
అనుబంధాలు-ఆవేశాలు – 4
– ప్రమీల సూర్యదేవర
“మంత్రిగారి నుండి అనుమతి పత్రం తీసుకుని లోపలకు రావటానికి మీ అనుమతి పొందగలిగాను. ఇక్కడ మీ సహాయం, సహకారం లభిస్తాయని ఆశిస్తున్నాను.”
ఈవిడ తీరు చూస్తే ముందుముందు నేను రావటానికి అనుమతినివ్వదేమోననే అనుమానం ఒకప్రక్క కలవర పెడ్తుండగా అన్నాను.
“ఇదంతా మాకుక్రొత్త , పై అధికారులకు తెలియజేసి వారేం సలహా ఇస్తారో చూడాలి. మీరు–మేము–ఇద్దరం ఎలా మొదలు పెట్టాలో, ఎలా కొనసాగించాలో వారి నుండి అనుమతి రావల్సిందే. ఈ రోజు మీరు దోషుల వృత్తాతం తెలుసుకుని వెళ్ళండి. వెళ్ళే ముందు మీ చిరునామా ఇచ్చినట్లయితే వారం రోజుల్లో అధికారుల నిర్ణయం తెలుసుకుని మీకు తెలియజేస్తా ,”అంటూనే ప్రక్కనే బీరువా తెరిచి, కాగితాల కట్టలు నాముందు పెట్టింది. ఒక్కొక్కకట్టలొ కాగితాలు కనీసం నాలుగు వందలైనా ఉన్నాయి. ఎంత త్వరగా చదివినా వారం పైనె పడుతుంది.
నా సందేహం గమనించిందిలా ఉన్నది. “మొదటి ఇరవై పుటల్లో వారి కేసు వివరాలు, వారి ఫోటోల్తో సహా ఉన్నాయి. ఇవి ఎట్టి పరిస్థితిలోను బయటకు రాకుడదు.” ఖరాఖండిగ చెప్పింది.
మేము మాట్లాడుకుంటూ ఉండగానే జలజ నా సంచి తెచ్చి ఇచ్చింది. అందులో అన్నీ ఉన్నాయో లేదో చూడాలని ఆతృతగా ఉన్నా ధైర్యం చాల్లేదు. కారాగార నివాసులు, సిబ్బందుల మధ్య జరిగే దొంగతనాలు, అక్కడి వారికి అలవాటులోనున్న మత్తుమందులు, వాటి అవసరాలు, ఇవే కాక వారిలో వారికి జరిగే కొట్లాటల–గురించి వ్రాసిన వ్యాసం ఒకటి ఎప్పుడో చదివాను.
కారాగార అధికారిణితోపాటే జలజ కూడ వెళ్ళి పోయింది. ఇద్దరు నిష్కృమించటంతో సంచి తెరిచి చూడాలనిపించినా ప్రతి గదిలోను సెక్యూరిటీ కెమేరాలు ఉండటం చూసి, కారులో కూర్చుని చూసుకోవచ్చు అనుకుని, నా ఎదురుగ ఉన్నఫైల్స్ కట్టల్లోనుండి 349 అని సంఖ్యవున్న ఫైల్ తెరిచాను.
మొదటి పేజీలో పేరు లేదు. రెండవ పేజీలో ఒకఫోటో, దాని క్రింద పేరు భ్రమర అని ఉన్నది. నేను చూసిన ఆ ఇరువురిలో ఈ అమ్మాయి ఎవరై ఉంటుందా? అని గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించాను. ఈ ఫోటోలో ఉన్న రూపురేఖల్తో వారెవరూ స్పురించలేదు. ఈఫోటోలో అమ్మాయి నల్లని కళ్ళల్లో భయం, బాధ, సిగ్గు, కొట్టవచ్చినట్లు కనుపిస్తూ పెదవులు గట్టిగ బిగించి తెరవటానికి సాధ్యంకానట్టున్నాయి.
లేతాకుపచ్చరంగు పంజాబిడ్రెస్, కొంచెం బొద్దుగ అనిపించే ఆమె లేత గోధుమరంగు శరీరంపై మరింత వన్నె తెచ్చింది. నల్లని కురులతో అల్లుకున్న ఒక్కజడ కుడి భుజంపై నుండి ముందుకు పడి, అబ్బ ఎంత పెద్ద జడో! అనిపిస్తుంది. నునువైన బుగ్గలపై కారుతున్న కన్నీటిని తుడుచుకోవటానికి వీలు లేనట్లు చేతులు వెనక్కు విరిచి కట్టబడి ఉన్నాయి. కారాగారంలోకి అడుగు పెట్టిన మొదటి రోజు తీసిన ఫోటో అని నిర్ధారణ చేసుకుని మిగిలిన వివరాలు తెలుసుకుందామని మరో పేజీ త్రిప్పాను.
యువతి వయస్సు 22 సంవత్సరాలు. నేరం—హత్య— తల్లిని!!1 నివ్వెరపోయాను! భార్య, భర్తని–భర్త,, భార్యని–ప్రేమ వ్యవహారాల్లో పడి స్తీృ పురుషులు ఒకరినొకరు చేసుకునే హత్యలు–ఆస్తి వ్యవహారాల్లో ఆన్నదమ్ములు, దాయాదులు ఒకరినొకరు చంపుకోవటం–మత్తు పానీయాలు సేకరించి ఒళ్ళు తెలియని స్థితిలొ భార్యను, పిల్లల్ని బలిగొన్న పురుషులు–వివాహితఐన స్రీృ మరొకర్తో అక్రమ సంబంధం పెట్టుకుని, ప్రియుడి సహకారంతో భర్తను చంపివేయటం–ఆకలి బాధను తట్టుకోలేక తల్లి దండ్రులు పిల్లలకు విషం ఇచ్చి తాము త్రాగి చనిపోవటం–కొందరు విషం మింగినా చావలేక మిగిలిపోయి, పిల్లల్ని చంపివేసుకున్నామని కుమిలి పోయిన తల్లి దండ్రులు–ఇలాంటి దుర్వార్తలెన్నో చదివాము–విన్నాము. కాని–తల్లిని హత్య చేసిన కూతురు–వైద్య కళాశాలలో చదువుతున్నది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువతి! ఇంత చదువుకుని ఎందుకిలాటి పని చేసింది? తల్లిని కత్తితో తూట్లుతూట్లుగ పొడిచి చంపివేసింది!!!
నవమాసాలు మోసి, ప్రసవ వేదన భరించి, బిడ్డకు జన్మనివ్వగానే పడిన బాధ మరిచిపోయి. గర్వంతొ పొంగిపోతూ, ఆనందభాష్పాలు రాలుస్తూ, ఆప్యాయంగ బిడ్డను తడిమి చూసుకుని, ఉప్పొంగిన ప్రేమతొ ముద్దు పెట్టుకునే తల్లి—బిడ్డ ఆకలి గ్రహించి కడుపు నింపే తల్లి—నిద్రలేమితొ కనురెప్పలు బరువుగ వ్రాలిపోతున్నా బిడ్డఏడుపు వినగానే ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ఓదార్చే తల్లి—కధలుచెప్తూ గోరుముద్దలు తినిపించే తల్లి—పిల్లలు తప్పు చేసినప్పుడు నాన్నగారికి తెలిస్తే ఎక్కడ కొడ్తారోనన్న భయంతో తానే బిడ్డని సన్నగ మందలించి, నేరం సగం తనమీద వేసుకుని నెమ్మదిగ భర్తకు వివరించి బిడ్డ శిక్షను తగ్గించే తల్లి–బిడ్డ కోసం అవసరమైతే తన ప్రాణాలర్పించే తల్లి—అటువంటి తల్లి ప్రాణం తీయటం సాధ్యమా? అవగాహన కావటంలేదు.
ఆవేశంలో చంపి వేసిందా? ముందుగా పధకం వేసుకుని ఈ హత్య చేసిందా? నేను ప్రయత్నించి ఈమెతొ మాట్లాడ గలనా? ఇంత చదువుకున్న యువతి నాకు అవకాశం ఇస్తుందా? అనేక ప్రశ్నలు–అనుమానాలు–ఆలోచనలు కందిరీగల్లా ఝంకారం చేస్తుండగా, కొంత కుతూహలం, కొంత ఏం తెలుసుకో వలసి వస్తుందోననే భయం, మరికొంత– సహాయం చేయగలనేమోననే ఆశ–అన్నీ కలిపి నన్ను బలవంతంగా ముందుకు నెడ్తుండగా మూడవ పేజి తెరిచాను.
భ్రమరకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. ఈమెకు పదకొండు సంవత్సరముల వయసులో ప్రమాదవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి, పార్వతి, ఎమ్. ఎ ఎకనామిక్స్ చదివింది కాని ఉద్యోగం చేయలేదు. భర్తకు వచ్చిన జీవితభీమా డబ్బుతో ఆర్దికంగ ఎక్కువ ఇబ్బంది లేకుండానే పిల్లల్ని చదివించింది. అక్క, కోమలి, వివాహానంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్ళి పోయింది. తమ్ముడు, సురేష్ వైద్యకళాశా లలో ఐదవ సంవత్సరం చదువుతున్నాడు. భ్రమర బాల్యం ఎలాగడిచిందో, అతి క్లుప్తంగ ఉన్న ఈపేజీలలో లేదు. బహుశ మిగిలిన వివరాలన్ని చదివితే తెలుస్తుందేమో!
***
హత్య జరిగిన సమయంలో తమ్ముడు కూడా ఇంట్లో లేడు. చిత్రం ఏమంటే, అక్క, తమ్ముడు, ఇద్దరూ భ్రమరనే సమర్దించారు. సూక్ష్నజీవులకు కూడ హానిచేయని భ్రమర ఈ హత్యచేసిందంటె నమ్మలేక పోతున్నామన్నారు. ఒకవేళ ఈ హత్యచేసి ఉంటే బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్నారు. కారణం ఏదైనా ఈ అమ్మాయి తన నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నదని తలుచుకోగానె నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
ఈ అమ్మాయి కారాగారంలో నుండి ఎప్పటికైనా బయటకు వస్తుందా? ఒకవేళ వస్తే ఆమె జీవితం ఎలా ఉంటుంది? కారాగారం నుండి విడుదలైన పురుషుల్నే సంఘం గేళిచేసి, హింసలు పెడ్తుండే సమాజంలొ ఇమడ లేక, బ్రతుకు దెరువు కొరకు దొంగతనాలు, దోపిడీలు చేసి, అదృష్టంవుంటే మరల పట్టుబడి కారాగాకానికి వెళ్తామనుకుంటారు. బయటి ప్రపంచంకన్నా ఇక్కడే సుఖంగ, శాంతంగ ఉన్నామని భావిస్తారు.
కొందరు, సమాజం అవహేళనకు, నిరాదరణకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. విడుదలైన స్తీృలగురించి చెప్పనవసరంలేదు. ఏ మారుమూల దాగినా బయటకు లాగి హేళన చేసి, సమాజం నుండి వెలివేసి, చిత్రహింసలు పెడతారు. తరిమి తరిమికొట్టి చివరకు ఆ స్తీృమరణానికి కారకులౌతారు. ఒకసారి కారాగార ప్రవేశం చేసిన తరువాత వారి జీవితం ఎటు తిరిగినా ప్రమాదమే. ఆ విషాద భరితములైన కధలు ఎన్నో చదివాం, విన్నాం. నేను మారాలి–మరుతాను–అని సమాజంలో గౌరవంగా నిజాయితీగా బ్రతకాలనుకునే వీరికి ఏమాత్రం సహకరించలేని సంఘం మన సంఘం.
భ్రమర కేసు వివరాల్తో హృదయం బరువెక్కి పోయింది. హత్య జరిగిన ప్రదేశం, సమయం, ఆమె పట్టుబడిన సమయం, ఇవికాక, మృతదేహంపై ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో వివరంగ వ్రాసివున్నది.
ప్రక్కింటి వారు రెండవ ఆట సినిమాకు వెళ్ళి వస్తుండగా ఈ అమ్నాయి పిచ్చి చూపులు చూస్తూ, ఇంటిముందు ఉన్న చెట్టుక్రింద రక్తసిక్తమైన బట్టల్తో పిచ్చిదానిలా తిరుగుతూ ఉండటం చూశారట. వారి ఇంటి తలుపులు తీయగానే వారికుక్క, భ్రమర ఇంట్లోకి దూరి అరవటం మొదలు పెట్టిందట. అనుమానం వచ్చి చూస్తె వంటగదిలో మృతదేహం కనిపించిందట. ఇంటిప్రక్కవారు రావటంకాని, వారికుక్క అరుస్తూ బయటకు రావటం కాని అక్కడ జరుగుతున్నదేమిటో గ్రహించే స్తితిలో భ్రమర లేదు. విరబోసిన జుట్టుతొ, ఒంటి మీద రక్తం ఎండిపోయి, బీటలు వారిన శరీరంతో అలా తిరుగుతూనే ఉన్నదట.
తరువాత రక్షకభటులు రావటం, మృతదేహాన్ని వైద్యశాలకు పంపించటం, భ్రమర చేతులకు బేడీలు వేసి తీసుకు వెళ్ళటం, అన్నీ ఒకదాని వెనుక మరొకటి, జరిగి పోయాయి. ఎవరెన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పలేక పోయింది. ఆమె ఈ లోకంలొ ఉన్నట్లే అనిపించ లేదు.
*****
(ఇంకా ఉంది)

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.
