జగదానందతరంగాలు-2

ఎంత స్వేచ్ఛ! 

-జగదీశ్ కొచ్చెర్లకోట

 

నులివెచ్చనైన నీళ్ళల్లో సుతిమెత్తని గోడలమధ్య నాయిష్టానికి నేను యథేచ్ఛగా ఈదులాడేంత….
 
పైగదిలోంచి లయబద్ధంగా వినబడుతున్న జతిస్వరాన్ని నేనొక్కతెనే వినేటంత..
 
ఒకటారెండా? నలభైవారాలపాటు నిరాటంకమైన ప్రయాణంలో నాఅంతట నేనే ఎదిగేటంత….
 
ఎక్కడినుంచో జలపాతాల గలగలల్లా ధ్వనులు. నాకోసం తనుతాగే ఫలరసాలన్నీ గొంతులోంచి జారి, నాచుట్టూ కాసారాల్లా అలుముకుంటాయి
 
బద్ధకంతో కాళ్ళుచాపి నేను తన్నిన ప్రతిసారీ పులకింతకు లోనయ్యే ఆనందం
 
నేనెలా చూడాలి? నన్నుతలచి మైమరిచే ఆ కన్నుల వెన్నెలల్ని లోపలుండి చూసేదెలా?
 
అప్పుడప్పుడు ఒకానొక మృదువైన స్పర్శ నా గది గోడల్ని తాకుతుంది. తలుపు తట్టినట్టనిపించదు
 
ఉలిక్కిపడతాననేమో? ప్రేమగా స్పృశించాలని వచ్చికూడా, గుమ్మానికవతలే వుండిపోతుంది
 
నెలనెలా జర్రునజారే స్కానింగ్ రాతలతో సృష్టించే అలజడి మాత్రం నా మౌనానికి భంగమే!
 
లోపలుండగానే మొదలవుతుందిట…ఆడపిల్లల వెంటపడడం
 
కాదని తెలిసేదాకా కాలునిలవదు
అవునని చెబితే మనసు నిలవదు
 
బందిఖానాలోంచి బయటికొచ్చే సమయంలో వేదన తనకీ, ఆవేదన నాకూ!
 
రావాలా? తప్పదా? 
 
కొన్ని కవాటాలు మూసుకునే సమయం..
 
మరికొన్ని ద్వారాలు సుగమమయ్యే తరుణం..
 
అంతవరకూ విన్న నాదం ఆర్తనాదమైన క్షణం..
 
ఎన్నో గొంతులు ఏకమై… ఫరవావుందనో, ఫరవాలేదనో ఊరడించే నిమిషం..
 
అనేకానేక లోహధ్వనులతో ముందుగానే ఈ లోకరీతిని పరిచయంచేసే ప్రహసనం..
 
నాదైన లోకంనించి ఇవతలి ఒడ్డునపడే క్షణాన నాకెందుకో చెట్టునుంచి తెగిన కాయననిపించింది
 
ఇంత వెలుగు నాకెందుకు? నా తల్లి కన్నుల వెలుగు చాలదా? 
 
ఇంత చలేస్తోందేం? ఆ ఉష్ణజలాల్లో తృష్ణతీరేలా ఈదులాడిన గడియలన్నీ గడిచిపోయినట్టేనా?
 
ఇన్నాళ్ళూ తన శ్వాసే నాదిగా బతికిన నాకు కొత్త వూపిరులూది సాగనంపేశారు
 
మా మధ్య జ్ఞాపకాలన్నింటినీ ముడులేసుకున్న ఆ తాడుని నిర్దాక్షిణ్యంగా విప్పేశారు
 
మాయను తొలగించామనుకున్నారే గానీ అంతకంటే మాయా ప్రపంచంలోకి స్వాగతం పలికారు
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.