కథాకాహళి

ఆధునికానంతర వెలుగులో వరలక్ష్మి కథలు

– ప్రొ. కె. శ్రీదేవి

కాల ప్రవాహంలో ఆధునికత పర్వతంలా ఘనీభవిస్తూ చారిత్రక రూపం దాల్చడం గ్రహించాం. కాలమంత వడిగా నడుస్తున్న వ్యవస్థలో భావజాలం మారదు. ఒకే కోవలో ఘనీభవించిన భావజాలం కాదని ఆ కాలంలో విప్లవాత్మకంగా, చైతన్యవంతంగా సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసే విధానాన్ని బట్టి భావాలను ఆధునిక భావజాలంగా పేర్కొంటున్నారు. సరికొత్త భావజాలం సమాజంలో వేళ్ళానుకొనే స్థితిలో ఆధునికమనుకున్నది నేడు పాత/కాలంచెల్లిన భావజాలంగా చరిత్ర పుటలకు ఎక్కుతుంటుంది. ఆ ఆధునికత ద్రవస్థితిలో చలనశీలతతో తగు మార్పులకు లోనవుతూ ప్రాచీన/పాత భావాలకు దూరంగా జరిగిపోతుంటుంది. ఒక్కోసారి ఆయాకాలపు సామాజిక వాస్తవికతను లోతుగా ఆవిష్కరించలేని స్థితిలో ఆనాటి భావజాలం కొంతవరకు వెనుకబడుతూంటుంది. ఆధునికత తన అంతర్గత సౌష్టవాన్ని పూర్తిగా నూతనంగా సృష్టించుకోవడం, శకలాలు, శకలాలుగా విడిపోవడం, భావాలతోనే కాక జీవన వ్యవస్థలోనూ ఈ క్రమం పర్యవసించడం మూలంగా మరో కొత్త నిర్మాణాల్లోకి ప్రవహించడం ఒక అనివార్య సామాజిక పరిణామంగా గుర్తిస్తాం. ఈ గుర్తింపు సాహిత్యంలో స్పష్టా స్పష్టాంగా గోచరిస్తుంది. అలాంటి సృజన సాహిత్యంలో కె. వరలక్ష్మిగారి కథా సాహిత్యాన్ని ముందుగా చెప్పుకోవాలి.

వరలక్ష్మి కథల్లో స్థానీయతా లక్షణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మధ్యతరగతి కంటే మరింత క్రిందిస్థాయిలో బ్రతుకుతున్న స్త్రీల జీవితాలను చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించారు రచయిత్రి. వాళ్ళ జీవితాల్లోని మార్పుల్ని గమనించడం యాధృచ్చికంగాకాక ఒక నిరంతర ప్రక్రియగా జరిగిందనేది ఆమె కథల్లో గోచరించే విషయం. వాళ్ళ జీవితాలు అలా ఎందుకున్నాయో ఈమెకు తెలుసు. కానీ ఏ సిద్ధాంత ప్రభావంతోనే వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని లేశముత్రంగా కూడా సూచించరు. తనకు ఎదురైన నిస్సహాయ స్త్రీల మనోవేదనల్ని చిత్రించడం వరకే రచయిత్రి తన బాధ్యతగా గుర్తిస్తారు. ఎవరి సమస్యలకు వాళ్ళే పరిష్కారాలు వెతుక్కోవాలనేది వరలక్ష్మి కథ. రావిశాస్త్రి అథోజగత్ సోదర జీవితాలను వస్తువుగా ఎన్నుకోవడంలోని ప్రత్యేకత లాంటి ప్రత్యేకతే కె. వరలక్ష్మి కథలకుంది. ఈమె క్రింది, మధ్యతరగతి స్త్రీల జీవితాల్లోని ఒడిదుడుకులను గురించి లోతుగా ఆలోచించగలిగారు. ఈ పరిశీలన స్త్రీల భౌతిక, ఆత్మిక జీవితాల ఆవిష్కరణగా ‘ఖాళీ సంచులు’ కథలో దుర్గ ‘మంత్రసాని’ కథలో, లోవ, నీలవేణి, ‘శివంగి’ కథలోని శివంగి పాత్ర చిత్రణలో బహిర్గతమవుతుంది.

జ్ఞానాన్ని సృజించే సృజనకారులు (రచయితలు) మేధోజీవులు, భాషా వినియోగదారులు (పాఠకులు) ఎప్పటికప్పుడు మారుతూ సరికొత్త భాషా విభిన్నతను, బహుళత్వాన్ని, (వివిధత్వాన్ని ప్రోత్సహిస్తూంటారు. రచయిత్రి తన కథల్లో వినియోగించిన పాత్రోచిత మాండలిక భాష బహుళత్వ తత్వాన్ని కలిగివుంది. ప్రాంతీయ, స్థానిక గోదావరి మండలాల్లోని క్రిందివర్గాల భాషను తన కథలను శక్తివంతంగా మలచుకోవడంలో వరలక్ష్మి భాగం చేసుకున్నారు. తనలోని సంవేదనల్ని జాతీయ ఆర్థిక సంస్కరణల స్వభావాన్ని, మానవ సంబంధాల నిశ్శబ్ద ప్రవేశాన్ని వాచ్యంగా ఏ కథలోనూ చెప్పలేదు. ఉదాహరణకు స్థానిక జీవిక నుండి ప్రత్యామ్నాయ జీవికను ఎంచుకోవడంలో బహుజనులు గురవుతున్న వేదనా క్రమాన్ని చాలా కథల్లో చెప్పారు. ఒకవైపు స్థానిక చరిత్రలో చోటుచేసుకుంటున్న మార్పుల్ని చిత్రిస్తూ మరోవైపు బాల్యం నుండి తమ జీవితాల్లో వస్తున్న మార్పుల్ని భౌతిక మార్పులతో సమన్వయం చేసి చక్కటి శిల్పంతో ఆధునిక అభివృద్ధి విధ్వంస చిత్రపటాన్ని సృజించారు. మట్టి-బంగారం కథలోని మూలమ్మ, భూలక్ష్మమ్మ, అయోధ్య రాముడు ముగ్గురు మూడు తరాలకు ప్రతినిధులు. అందుకే ఆ తరాల ఆలోచనలను, ఆచరణ వైవిధ్యాన్ని సరైన ఎత్తుగడతో పాఠకులకు అందించారు. ‘ప్రస్థానం’ కథలోని బంగారక్క మంత్రసాని కథలోని సూరమ్మక్క లోవ, నీలవేణి మొదలైన స్త్రీల జీవితాల్లో పర్యవసించిన పరిణామాలు చిత్రించేటపుడు ఎక్కడా సైద్ధాంతిక చర్చ చేయకుండా కేవలం జీవిత శకలాలు శకలాలుగా వరలక్ష్మి తన కథల్ని శక్తివంతంగా చిత్రించారు.

వరలక్ష్మి కథల్లో విషయి-విషయంల మధ్య విభేదం బహిర్గతమౌతుంది. అందుకే ఈమె కథల్లో రచయిత ప్రాముఖ్యత తగ్గిపోయి పాఠకుని ప్రాముఖ్యత పెరుగుతుంది. సొంత అనుభూతుల నుంచి అనుభవాల నుంచి “నీవు నీవుగా వుండే” ధోరణిలోకి వెళ్ళేట్లుగా వరలక్ష్మి కథలు పాఠకుల్ని నడిపించగలుగుతాయనడానికి సాక్ష్యంగా నిలిచే కథలు “అతడు-నేను”, ‘శివంగి’, ‘అఘాడి’ ‘ఖాళీ సీసాలు’.

‘ఖాళీ సీసాలు’ కథలో దుర్గ తన కష్టాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టి తమ్ముడిని ఇంజనీరును, గుడిసెను పెంకుటిల్లు చేయగలిగింది. ఒక ఎకరం పొలం కూడా సంపాదించగలిగింది. ఈ తల్లి రొయ్యల చెరువులో పనికి పంపినప్పుడు గానీ ఆ తర్వాతగానీ కంటికి నదురుగా వున్న దుర్గ తన జీవితాన్ని తాను మలచుకోలేని అసమర్ధురాలేం కాదు. వివాహితుడైన కుప్పుస్వామితోనే జీవించాల్సిన అగత్యం ఆమెకు లేదు. కుప్పుస్వామి సాహచర్యం కాకుండా వివాహితురాలిగా వుంటే తన సంపాదన పైన ఆధారపడిన తన కుటుంబాన్ని ఆదుకొనే అవకాశం ఆమెకు వుండేది కాదు, జీవితం ఎటువైపుకు లాగితే అటువైపు దుర్గ వెళ్ళింది. తనకు తమ్ముడు, అతని పిల్లలూ ఇవే అండగా వుంటాయనుకుంది. తమ్ముడి స్వార్థం ఆమెను ‘ఖాళీ సంచు’లతో రోడ్డుపాలు చేసింది. ఈ కథలో ఖాళీ అయినవి సంచులే కాదు దుర్గ హృదయం కూడా, ఎవరికోసమైతే ఆమె తపించిందో, వాళ్ళే తన జీవిత సర్వస్వంగా భావించిందో వాళ్ళే అటు కుప్పుస్వామి, ఇటు తమ్ముడు భౌతికంగా శక్తివంతురాలైన దుర్గను నిస్సహాయురాలిగా, అనాథగా మార్చారు. “నీకు కుప్పుస్వామున్నాడు కదా!” అన్న తమ్ముడి మాటల్లోని వ్యంగ్యం, నైతిక చట్రాల అఖండత్వం దుర్గనే కాదు పాఠకుల్ని కూడా నిరుక్తులుగా మారుస్తుంది.

మనిషి వైఫల్యాలను దాచి కథల్లో అంతా సవ్యంగానే జరిగిపోతుందన్న హామీని, ఆశను చూపిస్తే పాఠకుల్ని మోసగించడమే అవుతుంది. మానవ జీవితంలో విషాదముంది. దు:ఖం వుంది. తప్పించుకోలేని వైఫల్యం వుంది. దీనికి కార్యకారణ సంబంధాల్ని ఆపాదించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఆ విషాదాన్ని తప్పించుకోలేం. ఇధి భరించలేని వాస్తవం. దీన్ని గుర్తించక తప్పదు. ఈ గుర్తింపు మాత్రమే మనిషికి స్వాంతననిస్తుంది. విషాదం తాలూకు భారాన్ని అధిగమించి జీవించడానికి ప్రేరణనిస్తుంది. సంక్లిష్టమవుతున్న మానవ జీవితంలో విషాదం అన్నది పెరుగుతుందేగాని తగ్గడం లేదు. మనిషి అంతరంగం సంక్షుభిత కేంద్రంగా వుంటుంది. నిరంతర ఘర్షణ, పెనుగులాటతో మనిషి సతమవుతున్నాడు. వీటిని తప్పించుకోవడానికి మనిషి పడే తపన అంతా ఇంతా కాదు. “అతడు-నేను” కథలో ఈ సంఘర్షణ మొత్తం అనుభవిస్తుంది ఆమె. వరలక్ష్మి కథల్లో ఈ రకమైన సంఘర్షణ చాలా కథల్లో వ్యక్తమవుతుంది. మనసుకు నచ్చని భర్తను, అత్త సాధింపుల్ని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని, తన జీవితాన్ని నిరాశమయం చేసుకోలేదు. ఆమెకెదురైన నిరాశను, నిరుత్సాహాన్ని పాఠకుల పైన రుద్దలేదు రచయిత్రి. విషాదాన్ని, వైఫల్యాన్ని చిత్రీకరించే కంటే జీవిత సాఫల్యం వైపుకు పాత్రల్ని నడిపిస్తుంది.

జీవితాన్ని గురించిన ఎరుకను కె. వరలక్ష్మి ఈ కథలో అందిస్తుంది. వైఫల్యాలు విషాదాలు అనివార్యంగా జీవిత గమనాన్ని ఊహించని దిక్కులకు నడిపిస్తాయన్న గ్రహింపునిస్తాయి. ఈ గ్రహింపు పాఠకులకు జీవితంపట్ల అవగాహన కలిగించడానికి తోడ్పడుతుంది.

తనను హింసించిన భర్తకు పక్షవాతం వస్తుంది. అతనికి సేవలు చేస్తున్న ఆమెను చూసి, స్నేహితురాలు షరీఫా అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు “సేవాశ్రమంలో ఎలాంటివాళ్ళో తెలియకుండానే మనం వాళ్ళకి సర్వీసు చెయ్యడం లేదూ? ఇతన్ని అలాగే అనుకొని” సేవచేస్తున్నానంటుంది. మనిషి జీవించడానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీ నమ్మకం, జాలి, దయ, ప్రేమ అన్న ప్రతిపాదనే వరలక్ష్మి కథా లక్ష్యం.

“మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించనీ, ప్రేమించకపోతే పోనీ – నువ్వు మాత్రం నిస్సహాయల్ని ప్రేమిస్తూనే వుండు” అన్న వివేకానందుడు లాంటి దేశీయ మేథో జీవుల ప్రవచనాల్ని తన కథాసాహిత్యం ఆలంబనగా చేసుకొంది.

తన జీవితంలో ఏర్పడిన ఖాళీకి ప్రత్యామ్నాయ మార్గంగా వందల కొలది పుస్తక పఠన ప్రక్రియ ఆమె జీవితాన్ని తనకు దొరికినంతలో అందిపుచ్చుకొనే ప్రయత్నం చేసిందని పై వాక్యంతో గమనించగలం.

శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రలో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె కోపానికి గురైంది. ఆమె నిస్సహాయతతో ఆడుకొన్న ఎలుక, ప్రాణంపోయే సమయంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి, అది చూసిన చూపు సహజసిద్ధంగా ఆమెలోని జాలి, దయ, కరుణ గుణాలకు ప్రేరణగా పనిచేసింది. అందుకే అనుక్షణం పీడించే భర్తను (ఎలుక కోసం తెచ్చిన) ఎలకలమందుతో కాచిన టీతో చంపాలనుకుంది. కానీ భర్త క్రౌర్యం నిస్సహాయతలోకి పర్యవసించబోయే క్రమం ఆమెలో నిద్రానంగా వున్న ప్రేమ, బహిర్గతం కావడానికి దోహదకారి అయింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలోకి పోబోతున్న భర్తను ఆ స్థితి నుండి తప్పించింది. అసహ్యంతో, అవమానంతో రగిలిపోయే ఆమె హృదయం స్థానంలో ఆర్ద్రత ప్రవేశించింది. అసహ్యించుకొన్న భర్తను ఆర్తితో హత్తుకో గలిగింది. స్త్రీల ప్రేమలోని ఔన్నత్యాన్ని ఉన్నతీకరించడమే వరలక్ష్మి కథా దృక్పథం.

సత్యం ఎప్పుడూ ఒక తీరుగా వుండదు. అది శకలాలు శకలాలుగా మార్పుకు గురవుతూ, విచ్ఛిన్నమౌతూ వుంటుంది. శివంగి భర్త ప్రాణాలు తీయాలనుకోవడం సత్యం. కానీ ఆ భావన విచ్ఛిన్నమవడానికి కారణభూతమైన అంశాలు శివంగి భవిష్యత్తు చిత్రపటాన్ని మార్చేవి కావు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే నోటి ముందున్న టీని కర్రతో తోసేసిన, ఆమె భర్త “నీయయ్య… అంటూ తిట్లకు లంకించుకుంటాడు. శివంగి అనుభవిస్తున్న హింసగానీ, ఆ హింసకు కారణపై భర్త ప్రవర్తనలో గానీ ఏ మార్పు వుండదు. విషయం తెలిసి కూడా ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? అనే ప్రశ్నలో హేతుబద్ధత వుందేమో గానీ మానవసంబంధాల అభిమాన వికసనక్రమంలో ఆ హేతుబద్ధతకు అవకాశం లేదు.

ఆధునికతలో కీలకంగా వుంటూ వస్తున్న ప్రతి అంశాన్ని అందులోని లోపాల్ని వాటి వలను జరిగే నష్టాల్ని వరలక్ష్మి తన కథా వస్తువుగా తీసుకున్నారు. మట్టి – బంగారం కథలో ఐదు దశాబ్దాల క్రమంలో జరిగిన (transformation) పరిణామాలను చిత్రించే ప్రయత్నంలో వరలక్ష్మి విజయవంతమయ్యారు. అభివృద్ధి పేరుతో కోల్పోతున్న వ్యక్తిగతమైన, ప్రాంతీయమైన, సాపేక్షికమైన సత్యాల్ని తన కథల్లో ప్రతిపాదించారు.

జీవన పోరాటంలో తుదికంటా నిలబడడానికి ఎంతో ఆత్మవిశ్వాసం అవసరం. అందుకు అనువైన సామాజిక విశ్వాసం కొరవడుతున్న సందర్భంలో విశ్వాసాలు మృగ్యమై భవిష్యత్ చిత్రపటం అగమ్యగోచరంగా మారిన స్థితి. ఈ స్థితిలో ఎవరికీ ఏ విశ్వాసాలు అవసరం లేకపోయినా ఛిద్రమౌతున్న రెక్కల్ని ఎవరంతకు వాళ్ళు సవరించుకోవాలన్న తపనలో మనిషి తనకు తానే దూరమౌతున్నారు. ఈ సందిగ్ధస్థితిలో తానున్న స్థితి నుండి గతంలోకి, గత అనుభవాల మృతుల్లోకి జారిపోయి, భావుకతను గుండెనిండా నింపుకొం ఆ జ్ఞాపకాల చిత్తడితో వర్తమానంలోని వ్యాకులాన్ని రూపుమాపుకునేందుకు దోహదం చేసే ఒకానొక గణనీయ ప్రయత్నానికి వరలక్ష్మి కథలు నాంది పలుకుతాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.