితం పంచుకోవడం అనే ఆలోచనతో తను కోరి కష్టాలను కొని తెచ్చుకుంటూందా?…

          ఏమో….

***

          ఆ రోజు ఒంట్లో నలతగా అనిపించి కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయింది తన్మయి

          పదకొండు గంటల వేళ తలుపు చప్పుడయితే మెల్లగా లేచింది.

          తాయిబా, పక్కనే సిద్దార్థ.

          “ఇగో మేడం, ఇంగ్లీషు సారు ఇల్లు సూపించమంటే నేనూ అచ్చిన. సుస్తీ ఉంటే రాండ్రి, దావఖానకు పొయ్యొద్దాంఅంది తాయిబా

          తన్మయి ఫర్వాలేదన్నట్టు తలూపింది.

          తాయిబా పక్క తలుపు వైపు వెళ్ళడం చూసి, “అయితే తనింట్లోనే మీరు అద్దె కుంటున్నారన్నమాట”  అని కూచుంటూ, “ఏమిటి? ఎలా ఉన్నారు?” అన్నాడు సిద్దార్థ.

          తన్మయి జుట్టు సరిచేసుకుంటూకొంచెం నలతగా ఉంది, అంతేఅంది బలవంతంగా చిన్న నవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తూ

          “ మధ్య మీరు అన్యమనస్కంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాను, ఎప్పుడూ ఏదో బాధలో ఉంటున్నారు. అంతా ఓకేనా? ఏవీ అనుకోకపోతే కారణం తెలుసుకోవచ్చా?” అన్నాడు సిద్దార్థ.

          అప్పటి వరకూ దాచుకున్న దు:ఖం కట్టలు తెంచుకుంది తన్మయికి

          తన్మయి తన గాథ చెప్తున్నంత సేపూ రెప్ప వాల్చకుండా వినసాగేడు.

          చివరగా ప్రభు గురించి చెప్పి తన్మయి గట్టిగా ఊపిరి తీసుకుంది.

          ఇంతలో తాయిబా టీలు పట్టుకొచ్చి ఇచ్చింది

          “నువ్వు కాలేజీ మానేసి పనులన్నీ చెయ్యాలా తాయిబాఅంది తన్మయి.

          “అట్లంట వేంది మేడం, అయినా ఏమీ గాదులే, ప్రిన్సిపాల్ సారుకి సెప్పొచ్చిన, ఇంగ్లీసు సారెంబడి పోతున్న అనిఅని సిద్దార్థ వైపు తిరిగి, “నువ్వయినా చెప్పు సారూ, ఎప్పటికీ ఏమో పరేషానయితది, ఇగ ఆరోగ్యం గిట్ల గాక ఏమయితది?” ఆప్యాయంగా అని, “గిప్పుడే వస్తఅని లేచింది తాయిబా.

          టీ తాగి కప్పు కింద పెడుతూ

          “ రియల్లీ అప్రిషియేట్ యువర్ బ్రేవ్నెస్ తన్మయీ. అడ్మయిర్ యూ. జీవితంలో కష్టాల్ని కత్తి ఝళిపిస్తూ విజయవంతంగా నెగ్గుకొచ్చేరు మీరు. మీకు ఇంకా దు:ఖమా? లేవండి, కళ్ళు తుడుచుకోండి. ధైర్యంగా ముందడుగేయమని నేను మీకు చెప్పక్కరలేదుఅన్నాడు.

          ఇంకా అలాగే ఉన్న తన్మయి వైపు చూస్తూ, “మీరనుమతిస్తే ప్రభుని నేనుకలుస్తాను. అతను మీకు సరైన వాడవునో, కాదో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తాను, ఏమంటారు?” అన్నాడు

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.